Site icon Sanchika

కార్పెట్ కింద తోసేసిన కొన్ని సంగతులు: Dolly, Kitty Aur Woh Chamakte Sitare

[dropcap]ఇ[/dropcap]ది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం. మామూలు సినిమాల్లో తడమడానికి జంకే విషయాలు ఓటిటి లో కుదురుతుంది. అలాగని థియేటర్ చిత్రాల్లో బోల్డ్ వి లేవని కాదు. ఈ దర్శకురాలిదే Lipstick under burkha వున్నది.
స్పాయిలర్స్ లేకుండా ఈ సినిమాని చర్చించడం కష్టమే.
ఈ చిత్రం ముఖ్యంగా ఇద్దరు స్త్రీల కథ. డాలీ (కొంకొణా సెన్ శర్మా), కాజల్ (భూమి పెడ్నేకర్) ఇద్దరూ వరుసకి అక్కా చెల్లెళ్ళు. బీహార్ లోని పల్లె నుంచి అక్క వుంటున్న నోయిడాకు వచ్చింది కాజల్. వాళ్ళను వూరంతా చూపిస్తూ ఓ scary house కి కూడా తీసుకెళ్తాడు డాలీ భర్త అమిత్ (ఆమిర్ బషీర్). వీలు చిక్కించుకుని మరీ కాజల్‍ని తడుముతుంటాడు. ఈ విషయం అక్కతో ఆ స్కేరీ హౌస్ లో చెబుతుంది. నీదంతా భ్రమ అంటుంది అక్క. సంభాషణ మధ్య మధ్యలో భయపెట్టడానికి, థ్రిల్ ఇవ్వడానికి పెట్టిన అస్తిపంజరాలూ వగైరా చటుక్కున లేస్తాయి. ఈ మొదటి సీన్ ద్వారా కథకు పునాది వేయబడింది.
డాలీ కి ఇద్దరు మగ పిల్లలు. కొత్తగా ఒక ఫ్లాట్ బుక్ చేసి కిస్తులు కడుతున్నారు. ఏసీ అద్దెకు తెచ్చుకున్నారు. ఫ్రెండ్స్‌ని పిలిచి పార్టీ చేసుకుంటూ గొప్పలు పోతారు. బయటకు ఒక సంతోషకరమైన కుటుంబంలా వుంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా డాలీ సెక్స్ ఎరగదు. భర్త చాటుగా ఫోన్ సెక్స్ చేస్తుంటాడు. ఆమె సమస్య frigidity. చిన్న కొడుకు dolls తో ఆడుకుంటాడు, బ్రా వేసుకుని స్కూల్ కెళ్తాడు, మగపిల్లలతో క్రికెట్ లాంటివి నచ్చవు ఇవన్నీ cross dresser లక్షణాలు. ఇక డాలీ తల్లి గతంలో తన భర్తనూ, బిడ్డనూ వదిలేసి ఎవరో ప్రేమికునితో వెళ్ళిపోయింది. ఈ రెండు విషయాలకూ తన ఫ్రిజిడిటి తో ఏమన్నా సంబంధం వుందా అని సందేహం. పక్క మీద, హనీమూన్‌తో సహా, ఎప్పుడూ తనకు ఎలాంటి స్పందనా వుండదు, లూబ్రికంట్స్ వాడినా ఉపయోగం వుండదు. పెళ్ళికి ముందు తను తన hymen recreate చేయించుకుంది. దాని పరిణామమేమో తెలీదు. కానీ ఒక డెలివరీ బాయ్ ఉస్మాన్ అన్సారీ (అమోల్ పారాషర్) తో ప్రేమలో పడి మొదటిసారిగా ఆర్గాజం అనుభవిస్తుంది.


కాజల్ పెద్దగా చదువుకోలేదు. మొదట ఒక షూ కంపెనీలో జేరి, ఆ మొదటి రోజే బాస్‌తో పడక ఉద్యోగం మానేస్తుంది. తర్వాత Red Rose Romance App కంపెనీలో జేరుతుంది. జేరాక గాని అదేమిటో తెలియదు ఆమెకి. మగవారికి సెక్స్ జీవితం కు తోడుగా ఇంకా కొన్ని థ్రిల్లింగ్ పనులు ఇష్టం. వాటిలో సెక్స్ ఫోన్ ఒకటి. ఈ ఆఫీసుకు ఫోన్ చేసి నచ్చిన అమ్మాయితో చేస్తారు క్లైంట్స్. వాళ్ళలో ప్రదీప్ అనే క్లైంట్ తో ఆమె ప్రేమలో పడి బయట కూడా కలుస్తుంది. అతనితో రెండు సార్లు సెక్స్ చేసినా, ఆమె మాటల్లోనే “కాస్త రక్తం కారింది కానీ క్లైమాక్స్ చేరలేదు”. ఎందుకంటే ప్రదీప్ కేవలం తన గురించే చేసుకుంటూ పోతాడు క్షణాల్లో. తర్వాత అతనొక ఫ్రాడ్ అనీ, వివాహితుడనీ తెలిసి వదిలేస్తుంది. తన స్నేహితురాలు షాజియా (కుబ్రా సైట్) మాజీ ప్రేమికుడు డీజే గుర్జర్ తేజా (కరణ్ కుందర్) తో కలిసినపుడు మాత్రం ఆమె తొలిసారి ఆర్గజం పొందుతుంది, అతను ఆమెకు తనతో సమాన పార్ట్‌నర్‌గా ప్రవర్తిస్తాడు గనుక. చివర్న కాజల్ తన బాస్ లను ఒప్పించి Ladies special red rose romance app తయారు చేయిస్తుంది.
చాల విషయాలు చివర్లో అక్క చెల్లెళ్ళు విస్కీ తాగుతూ మాట్లాడుకున్నప్పుడు ఇవన్ని బయట పడతాయి, ముందు కాదు. కాజల్‌కి తను చేస్తున్న పని కారణంగా గిల్ట్ ఫీల్ కాదు. ఆమె ఆఫీసును సంప్రదాయ పరిరక్షకులు గొడవ చేసి మూయించేస్తారు. తనకు వేరే ఆప్షన్ దొరికుంటే ఈ పని చేసేదాన్ని కాదంటూనే, ఇలాంటి సర్వీసే ఆడవాళ్ళకు కూడా వుంటే బాగుణ్ణు అంటుంది.
ఒక యోని ఆకారంలో వున్న నిర్మాణం women’s empowerment symbol గా తయారు చేసి అక్కడ పెట్టి దాన్ని ఆవిష్కరించే ఆ సభలో సంప్రదాయ సంరక్షకుల అల్లరి మూకలు వచ్చి అక్కడంతా ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు రావడం, గొడవలు, షూటింగు జరగడం, ఆ షూటింగులో ఉస్మాన్ చనిపోవడమూ జరిగిపోతాయి. డాలీ ముస్లిముల సమాధికి వెళ్ళి ఉస్మాన్‌ని పాతిపెట్టిన చోట వొక నాపరాతి ఫలకాన్ని పెట్టి దానిపై “అమోల్ —– ” అని వ్రాస్తుంది. భర్తను విడిచిపెట్టి, పెద్ద కొడుకు రాకపోతే, చిన్నవాడినే తీసుకుని ఆమె వెళ్ళిపోతుంది.
లిప్‌స్టిక్ అండర్ బుర్ఖా లో నాలుగు కథలను కలిపి అల్లింది దర్శకురాలు అలంకృతా శ్రీవాస్తవ్. అక్కడ ముగింపు తప్ప మిగతా చిత్రమంతా సహజంగా వచ్చింది. మొత్తం మీద ఆ చిత్రం దీనికంటే బిగువుగా సూటిగా వుంది. ఈ కథలో చాలా విషయాలను స్పర్శించడం ద్వారా కొంత బలహీన పడింది.
కథలో లోపాలు తక్కువేమీ లేవు. కానైతే కొన్ని విషయాలను చర్చకు పెడుతుంది. ఇప్పుడు మనం అన్ని రకాల సేవలనూ మొబైల్ ఏప్స్ ద్వారా పొందుతున్నాం. ఆ తర్వాత ప్రతి డెలివరీ తర్వాత కస్టమర్ స్టార్ రేటింగ్ ఇవ్వాల్సి వుంటుంది. దాని బట్టి ఆ మనుషుల ఉద్యోగాలు ఆధార పడి వుంటాయి. అలాగే ఈ రొమాన్స్ ఏప్‌లో కూడా. డెలివరి బాయ్ ఉస్మాన్ కూడా తనకు ఐదు స్టార్ల రేటింగ్ ఇమ్మని బతిమాలుతాడు. జీవితపు అన్ని పార్శ్వాలలో ఈ రేటింగ్ వున్నా, స్త్రీ పురుషుల మధ్య వున్న సంబంధం విషయం లో స్త్రీకి ఎలాంటి హక్కూ ఉండదు రేటింగ్ ఇవ్వడానికి. పడక అనేది కేవలం మగవారికి సంబంధించినది అయిపోయింది. ఇలా వ్రాస్తున్నానంటే చాలా మంది అభ్యంతర పెట్టొచ్చు ఇది అతిశయోక్తి, అన్ని ఇళ్ళల్లోనూ ఇలా వుండదని. నిజమే. కానీ అలాంటి వారి గురించి కాదు ఈ చిత్రం. డాలీ, కాజల్ లాంటి వారి జీవితాల గురించి. అలాంటి వారు కూడా తక్కువేమీ వుండరు. అలంకృత దర్శకత్వం బాగుంది. అవకాశం వున్న ప్రతి చోటా చిన్న చిన్న విషయాలు పనిగట్టుకుని మన దృష్టికి వచ్చేలా చేస్తుంది. డాలీ పని చేస్తున్న చోట తను స్త్రీ కాబట్టి అదనంగా టీ పెట్టే పని కూడా ఆమెకిస్తారు. చివరి సీన్ లో ఆమె తనకు మాత్రమే టీ పెట్టుకుని తాగుతుంది ఆఫీసులో. నోయిడా లో కాజల్ ఒక్కతే రోడ్డు మీద కనబడితే కార్లలో వెళ్తున్న కుర్ర మూకలు ఆమెను తమతో రమ్మనడం, భయపెట్టడం చేస్తారు. ఇలాంటివి మనం వార్తా పత్రికలలో చదువుతూనే వుంటాము. ఇక డాలీ చిన్న కొడుకు మొదటి సారి dolls తో ఆడటం చూసి జెండర్ రోల్స్ ఫిక్స్ కాకుండా చేసినట్టు అనుకున్నాను. కానీ తీరా ఆ బాబు క్రాస్ డ్రెస్సర్ అని తెలిసేసరికి ఆ మొదటి సీన్ పెట్టాల్సింది కాదనిపించింది. మనం చూసేది మగ పిల్లలు గన్స్ తో, ఆడ పిల్లలు డాల్స్ తో ఆడటం. దాన్ని ఛేదించే ప్రయత్నంగా దాన్ని వాడుకుంటే బాగుంటుంది. ఇక కుబ్రా సైట్ పాత్ర కూడా ఎలాంటిదంటే తన అవసరాలకోసం ఆ డీజేని వాడుకుంటుంది. పడక మీద ఉన్న క్షణాల్లోనే తనకు ఐ ఫోన్ కావాలనీ అడగడం వగైరా. చివరికి అతన్ని వదిలేసి కెనెడాకు వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా వుంటారని చెప్పడానికి ఈ పాత్ర.
ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో వుంది. చూడండి.

Exit mobile version