దోమార్జునీయం

2
3

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి ఆరుబయట డాబా మీద పడుకున్న అర్జున్ నిద్ర పట్టక అసహనంగా చికాగ్గా అటూ ఇటూ చాప మీద దొర్లుతున్నాడు, అంతా కాంక్రీటు అరణ్యమే అయినా, అక్కడక్కడా వేలి లెక్కలకు సరిపోయేలా ఉన్న చెట్టూ చేమా కూడా ‘ఎలా నిద్రపోతావో చూస్తాము’ అని ఏదో పగ బట్టినట్టే కట్రాటల్లా బిగుసుకుపోయాయి. అట్ట ముక్కతో చెయ్యి నొప్పి, విసుగూ పుట్టేంత దాకా గాలి విసురుకుని, ఆనక దాన్ని కూడా పక్కకు విసిరేసి, ఎడ తెరిపి లేని ఉక్కా చెమటతో పాటూ చెవుల్లో చేసే దోమల సంగీత సాధన కూడా తోడవ్వడంతో భరించలేక చికాగ్గా లేచి కూర్చున్నాడు.

పెద్ద సంసారం, చాలీ చాలని రెండు చిన్న గదులూ, ఎంత కష్ట పడ్డా కనీస అవసరాలు కూడా తీరని సంపాదన. పొరపాటున ఒక పూట కడుపు నిండా తినేస్తే, అది అరిగే దాకా బెంగే, మర్నాటి కెలాగా అని, మొహం, చేతులూ కాళ్ళ మీదా ఇష్టమొచ్చినట్లు వాలుతూ కుట్టే దోమల్ని ‘ఫాట్.. ఫాట్’ మని చేతులతో కొట్టి చంపి, నిద్ర పట్టక గుర్తుకొచ్చే నిత్య కష్టాల మీద ఉన్నకసిని అంతా వాటి మీద తీర్చుకుంటూ ‘దిక్కుమాలిన దోమలూ, దిక్కుమాలిన కష్టాలూ లేని ప్రపంచమే లేదా, వీటితోనే పుట్టి, వీటి తోనే పెరిగి వీటితోనే చావాలా.. మరో దారే లేదా దేవుడా’ అంటూ సణుక్కున్నాడు.

ఇక ఆఖరికి కదలకుండా కూర్చుని దోమలకి విందు భోజనం అవ్వడం కంటే అలా వీధిలోకి పోవడమే మంచిదనిపించి, విసుక్కుంటూ లేచి రోడ్డు మీదకి వచ్చేశాడు. ఎక్కడ చూసినా మూసుకు పోయి కంపు కొట్టే డ్రైనేజీలు, నిండిపోయిన చెత్తకుండీలు, ఫేవికాల్ వేసి అంటించేసినట్లు దగ్గర దగ్గరగా అతుక్కుపోయీ, గాలీ వెలుతూరూ కూడా రాని ఇళ్లూ, అన్నిటినీ చూసి తిట్టుకుంటూ, ఎక్కడికి పోవాలో ఎక్కడ ఆగాలో కూడా తెలియక చీకట్లో అలా నడుస్తూ పోతూనే ఉన్నాడు అర్జున్.

ఓ చీకటి సందు దాటుకుని పోతుండగా అక్కడ ఉన్న చెత్త కుండీ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టనిపించింది అతనికి, అనుమానంతో ఆగి కళ్ళు చిట్లించి చూశాడు. సందేహం లేదు, అక్కడెవడో ఓ వ్యక్తి గాల్లో చేతులెగరేసి ఏదో పట్టుకుని, తన దగ్గర ఉన్న సంచీలో వేసుకుంటూ చెత్త కుండీ చుట్టూ తిరుగుతున్నాడు. ‘ఎవడు వీడు దొంగా లేకపోతే చేతబడులూ. బాణామతులూ చేసే మాయలమారా, వీడికి ఈ చెత్తకుండీతో పనేమిటీ’ అని మనసులో అనుకుని ఒక్క క్షణం తటపటాయించి “ఒరేయ్ ఎవడ్రా నువ్వు, ఏం చేస్తున్నావ్ ఇక్కడా” అంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు.

అంతే! అర్జున్‌ని చూసిన వెంటనే ఆ వ్యక్తి పరుగు లంఘించుకున్నాడు. అది చూసి ఇంకా అనుమానం ఎక్కువయి వాడ్ని అందుకోవడానికి వాడి వెనుక పరిగెట్టాడు అర్జున్. ఎంత వేగంగా పరిగెట్టినా దొరికినట్టే దొరికి అంతలోనే జారుకుంటున్న ఆ వ్యక్తిని ఆఖరికి ఎలాగైతేనే అతి కష్టం మీద అంది పుచ్చుకున్నాడు అర్జున్. గింజుకుంటున్న అతన్ని గట్టిగా పట్టుకుని చేతిలోని సంచిని లాగే ప్రయత్నం చేశాడు, చావు దెబ్బలెన్నయినా తింటున్నాడు కానీ చేతి సంచి మాత్రం విడిచి పెట్టటం లేదు అతను. అతను పట్టుబట్టడం చూసిన కొద్దీ, ఆ సంచిలో ఏమంత విలువయ్యింది ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకా ఎక్కువయిపోయింది అర్జున్‌లో, అందుకే ఆ వ్యక్తిని స్పృహ తప్పేటంత లాగా కొట్టి మరీ ఆ చేతి సంచిని లాక్కున్నాడు.

తేలిగ్గా ఉన్న సంచికి వేసి ఉన్న ముడిని విప్పి, సెల్ వెలుగులో దాన్లోకి చూసి, అందులో నలకల్లాగా చచ్చి పడి ఉన్న దోమల్ని చూసి ఒక్కసారే తెల్లబోయాడు!. “ఏవిటివీ.. అర్ధరాత్రి వీటి కోసం నా చేతిలో చావు దెబ్బలు తిన్నావా, నీ కేమైనా పిచ్చా” అంటూ అడిగాడు ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని.

అప్పుడా వ్యక్తి “అవునవును నాకు పిచ్చే, నాకు పిచ్చే” అంటూ అర్జున్ చేతిలో సంచి లాగేసుకుని, పడుతూ లేస్తూ మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టాడు, అతను వెళ్ళే వైపే వింతగా చూస్తూ ఉండిపోయిన అర్జున్‌కి అరికాలికి ఏదో గుచ్చుకున్నట్టవ్వడంతో కిందకి చూశాడు. అక్కడ చీకట్లో ఏదో తళుక్కున మెరిసింది, ఆశ్చర్యంతో తీసి చూశాడు, అంతే!! ఒక్కసారి నిర్ఘాంతపోయాడు, మెరుస్తున్న బంగారపు ముక్క అది, ఇందాక పెనుగులాటలో ఆ వ్యక్తి ఫ్యాంట్ లోంచి పడింది అది అని గ్రహించాడు, వెంటనే దాన్ని చొక్కా జేబులో వేసుకుని పారిపోతున్న ఆ వ్యక్తిని పరిగెట్టి వెళ్ళి పట్టుకుని, అతని జేబుల్లో ఉన్న మరో రెండు బంగారపు ముక్కలని వెతికి తీసి “నిజం చెప్పు, ఎవరు నువ్వు, ఇవి ఎక్కడ నుంచీ దొంగిలించావు” అంటూ గట్టిగా గద్దించాడు. “నేనేమీ దొంగతనం చేయలేదు, అవి నావే” అంటూ సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఆ మాటలు నమ్మని అర్జున్, ఆ వ్యక్తిని నిజం చెప్పమంటూ చచ్చేలా కొట్టాడు. ఎంత కొట్టినా ఆ వ్యక్తి అదే సమాధానం చెప్పడంతో, ఇక విసుగెత్తి పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే అప్పుడా వ్యక్తి “ఈ బంగారాన్ని నేనే స్వయంగా తయారు చేసుకున్నాను ఎవ్వరికీ చెప్పనంటే నీకు కూడా బంగారం తయారు చెయ్యడం నేర్పిస్తాను, అనవసరంగా పోలీసులకు చెప్పి ఈ రహస్యాన్ని బట్టబయలు చెయ్యకు, దాని వలన నీకూ, నాకూ ఇద్దరికీ లాభం ఉండదు” అంటూ నోరు విప్పాడు. ఆ మాటలు నమ్మలేదు అర్జున్, దాంతో ఆ వ్యక్తి ఊరి చివర్న తను ఉంటున్న నివాసం దగ్గరకి తీసుకెళ్ళాడు.

పాడుబడిపోయి ఉన్న ఆ ఇంట్లో ఓ గదిలోకి తీసుకెళ్లి, అందులో ఓ ప్లాస్టిక్ బక్కెట్ నిండా ఉన్న చచ్చిన దోమలూ, మరో రెండు బక్కెట్లలో ఉన్న ఏవో చెట్ల వేర్లూ, బెరడులూ, ఓ కొలిమి, రకరకాల పని ముట్లనూ చూపించాడు. అంతే కాదు రహస్యంగా ఓ పెట్లో ఓ ముఖమల్ క్లాత్‌లో మూట గట్టి ఉంచిన కొన్ని బంగారపు ముక్కలని కూడా చూపించాడు.

వింతగా, విచిత్రంగా వాటి నన్నిటినీ చూస్తున్న అర్జున్‌తో ఆ వ్యక్తి “సంసార సాగరాన్ని ఈదలేక జీవితం మీద విరక్తి చెంది, ఇంట్లోంచి పారిపోయి హిమాలయాల్లో తిరుగుతుంటే, అక్కడో అఘోరా నన్ను చూసి నా మీద జాలి పడి దోమల్ని పట్టి చంపి, కాల్చి నుసి చేసి, ఆ నుసిని కొన్ని రకాల చెట్ల వేర్లు, బెరడు లతో కలిపితే బంగారం తయారవుతుందని నాకు చేసి చూపించి ఈ విద్యని నేర్పించాడు. ఎవ్వరికీ తెలియకుండా నాకు కావల్సినంత బంగారాన్ని తయారు చేసుకుని డబ్బు సంపాదించి, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ పనిని మానేద్దాం అనుకున్నాను, కానీ దురదృష్టం ఈ రోజు నీ దృష్టిలో పడిపోయాను.” అని చెప్పడమే కాకుండా దోమల ద్వారా ఆ బంగారం ఎలా తయారు చెయ్యాలో కూడా చేసి చూపించాడు. కళ్ళారా అంతా చూసినా కూడా ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు అర్జున్‌కి. తెల్లారే దాకా ఎలాగో ఓపిక పట్టి, తెల్లారాక దగ్గర లోని ఓ బంగారం షాపుకి ఆ బంగారపు ముక్కని తీసుకెళ్ళాడు. ఆ షాపు యజమాని దాన్ని పరీక్షించి “ఇది అసలు సిసలైన మేలిమి బంగారం” అంటూ నిర్ధారించడంతో, ఓ వారం రోజుల పాటూ ఆ వ్యక్తి తోనే ఉండిపోయి, ఆ బంగారం తయారీ విధానాన్ని అంతా కూలంకషంగా తెల్సుకున్నాడు. చెట్టు బెరళ్లూ, వేళ్లూ, ఆ వ్యక్తి హిమాలయాల నుంచీ కావల్సినంత ముందే తెచ్చి పెట్టుకున్నాడు, కాకపోతే వీసమెత్తు బంగారం తయారు చెయ్యాలంటే ఎన్నో వేల దోమల్ని పట్టాల్సి వస్తోంది. ఆ మూలికలనీ, దొరికిన దోమల్నీ, అప్పటి దాకా తయారయిన బంగారాన్ని మొత్తం తనే స్వంతం చేసేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు కదా అనే దురాశ అర్జున్‌లో క్రమక్రమంగా పేరుకు పోయింది.

దాంతో ఓ అర్ధరాత్రి వేళ ఆ వ్యక్తిని చంపేసి, అన్నిటినీ తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు అర్జున్. రాత్రంతా దోమల్ని పట్టడం , తెల్లారాక ఆ పట్టిన దోమల నుసితో చెట్ల బెరడ్లు కలిపి బంగారం తయారు చెయ్యడం మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలం లోనే ఇల్లూ, కారూ, ఇంటి స్థలాలూ, ఆస్తులూ బాగానే సంపాయించాడు, సంపాదన పెరిగే కొద్దీ, ఇంకా ఇంకా సంపాయించాలనే ఆశ పెరిగి పోయింది అతనిలో. రాత్రులు బయట తిరగడం, పదే పదే హిమాలయా పర్వతాలకి వెళ్ళి వస్తూ ఉండడం, పైగా అతి కొద్ది కాలం లోనే అతని ఆస్తులన్నీ విపరీతంగా పెరిగిపోవడం గమనించి ఇరుగు పొరుగు అందరి దృష్టీ అర్జున్ మీద పడింది. దురదృష్టవశాత్తూ ఓ రాజకీయ నాయకుడి హత్య జరగడంతో ఎంక్వయిరీ చేస్తున్న పోలీసులకి, ఆ పరిసరాల్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతూ అర్జున్ సిసి కెమెరాల్లో కనిపించాడు, దాంతో పోలీసులు అర్జున్‌ని అరెస్ట్ చేశారు, ఏ వ్యాపారం, ఉద్యోగం లేకుండానే సంపాదించిన అతని ఆస్తులను చూసి ఆశ్చర్య పోవడమే కాకుండా అతనే హంతకుడని నిర్ధారణకు కూడా వచ్చేశారు, ఎప్పుడెప్పుడో జరిగిన బ్యాంకు దోపిడీల, హత్యల నిందారోపణలను కూడా అర్జున్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసి అతన్ని శాశ్వతంగా జైలుకే అంకితం చెయ్యబోతూ ఉంటే, ఇక అప్పుడు చెప్పక తప్పలేదు అర్జున్‌కి, దోమల ద్వారా తయారయ్యే బంగారం గురించి.

ముందు ఎవ్వరూ నమ్మలేదు, తర్వాత స్వయంగా చేసి చూపించడంతో చూసి ఆశ్చర్య పోయారు. ఇక అప్పుడు మొదలయ్యింది అసలు కథ. టివిల్లో, సోషల్ మీడియాల్లో ఎక్కడ పడితే అక్కడా ఇదే చర్చ, నిజం అని కొందరూ, అభూత కల్పన అని కొందరూ, అర్జున్‌తో ఇంటర్వ్యూలు తీసేసుకుంటూ కొందరూ, అప్పుడే దోమల్ని పట్టే పనిలో పడిపోయి కొందరూ ఇలా మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. కొద్ది రోజులకే దోమల నుంచీ నిజంగా బంగారం తయారవుతోంది అని అంతా నిర్ధారణకి వచ్చేశారు. ఇక అంతే కంపు గొట్టే కాల్వల మీదా, డంపింగ్ యార్డ్‌ల మీదా, మూసుకు పోయిన డ్రైనీజీల మీద కూడా జనం దోమల కోసం ఎగబడిపోయారు. అంతే కాకుండా చెట్ల బెరడ్ల, వేర్ల కోసం వెతుకుతూ హిమాలయాలకి జనం క్యూలు కట్టి వాటిని పిక్నిక్ స్పాట్‌లా చేసి పడేశారు. దోమలు మనుష్యుల మీద వాలడం పోయి మనిషే దోమ కనపడితే వాలి పోవడం మొదలయ్యింది, ఇప్పుడు మనుష్యులను చూస్తే చాలు దోమలు భయపడి పారిపోతున్నాయి, దొరికిన దోమల్ని దొరికినట్టు దోచేసుకుని ఇక ఒక్క దోమ ఎక్కడా లేకుండా చేసేశారు అంతా. ఇక అప్పుడు దోమల దొంగతనాలూ, దోమల మాఫియాలు, దోమల దందాలూ మొదలయ్యాయి. బలహీనుడి దగ్గర బలవంతుడు దోమల్ని దోచుకోవడం మొదలు పెట్టాడు. కాస్త తెలివైన వాళ్ళు దోమల చెరువులూ, దోమల పెంపకం మొదలు పెట్టి, బంగారానికి మించిన రేటుతో అమ్మేస్తూ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసేసుకున్నారు.

“ఏమ్మా.. మీరెంత సేపటి నుండీ ఇక్కడ నిలబడ్డారు” అని దోమల కోసం, దోమలమ్మే షాపు నుండీ రెండు మూడు వీధుల వరకూ బారులు తీరి నిలబడ్డ జనంలో ఓ స్త్రీని అడిగాడు టివి రిపోర్టర్.

“ఏం చెప్పమంటారండీ, మొన్న అర్ధరాత్రి వచ్చి నించున్నాం, ఇప్పటి దాకా ఓ గజం ముందుకు వెళ్ళ లేదు, అసలు మమ్మల్ని ఇక్కడ ఊరికే నిలబెట్టి, అక్రమంగా సరకు ఎక్కువ ధరకు పక్కకు మళ్ళించేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది” అంటూ ఆవేదన వ్యక్తం చేసిందా స్త్రీ. ఈ లోగా ఉన్నట్టుండి వెనుక నుంచీ ఒకావిడ వచ్చేసి “చంటి పిల్లలతో తిండీ తిప్పలూ లేకుండా ఇలా లైన్‌లో పడి ఏడుస్తున్నాం, ఏ నాయకులూ పట్టించుకోరా, ప్రభుత్వం ఏం చేస్తోంది, చోద్యం చూస్తోందా” అంటూ రెచ్చిపోయింది.

“మనకి అందకుండా అక్రమంగా వాళ్ళే దోచుకుంటూ ఉంటే మనల్నెందుకు పట్టించుకుంటారు, మన బాధలేమి అర్ధం అవుతాయి, మనమే వాళ్ళకి తెలిసి వచ్చేటట్లు చెయ్యాలి” అంటూ ఎవడో వెనక నుంచీ అరుస్తూ ఓ రాయి విసిరి అల్లర్లు మొదలెట్టాడు, అంతే మరో రెండు క్షణాల్లో అక్కడ మారణహోమమే జరిగింది.

“మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోకండి, మా సేవలు వినియోగించుకోండి, మీరు కోరుకున్నన్ని దోమలు కోరుకున్న రోజుకి మీ ఇంటి వద్దకే” అంటూ ఆన్‌లైన్ వ్యాపారం జోరు అందుకుంది. “హవ్ టు కాచ్ ఏ మస్కిటో, హవ్ టు స్టోర్ ఏ మస్కిటో” అంటూ యుట్యూబ్ లలో వీడియోలు, ఇలా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా దోమ నామ స్మరణే, దోమల యావే, కొద్ది రోజులకే దోమ అన్నది లేకుండా పోయింది.

చెట్ల బెరడ్లా, వేర్ల కోసం మొత్తం హిమాలయాల్ని గోకి పారేశారు. అటు దోమలూ, ఇటు ఈ వన మూలికలూ కూడా దొరకక పోవడంతో అంతా అల్లాల్లాడిపోయారు, కష్ట పడకుండా సులువుగా సంపాయించుకోవడానికి అలవాటు పడ్డ జనానికి మళ్ళీ మామూలు ఉద్యోగాలకీ, వృత్తులకీ వెళ్లాలంటే విసుగు పుట్టింది. సందట్లో సడేమియా లాగా కొంత మంది మోసగాళ్ళు ఎవ్వరి దగ్గరా లేని దోమలు తమ దగ్గర ఉన్నాయంటూ అసత్య ప్రచారం చెయ్యడం, కొంత మంది అత్యాశపరులు వాటిని నమ్మి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోవడం లాంటి సంఘటనలు జరిగి, జనం చాలా మంది నిరాశా నిస్పృహ లకు లోనయి మానసిక వేదనకు గురి అయ్యారు.

అలాంటి వేదనకు గురయ్యినవాళ్ళలో ఒకడికి ‘అసలు తమ మానాన తాము బతుకుతుంటే దోమలనీ, బంగారమనీ’ చెప్పి తమ బతుకులని చిన్నాభిన్నం చేసేసిన అర్జున్ మీద అంతు లేని కోపం వచ్చేసింది. అంతే విచక్షణ కోల్పోయి, వాడు ఆవేశంతో ఊగిపోతూ వెళ్ళి పదునైన కత్తితో అర్జున్ పొట్టలో ఒక్క పోటు పొడిచాడు. “అమ్మా’’ అంటూ ఒక్క కేక పెట్టి లేచిన అర్జున్‌కి, “తెల్లారి ఎండ మొహం మీదకి కొట్టినా ఇంకా నిద్ర పోవడమే కాకుండా అరుపులు కూడానా, లే లేచి డ్యూటీకి టైమ్ అవుతోంది తయారవ్వు” అంటూ తండ్రి గొంతు వినపడింది. లేచి దుప్పటి మీద చచ్చి పడి ఉన్న దోమల్ని దులుపుకుంటూ “ఏది ఎలా ఉంటే అలాగే ఉండనివ్వు దేవుడా.. విచిత్రాలు చెయ్యకు” అనుకున్నాడు అర్జున్ మనసులో రాత్రి వచ్చిన కలని తలచుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here