Site icon Sanchika

హృదయాల్ని పిండేసే ‘దొంగాట’

[dropcap]ఆ[/dropcap]హా ఓటీటీ ప్లాట్‍ఫాంలో తెలుగులో లభ్యం

“అమ్మా! దొంగ అంటే ఎట్లుంటాడమ్మా? నేను దొంగను ఎప్పుడు చూడలేదు” దాదాపు ప్రతి పిల్లాడు తన చిన్నతనంలో ఈ ప్రశ్నని తప్పకుండా తన తల్లిని అడిగే ఉంటాడు.

ఈ చిత్రంలో దొంగ పాత్రలో నటించిన/జీవించిన ఫహద్ ఫాజిల్‍ని చూపించవచ్చు ప్రతి చిన్నపిల్లాడికి. అప్పుడు ఆ చిన్న పిల్లాడికి దొంగ అంటే సానుభూతి, జాలి కలుగుతాయి. దొంగల గూర్చి మానవత్వంతో ఆలోచించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఓ క్షణం.

***

ఒక మంచి చలన చిత్రాన్ని చూసిన తర్వాత నాలుగు ముక్కలు వ్రాయకుండా ఉండలేని బలహీనత నాది. ‘దొంగాట’ ఒక మంచి చలన చిత్రం. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం.

కథేమీ లేకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకునే కథనం, హృదయాన్ని ద్రవింపజేసే ఆర్ద్రమైన దృశ్యాలు, చివరి వరకు వచ్చాక ఆలోచింపజేసే విధంగా తీసిన విధానం ఇవన్నీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.

రెండే రెండు వాక్యాలలో వ్రాయదగ్గ కథ ఇది. అసలీ కథతో ఇంతలా ఆకట్టుకునేలా చిత్రాన్ని తీయటానికి సాధ్యమా అని ఆశ్చర్యం కలుగక మానదు.

ఇంతకీ కథేంటంటే:

ఒక యువజంట (శ్రీజ, ప్రసాద్) ఉంటుంది.

మొదట చిన్న అపార్థంతో మొదలైన పరిచయం, వారిద్దరి మధ్యా ఓ చిన్నపాటి గొడవకి దారి తీసినా చివరికి ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని ప్రేమలో కూరుకుపోతారు. ఇద్దరూ పారిపోయి వేరే ఊర్లో స్థిరపడతారు. ఆర్థిక కష్టాలనుండి బయటపడి జీవితంలో స్థిరపడటానికి, ఆ కుర్రాడు తమ వ్యవసాయ క్షేత్రంలో బోర్‌వెల్ వేసి పంటలు పండించుకుందాం అని అనుకుంటాడు. ఆ బోర్‍వెల్ వేయాటానికి అవసరమైన డబ్బుల కోసం ఆ అమ్మాయి తన రెండు తులాల తాళిబొట్టు గొలుసుని అమ్మి అతనికి సాయపడటానికి సిద్ధపడుతుంది. ఆ పరంపరలో వాళ్ళు దగ్గరలో ఉండే ఊరికి బస్సులో ప్రయాణం అవుతారు.

ఇక్కడ కథ కీలక మలుపుతిరుగుతుంది.

ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న చిల్లరదొంగ, ఈ అమ్మాయి వెనుక సీట్లో కూర్చుంటాడు. ఆమె నిద్రపోగానే లాఘవంగా గొలుసు కత్తిరించి జేబులో వేసుకోబోతాడు. బస్సు కుదుపులకి ఈ అమ్మాయికి మెలకువ వచ్చి వాడి హస్తలాఘవాన్ని పసిగట్టి ‘దొంగ దొంగ’ అని అరవబోయేలోగా వాడు మెరుపువేగంతో అ అమ్మాయి చూస్తుండగానే ఆ గొలుసుని మింగేస్తాడు. సాక్ష్యం ఎవ్వరూ లేరు, ఎవరి పనిలో వారు ఉంటారు. ఈమె ఒక్కటే సాక్ష్యం.

ఆ తరువాత రక్షకభటులకి ఫిర్యాదు చేయటం, వారు తమదైన బాణీలో వాడ్ని విచారించటం ఇత్యాది సంఘటనలు వరుసగా జరిగిపోతాయి.

చివరికి ఏమైంది అన్నది చిత్రాన్ని చూసి తెలుసుకోవలసిందే.

ఇంతే కథ.

అసలు ఇలాంటి ఓ అప్రాముఖ్యమైన చిన్న కథతో హృదయాల్ని పిండేసే చిత్రాన్ని తీయవచ్చు అన్న ఆలోచన వచ్చిన దర్శకుడు అభినందనీయుడు.

***

మా చిన్న తనంలో మా అమ్మ ఓ వెండి చెంబు చూపించి ఓ సంగతి చెబుతూ ఉండేది. అలా చెప్పేటప్పుడు అప్రయత్నంగా తను కంట తడిపెట్టేసేది. నేనింకా పుట్టక ముందు, ఆ వెండి చెంబుని ఓ దొంగ దొంగిలించాడాట. కాని వాడి ఆచూకి కనుగొని రక్షకభటులు నాలుగు తగిలించి మా వాళ్ళకి అప్పజెప్పారట. కానీ ఆ దొంగని కొట్టిన వైనాన్ని తలచుకుని మా అమ్మగారు కంటతడి పెట్టేవారు. ఇదిగో ఈ చలన చిత్రంలో కూడా మీకు ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.

***

ఇది ‘తొండముదిలుమ్ ద్రిక్సాక్షియుం’ అనే మలయాళ చిత్రానికి శబ్దానువాదం చేయబడ్డ చలన చిత్రం. 2017లో మలయాళంలో విడుదల అయిన ఈ చిత్రానికి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి.

మహేషింట ప్రతీకారం అనే చిత్రాన్ని తీసిన దర్శకుడి రెండవ చిత్రం ఇది. ఇందులో కూడా అదే బాణిలో భావోద్వేగాలకి పెద్ద పీట వేశారు.

***

ఈ చిత్రంలో నాకు కనిపించిన ప్రత్యేకతలు చెబుతాను.

ఏదైనా చిన్న ఊరికెళ్ళి ఒక ఇంటి కిటికీ తలుపు తీసి బయటకి చూస్తే ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణం చక్కగా చూపించారు దర్శకుడు. సినిమా చూస్తున్నాము అనే భావన కంటే నిజ జీవిత వాతావరణాన్ని చూస్తున్నాము అనే భావనే కలుగుతుంది ఆద్యంతం.

భారీ మేకప్పులు, భారీ శబ్దంతో కూడిన సంగీతం, పంచ్ డైలాగులు, హీరో ఇమేజిని ఎలివేట్ చేసే దృశ్యాలు ఇవేవి లేకుండా హాయిగా నిజ జీవితాన్ని ఒడిసి పట్టి చూపించినట్టు ఉంది.

మానవత్వం, కరుణ ఈ రెండు భావాలు ఈ సినిమాని ఆద్యంతం నడిపిస్తాయి. ఎవ్వరూ చెడ్డవారు కాదు, ఎవ్వరూ మంచివారు కాదు. పరిస్థితులు మనల్ని నడిపిస్తాయి. ఈ భావన కలుగుతుంది మనకు చివరకి.

ఇంతకు మించి ఏ మాత్రం చెప్పినా మీకు సస్పెన్స్ విడదీసి చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి ఇంకేమి చెప్పను.

***

* పారిపోతున్న దొంగని వెంటాడే సందర్భంగా నిరాయుధుడైన ప్రసాద్ (భర్త) దొంగని ఒక నీటి కాలువలో ముఖాముఖి ఎదుర్కొంటాడు. అతనికి ప్రాణభయం లేదు, అలాగని చెప్పి దొంగకి హాని తలబెట్టే ఉద్దేశం కూడా లేదు. కేవలం తన నగని తిరిగి తెచ్చుకోవాలనే తపనే అతనిది. పారిపోవాలనే ప్రయత్నమే తప్ప, ప్రసాద్‍కి హాని తలపెట్టే ఉద్దేశం లేదు దొంగకి.

‘మీకు భయం వేయదా’ అని రమణ మహర్షిని ఎవరో అడిగితే, అనన్య భావన ఉంటే ఎవ్వరికీ భయం కల్గదు అని చెప్తారు. ఆ సంగతి అసంకల్పితంగా గుర్తొచ్చింది ఈ దృశ్యంలో.

దొంగని వెనుకపాటుగా వాటేసుకుని పారిపోకుండా ప్రసాద్ పట్టుకున్నప్పుడు, వారిద్దరి ముఖాలలో భావాలని వర్ణించటానికి మాటలు చాలవు.

పట్టుకున్న పెద్ద బండ రాయిని జారవిడిచేస్తాడు దొంగ ఆ క్షణంలో. ఫాజిల్ కేవలం దొంగతనం చేస్తాడే కానీ ప్రసాద్‍కి హాని చేయాలని ప్రయత్నం చేయడు. పారిపోవాలని చూస్తాడు, ఆ సమయంలో అడ్డుపడ్డ ప్రసాద్‌ని వదిలించుకోవాలని చూస్తాడు కానీ గాయపరచాలని అనుకోడు.

ఇక చిక్కక తప్పదు అనుకున్నప్పుడు కూడా భావ రహితంగా ఉండిపోతాడు.

* ప్రసాద్ కూడా అతన్ని పట్టుకోవాలనే చూస్తాడు తప్పనిచ్చి, గాయపర్చాలని గానీ, కొట్టాలని గానీ చూడడు. ‘నా గొలుసు నాకివ్వరా’ అని అర్థిస్తాడు. ఆ దృశ్యం చూసేటప్పుడు మనకు కన్నీరు వస్తుంది

* ఇది చిన్న కేసే కద అని పోలీసులు తేలిగ్గా చూడరు. వాళ్ళ శాయశక్తులా వారు ప్రయత్నించిన విధానం అబ్బురపరుస్తుంది. ఎక్స్‌రే తీయిస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే వాడు టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు గొలుసు బయటకి వచ్చిందేమో అని చూస్తారు. కొద్దిపాటి పోలీసు హింస ఉంది. ఆ సమయంలో దొంగ మీద జాలి కలుగుతుంది మనకు.

* వాడు బాధగా కేకలు పెట్టే దృశ్యాల సందర్భంగా భార్యాభర్తలు “మేము కేసు వెనక్కు తీస్కుంటాం, వాడ్ని వదిలేయండి” అనేస్తారు.

* నాక్కూడా మీలా గౌరవంగా బ్రతకాలని ఉంటుంది అని దొంగ అన్నప్పుడు మనకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అవుతుంది.

* దొంగ పాత్రలో అనేక షేడ్స్ కనిపిస్తాయి. చిలిపిదనం, శాడిజం, హస్తలాఘవం, దయనీయమైన చూపులు, బాధతో ఆక్రందనలు చేసే అరుపులు, యువజంటని చూసి కాస్త అసూయగా చూసి ‘అరె నా జీవితం ఇలా లేదే’ అని బాధపడే చూపులు, ‘నా జీవితం మీ చేతిలో ఉంది’ అని వేడుకునేటప్పుడు దైన్యం, ఎక్స్‌రేలో గొలుసు కనిపించేదాకా బుకాయింపు ధోరణి, ఎక్స్‌రేలో గొలుసు కనిపించగానే చిలిపిగా నవ్వుతూ ‘నేను దొంగతనం చేశాను’ అని ఒప్పుకున్న విధానం ఇవి మామూలు నటుడు చేయలేడు, ఈ పాత్ర కోసమే ఫహద్ ఫాజిల్ పుట్టాడు అన్నట్టుగా నటించాడు. అందుకే అతనికి జాతీయ అవార్డ్ దక్కింది ఈ పాత్ర పోషణకి.

నిజాయితీగా చెబుతున్నాను. తెలుగులో ఒక వేళ్ రీమేక్ చేస్తే ఈ పాత్రకి ఎవరు సరిపోతారు అని ఆలోచిస్తే నాకు ఇద్దరి పేర్లు తట్టాయి.

ఇప్పుడు కాదు కానీ, వయసులో ఉన్నప్పటి రాజేంద్రప్రసాద్, ఇప్పటి నటుల్లో అయితే సత్యదేవ్ మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలరు అనిపించింది.

***

ఈ చిత్రం గూర్చి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. సాధారణంగా ఇటీవలి మలయాళ చిత్రాలలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే ప్రధాన పాత్రలుగా ఉంటూ, ఆ తరహా వాతావరణాన్ని గ్లామరైజ్ చేసి చూపిస్తూ, కేరళ మొత్తంలో హిందూ సమాజం లుప్తం అయిపోయిందేమోఅన్నట్టు భ్రమ కలగజేస్తున్నారు.

తద్విరుద్ధంగా ఈ చిత్రంలో, పాత్రలన్నీ హిందూ మతానికి చెందినవి. చక్కగా శివపార్వతుల పటానికి శ్రీజ దీపం వెలిగించి హారతి ఇస్తుంది. గ్రామంలో జాతర జరుగుతూ ఉంటుంది. గుడి వాతావరణాన్ని, జాతర ఉత్సవాలని అద్భుతంగా నేపథ్యంలో చూపించారు. భగవాధ్వజం (కాషాయ జండాలు), కాషాయ తోరణాలు ఆద్యంతం గ్రామంలో కనిపిస్తు ఉంటాయి, బస్ స్టాప్ గోడలమీద ఏబీవీపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్ అనే గ్రాఫిటీలు కనిపిస్తాయి.

తాళిబొట్టు తాలుకు ప్రాశస్త్యాన్ని పోలీసులు వివరిస్తూ ఉంటారు, సంభాషణలలో భాగంగా.

***

పాత్రలు – పాత్రధారులు

దొంగ- ఫహాద్ ఫాజిల్

శ్రీజ-నిమిష సాజయన్

ప్రసాద్(అమ్మాయి భర్త)-సూరజ్ వెన్‍జార్‍మూడ్

ఎస్ ఐ- సిబీ థామస్

కానిస్టేబులు-ఆలెన్చియర్ లే లోపెజ్

సాంకేతిక శాఖలు:

దర్శకత్వం – దిలీష్ పోతన్

తెర కథ – సాజీవ్ పళూర్

సంగీతం -బిజ్‍బాల్

Exit mobile version