[పెనుమాక రత్నాకర్ గారు రచించిన ‘దోని గంగమ్మ’ అనే కథని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]
[dropcap]“ఊ[/dropcap]రికి, జాతికి కడదాన్ని” అని చెప్పుకోడానికి వెనుదీయని ధైర్యం ఆమెది!
గొంతులో పాటల మాధుర్యమే కాదు, పీకలు కోసేంత పదునైన మాటలు వొదుల్తాది ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే!
దోని గెంటుకుంటూ బతికినంత మాత్రాన ఊరందరికీ ఉంపుడుగత్తె ననుకుంటున్నావేంట్రా – అంటూ చూరు లోంచి కొడవలి తీసేయగలదు!
యాక్సిడెంట్‌లో మొగుడు చచ్చిపోతే మోడులా బతుకుతూ, ముసలి తల్లిదండ్రులను ‘పెంచుకుంటోంది’!
అందం, ఆకర్షణ, హుందాతనం, మనసులోనూ మాటలోనూ సూటిదనం, నిజాయితీ, ప్రేమ, త్యాగం.. అన్నీ మూర్తీభవించిన స్త్రీ ‘దోని గంగమ్మ’.
అంతటి అద్భుతమైన పాత్రను సృష్టించిన రచయిత పెనుమాక రత్నాకర్.
ఉషా పత్రిక మరియు తటవర్తి భారతి స్మారకార్థం టి.టి. నాగేశ్వరరావు గారి ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ‘దోని గంగమ్మ’.
గంగమ్మ ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు. ‘ఏ విధంగానూ’ లొంగదు. ఆమె జీవితం ఓ పజిల్. ఎవరికి తోచినట్లు వారు కల్పనలు, గుసగుసలు జేగురుపాడులో.
ఎందరో పడి చచ్చిపోయే ఆమె అందాన్ని వర్ణించడంలో రచయిత ఎక్కడా తడబాటు పడలేదు –
“30 ఏళ్లు ఉంటాయి. చూడటానికి చదువుకున్న దానిలా పొందిగ్గా ఉంటది. కచ్చా ఏసుకొని కాళ్ళకి కడియాలెట్టుకుని, నెత్తిన కొప్పెట్టుకొని, పావలాకాసంత బొట్టెట్టుకుని, నల్లగా నిగనిగ లాడతాది. కచ్చా ఏసుకోటం వొల్లేమో అన్నీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కనిపిత్తాయి. చూసినోడికి దీని మొగుడెంత అదృష్టవంతుడో అనిపిత్తాది. అలాగని అందగత్తేమీ కాదు కానీ కసిగా ఉంటాది. ఆ ఆకర్షణ దాని రంగుది. అది మామూలు నలుపు కాదు. మత్తెక్కించే నలుపు. వోడ్కా ఫుల్ బాటిల్ తాగితే వొచ్చే కిక్కు దాని కళ్ళను చూత్తే వొత్తాది. ఆ ఆకర్షణ దాని నడుము మడతది. ఆ మడతలో దూరి ఆత్మహత్య చేసుకున్న చెమట చుక్కకు తెలుసు దాని ఆకర్షణెంతో. కానీ దాని చెయ్యట్టుకునే ధైర్నం ఎవడికీ లేదు..”
కొన్ని కథల్లోని పాత్రలు పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. శాశ్వతత్వాన్ని పొందుతాయి. కథ శుభాంతం కావొచ్చు, విషాదాంతం కావొచ్చు. పాత్రలు మాత్రం చిరంజీవులుగా నిలిచిపోతాయి. ఏది ఏమైనా రచయిత వల్ల పాత్రకు పేరు రావడం కంటే, తాను సృష్టించిన పాత్ర వల్ల రచయితకు పేరు రావడం గొప్ప గా ఉంటుంది. అలా”దోని గంగమ్మ” పాత్ర వల్ల రచయిత పెనుమాక రత్నాకర్‌కు ఒక్కసారిగా గొప్ప పేరు, ప్రచారం వచ్చింది.
ఈ దోని గంగమ్మకి ఆ అనపర్తి చుట్టరెడ్డి అనబడే నల్లిమిల్లి ధర్మారెడ్డితో ఏమిటి సంబంధం?
అసలు ఏ మనిషిలో నైనా ఆత్మీయ భావాలు ఎందుకు ఉద్భవిస్తాయి? వాంఛలు ఎలా ప్రవహిస్తాయి? ఏ కడలిలో ఎప్పుడు ఏకమౌతాయి? అంత తీవ్రమైన ఆరాధన ఉంటుందా? ప్రాణానికి ప్రాణమైన ఆత్మీయత, దగ్గరితనం ఉంటుందా?
నిజానికి శారీరక సంబంధమే కానవసరం లేదు. స్నేహమా? ప్రేమా? ఇంగ్లీష్‌లో చెప్పే ‘ప్లేటోనిక్ లవ్’? ‘సోల్ మేట్’?.. ఇన్ని భావాలు ముప్పిరిగొంటాయి దోని గంగమ్మ కథ చదువుతుంటే.
ఏదో ఒక వాదానికి కట్టుబడిన మూస కథలను చదువుతున్న నేటి పాఠకుడు ఒక మనిషి కథ, మనసు కథ, అంతర్లీనంగా మానవతావాదం స్ఫురింపజేసే ఈ గంగమ్మ కథను చదవడం ఒక మంచి అనుభూతి. గోదావరి జిల్లాల యాస, పల్లెటూరి మోటు బాస, అట్టడుగు వర్గాలకు చెందిన వారు మాట్లాడుకునే మాటల్లోనే ఈ కథ చెప్పబడింది. కనుకనే సహజంగా బూతులూ ఉండడంలో పెద్ద అభ్యంతరమూ కనబడదు. అసభ్యతా ఉండదు. రచయిత చేసిన గంగమ్మ శారీరక వర్ణనలో అశ్లీలత కనిపించదు. పైగా దానికో ప్రయోజనం ఉంది. అంత నిగనిగలాడే అందం కాబట్టే చాలామంది కళ్ళు ఆమె నడుం మడతలో చిక్కడిపోతాయి. దోని గెంటుతూ, గంగమ్మ తల్లిలా గలగలా మాట్లాడుతూ, కిలకిలా నవ్వుతూ, గొంతెత్తి హాయిగా పాడుతూ, జీవం తొణికిసలాడే దోని గంగమ్మ చుట్టూ అదో ఆకర్షణ ‘ఆరా’ ఉంటుందేమో! అయితే, అదే ఆమె జీవన్మరణ సమస్య అయిందని పాఠకుడు ఊహించలేడు.
అనపర్తి నుండి టివియస్ బండేసుకుని జేగురుపాడు వొచ్ఛి రోజంతా అందరినీ పలకరిస్తూ, మూడు రూపాయల వడ్డీకి డబ్బు లిచ్చే చుట్టరెడ్డి గారితో ఊర్లో వారికి, వడ్డీకి కాకపోయినా “అయ్యా, ఇంట్లో శుభకార్యం ఉంది, మీ చేత్తో ఐదు రూపాయలివ్వండి” అనేంత ఆప్యాయత ఉంది.
సాయంత్రానికి గంగమ్మ గుడిసెకు వచ్చి, ఆమె పుల్లల పొయ్యి మీద మట్టి దాకలో వండే మాంసం ఇగురు, బండ మీద నూరే చింతకాయ పచ్చడి ఇష్టంగా తింటారు. ఆయన సంపదతో ఆమెకు సంబంధం లేదు. ఈమె లేవరకంతో ఆయనకి సంబంధం లేదు. ఆమెకు అడ్డాపుగెట్టడం (నిప్పున్న వైపు చుట్టను నోట్లో పెట్టుకొని కాల్చడం) ఇష్టమని పొగాకు ఇస్తాడాయన. ఆమె డబ్బు కోరుకునే మనిషయితే గుడిసెలో కరెంట్ పెట్టించుకోకుండా కోడిగుడ్డు దీపం లోనే మగ్గుతుందా! ఇంతకీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా – అని కుర్రాళ్ళు గుసగుసలాడుతుంటే “ఆడా మగ మజ్జన సెక్సు కోరికలు చచ్చిపోయాక పుట్టేదే నిజమైన ప్రేమ రా” అంటాడు అంటాడు భూషణం.
కథను చెప్పే క్రమంలో రచయిత అద్భుతమైన శిల్ప సంవిధానాన్ని అల్లుకున్నాడు. రెప్ప వాల్చకుండా చదివించే శైలిని వొంపాడు. పాత్రోచితమైన భాష మాత్రమే కాక ఏ పాత్రను ఎందుకు ప్రవేశపెట్టాలో, ఆ పాత్ర ప్రయోజనం ఏమిటో తనకంటూ ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నాడు.
ఒకసారి రెడ్డి గారు వరుసగా మూడు రోజులు రాలేదు. ‘ఆరి అన్నయ్య బాల్రెడ్డి’ వచ్చి రెడ్డి గారి కూతురికి జబ్బు చేసిందని, వైజాగ్ ఆస్పత్రిలో చేర్చారని చెప్పాడు. వడ్డీ కిచ్చిన డబ్బులు వసూలు అన్నాడు.
రెడ్డిగారికి కూతురు లేదని, కొడుకు చదువుకుంటున్నాడని గంగమ్మకి తెలుసు, అతనికి మూడు లక్షలు పంపాలని తనింటికి వచ్చిన చివరి రోజు చెప్పడం గుర్తుంది. ఏదో తిరకాసు ఉందని అనుమానించి బయలుదేరి కొప్పారం వెళ్ళింది. పిన్నమ్మ చెప్పింది రెడ్డి గారిని కారు గుద్దేసిందని, ఆసుపత్రిలో కోమాలో ఉన్నారని, పనికి ఓ మనిషిని పెట్టారని, ఎవరికీ ఈ విషయం తెలియనివ్వలేదని.
గంగమ్మ పరుగున హాస్పిటల్ కెళ్ళింది. రెడ్డిగారిని తను చూసుకుంటానని, జీతం ఆమెనే తీసుకోమని చెప్పడంతో అప్పటికే విసుగులో ఉన్న సుందరమ్మ సంతోషం గా వెళ్ళిపోయింది.
“గంగమ్మ రెప్పేయకుండా రెడ్డి గారిని చూసుకుంటోంది. రోజూ ఒళ్ళంతా తడిబట్టెడతది. టైముకి ఇంజెక్షన్ కోసం నర్స్‌కి గుర్తు చేస్తది. ఆయనకి సేవ చేసుకునే అవకాశం కలిగినందుకు సంతోషించింది”
కానీ ఒకరోజు ఆమె చూస్తుండగనే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
“పొగిలి పొగిలి ఏడ్చింది. ఆయన పక్కన పడుకుని తనివితీరా కావిలించుకుంది. ఆయనకిష్టమైన తోటరాముడు లోని పాట ఆయనకు మాత్రమే ఇనబడేలా చెవిలో సన్నగా పాడింది. చుట్ట తెచ్చి ఆయన నోట్లో పెట్టి వెలిగించి, ఆ ఎంగిలి చుట్ట కాల్చింది”.
ఆయన బంధువులు వచ్చేలోగా బైటకు వచ్చేసింది.
“ఏ గుండెకాయో, ఉంకోటో ఎవరన్నా ఇత్తే బతుకుతారు అంటే నేనే ఇచ్చేద్దును కదా” అనుకుంది.
11వ రోజున పొద్దున్నే గౌతమి లో దిగి స్నానం చేసింది. రోజూ పెట్టుకునే బొట్టు చెరిపేసుకుంది. మట్టి గాజులు పగలగొట్టుకుంది. కొప్పు మీద పూలు తీసేసింది. రంగు కోకలు మానేసి తెల్ల కోక కట్టింది. ఇక ఆ తర్వాత ఆమె జీవితంలో పాటా లేదు, చుట్టా లేదు.
తరచుగా వచ్చే బాల్రెడ్డి చూపు గంగమ్మపై పడింది. చుట్టరెడ్డి ఇలాకా అని తెలిసి కూడా “ఐదొందలిత్తాను” అన్నాడు వెకిలిగా. ఆమె రౌద్ర రూపం చూసి పారిపోయాడు. ఓ రాత్రి బాల్రెడ్డి మళ్ళీ వచ్చాడు. నా తమ్ముడు మూడు లక్షలు నీకే ఇచ్చాడా, దొంగతనం కేసు పెడతా అన్నాడు. దాని పీకట్టుకుని నిట్టరాడు కేసి కొట్టాడు. స్పృహ తప్పిపోయిన దాన్ని రాబందు శవాన్ని పీక్కు తిన్నట్టు పగతీరా అనుభవించాడు.
చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన గంగమ్మ.. నిస్తేజంగా.. తర్వాత – మలినం కడిగేసుకుంటున్నట్టు గంగలో ‘దిగి’ కలిసిపోయింది. దాని ఆత్మ ఆయనతో జత కట్టింది.
దోని నడుపునే గంగమ్మ ఏమీ చేయలేక పోవచ్చు కానీ దేవుడే శిక్ష వేసాడా అన్నట్టు బండి మీద వెళ్తున్న బాల్రెడ్డి ని ఇసుక లారీ గుద్దేసింది.
రచయిత పెనుమాక రత్నాకర్ గతంలో వివిధ బహుళజాతి కంపెనీలలో పనిచేసి, పూర్తికాల సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో 2005లో యానాంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పి, ఎవరి నుండి విరాళాలు తీసుకోకుండా నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్నోసార్లు (42 పైగా) స్వచ్ఛంద రక్తదానం చేసారు. గత మూడేళ్లుగా రచనలు చేస్తున్నారు. 11 కథలతో ‘గౌతమీ తీరం’ అనే కథా సంపుటి తెచ్చారు. ఇప్పటి వరకు 60 కథలు, 5 నవలలు, 30 కవితలు వెలువడ్డాయి. రెండేళ్ల నుండి పోటీలకు పంపిన కథలలో 24 బహుమతి పొందాయి. ఇలా బహుమతి పొందిన కథలతో ఒక సంపుటి వేసే ఆలోచనలో ఉన్నారు.
నిబద్ధతతో రచనలు చేయడమే కాక, సామాజిక స్పృహతో, అకుంఠిత దీక్షతో సేవా రంగం లోనూ తనకు తోచిన విధంగా, ఒక విధంగా తలకు మించిన భారం తలకెత్తుకున్న పెనుమాక రత్నాకర్ రాబోయే కాలంలో తెలుగు భాష, పాఠకులు గర్వించే స్థాయి రచయిత అవుతారన్న ఆశా కిరణం ద్యోతకమౌతోంది.