Site icon Sanchika

దూరం

[అనూరాధ బండి గారు రచించిన ‘దూరం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]ర్ర చిలకగన్నేరు పువ్వులు నన్ను చూసే నవ్వుతాయా.
అయినా నేను కాగడామల్లెల్నే చూస్తాను.
చామంతిపువ్వుల్నే ముద్దుచేస్తాను.
శంఖుపువ్వులతో తేనీరు కాచుకుని త్రాగుతాను..
నా ఇష్టం..!

మధ్యాహ్నమయ్యింది, తెమలని పనిలో నేను
సాయంత్రంకూడా అవుతానా!..

ఇన్ని పిల్లల్ని కుండీల్లో ఎలా పెంచాలో.
మొక్కలకు నీళ్ళుపోసి పాడుకుంటూ తిరిగేలోపు
రాత్రి వస్తుంది
ఇక చీకటై నిద్రై..

చప్పట్లు విరిగి దూరంగా పడ్డాయి.
సభ మొత్తం దీపపు వాసన.
కుర్చీల్లో కాంతులీనే దీపపు మనుషులు.
కరతాళధ్వనుల మధ్య చెదరిన కల.

కళ్ళల్లో కాకరరసం పోసారెవరో.
ఎటు చూసినా చేదే.
మళ్ళీ కళ్ళు నులుముకుని చూస్తే..

ఆకులూ పువ్వులూ కొట్లాడుకుంటున్నాయి.
చెట్లు కదిలిపోయాయి.
నీకు తెలుసా ఈ చోటు ఇప్పుడు వేరేగా ఉంది.

Exit mobile version