Site icon Sanchika

దూరం పెరుగుతోంది

[dropcap]ఎం[/dropcap]డలు… ఎండలు… వాటితో పాటు వడగాడ్పులు! బయటే కాదు, అవి.. ఆ ఇంట్లోనూ అలాగే తలపిస్తున్నాయి

ఉక్కపోత… చికాకు పెట్టేస్తూంది. ఉక్కిరిబిక్కిరిగా, అస్థిమితంగా ఉంది బైటేకాదు… ఆ ఇంటిలో మనుషులకు మనసుల్లోనూ అలాగే ఉంది.

రెండురోజుల క్రితం…..

***

“ఏమిటీ ఏదో శుభవార్తన్నావ్, స్వీట్ న్యూస్ అన్నావ్. మధ్యాహ్నం నుండి ఊరించేస్తున్నావ్. ఊహించ లేక తెగ తికమక పడిపోతున్నాను. తెలుసా?” ఆఫీస్ నుండి వస్తూనే పరిమళను అడిగాడు రాజేంద్ర.

“మరో ఐదునిమిషాలు టైం ఇస్తున్నా గెస్ చేయండి. ఈలోగా మీకు టీ తెస్తా” నవ్వుతూ అని, వంటగదికి వెళ్ళింది పరిమళ. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి, బట్టలు మార్చుకుని కూర్చున్న భర్తకు టీ అందిస్తూ, నవ్వి అడిగింది “ఊహించారా?” అని.

“ఉహూ, నా ఊహకు అందటంలేదు, అంత స్వీట్ న్యూస్ ఏంటబ్బా? ఇప్పటికే మనకి ఇద్దరు పిల్లలున్నారు ఇంక నో ఛాయిస్. పోనీ… మా మామ గారికి లాటరీలో కోటి రూపాయలు తగిలితే మనకు యాభై లక్షలు ఇస్తానన్నారా ఏంటి?” ఆశగా అడిగాడు రాజేంద్ర.

“మీకు ఎప్పుడూ అంతకుమించిన మంచి ఆలోచనలు రావుగదా..” నిష్ఠూరంగా అంది పరిమళ.

“ఏం చేయను, నా మేధస్సు మేర అది అవునూ.. అమ్మానాన్న టీ తాగారా?” అడిగాడు.

“ఇచ్చాం లెండి. ఛ. నా ఆనందాన్ని ఆవిరి చేశారు.” కినుకగా అంది పరిమళ.

కప్పులో టీ కొంత సాసర్‌లో పోసి ఆమె పెదవుల దగ్గర పెడుతూ “పరీక్షలు పెట్టక విషయం ఏమిటో చెప్పవోయ్ సంతోషిస్తాను” అన్నాడు రాజేంద్ర.

సాసర్ తను పట్టుకుంటూ “నే రాసిన కథకు ప్రథమ బహుమతి వచ్చిందని మధ్యహ్నం మెసేజ్ వచ్చిందండీ!” మెరిసే కళ్ళతో చెప్పింది.

“ఓ… అభినందనలు! మరి ఆ మాట వెంటనే చెప్పొచ్చు కదా.. ముందా టీ తాగు, చల్లారి పోతోంది.”

భర్త మాటతో సాసర్ ఖాళీ చేసి, కప్పు కూడా అందుకుని పక్కన పెట్టేసింది.

మంచం మీద అడ్డంగా వాలి పడుకుని, తన చేతిలో ఉన్న ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ అడిగాడు “కథ పేరేంటి? ఇతివృత్తం ఏంటి?”

“కథ పేరు.. ‘దూరం పెరుగుతోంది’. ఇతివృత్తం ఏంటంటే, “ఈ రోజుల్లో ఆడ మగ, చిన్నా పెద్దా అందరూ మొబైల్ ఫోన్లకు బానిసలై, ఎదురుగా ఉన్న వారిని.. ఇంట్లో వాళ్ళను సైతం పలకరించరు, పట్టించుకోరు. వాళ్లకు వాళ్ళే మౌనంగా, మరో లోకంలో ఉంటున్నారు. ప్రపంచమంతా తమ అరచేతిలోనే ఇముడ్చుకుని.. ముఖపరిచయం లేని వాళ్ళను సైతం ఆత్మీయులుగా చూస్తూ, గంటల తరబడి మాట్లాడకపోతే బతకలేని బలహీనతలు బాగా మనలో బలపడి పోతున్నాయి.. ఆప్తులని మాత్రం అపరిచితుల్లాగా చూస్తూ అలక్ష్యం చేస్తున్నారు…ఇలా దూరం పెరిగిపోతే… ఆపదొస్తే ఆదుకునేవారెవరు?…”

ఉత్సాహంగా చెప్పుకు పోతున్న పరిమళ ఆగి, భర్త వైపు చూసింది.

తన చేతివేళ్ళు ఎప్పుడు వదిలేశాడో గమనించలేదు. కళ్ళు మూసుకుని ముని వేళ్ళతో నుదురు మీద రద్దుకుంటున్నాడు.

టక్కున ఆపేసింది.

“చెప్పద్దని, వినలేనని చెప్పొచ్చు కదా ఈ తలనొప్పి భంగిమ లెందుకో?” కోపంగా అంటూ లేచింది.

“అరె…కూర్చో. నిజంగానే తల…”

అంటున్న భర్త మాటలు వినిపించుకోకుండా గదిలోంచి వెళ్ళిపోయింది…

***

ఇదిగో.. రెండు రోజులనుండి ఇలాగే వాళ్ళిద్దరి మౌనం, ఎడముఖం పెడముఖాలతో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు కూడ వడగాడ్పులు… ఉక్కపోతల్లా ఉంది.

ఆరోజు ఆదివారం. రాజేంద్ర ఇంట్లోనే ఉన్నాడు.

“భోజనానికి రమ్మని పిలవటం ఇది మూడో సారి. వస్తారా, రారా?” పిల్లలతో కబుర్లుచెప్తూ కూర్చున్న రాజేంద్రను పిల్చింది పరిమళ.

టైం చూశాడు రెండు అయ్యింది.

“టిఫిన్ గట్టిగా పడింది కదా.. అని ఆగాను. నీవు తిన్నావా?”

“నా సంగతి వదిలేయండి” ఆమె జవాబుకి నవ్వుతూ అన్నాడు.

“సరే, పద తిందాం” అని లేచాడు.

భోజనం చేసి లేస్తూ, తనూ తిని చేయి కడుక్కుంటున్న భార్యతో అన్నాడు “పరిమళా! ఇప్పుడు రాసుకునే పని లేకపోతే బెడ్ రూమ్‌కి రా.” అని.

“ఏమిటి రమ్మన్నారు?” అడిగింది పరిమళ కాసేపాగి వచ్చి.

“కూర్చో, ఇంకా కోపం పోలేదా మూడు రోజుల నుంచి?” అడిగాడు నవ్వి.

“నేనెంత? నాకోపం ఎంత? విషయం ఏంటో చెప్పండి?” అంది.

“కూర్చోముందు” అంటూ చేయి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

ఆమెని చూస్తూ అడిగాడు “నీ రాతలని గాని, నువ్వు ఎందుకు రాస్తున్నావని గాని నేను ఎప్పుడైనా ఏమైనా అన్నానా?” అని.

“మీకంత తీరిక ఎక్కడిది? సంతోషంగా మీతో ఏదైనా పంచుకుందామని ఆశపడితే, ఎక్కడలేని తలనొప్పీ మీకు అప్పుడే వచ్చి పడుతుంది కదా…”

“అబ్బా..!” అన్నాడు.

“ఏం మళ్ళీ వస్తుందా తలనొప్పి?”

“పిచ్చీ! నేను చెప్పేది వినిపించుకోవు కదా?” నవ్వుతూ అన్నాడు.

మౌనంగా ఉండి పోయింది పరిమళ.

“అలుక మాని, చెప్పేది విను. నిన్న మీ నాన్న నాకు ఫోన్చేశారు. ‘బాబూ, అమ్మాయి ఫోన్ చేసి పది రోజలు పైనే అయ్యింది. మేము చేసినా చూడటం లేదు. అమ్మాయి బాగానే ఉందా? ఇంట్లో అంతా కులాసా?’ అని. ఇలాగే చేశారని మొన్నా మధ్య కూడా నీకు చెప్పాను. చేశావా?” అడిగాడు.

“రాత పనిలో ఉండీ.. చేద్దామని అనుకుంటూనే… ఎప్పటికప్పుడు…”

మౌనంగా ఉండిపోయాడు రాజేంద్ర.

“ఈమాత్రానికే అల్లుడిగారికి ఫిర్యాదు చేశారా కూతురి మీద?” నవ్వుతూ అడిగింది పరిమళ.

“నవ్వావా! హమ్మయ్య… గుండెలపై బరువు దించేశావ్”

“మరీ విడ్డూరంగా మాట్లాడకండి”

“విడ్డూరం కాదు, వాస్తవం లే గానీ… నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు పెట్టిన భోజనపు పళ్ళెంలో అన్నంతో పాటు మధ్యలో కనిపించేది పరిమళ అనే నీ పేరు. మంచినీళ్ళు త్రాగే గ్లాస్, అరే! కాఫీ ఇచ్చే చిన్న వెండి గ్లాస్ పై సైతం పరిమళే! అర్థమైంది.. లోపలున్న బిందెలు, గిన్నెలు మీద కూడా పరిమళిస్తుంటావని. ఇంటి పేరు సరేసరి…”

“ఏమిటీవాళే అవన్నీ కొత్తగా చూసినట్లు మాట్లాడుతున్నారు…” అంది.

“ఆగు. చెప్పనివ్… అమ్మానాన్న వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కుని నీ పేరు వేసి చూసుకుని మురిసిపోతున్నారు. వాళ్ల ఆశ, ధ్యాస నీ మీదే…”

“చెప్పాగా… రాతపనిలో…”

“చేతిలో ఫోనుంది. రోజు మొత్తంలో ఓ రెండు నిమిషాలు ‘లేచారా లేదా, తిన్నారా, ఎలా ఉన్నారు’ అంటే వాళ్ళకు ఎంత సంబరంగా ఉంటుంది?”

“……………..”

“ఏమైనా అంటే ‘రాసుకోవాలి కాబట్టి కుదరటం లేదు’ అంటావ్. పోనీ… ఎవరితో మాట్లాడవా అంటే,నీ కథలో చెప్పావే… అలాగే నువ్వూ గంటలు మాట్లాడుతావ్ అందరితో!”

“…………….”

“ఇక్కడ… వంట చేస్తావ్, టేబిల్ మీద పెడతావ్. అమ్మా నాన్న వెళ్లి పెట్టుకు తినాలి. తిన్నారా లేదా పట్టించుకోవ్, ఎందుకంటే నీవు రాసుకోవాలి…”

“…………….”

“ఇపుడు వేసవి సెలవులు. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. పై పనులన్నీ పనిమనిషి చేస్తే… హడావిడిగా వంట చేసి పెట్టేస్తావ్. పిల్లలు మాట్లాడబోతే, ఏమైనా అడగబోతే… ‘తినేసీ,మీ రూం లోకెళ్ళి క్యారమ్స్ ఆడుకోండి, టివి చూడండి.. నన్ను డిస్ట్రబ్ చేయొద్దు’ అంటావ్. రాసుకోవాలి కదా నీవు?” ఆగాడు రాజేంద్ర.

చివ్వున తలెత్తి చూస్తూ అడిగింది పరిమళ. అప్పటికే ఆమె కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతున్నాయ్.

“ఇంతకీ మీరనేదేమిటి? అవన్నీ మానేసి, ఇంటిపని వంటపని చూసుకోమని. అంతేగా? మానేస్తాలెండి” ఆమె స్వరంలో రోషం ధ్వనించింది.

ఆమెను దగ్గరకు తీసుకుంటూ “అలా అర్థమయ్యిందా…ప్చ్! మీ రాసే వాళ్ళు ఎంత షార్పో… అంత సెన్స్‌టివ్‌గా ఉంటారు కాబోలు. మొన్న నువు బహుమతి కథ ఇతివృత్తం చెబుతుంటే అనిపించింది అటు కన్నవాళ్ళని, ఇంట్లో ఉన్నవాళ్ళని, కడుపున పుట్టిన చిన్నవాళ్లతోను నవ్వుతూ నోటారా మాట్లాడకుండా.. అలా ఉండకూడదని నువు చెప్పేది ఎవరికీ?” మెత్తగా, సూటిగా అడిగాడు రాజేంద్ర.

“అర్థమైంది. రాయటం మానేస్తాలే” ఒకింత కలతగా అంది పరిమళ.

“మరదే అలుగుడంటే.. ఇలా అంటావనే ఆ రోజు చెప్పలేక పోయాను. రాసే శక్తి ఎందరికుంటుంది?  వ్రాస్తుండు. కాకపోతే.. ఆ దూరం మన మధ్యలో పెరగకుండా చూసుకుంటే చాలు” అన్నాడు రాజేంద్ర.

మౌనంగా ఉన్న పరిమళతో మళ్లీ అనునయంగా చెప్పాడు

“నిన్ను నొప్పించాలని కాదోయ్, మన కోసమే ఎదురు చూసేవాళ్లను అలక్ష్యం చేయొద్దు అని మాత్రమే నేను చెప్పేది”

“అలాగే…” అంది చిన్నగా నవ్వి.

“హమ్మయ్య. లేచిన వేళావిశేషం కాస్త బావున్నట్లుందీ వేళ!?” అంటున్న భర్తతో పాటు తను కూడా నవ్వేసింది పరిమళ.

Exit mobile version