[శ్రీ ముకుంద రామారావు రచించిన ‘దొరికీ దొరకనపుడు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]దూ[/dropcap]దిలా
చుట్టూ ఎగురుతూ
ఊరించే పదాలు
దొరికేవెన్నో దొరకనివెన్నో
అంత వేకువనే పక్షులు
కిటికీ దగ్గరసా వచ్చి
పోటీలు పడుతూ అరిచేవే
లేచి చూసేసరికి
మూకుమ్మడిగా కొన్ని ఎగిరిపోతాయి
వేటికవే వేర్వేరు గూటిలో ఉంటున్నా
ఇతర పక్షుల అరుపులతో
జతకలుపుతూనే ఉంటున్నట్టు
మరికొన్ని
మంచులో కనుమరుగైన దృశ్యాల్లా
గుర్తుకుతెచ్చుకుంటున్నవి ఇంకెన్నో
అదే పనిగా
విన్నవే విననంటున్న చెవులు
చెప్పినవే చెప్పనంటున్న నోరు
రాసినవే రాయనంటున్న చేతులు
మూగవానిని చెవిటివాడు వింటున్నట్టు
తెలిసినవయినా కాకపోయినా
ఏ రోజుకారోజు సరికొత్తగా పదాలు