Site icon Sanchika

దొరికిన పెన్నిధి

[శ్రీమతి నండూరి సుందరీ నాగమణి రచించిన ‘దొరికిన పెన్నిధి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఎం[/dropcap]దుకంతలా విసుక్కుంటున్నావు? ఆవిడకు మనం తప్ప ఇంకెవరున్నారని అలివేలూ?” అనునయంగా చెబుతున్న నారాయణకు జవాబుగా, “ఏమోనండీ, నాకావిడంటే ఇష్టం లేదు.. నా పిల్లవాడు ఆవిడ దగ్గర పెరగటం అసలిష్టం లేదు..” అంటూ తెగేసి చెప్పింది అలివేలు.

“అలా మాట్లాడకు అలివేలూ, ఆమె నీ కన్నతల్లి కాకపోయినా, ఆ స్థానంలో ఉంది.. మీ నాన్నగారు హఠాత్తుగా చనిపోతే ఒంటరిగా బ్రతకలేకనే కదా, తాను ఇలా మన పంచన చేరింది! తన పేరిట ఉన్న ఆస్తి కూడా నీ పేరునే రాసేసింది.. ఒక పెద్ద దిక్కుగా మనతో ఉండనీ.. అలా కటువైన మాటలతో ఆవిడని హింసించకు..”

“హు.. అదంతా మా నాన్న చేసిన పని.. నా పదహారేళ్ళ వయసులో నా గురించి చిన్న ఆలోచన కూడా లేకుండా, ఈవిడను గుళ్ళో పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు మా నాన్న.. నా తల్లి స్థానంలోకి వచ్చిందే కానీ నాకు తల్లి కాలేకపోయింది.. సరే, తరువాత మన పెళ్ళయ్యాక మా ఇంటి గుమ్మం తొక్కలేదు నేను – కేవలం ఈ మొహాన్ని చూడాల్సి వస్తుందనే. మా నాన్న తాను మరణించి నన్ను చంపాడు.. ఇదిగో, ఈ దరిద్రం నాకు చుట్టుకుంది.. ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని చెప్పేస్తాను.. ఆమెను అస్సలు భరించలేకపోతున్నాను..”

దీర్ఘంగా నిట్టూర్చాడు నారాయణ.

“ములుకుల్లాంటి నీ మాటలు పడటం కన్నా ఆవిడ ఎటైనా వెళ్ళిపోవటమే మంచిదేమోలే.. మరి ఆవిడ నీ పేరున వ్రాసిన ఆస్తి కూడా తిరిగి ఇచ్చేయి..” చెప్పదలచుకున్నది చెప్పేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్న రాములమ్మకు తన గుండెను ఎవరో పరపరా కోసినట్టు అయింది. ఉవ్వెత్తున ఏడుపు ముంచుకు వచ్చింది. నిస్సహాయంగా స్వర్గానికి చేరిన భర్తను తలచుకుని, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.

***

రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలో హెల్పర్‌ పని చేసేది, పదవ తరగతితో చదువు ఆపేసిన రాములమ్మ. చిన్నప్పుడే తండ్రి పోయినా తన రెక్కల కష్టం మీద తమ్ముళ్ళను ఇద్దరినీ చదివించి, పెద్దవారిని చేసింది. పెళ్ళి సంబంధాలు చూడటానికి తల్లి ప్రయత్నిస్తుంటే, తాను పెళ్ళి చేసుకోనని, ఆ వయసు దాటిపోయిందని తల్లికి నచ్చజెప్పి, తమ్ముళ్ళు ఇద్దరికీ మంచి సంబంధాలే చూసి పెళ్ళి చేసింది. పెళ్ళిళ్ళు అయ్యాక తమ్ముళ్ళు ఇద్దరూ తమ తమ సంసారాలతో దూరంగా వెళ్ళిపోతే, తాను వృద్ధురాలైన తల్లితో జీవించసాగింది రాములమ్మ. అప్పటికే తనకు దగ్గర దగ్గర ముప్పై ఐదేళ్ళు వచ్చేసాయి. కూతురు ఏమైపోతుందో అన్న బెంగతో కృశించిపోయి, తల్లి కూడా తనువు చాలించటంతో ఒక్కసారిగా ఒంటరిదైపోయింది రాములమ్మ.

***

ఒకరోజు సాయంత్రం ఆఫీసులోని వర్కర్స్ అందరూ వెళ్ళిపోయిన తరువాత, అన్నీ సర్దుకొని తానూ వెళ్ళటానికి ఉపక్రమించింది రాములమ్మ. ఈలోగా యజమాని కేబిన్ లోంచి గట్టిగా మూలుగు, దాంతో పాటే ఏదో వస్తువు కింద పడిన శబ్దం వినిపించి లోపలికి వెళ్ళింది.

కుర్చీలో వెనక్కి వాలిపోయి ఉన్నాడు రంగారావు. తల వెనక్కు వాలిపోయి కనులు మూత పడసాగాయి. టేబుల్ కింద – పైనుంచి పడిన స్టీల్ గ్లాసు ఇంకా గింగిరాలు తిరుగుతోంది. అతన్నలాంటి స్థితిలో చూసిన రాములమ్మకి క్షణం పాటు ఏం చేయాలో తోచలేదు. వెంటనే అక్కడ పుస్తకంలో ఉన్న ఫ్యాక్టరీ క్లినిక్ డాక్టర్ గారి నంబర్‌కు త్వరత్వరగా లేండ్ లైన్ లోంచి ఫోన్ చేసింది. విషయం విన్న వెంటనే ఆయన అలర్టయి, రంగారావు కారు డ్రైవర్‌తో సహా వచ్చేసాడు. వెంటనే రంగారావును ఆసుపత్రికి తరలించటం, అతనికి సత్వరంగా చికిత్స దొరకటం, ప్రాణాపాయం తప్పటం జరిగింది. ఆ విషయం తెలిసిన తరువాత తేలికగా నిట్టూర్చింది రాములమ్మ.

ఆ తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా, ఇంచుమించు పది పదిహేను రోజుల పాటు ఆయన ఆఫీసుకు రాలేదు. కొన్ని పత్రాల మీద సంతకం పెట్టించవలసి రావటంతో, రాములమ్మ తానే ఆయన ఇంటికి వెళ్ళింది. ఆమెను చూడగానే రంగారావు ముఖం విప్పారింది.

“చాలా థాంక్స్ రాములమ్మా, నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో.. నా ప్రాణం కాపాడావు..” ఉద్వేగంగా చెప్పాడాయన.

“ఫరవాలేదు సార్, నేను చేసిందేమీ లేదు. సమయానికి డాక్టర్ గారు వెంటనే వచ్చి, వైద్యం చేసి మీ ప్రాణం కాపాడారు.” వినయంగా చెప్పింది రాములమ్మ. ఆయన సంతకాలు పెట్టి కాగితాలు వెనక్కి ఇవ్వగానే, ఆఫీసుకు తిరిగి వెళ్ళిపోయింది ఆమె.

స్వస్థత చేకూరిన తరువాత ఆయన మరల ఆఫీసుకు రావటం మొదలుపెట్టాడు. రాములమ్మను నిశితంగా గమనించటం మొదలుపెట్టాడు. ఆమె ఓపిక, సహనం, ఒద్దిక ఆయనకెంతో నచ్చాయి. ఆమె వ్యక్తిగత వివరాలు కూడా తెలుసుకుని, అంత మంచి వ్యక్తి, ఒంటరిగా మిగిలిపోయినందుకు చాలా బాధ పడ్డాడు. ఏదో తెలియని అభిమానం కలిగింది ఆమెపైన. ఇవేవీ తెలియని రాములమ్మ అందరికీ పనిచేసి పెట్టిన విధంగానే అతని పనులు కూడా చేసి పెట్టేది.

ఒకరోజు ఉన్నట్టుండి, తన మనసులో మాట బయటపెట్టి, “నాకు పదహారేళ్ళ కూతురు ఉంది. ఈ సమయంలో ఆమెకు తల్లి అవసరం చాలా ఉంది. నీ మనస్తత్వం, స్వభావం ఏడేళ్ళుగా చూస్తున్నాను. ఆమెకు తల్లిగా, నాకు భార్యగా నా జీవితంలోకి రాగలవా?” అని అడిగాడు వేడికోలుగా..

“అయ్యగారూ, నేను పెద్దగా చదువుకోలేదండీ.. నాకు నాగరికత తెలియదు. మీరు తలచుకుంటే మీలాంటి గొప్పింటి వాళ్ళలో మీకు తగిన ఇల్లాలు దొరుకుతుంది. నాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం అసలు లేదండీ. క్షమించండి..” అని మృదువుగానే అయినా స్థిరంగా చెప్పింది రాములమ్మ.

తాను చెబితే వినటం లేదని, ఆమె తమ్ముళ్ళను పిలిపించి మాట్లాడాడు రంగారావు.

ఇన్నాళ్ళకు అక్క ఓ ఇంటిదయ్యే అవకాశం వచ్చినందుకు, అదీ అంతటి గొప్ప వ్యక్తికి ఇల్లాలు అవుతున్నందుకు ఇద్దరూ సంతోషపడ్డారు. అక్కను బతిమాలి ఒప్పించారు. అయితే, రంగారావు, ‘అలివేలు’ సంగతి పూర్తిగా విస్మరించాడు. పదహారేళ్ళ వయసున్న ఆ అమ్మాయికి తోడుగా, పెద్ద దిక్కుగా, మార్గదర్శినిగా రాములమ్మను తీసుకువెళుతున్నానని అనుకున్నాడే కానీ, యుక్తవయసు వచ్చిన కూతురిని ఈ మార్పుకు సంసిద్ధం చేయాలన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయాడాయన. ఆయన దృష్టిలో అలివేలు ఇంకా చిన్నపిల్లే.

రాములమ్మను గుడిలో పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకువెళ్ళిన రోజు, తల్లి తరఫు బంధువులంతా చెప్పిన మాటలకు ప్రభావితమైన అలివేలు కంటి నిండా కన్నీళ్ళతో, మనసు నిండా ద్వేషంతో రాములమ్మకు ఎదురుపడింది.

“ఏమ్మా, బాగున్నావా?” ఆదరంగా దగ్గరకు తీసుకోబోయిన రాములమ్మను నిర్లక్ష్యంగా చూసి, ముఖం తిప్పుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత అలివేలుకు ఎంత దగ్గరవ్వాలని చూసినా రాములమ్మకు సాధ్యమే కాలేదు. రంగారావు ఎంత నచ్చజెప్పినా అలివేలు వినేది కాదు. తన సామ్రాజ్యంలోకి దూసుకువచ్చిన శత్రురాజును చూసినట్టే చూసేది. ఏ ప్రయోజనం కోసం తాను రెండవ పెళ్ళి చేసుకున్నాడో అది కాస్తా విఫలమయ్యే సరికి – ఏమీ చేయలేక అసహాయంగా ఊరుకున్నాడాయన. ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, వేళకు మందులు ఇస్తూ, మంచి ఆహారం వండి పెడుతూ ఆ ఇంటి ఇల్లాలిగా గడపసాగింది రాములమ్మ. అలివేలుతో ఎంత సామరస్యంగా ఉండాలన్నా ఆమె సహకరించేది కాదు. ఎప్పుడూ రాములమ్మను కసురుతూ, తిడుతూ, నిందిస్తూ కోపంగా ఉండేది. ప్రేమతో అన్నం వడ్డించినా కూడా, అందులో ఏదో విషం కలిపినట్టుగా అనుమానించేది.

ఇంటర్ అవగానే, “నాన్నా, నాకు ఇక డిగ్రీ చదవాలని లేదు. ఇక్కడ ఉండాలనీ లేదు. నాకు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించేయి. ఆ రాములమ్మను చూస్తుంటే నాకు తేళ్ళూ జెర్రులూ పాకుతాయి ఒళ్ళంతా.. నేను ఇక్కడ ఉండను..” అంది కటువుగా.

“అమ్మా, అలివేలూ, మారు తల్లి అంటే నానా బాధలూ పెడుతుందని అనుకోవటం అన్నది నీ భ్రమ అని రాములమ్మ విషయంలో తెలిసిపోయింది కదా.. ఆవిడ నిన్నూ, నన్నూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో గమనించావా? అందరితో ఎంతో బాగా ఉండే నీవు ఆమెను అర్థం చేసుకోకపోవటం చాలా దురదృష్టం. అసలు రాములమ్మ లేకపోతే, ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడినా చెప్పు?” రంగారావు బుజ్జగింపుగా చెప్పటానికి ప్రయత్నించినా, ఆమెకు సహించేవి కావామాటలు.

ఎప్పటికైనా పెళ్ళి చేయవలసిందే కనుక ఆమెకు పెళ్ళి సంబంధాలు చూడసాగారు. సంబంధం కుదరగానే, పెళ్ళి జరగటానికి పదిహేను రోజుల ముందు లాయర్ని పిలిచి వీలునామా వ్రాసాడు రంగారావు. ఆస్తిలో మూడు వంతులు కూతురి పేరున వ్రాసి, ఒక వంతు తన పేరున ఉంచుకున్నాడు. ఫ్యాక్టరీని మాత్రం రాములమ్మ పేరిట వ్రాసాడు. ఆ విషయం తెలిసి ఉక్రోషంతో ఉడికిపోయింది అలివేలు. కానీ చేసేది లేక, తన పేరున ఆస్తిలో సింహభాగాన్ని వ్రాసినందుకు పైకి ఏమీ అనకుండా ఊరుకుంది.

అలివేలు పెళ్ళి జరిగి ఐదేళ్ళయాక రంగారావుకు మళ్ళీ హార్ట్ ఎటాక్ రావటం, ఆకస్మిక మరణం చెందటంతో రాములమ్మ మళ్ళీ ఒంటరిదై పోయింది.

***

రంగారావు దినవారాలు పూర్తి అయాక, అలివేలు భర్త నారాయణ – రాములమ్మను తమతో రమ్మని అడిగాడు. ఆశగా అలివేలు వైపు చూసింది రాములమ్మ. ఆమె అయిష్టంగా ముఖం తిప్పేసుకుంది. గత పదిరోజులుగా అలివేలు కొడుకు రెండేళ్ళ పిల్లవాడు రాములమ్మకు బాగా మాలిమి అయాడేమో, అలివేలింటికి వెళితే ఆ పిల్లవాడిని సాకటంలో తన దుఃఖం కొంతైనా తగ్గుతుందేమో అనిపించి, బంధువులు కూడా మరీమరీ చెప్పటంతో రాములమ్మ వారితో బయలుదేరింది. బంధువులంతా చెప్పినందువలన అలివేలు కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. మనసులో మాత్రం కోపంతో పళ్ళు నూరుకోసాగింది.

నారాయణ ఇంటికి వచ్చిన తరువాత రాములమ్మకు ఆ ఇల్లు ఒక ఖైదులా అనిపించింది. పిల్లవాడిని ఎత్తుకుందామంటే, వల్లకాదని తెగేసి చెప్పింది అలివేలు. గదిలో ఓ మూల నేల మీద చాపేసుకుని పడుకుని ఉన్న రాములమ్మను పలకరించే దిక్కు లేదు. భోజన సమయానికి మాత్రం నారాయణ పిలిస్తే వెళ్ళి నాలుగు మెతుకులు కతికి వచ్చేసేది.

పదిరోజులు గడిచిన తరువాత లాయర్ గారు వచ్చి, అలివేలు చేతికి కాగితాలు అందించి చెప్పాడు, రాములమ్మ తన పేరిట వ్రాసిన ఫ్యాక్టరీని తిరిగి అలివేలు పేరుకు బదలాయించిందని చెబుతూ. అయినా అలివేలుకు ఏమాత్రం జాలి కలగలేదు. ఇప్పుడు రాములమ్మకు ఎవరూ లేరు, ఏమీ లేదు. కూతురి మనసు మారుతుందేమోనని అనుకుంది కానీ, కటువుగా తన వల్లనే రంగారావు చనిపోయాడని అలివేలన్న మాటలకు ఆమె మనసు చెదిరిపోయింది. ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ, రోడ్డు మీదికి తన బ్యాగ్‌తో వచ్చి, సరిగ్గా తిండి లేక ఒళ్ళు తిరగటంతో ఒక కారుకి అడ్డంగా వెళ్ళి పడిపోయింది.

***

సాయంత్రం ఐదున్నర దాటుతోంది. బెల్ కొట్టి, తలుపు తెరవగానే లోపలికి వచ్చిన డాక్టర్ శివరావును చూడగానే సంతోషంగా ‘రండి అంకుల్..’ అని లోపలికి పిలిచింది అలివేలు.

కూర్చోమని సోఫా చూపిస్తున్న ఆమెతో, ‘లేదమ్మా, నేను కూర్చోవటానికి రాలేదు. నీకొక సంతోషకరమైన వార్త చెబుదామని వచ్చాను..’ అన్నాడు గంభీరంగా.

అర్థం కానట్టు చూసింది అలివేలు.

“రాములమ్మ కారుకింద పడి, మూడురోజులు నరకయాతన పడి ఈరోజు చనిపోయింది..” ఆమె ముఖంలోకి దీక్షగా చూస్తూ చెప్పాడు శివరావు.

అలివేలు ముఖంలో కలవరపాటు.. ఒక్కసారిగా ముఖం పాలిపోయింది. కళ్ళలో అపరాధభావన.. “అంకుల్.. మీరనేది నిజమా?” అలివేలు గొంతు జీరబోయింది.

“ఏమ్మా, నీకు సంతోషమే కదా.. నీ ఇంట్లోంచి వచ్చి రోడ్డున పడితేనే కదా యాక్సిడెంట్‌కి గురి అయింది? ఇంట్లోంచి వెళ్ళిపోయి మూడు రోజులైంది. కనీసం మనిషి ఏమైపోయి ఉంటుందో అని క్షణమైనా ఆలోచించావా? నీ సవతి తల్లిగా కాదు.. సాటి స్త్రీగా ఆలోచించు.. అసలెందుకమ్మా ఆవిడ మీద నీకంత ద్వేషం?

చిన్నతనంలోనే చదువు మానేసి, కొలువులో చేరి, తన కుటుంబాన్ని ఓ దరికి చేర్చింది. నిజాయితీగా పని చేస్తూ మీ కంపెనీలో అందరి అభిమానాన్ని పొందింది. నాన్నగారికి సరైన సమయానికి వైద్య సహాయం అందించింది. ఆరోజే మీ నాన్నగారు నాతో చెప్పారు. భూదేవికి ఉన్నంత సహనాన్ని, మంచితనాన్ని ఆ స్త్రీలో తాను చూసానని.. ఆ తరువాత కొద్దికాలానికి ఆమెను వివాహం చేసుకునే ముందు కూడా నాతో చెప్పారు. నీకు తల్లిలేని లోటు, ఆమె ప్రేమ ద్వారా తీరుతుందని, అలాగే ఒంటరిగా బ్రతుకుతున్న రాములమ్మకు ‘తనవాళ్ళు’ అంటూ ఏర్పడతారని.. లేకపోతే యాభై దాటిన ఆయనకీ, నలభై కూడా లేని రాములమ్మకీ పెళ్ళి ఏమిటి చెప్పు? ఇద్దరి మధ్యా ఒక స్నేహం ఉంది, కానీ శారీరక బంధం కూడా లేదమ్మా.. ఆవిడ నిన్నే తన కూతురని భావించి, అలాగే ప్రేమించింది. కానీ నువ్వామె ప్రేమను అంగీకరించలేకపోగా, నిరంతరమూ ద్వేషించావు.. ఆఖరికి తనకున్న తోడును కూడా పోగొట్టుకుని నీ దగ్గరకు వస్తే, నీ మాటలతో, చేతలతో హింసించి, ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసావు. తనకెంతో ప్రీతిపాత్రమైన ఫ్యాక్టరీని కూడా నీకే ఇచ్చేసింది కదమ్మా.. మీతో పాటే ఉంటూ, నీ పిల్లల పెంపకంలో సాంత్వన పొందాలనుకుంది.. చివరికి తన ప్రాణాలే పోగొట్టుకుంది..” కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడాయన.

“సారీ అంకుల్.. అయామ్ వెరీ సారీ..” రెండు చేతులతో ముఖం కప్పుకుని బావురుమంది అలివేలు.

“చిన్నప్పటి నుంచీ అమ్మలేని లోటును బాగా ఎదుర్కొనే దాన్ని.. దేవుడి మీద కోపం.. అమ్మను తీసుకుపోయాడని.. నాన్నకి మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినపుడు రాములమ్మే మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించటం, దాని ద్వారా ఆయనకి సమయానికి వైద్య సహాయం అంది, ఆయన మాకు దక్కటం చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆమెను కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉద్యోగిని.. నేను వెళ్ళి పలకరించటం ఏమిటి అనే అహం నన్ను ఆపేసింది. ఆ తరువాత మా నాన్న ఆమెకు దగ్గరయ్యారు. నాతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకువచ్చారు.

మా మామయ్య వాళ్ళు చెప్పారు, కేవలం ఆస్తి కోసం వలేసి, ఆయన్ని వలవేసి పట్టి పెళ్ళి చేసుకుందని, రాములమ్మ చాలా మాయలమారి అని.. ఆ వయసులో ఆ మాటలు నాకు నిజమేననిపించాయి. ఆవిడ ఎంత ప్రేమగా నాకు దగ్గరవ్వాలన్నా నేను దూరంగా జరిగిపోయేదాన్ని. నాన్నగారిని నానుంచి లాగేసుకుందన్న ఉక్రోషంతో, పెళ్ళి చేసుకుంటే వీళ్ళకి దూరంగా వెళ్లిపోవచ్చని అనుకున్నాను. నిజానికి రాములమ్మ ఏనాడూ నాకు సవతి తల్లిలా ప్రవర్తించలేదు.. ఆమె ప్రేమలో అబద్ధం లేదు. కానీ ద్వేషం నిండిన నా కళ్ళకు ఆమె మనిషిలా ఎప్పుడూ కనిపించలేదు.. మా నాన్నతో కలిసి నా భర్త కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన దేవత.. కానీ నేను మూర్ఖురాలిని.. ఆమెను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.

నిజమే, నాన్న నాకు నాన్నైతే ఆమెకు భర్తే కదా.. ఆయనను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను, నేను కనీసం మంచి మాటలతో ఆదరించలేదు. నేను నాన్నను పోగొట్టుకున్నాను అన్న బాధే నాకు కొండంతగా కనిపించింది.. ఈ రాక్షసి వలన ఆయన నాకు మానసికంగా దూరమయ్యారన్న ఉక్రోషం నా మనసుకు మాయతెరలు కప్పేసింది. అసలు ఆమె వలనే ఆయన ఆయుర్దాయం పొడిగింపబడిందన్న జ్ఞానం నాకు కలగలేదు.. ఈ నిజాన్ని నా భర్త ఎన్ని సార్లు చెప్పినా నా మనసు పరమ మూర్ఖంగా దాన్ని నేను త్రోసిపుచ్చుతూ వచ్చాను అంకుల్.

మొన్న ఆవిడ ఇంటి నుంచి వెళ్ళిపోయాక, ఆ సాయంత్రం నుంచే అన్ని చోట్లా వెదికించారు ఆయన. వాళ్ళ తమ్ముళ్ళకి కూడా కబురు చేసారు. కన్నతల్లి ప్రేమకై అల్లాడిపోయిన నేను, ఒక తల్లిగా మారి నాకోసం రాములమ్మ వస్తే ఎందుకు నిరాదరించాను? చేజేతులా పోగొట్టుకున్నాను.. అమ్మను ఎప్పటికీ నేను పొందలేను.. తప్పు చేసాను అంకుల్.. చాలా తప్పు చేసాను. ప్రేమించటమే తప్ప ఎవరినీ తప్పు కూడా పట్టని అమ్మను జారవిడచుకున్నాను.. ఏదైనా కానీ దూరమైతేనే కానీ విలువ తెలియదులెండి.. ‘అమ్మను గౌరవించని నీకెందుకే అమ్మ?’ అని కోపించి, దేవుడు నా తల్లిని లాగేసుకున్నాడు..” రోదించసాగింది అలివేలు.

“మళ్ళీ ఆ ప్రేమను పొందే అవకాశం వస్తే ఏం చేస్తావు అలివేలూ?” అడిగాడు ఆమె భర్త నారాయణ.

“పోగొట్టుకోనండీ.. అమ్మ ఒడిలో సేద దీరతాను.. ఆమె బాధను మరిపిస్తాను.. కానీ.. కానీ.. ఏదీ ఆ అవకాశం?”

“ఉంది.. రాములమ్మ చనిపోలేదు..” అన్నాడు శివరావు..

“నిజంగా?” సంభ్రమంగా అంది అలివేలు.

“అవును అలివేలూ.. అత్తయ్య బయట కారులో ఉంది.. తీసుకువద్దాం పద..” ఆమె చేయి పట్టి లేవదీసాడు నారాయణ. ఒక్క ఉదుటున లేచి గేటు దగ్గరకు పరుగు తీసింది అలివేలు.

అప్పటికే కారులోంచి దిగిన యువకుడికి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాడు నారాయణ. ఆ యువకుడే, తన కారు కింద రాములమ్మ పడిపోతే ఆమెకు వైద్యం చేయించిన మనోహర్.

కారు డోర్ తీసి రాములమ్మ చేయిపట్టి మెల్లగా దింపాడు శివరావు. నీరసంగా నిలబడిన రాములమ్మను తన చేతుల్లోకి తీసుకుని, కన్నీటితో గుండెకు హత్తుకుంది అలివేలు .. మనసుకెంతో సాంత్వన కలుగుతూ ఉండగా ఆమె ఎదపై తలవాల్చింది రాములమ్మ. ఆ ఇద్దరి కన్నుల్లో కన్నీటి నదులు.. అయితే అవి ఆనందబాష్పాలు!

Exit mobile version