Site icon Sanchika

డాక్టర్ అన్నా బి.యస్.యస్.-1

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]న్నా!?..

కార్డియాలజిస్ట్..

ఫ్రమ్ అమెరికా..

హార్టు స్పెషలిస్ట్ (ఆస్ట్రోస్).

గుంటూరు హాస్పటల్..

తనకు కేటాయించిన గదిలో కూర్చొని ఏదో ఇంగ్లీషు పుస్తకాన్ని దీక్షగా చూస్తున్నాడు..

డోర్ నాక్ చేసిన శబ్దం..

“ప్లీజ్.. కమిన్!..” అన్నా జవాబు.

జూనియర్ డాక్టర్ సుందర్ లోనికి వచ్చాడు.

“గుడ్ మార్నింగ్ సార్..” చిరునవ్వుతో చెప్పాడు సుందర్. సుందర్ ముఖంలోకి చూచి.. అన్నా..

“డియర్ సుందర్ గుడ్ మార్నింగ్!.. అంతా రెడీనా..” చిరునవ్వుతో అడిగాడు.

“యస్ సార్..”

“సో.. షల్ వుయ్ మూవ్..”

అవునన్నట్టు సుందర్ తల ఆడించాడు.

అన్నా కుర్చీ నుంచి లేచి.. చేతిలోని పుస్తకాన్ని టేబుల్ పైన ఓ చివరన వుంచి.. వేగంగా గదినుంచి బయటికి నడిచాడు. సుందర్ గదినుండి బయటికి నడిచి.. తలుపును మూసి డాక్టర్ అన్నాను అనుసరించాడు.

అది ఆపరేషన్ థియేటర్…

పేషంట్ టేబుల్‌పై నిర్జీవంగా వున్నాడు. అనస్థీషియా ఇచ్చి పావుగంట అయింది. ముగ్గురు డాక్టర్లు.. ముగ్గురు నర్సులు.. ఆ టేబుల్ చుట్టూ వున్నారు.

అన్నా.. సుందర్ ఆ గదిలో ప్రవేశించారు. అందరూ అన్నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు. చిరునవ్వుతో అందరికీ కళ్లతోనే జవాబు చెప్పాడు అన్నా.. సుందర్ వారి ప్రక్కన నిలబడ్డాడు. అన్నా.. ఆ వ్యక్తిని పరీక్షగా చూచాడు. వయస్సు యాభై సంవత్సరాలు.. హార్టు ప్రాబ్లమ్… ఆపరేషన్ చేయాలి.. అన్నా..

అన్నా తన సీక్వెషియల్ చర్యను ప్రారంభించాడు. డాక్టర్సు వారి కనుసన్నల్లో వర్తించసాగారు.. ఆపరేషన్ సక్సెస్.. వరండాలో వున్న పేషంటు బంధువులకు ఆ విషయం చిరునవ్వుతో చెప్పి.. అన్నా.. తన గదిలోకి వెళ్లిపోయాడు.

***

జిల్లా జైలు..

జైలర్ బలరామ్ తన సీట్లో కూర్చుని టేబుల్ ముందున్న లిస్టును చూస్తున్నాడు.

ఆ లిస్టులో కొన్ని పేర్లు వున్నాయి. అవి నేరస్థుల పేర్లు. వారి శిక్షాకాలం పూర్తి అయింది. ఆ రోజున ముగ్గురి విడుదల.

జీవా పోలీస్ కాని స్టేబుల్.

“జీవా..”

“సార్!..”

“రత్తయ్య.. జోగి.. రాఘవయ్యలను పిలుచుకొనిరా! వారు ఈ రోజు విడుదల.. ముందు రత్తయ్య… జోగిని పిలుచుకొనిరా!… వారు వెళ్లాక రాఘవయ్యతో రా!..”

“యస్ సార్ ….”

“వెళ్లు”

జీవా గదినుంచి బయటికి నడిచాడు. ఐదు నిముషాల్లో జోగి.. రత్తయ్యలతో వచ్చాడు.

ఇరువురూ జైలరు బలరామ్ గారికి నమస్కరించారు.

వారిని చూచి బలరామ్ చిరునవ్వుతో.. “రత్తయ్యా!.. జోగీ!.. మీ శిక్షా కాలం పూర్తయింది. ఈ రోజు.. ఇపుడు మీరు.. జైలునుండి బయటకు వెళుతున్నారు. బయటకు వెళ్లాక.. గతాన్ని మరచి మంచి మనుషులుగా.. మంచిగా.. బ్రతకండి. జీవా.. వారి బట్టలు వారికి ఇవ్వు..”

జీవా రెండు కవర్లను ఇరువురికీ అందించాడు.

బలరామ్.. రత్తయ్యకు రెండు వేలు.. జోగీకి మూడు వేలు.. నగదు చేతులకు అందించాడు.. ఇరువురూ బలరామ్‌కు నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

జీవా.. రాఘవయ్యతో.. బలరామ్ గదిలోకి ప్రవేశించారు. జీవా బీరువా పైన వున్న రాఘవయ్యగారి గుడ్డల ప్యాకెట్‌ను వారికి అందించి బయటకు వెళ్లిపోయాడు.

రాఘవయ్య.. విరక్తితో కూడిన నవ్వుతో ఆ కవర్‌ను అందుకొని బలరామ్ గారి ముఖంలోకి చూచాడు. ఆ క్షణంలో అతని కళ్లల్లో కన్నీరు. వారి వయస్సు అరవై సంవత్సరాలు.. ఏడేళ్ల జైలు శిక్ష.. జైల్లో వారి ప్రవర్తన.. మంచితనం.. మూలంగా శిక్ష ఆరునెలల తగ్గింపు.. ఈ రోజు విడుదల.

రాఘవయ్య.. బలరామ్ గారికి నమస్కరించాడు.. విరక్తితో కూడిన చిరునవ్వుతో..

“రాఘవయ్యగారూ!.. చేయని నేరానికి సాక్ష్యాల మూలంగా మీరు శిక్షను అనుభవించ వలసి వచ్చిందన్న నిజం.. నాకు తెలుసు.. నేరం.. కోర్టు.. విచారణ.. ఈ మూడింటినీ అనుసరించి వచ్చే తీర్పుకు కావలసింది కేవలం సాక్ష్యం. అందుకే అన్నారేమో.. చట్టానికి కళ్లు లేవని.. గతాన్ని మరచి పొండి.. వయస్సులో పెద్దవారు.. మీకు చెప్పేటంతటివాడిని కాను నేను.. పగ.. ప్రతీకారం.. అంటూ శేషజీవితాన్ని కష్టాలపాలు చేసుకోకండి..” అనునయంగా చెప్పాడు చెప్పాడు బలరామ్.

పదివేలు వున్న కవర్‌ను వారికి అందిస్తూ.. “దీన్ని తీసుకోండి సార్..! ఇది జైల్లోని మీ కష్టార్జితం..” అన్నాడు బలరామ్.

రాఘవయ్య మౌనంగా అందుకొన్నాడు. మరోసారి చేతులు జోడించాడు. గది నుండి బయటకు నడిచాడు.

జైలు మెయిన్ గేటు దాటి వీధి వైపుకు నడిచాడు రాఘవయ్య.

***

ఫోన్ మ్రోగింది.. చెవి దగ్గర వుంచుకొన్నాడు పాండు.

“అయ్యా!.. నమస్తే!….”

“ఎక్కడున్నావ్?..”

“జైలు ప్రాంతంలో..”

“వాడు విడుదలైనాడా!..”

“తెలీదు సార్.. ఇంకా ఫోన్ రాలేదు..”

“ఆ పోలీసోడు నమ్మకస్థుడేనా..”

“వాడు మనోడు సార్..” నవ్వుతూ చెప్పాడు పాండు.

“వాడిని ఫాలో చేసి.. వాడిని ముగించి.. నీవు నా దగ్గరకు రావాలి.. తేడా వచ్చిందో.. నీ మెడపై తలకాయ వుండదు.. జాగ్రత్త!…”

తన లక్ష్యసాధనకు తనదైన స్టయిల్లో చెప్పాడు భుజంగవర్మ..

“సార్.. మీరు పని అయిపోయిందని నన్ను తలచుకొంటూ హ్యాపీగా వుండండి.. పని అయిపోగానే ఫోన్ చేస్తా!..” అహంకారంగా తల ఎగరేస్తూ చెప్పాడు పాండు.

“సరే.. సరే.. జాగ్రత్త!..”

“ఓకే సారూ!..” వికటంగా నవ్వాడు పాండు.

భజంగ వర్మ సెల్ కట్ చేశాడు.

భుజంగవర్మ.. తాను చేసిన నేరాన్ని.. తనకు నమ్మినబంటు అయిన రాఘవయ్య.. ఆ నేరాన్ని తాను చేసినట్టు పోలీసులకు లొంగిపోయేలా చేశాడు.

భుజంగవర్మ పైన వున్న విశ్వాసానికి కృతజ్ఞతగా రాఘవయ్య ఆ నేరాన్ని అంగీకరించి జైలు పాలైనాడు.

“నీ కుటుంబ బాధ్యతలను నీవు జైలునుంచి తిరిగి వచ్చేవరకు నేను చూచుకొంటాను..” భుజంగవర్మ రాఘవయ్యకు చెప్పాడు.

గడచిన ఏడు సంవత్సరాల్లో రాఘవయ్య తల్లి.. ఆమె పోయిన సంవత్సరం తర్వాత భార్య గతించారు. ఒక్కగానొక్క కూతురు చిన్నా.. అనాథగా మారిపోయింది. ఎటుపోయిందో.. ఎక్కడ వుందో.. అసలు బ్రతికి వుందా లేక చచ్చిపోయిందా అనే వివరాలు భుజంగవర్మకు తెలియవు. కారణం అతను రాఘవయ్య జైలుకు పోయేటపుడు అతనికి ఇచ్చిన మాటను పాటించలేదు.

ప్రస్తుతంలో.. జైలునుండి విడుదలైన రాఘవయ్య నిజాలను తెలుసుకొని.. తన్ను చంపుతాడనే భయం భుజంగవర్మకు..

ఆ ఆపద నుంచి తాను తప్పించుకొనేందుకే పాండూకు.. డబ్బు ఇచ్చి రాఘవయ్యను చంపేయమన్నాడు. పాండు ఆ పని మీద జైలునుంచి బయటకు రావాల్సిన రాఘవయ్య కోసం దారి కాచాడు.

జైలు నుంచి విడుదలైన రాఘవయ్య రాజమార్గంలో నడవకుండా.. అడ్డదారిని అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత గ్రామానికి బయలుదేరాడు.

పాండూకు తెలిసిన పోలీస్ జైలు నుంచి ఫోన్ చేసి రాఘవయ్యగారు వెళ్లిపోయాడని చెప్పాడు.

దారి కాచుకొని కూర్చున్న పాండు గుండె ఝల్లుమంది.

“వీడు ఏ దారిని వెళ్లినట్లు!.. రెండు గంటలుగా నేను ఈడనే వుంది కదా!.. అసలు ఆయన ఏడకి వెళ్లినట్టు..” పాండు మనస్సున రాఘవయ్యగారిని గురించిన ఆలోచనలు.. జేబు నుంచి బీడీ తీసి వెలిగించి గట్టిగా ఓ దమ్ములాగి గాల్లోకి వదిలాడు. మెల్లగా రోడ్డు ప్రక్కన నడుస్తున్న అతని మస్తిష్కంలో ఓ భావన తళుక్కుమంది.. ఈ భావన రాగానే పాండు ముఖం పెట్రోమాక్సు లైట్ అయింది.

పోతూ వున్న ఆటోను ఆపి రాఘవయ్యగారి వూరి పేరు చెప్పి అందులో కూర్చున్నాడు.

ఆటో రాఘవయ్యగారి ఊరివైపుకు తిప్పాడు ఆటోవాలా.. సన్నగా తుంపర ప్రారంభమయింది. ఆటోవాలా రెండు పక్కలా ఆటోకి పట్టాలు దించాడు.

“అన్నా..! నీ పేరేంది..” అడిగాడు పాండు.

“కరీమ్!..” ఆటోవాలా జవాబు.

“చుక్క చిక్కద్దా..”

“ఏందీ!..” అడిగాడు కరీమ్.

పాండు హేళనగా నవ్వాడు.

“ఎందుకు నవ్వుతుండావ్?..” అడిగాడు కరీమ్.

“అదేనయ్యా!.. మందు!..”

“కల్లా.. బ్రాందీ.. విస్కీయా!..”

“ఏదైనా సరే..” పాండు జవాబు.

“ఓ ఐదు నిముషాలు ఆగు.. ముందు ఒక షాపు వుంది..”

“ఒకే.. అన్నా.. పోనీ!..”

ఐదు నిముషాలు.. వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.

కరీమ్ ఆటోను రోడ్డు ప్రక్కన ఆపాడు.

“ఓ అన్నా!.. అదిగో మందు షాపు..” చిరునవ్వుతో చెప్పాడు.

ఆ నవ్వులో పాండు మీద అభిమానం లేదు. నిరసన వుంది. పాండు ఆటో దిగి షాప్ వైపుకు వేగంగా నడిచాడు. షాపు అతనితో మాట్లాడి వెనక్కు వచ్చాడు.

“కరీమ్.. ఓ అరగంట ఆగు.. పైసలిస్తాలే!.. మందేసుకొని వస్తా!.. సరేనా..” చెప్పాడు పాండు.

“వంద రూపాయలు ఎగస్ట్రా యియ్యాలా!..”

“ఇస్తాలే!.. వుండు..”

వేగంగా షాపు వైపుకు నడచి హాప్ బాటిల్ రాయల్ ఛాలంజ్ విస్కీ తీసుకొని, ప్లాస్టిక్ గ్లాస్ వాటర్ బాటిల్ వేరుశనగపప్పుల పొట్లాంతో షాపు వెనక్కి వెళ్లాడు.

అది విశాలమైన స్థలం.. చెక్క బెంచీలు.. కూర్చొనేదానికి అనువుగా చెక్క స్టూల్సు.. దాదాపు పాతికమంది.. మందు పండుగను జరుపుకొంటున్నారు. కొందరు మిత్రులు.. మరికొందరు బంధువులు.. అందరూ ఆ సురాపాన మైకంలో ఆనందంగా.. ఏవేవో ప్లాన్స్.. పన్నాగాలు.. ఆలోచనలు.. కబుర్లతో కాలక్షేపం చేసుకొంటున్నారు.

పాండు ఓ మూల బెంచి దగ్గర కూర్చున్నాడు. మందును కొద్దిగా గ్లాసులో పోసి బాటిల్ లోని ఐస్ వాటర్‌ను అందులో కలిపి గొంతులో పోసుకొని ఒక్క గుక్కలో మింగేశాడు.. మధ్యలో నెమ్మదిగా వేరుశనగపప్పులు తింటూ ఆలోచనలో పడ్డాడు.

‘ఆ రాఘవయ్య ఏడకి పోయిండో!.. వూరికి ఎల్లివుంటే సరి.. లేకపోతే ఏం చేయాలి.. ఎలాగైనా ఎతికి పట్టుకోవాలి.. భుజంగవర్మకు అప్పగించాలి..’ రాఘవయ్య ఆలోచనలతో బాటిల్ ఖాళీ చేశాడు పాండు.

ఒళ్లు వేడెక్కింది.. మనస్సున రాఘవయ్య మీద కసి పెరిగింది. అరగంట గడిచింది. తూలుతూ వచ్చి కరీమ్ ఆటోలో కూలబడ్డాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version