[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[లాస్యని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి సారిస్తాడు అన్నా. లాస్య చదువు పూర్తి చేసుకుని అబ్రహమ్‍తో కలిసి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిపోతుంది. అన్నా కుటుంబం క్రమంగా లాస్యని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకరోజు ఇండియా నుంచి ధర్మతేజకు ఆయన మిత్రుడు నారాయణమూర్తి ఫోన్ చేస్తాడు. త్వరలో తను కుటుంబ సమేతంగా అమెరికా వస్తున్నట్లు చెబుతాడు. అన్నా, మాధవి సంతోషిస్తారు. నారాయణమూర్తి – భార్య ఇంద్రజ.. కూతురు పార్వతి.. కొడుకు మాధవ్ లతో అమెరికా చేరుతాడు. అమెరికాలో పార్వతి నృత్య ప్రదర్శనలు ఇస్తుంది. ఆ కార్యక్రమం వీడియోలను ధర్మతేజకు పంపుతాడు నారాయణమూర్తి. ధర్మతేజ మాధవి, ఆ వీడియోలు చూసి సంతోషిస్తారు. ఒకరోజు నారాయణమూర్తి భార్యాపిల్లలతో కలిసి ధర్మతేజ ఇంటికి వస్తాడు. ధర్మతేజ, మాధవి దంపతులు వారికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేస్తారు. ధర్మతేజ ఫోన్‍లో మాట్లాడి తాను సాయంత్రం వచ్చి కలుస్తానని చెప్తాడు. పార్వతి రూపం, ప్రవర్తన నచ్చిన మాధవి -ఆమెని అన్నాకిచ్చి పెళ్ళీ చేస్తారేమో అడుగుదామా అని భర్తతో అంటుంది. ముందు అన్నా అభిప్రాయం తెలుసుకోమంటాడు ధర్మతేజ. ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]న్నా.. చెప్పిన మాట ప్రకారం ఆరున్నరకు ఇంటికి వచ్చాడు. అతని రాక కోసం.. వరండాలో ఎదురు చూస్తున్న ధర్మతేజ.. మాధవి.. నారాయణమూర్తి.. ఇంద్రజ.. పార్వతి.. మాధవ్‌లు చిరునవ్వుతో పలకరించారు.
అన్నా వరండాలోకి వచ్చి అందరినీ ఓ సారి చిరునవ్వుతో చూచి నారాయణమూర్తి గారి చేతిని తన తన చేతిలోకి తీసుకొని.. “అంకుల్.. మీరంతా కలసి రావడం నాకు.. మా అమ్మా నాన్నలకు ఎంతో ఆనందం.. మరో విషయం.. మీ అమ్మాయిగారు మా మెడికల్ కాలేజీ ఆవరణలో ఓ ప్రోగ్రామ్ ఇవ్వాలి.. మీరు సరే అంటే నేను డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేస్తాను.. మీకు అభ్యంతరం లేకపోతే రేపైనా.. దటీజ్ ఇన్ ది ఈవినింగ్.. సరేనా..” చిరునవ్వుతో చెప్పి పార్వతి ముఖంలోకి చూచాడు.
“ఏరా నారాయణా!.. అన్నా చెప్పింది విన్నావుగా.. నీవేమంటావ్?..”
“ఒరేయ్! డ్యాన్స్ చేసేది నేను కాదు గదరా.. అడుగు నీవే పార్వతిని..” నవ్వుతూ చెప్పాడు నారాయణమూర్తి..
“ఏమ్మా!.. పార్వతి!.. విన్నావుగా.. అన్నా చెప్పింది.. నీ నిర్ణయం ఏమిటి?.. అనునయంగా అడిగింది మాధవి.
ఇంద్రజ.. “సరే అని చెప్పవే!.. ఏమిటీ.. నీ అలోచన?..” కూతురు ముఖంలోకి చూస్తూ చెప్పింది.
“ఆంటీ.. బలవంతం చేయకండి.. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వచ్చారుగా.. రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోనివ్వండి..” పార్వతి ముఖంలోకి చూస్తూ మెల్లగా చెప్పాడు.
“అంటీ.. నేను ప్రోగ్రాం ఇస్తాను..” అంది పార్వతి.. ఓరకంట అన్నా ముఖంలోకి చూస్తూ..
“అమ్మా!.. ఒకటి రెండు రోజులు రెస్టు తీసుకోమని చెప్పమ్మా!..”
“ఆ మాటేదో.. నువ్వే పార్వతితో చెప్పు!..” అంది మాధవి.
అన్నా పార్వతి ముఖంలోకి చూచాడు. మెల్లగా సమీపించాడు..
“చూడండి.. పార్వతిగారూ!.. ప్రోగ్రాం రేపే ఇవ్వాలనే బలవంతం గాని, అవసరంగాని లేదు. మీ ఇష్టం.. సరేనా!..” అనునయంగా పార్వతి కళ్లల్లోకి చూచాడు.
పార్వతి క్షణం సేపు అతని కళ్లల్లోకి చూచింది.. ఆ కళ్లల్లో ఆమెకు ఎంతో అబిమానం.. గోచరించింది.
“మీరంతా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి.. నేను డ్రస్ ఛేంజ్ చేసుకొని వస్తాను.”
“అన్నా సార్!.. నా పేరు మాధవ్.. పార్వతి మా అక్కయ్య!..” చిరునవ్వుతో చెప్పాడు మాధవ్.
“ఓ థాంక్యూ.. డియర్!..” అంటూ అతని భుజం తట్టి అన్నా లోనికి వేగంగా వెళ్లిపోయాడు.
అతని స్టయిల్ నడకను పార్వతి పరీక్షగా చూచింది.
‘మనిషి మంచి చూపరి.. అందగాడు.. అంతేగాదు .. మంచి మాటకారిలా కూడా ఉన్నాడు.. ఎదుటి వాళ్ల భావాలను గ్రహించి వారి ముఖ భంగిమలను చదువుతూ సరళంగా మాట్లాడే స్వభావం గ్రేట్..” అనుకొంది.
మాధవి అతని వెనకాలే లోనికి వెళ్లింది.
“ఏమిటే.. నీ నిర్ణయం?..” అడిగింది ఇంద్రజ.
“అమ్మా!.. నాకేం ప్రాబ్లమ్ లేదమ్మా!..”
“అయితే.. ఆ మాటను అన్నాతో ఎందుకు చెప్పలేదు?..” నిష్ఠూరంగా అడిగింది.
“నేను చెప్పాలనుకునే లోపల వారు లోనికి వెళ్లిపోయారు కదమ్మా!..” దీనంగా చెప్పింది పార్వతి.
“అక్కా నేను వెళ్లి వారికి నీ అభిప్రాయం చెప్పనా?..” అడిగాడు మాధవ్..
“ఏమని?..”
“యు ఆర్ రెడీ టు డు డ్యాన్స్ టుమారో!..”
“ఒరేయ్! మాధవా.. అది నీ పని కాదు.. అక్కయ్యే చెప్పాలి..” చిరునవ్వుతో మందలింపుగా చెప్పాడు నారాయణమూర్తి..
“అమ్మా!.. నీ ఇష్టం.. నీ అభిప్రాయాన్ని నీవే అన్నాకు తెలియచేయి.. నీవు చెప్పిన ప్రకారంగా వాడు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తాడు.. సరేనా!..” అన్నాడు ధర్మతేజ.
“అలాగే అంకుల్!.. నేనే చెబుతాను..”
అన్నా స్నానంచేసి డ్రస్ మార్చుకొని క్రిందికి వచ్చాడు.
అతని రాకను గమనించిన ధర్మతేజ.. నారాయణమూర్తి.. పార్వతి.. మాధవ్ ఇంట్లోకి వెళ్లారు.
నారాయణమూర్తికి పచ్చిమిరపకాయల బజ్జీలు.. చిత్రాన్నం అంటే ఎంతో ఇష్టం.. మాధవి లక్ష్మికి చెప్పి వాటిని తయారు చేయించింది. అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద క్రమంగా అమర్చి లక్ష్మి మాధవికి చెప్పింది.
“అన్నయ్యా!.. మీకు ఎంతో ఇష్టమైన టిఫిన్ చిల్లీబజ్జీ.. చిత్రాన్నం.. కొబ్బరి చెట్నీ.. మీ కోసం ఎదురుచూస్తూ డైనింగ్ టేబుల్ మీద వున్నాయి.. రండి..” చిరునవ్వుతో చెప్పింది మాధవి.
నారాయణమూర్తి.. “చెల్లెమ్మా!.. అలాగనా!.. సరే.. ఓ పట్టు పట్టాల్సిందే.. ఏమంటావ్ మిత్రమా ధర్మా!..”
“ఓకే.. ఓ పట్టు పట్టాల్సిందే.. పద..” నవ్వాడు ధర్మతేజ..
ఇరువురు మిత్రులు ప్రక్క ప్రక్కన కూర్చున్నారు.
అన్నా టీవీని ఆన్ చేసి చూస్తున్నాడు.
మాధవి.. ఇంద్రజ వారిరువురికీ వడ్డిస్తున్నారు.
పార్వతి ఓ ప్రక్కన నిలబడి వుండడాన్ని చూచిన అన్నా..
“ఏం.. నిలబడి ఉన్నారు.. వెళ్లండి.. టిఫిన్ తినండి..” అన్నాడు.
“ఆ..” తొట్రుపాటుతో అంది పార్వతి.
“వెళ్లి టిఫిన్ తినండి..”
“నేను మీతో..”
“నాతో!..”
“ఓ మాట చెప్పాలి..”
“చెప్పండి..”
“నేను రేపు నా ప్రోగ్రామ్ మీ కాంపస్‌లో ఇస్తాను!..” చిరునవ్వుతో ఓరకంట అతని ముఖలోకి చూస్తూ చెప్పింది.
“అలాగా!..
“అవును..”
“ఓకే.. గుడ్.. స్టేజ్ అరేంజ్మెంట్స్ చేయిస్తాను. ప్రోగ్రామ్ సాయంత్రం సెవన్ థర్టీ టు నైన్.. ఓకేనా!..” అడిగాడు
“ఓకే.. సార్!..” ఎంతో వినయంగా క్రీకంట చూస్తూ చెప్పింది పార్వతి.
“సరే పదండి.. టిఫిన్..” డైనింగ్ టేబుల్ వైపు ఎడమచేతిని చూపించాడు.. వెళ్లి తండ్రిగారి పక్కన కూర్చున్నాడు.
అతని ఎదురుగా.. నారాయణమూర్తి.. తన తండ్రి.. ప్రక్కన కూర్చుంది పార్వతి.
“నాన్నా!.. పార్వతి రేపు ప్రదర్శనకు సిద్ధమట..” పార్వతినే చూస్తూ చెప్పాడు అన్నా.
“సంతోషం.. ఏమ్మా.. ఓకేనా!..”
“యస్.. అంకుల్!..”.
“మధూ!..”
“ఆ.. వస్తున్నానండీ!..”
“నిదానంగానే రా!.. చెప్పేది విను.. పార్వతి ప్రోగ్రామ్ రేపే..” పార్వతి ముఖంలోకి నవ్వుతూ చూచాడు ధర్మతేజ.
అవునన్నట్టు తల ఆడించింది చిరునవ్వుతో పార్వతి.
మాధవి.. ఇంద్రజ వచ్చి కూర్చున్నారు. కూతురుని అడిగి మరోసారి ప్రోగ్రామ్ విషయాన్ని కన్ఫమ్ చేశాడు.. నారాయణమూర్తి.
అందరికీ ఆనందం..
అన్నా.. తినడం ముగించి అందరికన్నా ముందు లేచి చేతిని కడుక్కొన్నాడు.
“గుడ్ నైట్.. టు ఆల్..” అంటూ తన గదికి వెళ్లిపోయాడు.
మిగతావారు తిని.. హాల్లోకి వచ్చి కూర్చున్నారు. మిత్రులిరువురూ భవంతి చుట్టూ వున్న పేవ్‌మెంటు పైన కొంతసేపు కబుర్లతో వ్యాహ్యాళి చేశారు.
సమయం.. రాత్రి తొమ్మిదిన్నర.. ఎవరి గదులకు వారు వెళ్లిపోయారు.
మంచంపైన పడుకొని మాధవి తిరిగే సీలింగ్ ఫ్యాన్‌ని చూస్తూ ఏదో ఆలోచిస్తోంది.
ధర్మతేజ గదిలో ప్రవేశించి తలుపు మూశాడు.
మంచం సమీపించి కూర్చున్నారు. మాధవి ముఖంలోకి చూచాడు.
“మధూ!..”
తొట్రుపాటుతో భర్త ముఖంలోకి చూచి లేచి కూర్చుంది.
“విషయం ఏమిటో తీవ్రంగా ఆలోచిస్తున్నావ్?..”
“అన్నాను గురించండి!..”
“ఓహో.. వాడి వివాహ విషయాన్ని గురించా!..”
“అవును.. ఎంతో నమ్మకం పెట్టుకొన్నది మాయమై పోయింది..” విచారంగా చెప్పింది మాధవి.
“మనం అనుకొన్నవన్నీ అనుకొన్నట్టు జరగవన్న సంగతి నీకు తెలిసిందే కదా.. మధూ!..” సమాధాన పరిచేలా చెప్పాడు ధర్మతేజ.
“వాడికి ఇపుడు వయస్సు..”
“ఇరవై ఏడు..” ధర్మతేజ పూర్తిచేశాడు.
ప్రశ్నార్థకంగా భర్త ముఖంలోకి చూచింది మాధవి..
“నారాయణమూర్తితో మాట్లాడమంటావా?..”
“పార్వతిని గురించా!..”
“అవును.. నాకు పార్వతి బాగా నచ్చింది.. మరి నీకు? ..”
“మన ఇరువురి ఇష్టానికన్నా ముందు మనవాడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలిగా!..”
“అవును.. అది ముఖ్యం.. వెళ్లి అడిగివస్తావా?..”
“వెళ్ళిరానా?..”
“వాయిదా ఎందుకు. ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. వెళ్లిరా!..”
“సరే..”
మాధవి మంచం దిగి మేడపైని అన్నా రూమ్‌ను సమీపించింది.
మూసివున్న తలుపును నెట్టింది. గడియ బిగించనందున తలుపు తెరచుకొంది. లోనికి తొంగిచూచింది.
“రా అమ్మా!.. రా!.. నీవు వస్తావని నాకు తెలుసమ్మా!..” నవ్వుతూ తల్లిని ఆహ్వానించాడు అన్నా..
మాధవి వచ్చి అతని ప్రక్కన మంచంపై కూర్చుంది. అన్నా తిరిగి తన తలను ఆమె తొడపై పెట్టి కళ్లు పైకెత్తి తల్లి ముఖంలోకి చూచాడు.
మాధవి ఫ్యాన్ గాలికి చిందరవందరగా కదులుతున్న అతని తలవెండ్రుకలను వెనక్కు త్రోసి సరిచేసి.. చేతిని అలాగే వుంచింది. అన్నా ముఖంలోకి చూచింది.
అన్నా ఆనందంగా కళ్లు మూసుకున్నాడు. ఆ క్షణంలో అతని ఎదలో ఎంతో ప్రశాంతత..
“నాన్నా..”
“వూ..
“నేను నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను..” మెల్లగా వంగి చెప్పింది మాధవి.
“అడుగమ్మా..” కళ్లుమూసుకొని చెప్పాడు అన్నా..
“నీవు లాస్యను మరచిపోలేకున్నావా!..”
ఛంగున లేచి కూర్చున్నాడు అన్నా.. పరీక్షగా తల్లి ముఖంలోకి చూస్తూ..
“అమ్మా! నీకు నాన్నకు లాస్య ఎంతగానో నచ్చిందని.. మీ కోర్కెలు తీర్చడం నా ధర్మమని లాస్యను అభిమానించాను. మన తత్వాలు తనకు నచ్చలేదు. తనకు నచ్చిన వాడితో వెళ్లిపోయిది. నేను ఆమెను అభిమానించానంటే.. దానికి కారణం మీరు.. తనకు మీరూ నచ్చలేదు.. నేనూ నచ్చలేదు.. ఆ జ్ఞాపకాలు అంటూ నాలో ఏమీలేవు.. అమ్మా!.. ఆల్ ఆర్ డ్రయిన్డ్ ఎవే!.. నాకు కావాల్సింది నా తల్లిదండ్రుల ఆనందం.. దానికోసం.. మీరు చెప్పిన ఏపనైనా నేను ఆనందంగా చేస్తానమ్మా!..” ప్రీతిగా తల్లి కళ్లల్లోకి చూస్తూ చెప్పాడు అన్నా..
“నాన్నా..”
“చెప్పమ్మా..”
“పార్వతిని గురించి నీ అభిప్రాయం?..” అడిగింది మాధవి.
“మీ అభిప్రాయం ఏమిటి?..”
“నాకు నాన్నకు బాగా నచ్చిందిరా!..”
“మరి నేను తనకు నచ్చానా లేదా అనే విషయాన్ని కనుక్కొన్నారా!..”
“లేదు..”
“ముందు ఆమె నిర్ణయం తెలుసుకోండమ్మా..” అనునయంగా చెప్పాడు.
“అమ్మా!.. లాస్య వలన మీరు ఎంతగా బాధపడ్డారో నాకు తెలుసు. ఈ పార్వతి మరో లాస్య కాకూడదు. ఆమె ఖచ్చితాభిప్రాయాన్ని తెలుసుకోండి. ఆమె మీకు నచ్చితే నాకు అభ్యంతరం లేదు. సరేనా!..” చివరిమాటను చిరునవ్వుతో చెప్పి తల్లి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. నొసటన ముద్దు పెట్టుకొని “నా బంగారు తల్లి.. మా అమ్మ!.. జన్మజన్మలకు నాకు నీవే తల్లివి కావాలమ్మా!..” ఎంతో ఆనందంగా చెప్పాడు అన్నా..
మాధవి మనస్సు పులకించింది. అన్నా శిరస్సును తన హృదయానికి హత్తుకొంది.
ఇరువురి మనస్సుల్లో ఒకరి పట్ల మరొకరికి అవ్యాజానురాగాలు.. ఎంతో అభిమానం..
కళ్లనీళ్లను పమిటకొంగుతో తుడుచుకొని తన కుడి చేతిని అన్న తలపై వుంచి.. “ఆ సర్వేశ్వరుడు సదా నీకు అండగా వుండుగాక.. నీ భావిజీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు ఎంతో ఆనందాన్ని అందించుగాక!.. నాన్నా.. ఓ చిన్నమాట..”
“చెప్పమ్మా!..”
“ఓ రెండు మూడు రోజులు.. రెండు మూడు గంటలు ముందుగా వచ్చి.. పార్వతితో కలసి కొంత సమయం గడపగలవా!.. నాన్నా..”
“తప్పకుండానమ్మా..” ఆమెకు ఈ చుట్టుప్రక్కల చూడవలసిన ముఖ్యమైన వాటిని చూపిస్తాను. ఆమె ఆలోచనా విధానాన్ని గ్రహించి నీకు చెబుతానమ్మా!.. అదేకదా నీకు కావాల్సింది?..”.
“అవును..”
మాధవి లేచి.. “గుడ్ నైట్.. నాన్నా.. పడుకో !..” అంది. తల్లితో కలసి ద్వారందాకా వచ్చాడు అన్నా.
మాధవి క్రిందికి వెళ్లిపోయింది. అన్నా తలుపులు మూసి మంచం పై వాలిపోయాడు.
భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు ధర్మతేజ.
మాధవి లోన ప్రవేశించి తలుపు బిగించింది. చిరునవ్వుతో మంచంపై కూర్చుంది.
“మధూ.. ఏమన్నాడు?..”
ఆనందంగా నవ్వింది మాధవి..
“ఏమన్నాడో చెప్పు మధూ..” లాలనగా అడిగాడు ధర్మతేజ.
“ఏమండీ!.. మన బిడ్డ మన మాటను ఏనాడు కాదన్నాడండీ !..
ఈనాడు కాదనటానికి.. జన్మజన్మలకు మనమే వాడికి తల్లిదండ్రులం కావాలట..” ఆ మాటలు చెప్పేటపుడు మాధవి కళ్లు చెమ్మగిల్లాయి..
ధర్మతేజ తన చూపుడు వేలితో ఆ కన్నీటిని తుడిచాడు.
“ఆవేశపడకు మధూ..” ప్రీతిగా మాధవి కళ్లల్లోకి చూస్తూ మెల్లగా చెప్పాడు ధర్మతేజ.
“ఇది ఆవేశం కాదండీ.. ఆనందం.. మీ ఇష్టమే నా యిష్టం .. మీ ఆనందమే నా ఆనందం.. అన్నాడండీ!..”
“ఆ దేవుని నిర్ణయం ఎలావుందో.. మనలో ఎవరు ముందో.. ఎవరు వెనకో.. మనం లేని నాడు వాడిని మనలా చూచుకొనేదానికి మంచి గుణవతి అయిన అమ్మాయిని మనం వాడికి జీవిత భాగస్వామిగా చేయడం మన ధర్మం.. ఆ హోదాకు పార్వతి తగినదని నా అభిప్రాయం.. నారాయణతో రేపు మాట్లాడుతాను.. ప్రశాంతంగా పడుకో..” అనునయించాడు ధర్మతేజ.
ఇరువురూ శయనించారు.. అన్నా జీవిత భాగస్వామిని గురించి తలచుకొంటూ..
***
ఉదయాన్నే మిత్రులు ధర్మతేజ.. నారాయణమూర్తి జాగింగ్‌కు బయలుదేరారు.
వెళ్లేటపుడు సరదా కబుర్లు.. ఇరువురి అలోచనలు .. పార్వతి గురించే..
ధర్మతేజ.. ‘నారాయణ తన కూతురు వివాహ విషయం తనతో చర్చిస్తే.. తన అభిప్రాయం.. కాదు కాదు.. మా ముగ్గురి అభిప్రాయం ఒకటే!.. అంటే పార్వతి మా యింటి కోడలు కావాలని.. ఒక్కమాటలో చెప్పాలని..’
నారాయణమూర్తి.. ధర్మతేజా..’నా కొడుకు అన్నాకు నీ కూతురు పార్వతికి వివాహం జరిపించాలని నా అభిప్రాయంరా..’ అంటే.. అంతకన్నా నాకు కావలసిందంటూ మరేం లేదురా.. నీ యిష్టమే నాయిష్టం..’ అని ధర్మతేజకు చెప్పి ఒప్పుకోవాలని.. ఇరువురిదీ సవ్యమైన భావనలే.. ఒకరి స్థితిగతులు మీద మరొకరికి ఎంతో గౌరవం..
“ఒరేయ్ నారాయణా!..”
“ఏమిట్రా?..”
“పార్వతి వయస్సు ఎంత?..”
“ఇరవై రెండు రా!.. ఐ.ఎ.ఎస్.కు సెలక్టు అయింది. తిరిగి వెళ్లటంతోటే ట్రైనింగ్‌లో జాయిన్ కావాలి..”
“ఆ..”
“అవునురా!.. తనకు కలెక్టరు కావాలనే ఆశ.. చాలా తెలివికలది. మంచి మనసున్నది.. ఆమె ఏమాటనూ నేను కాదనలేదు. ఆమె ఇష్టమే నా ఇష్టంరా!..”
(ఇంకా ఉంది)