Site icon Sanchika

డాక్టర్ అన్నా బి.యస్.యస్.-19

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[భార్య చనిపోయిన బాధలో ఉన్న ధర్మతేజ ఫోన్ మోగుతుంది. ఫోన్ చేసినది నారాయణమూర్తి. మాధవి చనిపోయిందని చెప్తాడు ధర్మతేజ. నాల్గవ రోజు నారాయణమూర్తి అమెరికాకు వచ్చి ధర్మతేజ.. అన్నాలను కలిసి వారిని ఓదార్చి మంచిమాటలు చెప్పి వాళ్ల మనస్సుకు వూరట కలిగిస్తాడు. త్వరలో భారత్‌కు రావలసిందని కోరి నారాయణమూర్తి తిరిగి వచ్చేస్తాడు. కానీ ధర్మతేజ తాగుడికి బానిస అయిపోతాడు. ఒకరోజు అన్నాని పిలిచి తన సమయం అయిపోయిందని, తాను కూడా మాధవి దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పి, భారత్‍లో అన్నా నిర్మించదలచిన మెడికల్ కాలేజ్, హాస్పటల్ పూర్తి చేయమని కోరతాడు. దేశంలో మార్పు తేవాలన్న తన ఆశయం గురించి చెప్పి, తన డైరీని చదవమని ఇస్తాడు. మాటలు పూర్తి చేసే సరికి అతని ప్రాణం పోతుంది. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి, శ్యామ్ ఉద్యోగానికి కావలసినవి, స్వదేశంలో అవసరమయ్యేవి అన్ని పత్రాలు తీసుకుని లక్ష్మితో కలిసి ఇండియాకి బయల్దేరుతారు. తండ్రి రాసిన డైరీ చదువుతాడు అన్నా. అందులో తండ్రి స్థాపించదలచిన భారత్ సేవా సమాజ్ (బి.ఎస్.ఎస్.) సంస్థ ఆశయాలు, భారతదేశ చరిత్ర ఉంటాయి. దేశ స్వాతంత్య్రానికి కృషి చేసిన మహానుభావుల వివరాలు ఉంటాయి. ఇక చదవండి.]

[dropcap]వా[/dropcap]రి స్ఫూర్తితో కొందరు జైళ్లకు వెళ్లి.. సత్యాగ్రహాలు చేసి.. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి.. అహింస.. ఆయుధంతో.. ప్రాణ మాన ధన నష్టంతో.. ఎందరో మహనీయుల బలిదానంతో సంపాదించుకున్న స్వాతంత్ర్యం మనది. యావత్ ప్రపంచ చరిత్రలో అది ఒక సువర్ణ అధ్యాయం.. అహింసా విజయం.. ఆ సుచరిత్రకు ప్రధాన కర్తలు హైందవులు. వారితో ఏళ్ల తరబడి పారంపర్యంగా సహజీవనం చేస్తున్న ముస్లిమ్ సోదరులు.. హిందూ.. ముస్లిమ్.. భాయ్.. భాయ్..

కక్షా కార్పణ్యాలతో తెల్లవాడు దేశాన్ని వదలి వెళ్లే నిర్ణయానికి వచ్చాక.. సువిశాల భారతావనిని హైందవ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయాలనుకొన్నాడు. తన రాజకీయ చతురతతో ముస్లిమ్ సోదరుల హృదయాల్లో విష బీజాలను నాటాడు. దేశాన్ని మూడు ముక్కలు చేసి వెళ్లిపోయాడు లాస్ట్ వైశ్రాయ్ మౌంట్‌బాటన్.

పశ్చిమ భారతదేశం.. పొరుగు దేశంగా పాకిస్తాన్‌గా మారిపోయింది. అలాగే తూర్పు బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ విడిపోయింది..

స్వాతంత్ర్యం సిద్ధించి డెభ్బై నాలుగు సంవత్సరాలు దాటింది. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నాటి సఖ్యత నేడు జనాల్లో లేదు.. స్వార్థం పెరిగింది. భయం సన్నగిల్లింది. దేశభక్తి నశించింది. అహంకారం తలకెక్కింది. సోదరభావం నశించి శత్రుభావన పెరుగుతూ వుంది. స్త్రీల బాలికల పట్ల చిన్నచూపు, కులతత్వం.. మతోన్మాదం.. వృద్ధి చెందుతూ వుంది. ఇది దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు.

ఇప్పటి దేశం.. మూడు ముక్కలయింది. దీన్ని చిన్నాభిన్నం కాకుండా రక్షించాలంటే.. సఖ్యత.. ప్రేమాభిమానాలు వ్యక్తుల మధ్యన.. మతాల మధ్యన.. ఎంతో అవసరం.. ఆర్.ఎస్.ఎస్.కు హిందువుల సంస్థ అని పేరు. అవును దాన్ని కాదని ఎవరూ అనరు. కాడెద్దుల కాంగ్రెసు పార్టీ పోయి హస్తం గుర్తు.. వ్యక్తుల పేరుతో పార్టీలు పుట్టి వర్గ తత్వాన్ని పెంపొందిస్తూ నేతలు చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు. లంచగొండితనం అంటువ్యాధి అయింది. దేశాభిమానం సన్నగిల్లి.. కులాభిమానం పెరిగిపోతూ వుంది. హైందవుల్లోని ఈ చిత్రవిచిత్ర పోకడలను చూచి అన్యమతస్తులు హైందవతను గురించి విమర్శిస్తున్నారు. అమాయక హైందవ జనాన్ని మతమార్పిడి చేస్తున్నారు.

ఆదిలో స్వాతంత్ర్యం కోసం తొడకొట్టి నిలిచింది ఓ చెల్లి.. అక్క.. తల్లి.. వారే మహారాణి రుద్రమదేవి (1261 – 1295).. ఆ మహామూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి తల్లి తమ సంతతిని చక్కగా.. భాషపట్ల.. జాతి పట్ల (హైందవ).. దేశం పట్ల.. తల్లి.. తండ్రి.. గురువుల పట్ల.. భక్తి.. గౌరవం.. అభిమానాలు కలిగి సాటివారికి.. సమసమాజానికి.. ఆదర్శప్రాయులుగా ఎదిగి చదువరులై దేశనాయకత్వాన్ని నీతి.. నిజాయితీ.. నిస్వార్థం.. పరమార్థం.. భక్తి.. శ్రద్ధ.. వినయ.. విధేయతలకు వారసులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి గృహిణి.. తల్లి తమ వంతుగా భావించాలి.

మనదేశ జనాభా 13 కోట్లు. ఫ్రాన్స్ దేశం యొక్క జనాభా 7 కోట్లు. యుద్ధవిమానాలను ఆ దేశం ఎన్నో దేశాలకు అందిస్తూవుంది. ఆ దేశంలో సంవత్సరానికి బయటికి వచ్చే ఇంజనీర్ల సంఖ్య 30 వేలు. మనదేశంలో 15 లక్షలకు పైగా సర్టిఫికెట్టుతో బయటికి వస్తున్నారు.

స్వదేశంలో విలువైన ఉత్పత్తులు జరగటం లేదు. ఇతర దేశాలపై ఆధార పడుతున్నాము. ఎక్కువగా చైనా దిగుమతులను కోరుతున్నాము. స్వయం ఉత్పత్తులను పెంచాలి. నాయకులు దక్షతతో విషయాలను పరిశీలించి అవసరాలకు తగిన రీతిగా విద్యార్థులకు రంగ విభజనతో శిక్షణ ఇవ్వాలి. ఉన్నత విద్య ధనికులకే పరిమితం (డాక్టర్స్, ఇంజనీర్స్) అనే పేరును రూపుమాపి మెరిట్ పద్ధతిలో రిజర్వేషన్ రద్దుతో.. గవర్నమెంటు.. ప్రైవేటు కాలేజీల ఫీజులు ఒకేరీతిగా వుండేలా చేసి.. సీట్లను కేటాయించాలి. ఉద్యోగ ప్రవేశం కూడా మెరిట్ రీత్యానే జరగాలి. రికమెండేషన్లు.. రిజర్వేషన్లు రద్దు చేయాలి. రాజ్యాంగ చట్టాలు అన్ని మతాలకు, అన్నివర్గాలకు ఒకే రీతిగా వుండాలి. శిక్షాస్మృతులు కఠినంగా పక్షపాత రహితంగా వుండాలి. పాలకులను ప్రజలు గౌరవించాలి.. అభిమానించాలి.

పురుషులు.. దేశంలో వున్న హిందూ.. ముస్లిమ్.. బౌద్ధ.. సిక్కు.. క్రైస్తవ మతస్థులంతా వారివారి మత సిద్ధాంతాల ప్రకారం స్వేచ్ఛగా జీవితాన్ని ఈ భారతావనిలో సాగిస్తూ.. తాము భారతీయులమని.. మిగతా మతాలవారు మా సోదరులని భావించి.. చేయి చేయి కలిపి ఒకే దేశం.. భారతదేశం.. ఒకే జాతి భారతజాతి.. (ఈ గడ్డపై పుట్టినందున) అని భావించి ప్రేమను.. సౌభ్రాతత్వాన్ని పంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎత్తి ఎదుటివారికి చూపించవలసిన రీతి నీతి.. ధర్మం.. న్యాయం.. భారతావనిలో పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యంగా భావించాలి.. మన ఆ భావాలతో మనమందరం ఏకం కావాలంటే.. ఒక వేదిక అవసరం. ఆ వేదికకు నేను పెట్టిన సమైక్యతా చిహ్నపు పేరు బి.ఎస్.ఎస్. .. అంటే భారత్ సేవా సమాజ్.. ఐక్యతలో కలదు ఆనందం.. కలసివుంటే కలదు సుఖం.. నా భరతమాత ప్రంచానికి తలమానికం కావాలి.. ఆ నా తల్లి ముద్దు బిడ్డలు యావత్ విశ్వానికి శాంతి దూతలై శాంతిని నింపాలి. ప్రతి తల్లి పై తత్వాలను తమ బిడ్డలకు నేర్పి.. వారిని చక్కగా తీర్చిదిద్ది.. ప్రజ్ఞాపాటవాలతో వారు ఎదిగి నాయకులై కన్నవారికి ఆనందాన్ని.. నాటి సమాజానికి సంతృప్తిని.. యావత్ ప్రపంచానికి స్నేహ సౌభ్రాతత్వాన్ని వంచాలి. ప్రపంచాన్ని ప్రేమించాలి.

జై.. జై.. జై.. భారత్.. జయహో.. జయహో.. భారతమాతా!..

అన్నా పేజీ త్రిప్పాడు. అది చివరి పేజి.

బి.యస్.యస్. లక్ష్యాలు:

  1. స్త్రీ లేనిదే పురుషుడు లేడు.. కనుక ప్రతి స్త్రీని గౌరవించాలి. సమాన హక్కులు ఇవ్వాలి. జీవిత విధానం ఆనందంగా సాగేదానికి ఇరువురూ పరస్పర ప్రేమాభిమానాలతో వర్తించాలి.
  2. సంతతికి.. తమ కుటుంబ పెద్దల జీవిత విధానాన్ని దేశ మహోన్నత నాయకుల చరిత్రలను తెలియజేసి.. వారు చిన్నతనం నుంచి మంచి క్రమశిక్షణ, విచక్షణతో ఎదిగేలా చూడాలి.
  3. బి.ఎస్.ఎస్. కులమతాలకు అతీతం.. అందరూ మనుషులే.. దైవ విషయంలో ఎవరి నమ్మకం.. ఆచార వ్యవహారాలు.. వారివే.. విమర్శనా రహితంగా గౌరవించాలి.
  4. స్వప్రయోజనాలకోసం పార్టీలను మతాలను మార్చేవారికి ఓటుహక్కును రద్దు చేయాలి.
  5. పేదరికం అనేది అన్ని కులాలలో, అన్ని మతాలలోనూ వుంది. వారిని
  6. ఆదుకోవడం.. ఆశ్రయం కల్పించడం.. ప్రతి బి.యస్.యస్. సభ్యుని కర్తవ్యం.
  7. కులమతాలకు అతీతంగా యావత్ భారత ప్రజానీక సమైక్యతే బి.యస్.యస్ ప్రధాన లక్ష్యం.
  8. విద్యా విదానం.. సిలబస్.. దేశం అంతా ఒకటిగానే వుండాలి. పాఠ్యాంశాలలో దేశ.. గొప్ప నాయకుల చరిత్రలతో వుండాలి. తమ ప్రాంతం.. దేశంలోని మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులు నిశితంగా తెలుసుకోవాలి.
  9. సంస్కృతం.. ప్రతి రాష్ట్ర భాష, యావత్ భారత దేశంలో ప్రైమరీ, సెకండరీ విద్యాలయాల్లో ప్రవేశపెట్టాలి.
  10. రిజర్వేషన్లు.. రికమెండేషన్లు.. లంచాల వ్యవస్థను సమూలంగా ఖండించాలి. వాటికి పాల్పడినవారికి ఓటు హక్కు రద్దు.. పది సంవత్సరాల కారాగార శిక్ష అమలు చేయాలి.
  11. స్త్రీని నీచంగా విమర్శించినా.. బాల బాలికలను బలవంతం చేసి చెరచినవారిని ససాక్ష్యంతో పబ్లిక్ లో నిలబెట్టి కాల్చి చంపాలి.
  12. గోహత్యా పాపానికి శిక్ష శిరచ్ఛేదం చేయాలి.
  13. కుటుంబ నియంత్రణ.. వివాహ వ్యవస్థ.. అన్ని మతాల వారికి ఒకే రీతిగా వుండాలి.
  14. ఏ మతం వారైనా వారి ముఖ్య పుణ్య క్షేత్రాలకు వెళ్ల దలచుకుంటే.. ప్రభుత్వ విరాళం.. అన్ని మతాల వారికి ఒకే రీతిగా వుండాలి.
  15. భర్త వియోగం.. చనిపోయినా.. విడాకులు ఇచ్చినా.. నచ్చినవారితో జీవితాన్ని పునర్వివాహంతో ఆనందమయం చేసుకోవాలి. వారికి సహకరించి సాయం చేయాలి.

ఇవన్నీ నా భావాలు… నా దేశం పట్ల నాకు వున్న గౌరవాభిమానాలకు నిదర్శనాలు.. నా దేశానికి వెళ్లి బి.యస్.యస్.ను స్థాపించాలని నా ఆశ.. పై వాని నిర్ణయం ఎలా వుందో?!…

అన్నా తన తండ్రి యిచ్చిన డైరీని చదవడం ముగించాడు. కళ్లు మూసుకొని ప్రక్కనే నిద్రపోతున్న శ్యామ్ ముఖంలోకి చూచాడు.

అతని మనస్సు నిండా తన తండ్రి డైరీలో వ్రాసిన ప్రతి అక్షరం.. వారి ఆశయం.. ఆశయాలు.. మాజీ ప్రొఫెసర్.. చాలా గొప్పగా వ్యవహరించారు. ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించి.. ‘డీన్’ అయారు. వారి మనస్సున తమ దేశం పట్ల.. దేశ ప్రజానీక శ్రేయస్సు ప్రగతి పట్ల అంతటి మహెూన్నత.. ఆశయాలు వున్నాయని అన్నా ఏనాడు వూహించలేదు.

కానీ.. కొన్ని రాత్రులు.. వారి తల్లి మాధవి బ్రతికి వున్న రోజుల్లో ఆమెతో.. భారత దేశాన్ని గురించి.. పరపాలనా విధానాలను.. పార్టీల గురించి తండ్రి చర్చించడం అన్నా చూచాడు. వారి కొన్ని మాటలను విన్నాడు.

‘అవును.. డెబైనాలుగు ఏళ్ల స్వాతంత్ర్యంలో.. దేశ ప్రజల మధ్యన స్నేహభావం లేదు.. వైరభావం పెరిగింది. కుల మతాలను గురించి పట్టింపులు.. ఏది ఏమైనా ఈ దేశ హైందవేతరులు వేరే ప్రదేశానికి వెళ్లలేరు. తాత ముత్తాతల హయాం నుండి వున్నవారు మనో తత్వాలను మార్చుకొని.. హైందవులను తమ సోదరులుగా భావించి.. మతపర ఉన్మాద భావాలను సమాధి చేసి.. దేశ సౌభాగ్యానికి.. తమవంతు సాయం చేయడం ప్రతి భారత హైందవేతర పౌరుడి లక్ష్యం కావాలి. వ్యతిరేక చర్యలతో సమాజాన్ని కించపరచిన వారిని కఠినంగా శిక్షించాలి. ఓటు హక్కును రద్దు చేయాలి.

నాన్నగారి మనో భావన.. రచనకు రూపకల్పన చేయాలి.. బి.యస్.యస్.ను స్థాపించాలి. ఐక్యతాయుత సమసమాజానికి.. నాంది పలకాలి. ఆ తండ్రి కొడుకుగా అది నా కర్తవ్యం..’ ఆ నిర్ణయానికి వచ్చాడు అన్నా.

శ్యామ్ మేల్కొన్నాడు. అన్నా ముఖంలోకి చూచాడు.

“చదువు.. నాన్నగారు వారి జీవిత ఆశయాన్ని గురించి ఇందులో చాలా వివరంగా వ్రాసి వున్నారు..” అన్నాడు అన్నా..

“అలాగే !..” శ్యామ్ డైరీని చేతికి తీసుకొన్నాడు.

అన్నా.. శ్యామ్‌లు వారణాశిలో దిగారు. తల్లి తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేశాడు. ఇరువురు కాశీ విశ్వేశ్వరుడు, మాతా అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరవుల వారిని దర్శించుకున్నారు.

వయా హైదరాబాదు గుంటూరుకు వచ్చారు. పూలవాసన కట్టిన నారకు సంక్రమించినట్టు.. లక్ష్మికి వారి వలన ఎంతో ఆనందం..

***

“అయ్యా!..” పిలిచాడు సింధ్యా..

అన్నా తొట్రుపాటుతో సింధ్యా ముఖంలోకి చూచాడు. గత స్మృతులు చెదిరి పోయాయి.

“శ్యాంబాబు వచ్చాడయ్యా!..”

“ఎక్కడ వున్నాడు?..”

“వరండాలో!..”

“సింధ్యా!.. శ్యామ్ ఎవరనుకొంటున్నావ్!.. వాడు నా తమ్ముడు.. వాణ్ణి వరండాలో ఆపావా!.. తప్పు.. వెళ్లి లోనికి పిలుచుకొనిరా!..”

సింధ్యా హడావిడిగా వరండాలోకి పరిగెత్తి.. మూడు నిముషాల్లో శ్యామ్‌ను వెంటపెట్టుకొని వచ్చాడు.

అతని చేతిలో డైరీ వుంది.

అన్నాను చూచి చిరునవ్వుతో ఎదుటి సోఫాలో కూర్చున్నాడు.

“రేయ్! శ్యామ్.. త్రాగుతావా!..”

తల ఆడించాడు.. చిరునవ్వుతో శ్యామ్..

అన్నా.. సింధ్యా ముఖంలోకి చూచాడు.

సింధ్యా గ్లాసులో విస్కీని నింపి.. తయారు చేసి శ్యామ్ ముందుంచాడు.

తన గ్లాసును పైకెత్తాడు..

“ఛియర్స్ డియర్!.. ప్లీజ్ హ్యావిట్!..” చిరునవ్వుతో చెప్పాడు.

అన్నా.. క్షణం తర్వాత.. “శ్యామ్!.. ఈరోజు క్రిందటి గంటలో నాకు అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు. వారి మధ్యన నా అమెరికా జీవితం అంతా నా కళ్లముందు నిలిచింది..” విచారంగా చెప్పాడు అన్నా..

“అన్నా!.. తిరిగి మన భారత్‌కు వచ్చేటపుడు నాకు నీవు నాన్నగారి డైరీని ఇచ్చావు చదవమని.. మనం ఇక్కడికి వచ్చాక మన ఎంప్లాయిమెంట్, మనం నిర్మించదలచుకొన్న హాస్పటల్, మెడికల్ కాలేజి వ్యవహారాల్లో మనం ఎంత బిజీగా వున్నామో నీకు తెలియంది కాదు. రెండు రోజుల క్రిందట డైరీని చదవడం పూర్తిచేశాను. నాన్నగారి ఆశయం మహోన్నతం. మనం వారి కలను నిజం చేస్తాము. అల్రెడీ వారు వ్రాసిన దాన్ని జిరాక్స్ తీసి టైపింగ్‌కి ఇచ్చాను. మనకు కావాల్సినన్ని ప్రతులను మనం తీసుకోగలం.” వేగంగా చెబుతున్న శ్యామ్ ఆగిపోయాడు.

అన్నా ఆశ్చర్యంగా శ్యామ్ ముఖంలోకి చూచాడు.

“ఏరా! ఆగిపోయావ్!..”

శ్యామ్ డైరీ చివర పేజీలలో ఒక దాన్ని తీసి “ఈ పేజీ నీవు చూచావా!..”

ఆ పేజీని తెరచి చూపించాడు శ్యామ్.

‘రాజమండ్రి అనాథాశ్రమ నిర్వాహకులకు నా ధన్యవాదములు.. నేను ఆశ్రమానికి ఇచ్చింది చాలా తక్కువ.. వారు నాకు ఇచ్చింది.. ఎంతో ఎక్కువ.. ఇంత అని విలువ కట్టలేనిది..’

అన్నా ఒకటికి రెండు సార్లు చదివాడు. శ్యామ్ ముఖంలోకి చూచాడు.

“అన్నా!.. నీకు ఏమైనా అర్థం అయిందా.. ఆ ఆశ్రమాన్ని గురించి నాన్నగారు నీతో ఏమైనా చెప్పారా!..”

అన్నా ముఖంలో ఆశ్చర్యం.. ఆ రెండు లైన్లను తన సెల్లో ఎక్కించుకున్నాడు..

‘చెప్పలేదు..’ అన్నట్టు తల ఆడించాడు.

‘నేను ఆశ్రమానికి ఇచ్చింది చాలా తక్కువ.. వారు నాకు ఇచ్చింది ఎంతో ఎక్కువ..’ ఆ వాక్యాలు మస్తిష్కంలో మారుమ్రోగాయి.

‘వెళ్లాలి.. ఆ ఆశ్రమానికి.. నాన్న గారికి వున్న సంబంధాన్ని గురించి వారి వ్రాతను వారికి చూపించి.. వారు నాన్నగారికి ఏం ఇచ్చారో.. తెలుసుకోవాలి!..’ అనుకొన్నాడు అన్నా..

“అన్నా!.. ఏమిటి మీ ఆలోచన?..”

“శ్యామ్!.. ఒకసారి మనం ఆ ఆశ్రమానికి వెళ్లాలి!..” సాలోచనగా చెప్పాడు అన్నా.

అన్నా ముఖంలో .. శ్యామ్‌కు ఏదో అనుమానమున్నట్లు గోచరించింది. కానీ అదేమిటో అడగలేదు.. అది అసభ్యత.. అన్నా సెల్ మ్రోగింది.. చేతిలోకి తీసుకొని..

“హలో..” అన్నాడు.

“హలో సార్!..”

“ఎవరండీ?..”

“గుర్తుచేసుకోండి..”

“పావని..”

“మనం ఒకే రో సీట్లలో విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణం చేశాము” నవ్వుతూ చెప్పింది పావని.

అన్నాకు గుర్తు వచ్చింది.

“ఆ.. ఆ.. అవునవును..”

“నేను మిమ్మల్ని రేపు హాస్పిటల్లో కలవబోతున్నాను.. సార్!..”

(ఇంకా ఉంది)

Exit mobile version