[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[తనో అనాథని తెలుసుకున్న అన్నా కారు డ్రైవ్ చేస్తూ గుంటూరుకి తిరిగి వస్తూ తనలో తానే మథనపడతాడు. పార్వతికి, వాళ్ళ కుటుంబానికి నిజం చెప్పి, వారు సమ్మతిస్తేనే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంటికి చేరుతాడు. తనకోసం వేచి ఉన్న పార్వతిని పలకరించి, ఆలస్యమైనందుకు క్షమించమంటాడు. స్నానం చేసి, ఫ్రెష్ అయి వచ్చి, పార్వతితో కలిసి భోం చేస్తాడు. సింధ్యాని పార్వతి కారుని తీసుకురమ్మని చెప్పి, పార్వతిని తన కారులో కూర్చోబెట్టుకుని బయల్దేరుతాడు. దారిలో తన జన్మ రహస్యం గురించి పార్వతికి చెప్తాడు. పార్వతి నమ్మలేకపోతుంది. పార్వతిని ఇంటి దగ్గర దింపి, తన కారులో సింధ్యాతో కలిసి వెనక్కి వచ్చేస్తాడు అన్నా. పార్వతి తండ్రికి ఫోన్ చేసి జరగినదంతా చెబుతుంది. తాను మర్నాడు అన్నాతో మాట్లాడతానని అంటాడు నారాయణమూర్తి. మర్నాడు ఉదయం డాక్టర్ శ్యామ్‍తో కలిసి, డి.ఐ.జి. వినోద్, అడ్వకేట్ ఆనందరావు అన్నా ఇంటికి వచ్చి – మాధవయ్యగారి కేసులో భుజంగవర్మకి శిక్ష పడుతుందని, ఆయనని అరెస్టు చేస్తారని అంటారు. ప్రస్తుతం భుజంగవర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనకి నయమయ్యాదాక ఆగమని చెప్తాడు అన్నా. టీ త్రాగి డి.ఐ.జి. వినోద్.. అడ్వకేట్ ఆనందరావు వెళ్లిపోతారు. బిఎస్ఎస్ సంస్థ ప్రకటనకు మంచి స్పందన వచ్చిందని శ్యామ్ చెప్తాడు. ఇంతలో పావని వచ్చి తన తండ్రి అన్నాను చంపేందుకు ఎత్తులు వేస్తున్నాడని అంటుంది. భుజంగవర్మకు ఓ-పాజిటివ్ రక్తం అవసరమని, అది తమ హాస్పటల్‍లో స్టాకు లేదని చెప్తుంది. తాను ఏర్పాటు చేయిస్తానని, కంగారు పడొద్దని అంటాడు అన్నా. తన తండ్రి గురించి బాధపడద్దని చెప్తాడు. పావని వెళ్ళిపోయాకా, వెంకటేశ్వర్లు గారు చెప్పిన నిజాలు జ్ఞాపకం రావడంతో అన్నా కళ్ళలోంచి కన్నీళ్ళొస్తాయి. అది చూసిన శ్యామ్ కారణం అడుగుతాడు. ఇక చదవండి.]
[dropcap]“శ్యా[/dropcap]మ్!.. నీవు నీవు కాదని నీకు తెలిసిన నాడు నీ మనస్సుకు ఎలాంటి ఆవేదన కలుగుతుందో.. అదే ప్రస్తుతం నాలో చెలరేగుతూ వుంది..”
..అతని చెవి దగ్గర.. “నీవు మొన్నటివరకూ.. ‘బాబాయ్.. పిన్ని’ అని పిలిచిన ధర్మతేజ.. మాధవి.. అమ్మానాన్నలు.. నన్ను కన్న తల్లిదండ్రులు కారట.. నేను అనాథనట.. రాజమండ్రిలోని అనాథ ఆశ్రమ నిర్వాహకులు వెంకటేశ్వర్లుగారు చెప్పారు..” శ్యామ్ ముఖంలోకి దీనంగా చూస్తూ చెప్పాడు.. అన్నా.
శ్యామ్ అంతులేని ఆశ్చర్యంతో.. అన్నా ముఖంలోకి చూచాడు.
అన్నా విరక్తిగా నవ్వి.. లేచి.. “స్నానం చేసి వస్తాను.. కూర్చో!.. టిఫిన్ చేసి హాస్పటల్‌కు కలసి వెళదాం!..” అన్నా కుర్చీ నుండి లేచాడు.
“అలాగే.. అన్నా!..”
అన్నా తన గదిలోకి వెళ్లిపోయాడు.
మాధవయ్య చివరిగా శ్యామ్ చెవిలో చెప్పిన మాటలను దూరంగా వున్న కారణంగా.. వినలేకపోయాడు. శ్యామ్ అన్నాల మధ్యన జరిగిన సంభాషణ ఏమైవుంటున్నదన్న ఆలోచనతో మాధవయ్య తన గదికి వెళ్లిపోయాడు.
అన్నా శ్యామ్‍లు టిఫిన్ తిని హాస్పటల్‌కు వెళ్లారు.. భుజంగవర్మ ఆపరేషన్‍కు నాలుగు బాటిల్సు ఓ పాజిటివ్ రక్తం అవసరం.. రెండు బాటిల్సు లభ్యం అయినాయి ఇతర హాస్పిటల్స్ నుండి.. మరో రెండు బాటిల్స్ కావాలి.. ఆపరేషన్ చేయడం ఆలస్యమయితే.. కాలు సెప్టిక్ అయేదానికి అవకాశం వుంది.
అన్నా మరోసారి.. డ్యూటీ డాక్టర్స్‌ని.. స్టోర్సు వారిని రక్తాన్ని గురించి సెల్‍లో ఎంక్వయిరీ చేశాడు. “ఎవైలబిలిటీ నిల్.. సార్” అనే సమాధానమే వచ్చింది.
తన బ్లడ్ గ్రూప్ ఓ-పాజిటివ్.. తన తల్లిదండ్రులు చెప్పిన.. మాటలు.. ‘మానవ సేవే.. మాధవ సేవ’ మాటలు గుర్తుకు వచ్చాయి. బెడ్ పై వాలిపోయాడు. తన రక్తాన్ని బాటిల్స్‌లో నింపించాడు. బెడ్ దిగి బయటికి వస్తున్న అన్నాను చూచి పావని.. చేతులు జోడించి.. “సార్!.., యు ఆర్ గ్రేట్ సార్.. గ్రేట్ సార్!..” పారవశ్యంతో చెప్పింది.
భుజంగవర్మ గారిని ఆపరేషన్ థియోటర్లోకి షిఫ్టు చేశారు.. డాక్టర్ శ్యామ్.. డాక్టర్ ముకుంద్.. డాక్టర్ శృతి.. భుజంగరావు కాలుకు అపరేషన్ చేసి స్టీల్ ప్లేట్లు.. బోల్ట్స్ అమర్చి.. స్టిచెస్ వేసి.. ఆపరేషన్ ముగించారు. భుజంగరావును ఐ.సి.యు.కి షిఫ్ట్ చేశారు.
పావని ఐ.సి.యు. ముందు అన్నాకు ఎదురయింది.
“పావనీ!.. నాన్నగారి ఆపరేషన్ సవ్యంగా జరిగింది. నో ప్రాబ్లమ్.. నాలుగైదు గంటల్లో స్పృహ వస్తుంది. మీరు వారితో మాట్లాడవచ్చు.. మీరూ ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు కాబట్టి వారు త్వరలో కోలుకోగలరు..” సామ్యంగా చెప్పాడు అన్నా..
ప్రక్కన నిలబడి ఏడుస్తున్న పావని తల్లి యశోదమ్మను చూచి.. “వారికేం భయం లేదమ్మా!.. బాధపడకండి. నాలుగైదు గంటల తర్వాత చూచి.. మాట్లాడవచ్చు..” అని చెప్పి అన్నా తన గదికి వెళ్లిపోయాడు.
నాలుగన్నర గంటలకు నారాయణమూర్తిగారు ఫోన్ చేశారు.
“నేను మిమ్మల్ని కలవాలి బాబూ!..”
“ఆరున్నరకి ఇంటికి రండి సార్!..”
“అలాగే.. వస్తాను..”
“సరే..” అని సెల్ కట్ చేశాడు అన్నా..
రౌండ్సు ముగించుకొని ఐదున్నరకు ఇంటికి చేరాడు అన్నా.
నిర్మాణాల సైటు ఇన్‍ఛార్జి పి.యం.వాసుదేవ్ వచ్చాడు. బిల్డింగ్ వైజ్ ప్రోగ్రెస్.. కంప్లీషన్ డేట్స్‌ను వివరించాడు. కృష్ణయ్యగారు ఏర్పరిచిన కాంట్రాక్టర్స్ చాలా బాగా పని చేస్తున్నారని నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి అవుతాయని.. అన్నాకు చెప్పి వెళ్లిపోయాడు.
ఏ నిర్మాణానికైనా.. ప్లానింగ్.. చాలా ముఖ్యం.. మెటీరియల్స్ ప్రొక్యూర్‍మెంటు.. లేబర్.. పేమెంట్స్.. ప్రాపర్‌గా నిర్వహించ కలిగిన అనుభవజ్ఞుడైన ‘మేనేజర్’ వుంటే పనులన్ని సకాలంలో.. ఇంకా ముందుగా కూడ ముగించవచ్చు. వాసుదేవ్ దాన్ని సాధించాడు.
ఏడుంపావు కల్లా నారాయణమూర్తి అన్నా ఇంటికి వచ్చాడు. ఇరువురూ వరండాల్లో కూర్చున్నారు. ఇరువురి మనస్సులలో అప్రశాంతత..
“బాబూ!.. అమ్మాయి విషయాన్ని చెప్పింది..” విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.
నడక ప్రాక్టీస్ చేయాలని బయటికి రాబోయిన మాధవయ్య లోపలే ఆగిపోయి వారి సంభాషణను వినసాగాడు.
“నాకు అబద్ధం చెప్పడం.. ఎదుటివారిని మోసం చేయడం.. చేతకాదు.. అమ్మా నాన్నలు..” ఆగిపోయాడు అన్నా..
“అవును.. వారిరువురూ ఎంతో మంచివారు..”
“నాన్నగారు వారి డైరీలో చివరన ఒక పేజీలో ‘ఆశ్రమానికి నేను ఇచ్చింది చాలా తక్కువ.. అది నాకు ఇచ్చింది ఎంతో ఎక్కువ’ అని వ్రాశారు.. ఆ ఎక్కువ.. ఏమిటో తెలిసికోవాలని రాజమండ్రి అనాథ ఆశ్రమానికి వెళ్లాను..”
‘రాజమండ్రి.. అనాథ ఆశ్రమం..’ ఆ మాటలను విన్న మాధవయ్య.. ఆ మాటలను మెల్లగా సాలోచనగా.. తనలో తాను పలికాడు.
“ఇరవై ఎనిమిది సంవత్సరాల కిందట జరిగిన విషయం.. ఆశ్రమ నిర్వాహకులు వెంకటేశ్వరుగారు.. నన్ను ఎవరో ఆశ్రమం ముందు విడిచి వెళ్లిపోయినట్టు చెప్పారు.. అపుడు అర్థం అయింది నాకు.. నాన్నగారు వ్రాసిన.. ‘తక్కువ’.. ‘ఎక్కువ’ పదాల అర్థం.. ఆ ‘ఎక్కువనే’ నేను.. సార్!..” దీనంగా కన్నీటితో చెప్పాడు అన్నా..
మాధవయ్యకు విషయం విపులంగా అర్థం అయిది. అతని కళ్లనుండి కన్నీళ్లు.. ఇరవై ఎనిమిది సవత్సరాల క్రిందట యజమాని భుజంగరావు ఆజ్ఞ ప్రకారం.. తాను..
‘ఆ పాపిష్టిని నేనే.. నేనే బాబు.. నేనే..’ మాధవయ్య హృదయం గత జ్ఞాపకాలతో ద్రవించింది. కన్నీరుగా కళ్లనుంచి స్రవించింది.
“సార్.. జరిగిన యథార్థాన్ని నేను మీకు చెప్పాను. మీరు మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నవారు. బాగా అలోచించుకోండి.. మీకు ముమ్మూర్తులా సమ్మతం అయితేనే నాకు పార్వతికి వివాహం..” కళ్లల్లో విషాదం ఉన్నా.. పెదవులపై చిరునవ్వుతో చెప్పాడు అన్నా.. క్షణం తర్వాత..
“సమాధానం ఇప్పుడే అవసరం లేదు.. అందరూ కలసి ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి. మీ నిర్ణయం ఏమైనా సరే.. నాకు సమ్మతం.. జీవితాంతంనేను మీ శ్రేయోభిలాషిగా వుండిపోతాను..” ఎంతో వినయంగా చెప్పాడు అన్నా.
నారాయణమూర్తి.. కళ్లల్లో కన్నీరు.. మౌనంగా వుండిపోయాడు. ఇరువురి మధ్యన మాటలు కరువైపోయాయి..
విషయం అర్థమయిన మాధవయ్య.. ఏడుస్తూ వరండాలోకి ప్రవేశించాడు. అన్నా చేతులు పట్టుకొని..
“బాబూ.. మీరు కులహీనులు కాదు.. భుజంగరావుగారి అన్నగారు భూపతివర్మ.. వారి అర్థాంగి యశోధర.. ఆ దంపతుల సంతతి మీరు.. మీ తాతగారి పేరు మార్తాండవర్మ.. నాయనమ్మ పేరు రుక్మిణీదేవి. వారికి ఒక తమ్ముడు మన్మథరావు.. అతను మీ యింట్లో వుంటుండే వాడు. అనారోగ్యంతో తాత నాయనమ్మలు గతించగా ఆస్తి కోసం.. గుర్రాలపై సవారీని ఇరువురు అన్నదమ్ములు చేస్తూ వుండగా.. అంటే మీ నాన్నగారు భూపతివర్మ.. భుజంగవర్మలు.. మీ నాన్నగారిని గుర్రాన్ని.. ఆ మామా అల్లుళ్లు రెచ్చగొట్టి.. మీ నాన్నగారిని రాళ్ల ప్రాంతంలో క్రిందపడేలా చేశారు. రాళ్లపై నేరుగా పడ్డ కారణంగా నాన్నగారు తల పగిలి మరణించారు. అప్పటికి మీ తల్లి ఆరుమాసాల గర్భవతి. మీ అమ్మగారి పుట్టింటివారు వచ్చి మీ అమ్మగారిని తమతో పంపమంటే భుజంగవర్మ.. మేనమామ మన్మథరావు అమ్మగారిని వారితో పంపలేదు. మూడు మాసాల తర్వాత మీరు జన్మించారు. మీరు పుట్టి చనిపోయినట్టు అమ్మగారికి చెప్పారు. ఆ వార్త విని వారు మరణించారు. భుజంగవర్మ మన్మథరావులు మిమ్మల్ని నాకు అప్పగించి చంపేయమన్నారు.
ఆ పాపం చేసేదానికి నాకు మనసొప్పక.. గుంటూరు నుంచి రాజమండ్రికి రైల్లో వచ్చి.. మిమ్మల్ని ఆ అనాథ శరణాలయం ముందు రాత్రి ఒకటి రెండు గంటల మధ్య విడిచిపెట్టి వెళ్లిన కిరాతకుణ్ణి నేనే.. బాబూ.. ఆ కిరాతకుణ్ణి నేనే..” బోరున ఏడ్చాడు మాధవయ్య.
అన్నా.. నారాయణమూర్తులు ఆశ్చర్యంతో మాధవయ్య ముఖంలోకి చూచారు. “సార్!.. ఆ సర్వేశ్వరుని సాక్షిగా నేను చెప్పినదంతా నిజం.. నా మాటను నమ్మండి..” దీనంగా చేతులు జోడించాడు మాధవయ్య..
అన్నాకు విషయం.. పూర్తిగా వివరంగా అర్థం అయింది.
మాధవయ్యగారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని.. “అన్నా.. మీరు నా ఆత్మకు శాంతిని కలిగించారు. ధన్యవాదాలు.. కానీ మీరు ఇపుడు మాతో చెప్పిన నిజాన్ని మీ జీవిత కాలంలో ఎవరితోనూ చెప్పనని నాకు మాట ఇవ్వండి..” అన్నా తన కుడిచేతిని ముందుకు సాచాడు.
మాధవయ్య తన చేతిని అన్నా చేతిలో వుంచి.. “సార్!.. మీరు నన్నూ నా బిడ్డను రక్షించారు. నాకు తెలిసిన ఆ నిజాన్ని నాలోనే దాచుకొంటాను.. నా బిడ్డమీద ఒట్టు!..” కన్నీటితో చెప్పాడు మాధవయ్య.
“నేను మిమ్మల్ని అలా ఎందుకు అడిగానో తెలుసా!.. నాకు తెలిసిన నా తల్లిదండ్రులు ప్రొఫెసర్ ధర్మతేజ.. మాతా మాధవీలుగానే నా జీవితాంతం.. నా మదిలో వుండబోయే వారు.. వారి ఋణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను.. నా ప్రతి విజయం వెనుక వుండినది.. నన్ను చక్కని మార్గంలో ముందుకు నడిపించినదీ వారే.. దయచేసి మీరు చెప్పిన మాటమీద నిలబడండి మాధవయ్య అన్నగారూ!..” కన్నీటితో చిరునవ్వుతో కోరాడు అన్నా..
నారాయణమూర్తి ముఖంలో పరమానందం..
వారిని చూచిన అన్నా.. “సార్!.. మాధవన్నయకు చెప్పిన మాటలు మీకూ వర్తిస్తాయి.. సుమా!..” అంటూ సంతోషంగా నవ్వాడు.
నారాయణమూర్తి సెల్ మ్రోగింది.. ఫోన్ చేసింది.. పార్వతి.
“ఆ.. ఆ.. వచ్చి.. అన్ని విషయాలు వివరంగా చెబుతానమ్మా!..” సెల్ కట్ చేశాడు. అన్నా ముఖంలోకి చూచాడు, ఆనందంగా నవ్వుతూ.
పావని.. తండ్రికి స్పృహ వచ్చిందని అన్నాకు చెప్పాలనివచ్చింది. అన్నాతో మాధవయ్య చెప్పిన మాటలను విని.. మౌనంగా వెనక్కు వెళ్లిపోయింది.
నారాయణమూర్తి లేని.. “వెళ్లొస్తాను బాబూ..” అన్నాడు. పెదవులపై చిరునవ్వు..
అన్నా తల ఆడించాడు.. నారాయణమూర్తి వెళ్లి పోయాడు.
మాధవయ్య ప్రీతిగా అన్నా ముఖంలోకి చూచాడు.
నవ్వుతూ.. అన్నా వారి ముఖంలోకి చూస్తూ చేతులు జోడించాడు.
***
అన్నా ఎనిమిది గంటలకల్లా హాస్పటల్‌కు వచ్చాడు. శ్యామ్.. డాక్టర్ శృతి.. డాక్టర్ పావని.. నర్స్ నాగమణిలతో కలసి రౌండ్స్‌కు బయలుదేరాడు అన్నా. వార్డ్ వైజ్ డ్యూటీ డాక్టర్స్ కూడా వారితో వారి వార్డుల్లో తిరిగారు. అన్నా కేస్ షీట్‍ను చూచి పేషెంట్ కండిషన్ చూచి.. వార్డ్ డాక్టర్స్‌కు సలహాలను ఇచ్చి మార్చవలసిన మెడిసిన్‍ను కేస్ షీట్‍లో వ్రాశాడు.
చివరగా.. భుజంగవర్మ వున్న స్పెషల్ రూమకు వచ్చాడు. కళ్లు మూసికొని వున్న అతని శరీరాన్నితాకి చూచి.. పావని ముఖంలోకి చూచాడు.
“పావనీ! డోన్ట్ వర్రీ.. హి విల్ రికవర్ సూన్.. ప్రే గాడ్!..” చిరునవ్వుతో చెప్పి.. డ్యూటీ డాక్టర్స్‌తో మెడిసిన్ గురించి మాట్లాడి.. కేస్ షీట్‍లో మార్చి వ్రాశాడు.
భుజంగ వర్మ సతీమణి నమస్కరించింది. చేతులు జోడించి ప్రతినమస్కారం ఆ మాతృమూర్తికి చేశాడు అన్నా..
భుజంగవర్మ మేల్కొన్నాడు. మంచం చుట్టూ వున్నవారందరినీ చూచాడు. అన్నా ముఖంలోకి క్షణం సేపు చూచి కళ్లు మూసుకొన్నాడు. అన్నా తన చేతిని వారి చేతిపై వుంచి.. “బాధపడకండి.. త్వరలో కోలుకొంటారు..” చిరునవ్వుతో చెప్పి గది నుండి బయటికి నడిచాడు. అందరూ అతన్ని అనుసరించారు.
పావని.. “నాన్నా!.. నిన్ను రక్షించింది వారే.. నీవేమో.. వారిని చంపాలని గూండాలతో మంతనాలు చేస్తున్నావు.. నీవు వారిని ఏమైనా చేయించావో.. నిన్ను నేను కాల్చిపారేస్తాను.. అమ్మా!.. చెప్పు నీ భర్తకు.. బుద్ధి మార్చుకొని మంచి మనిషిగా బ్రతకమని!..” ఆవేశంగా చెప్పి గది నుండి బయటికి నడిచింది. పరుగిడి వారితో కలిసిపోయింది.
‘అన్నా.. డాక్టర్ అన్నా.. నాకు అన్నయ్య.. ఈ నిజం నా జీవితాంతం.. నాలోనే దాచుకోవాల్సిన విషయం..’ ఆనంద భాష్పాలతో నవ్వుకొంది పావని.
అన్నా తన గదికి వెళ్లాడు. కూర్చున్నాడు. శ్యామ్ ఎదురు కుర్చీలో కూర్చుంటూ..
“అన్నా!.. మన హాస్పిటల్‍కు వెళ్లామా!..” అడిగాడు.
“ఆ.. పద.. చూచి చాలా రోజులయింది..”
అన్నా శ్యామ్ తాము నిర్మిస్తున్న హాస్పిటల్.. మెడికల్ కాలేజ్ భవనాల ప్రాంతానికి బయలుదేరారు. శ్యామ్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.
అన్నా సెల్ మ్రోగింది..
“బిజీ!..” సెల్ కట్ చేశాడు అన్నా..
శ్యామ్ అన్నా ముఖంలోకి చూచాడు.
“అన్నా! అన్యాయం..”.
“ఆ.. నా యాపారమే అదిరా.. అందరికీ అన్యాయం చేయడమే..”
“ఎందుకన్నా వదిన మీద కోపం?..”
“అది కోపం కాదు.. అభిమానాన్ని పెంచే ఆయుధం!..” నవ్వాడు. అన్నా చెప్పిన తీరుకు శ్యామ్‍కు కూడ నవ్వు వచ్చింది.. నవ్వాడు.
ఇరువురూ భవన నిర్మాణ స్థలానికి చేరారు.. ప్రాజెక్టు మేనేజరు వాసుదేవ్ వారిని సమీపించి విష్ చేశాడు. అన్ని బిల్డింగ్స్ లోనికి వెళ్లి చూచారు. ఓ రూమ్‍లో గోడకు వున్న బోర్డ్ పైని స్క్రీన్‍ను తొలగించాడు వాసుదేవ్.
అందంగా చిత్రించబడిన తెలుగు క్రింద ఇంగ్లీషు అక్షరాలు.. ‘మాధవీ ధర్మతేజ హాస్పిటల్’.., ‘మాధవీ ధర్మతేజ మెడికల్ కాలేజ్’..
రెండు బోర్డులను చూచిన అన్నాకు పరమానందం.. వాసుదేవ్ చేతిని తన చేతిలోనికి తీసుకొని .. “వాసూ!.. వెల్‍డన్.. డియర్.. అయాం వెరీ హ్యాపీ!..” ఆనందంగా చెప్పాడు అన్నా..
“ఎక్స్‌లెంట్ వాసూ..” కరచాలనం చేశాడు శ్యామ్.
“సార్.. ఈ సాయంత్రం ఎరక్ట్ చేయబోతున్నాను సార్.. రేపు వుదయం చాలా మంది ఆ నేమ్ ప్లేట్లను చూడబోతారు..”
“అన్నా! మన కాలేజీ అడ్మిషన్స్ యాడ్ ఇచ్చేశాను.. ప్రొఫెసర్లకూ.. విద్యార్థులకు.. కొన్ని అప్లికేషన్స్ కూడ వచ్చాయి. ఆ విషయాలు శృతి చూచుకొంటోంది.”
“ఓకే.. ఓకే!.. త్రీ వీక్స్‌లో అమ్మా వాళ్ల మ్యారేజ్ డే.. ఆనాటి నుంచే హాస్పిటల్ ప్రారంభం.. ఈలోగా మనం ఇద్దరం.. ఓసారి అమెరికా వెళ్లి అర్డర్ చేసిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్‌ను ఎయిర్‍లో లోడ్ చేసివద్దాము.. సరేనా!..” ఆనందంగా చెప్పాడు అన్నా.
శ్యామ్ మౌనంగా తల దించుకున్నాడు.
“ఏరా!.. నో జవాబూ?..”
“అన్నా!.. శృతి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూ వుంది..”
“ఏ విషయంలో!..”
“వివాహ విషయంలో!..”
అన్నా.. శ్యామ్ ముఖంలోకి చూచాడు. అవును అన్నట్టు దీనంగా చూస్తూ తల ఆడించాడు శ్యామ్.
“సరే పద.. పరిష్కారం చేస్తాను..”
అన్నా సెల్ మ్రోగింది.. చూచి.. వెంటనే కట్ చేశాడు.
“అన్నా!.. అన్యాయం కదా!..” దీనంగా చూస్తూ అన్నాడు శ్యామ్..
ఇరువురూ నవ్వుకొంటూ కార్లో కూర్చొన్నారు.
***
బి.యస్.యస్. ఆశయాలను చూచిన అనేకమంది సభ్యులుగా చేరేటందుకు సిద్ధమయ్యారు. పేరు.. వూరు.. విలాసం.. వృత్తి, ఫోన్ నెంబర్లను శ్యామ్ పబ్లిష్ చేసిన మెయిల్ ఐడీలకు వచ్చాయి. అందులో హైందవేతరులైన భారత సంతతి అయిన ముస్లిమ్స్.. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు.
కొందరు.. మనం అందరం కలసికొనేటందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసుకొంటే బాగుంటుందని సూచించారు.
అన్నా, శ్యామ్, పార్వతి, శృతి, పావని, మాధవయ్య, కృష్ణయ్యలు కలసి సమావేశ విషయాన్ని గురించి చర్చించారు. చివరగా పార్వతి.. “సమావేశం.. ఒకరినొకరు నేరుగా చూచుకొని పరిచయం చేసుకొనేటందుకుగానే వుండాలి గాని.. మామయ్య ధర్మతేజ గారు వ్రాసి రూపొందించిన సిద్ధాంతాలను గురించి వాద ప్రతివాదాలకు ఆస్కారం లేదని.. మనసా వాచా కర్మణా.. పబ్లిష్ చేసిన బి.యస్.యస్. సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడి వుండగలిగిన వారికే సభ్యత్వం లభిస్తుందని మరో అనౌన్సుమెంటు చేద్దాము.. దానికి సమ్మతించిన వారికే సభ్యత్వం లభిస్తుందని.. తన అంగీకారాన్ని ఆ రీతిగా తెలియచేసిన వారితోనే జరగవలసిన సమావేశం జరుగుతుందని.. దానికి మరికొంత వ్యవధి.. సమయం.. అందరికీ వుందని.. ఆ తేదీని కొన్ని వారాల్లో తెలియచేస్తామని.. ప్రకటనను మరోసారి రిలీజ్ చేద్దాము. ఇది నా సలహా!..” ఆవేశంగా చెప్పిన పార్వతి అపి చిరునవ్వుతో అందరి ముఖాల్లోకి చూచింది.
“మరొక్క మాట!.. బి.యస్.యస్. లక్ష్యం.. అన్ని కులాల మతాల సమైక్యత.. ఈ సాధనలో ఎవరి ఖర్చులు వారు పెట్టుకోవాలి.. ముందు రోజుల్లో ఎవరైనా సహృదయులైన దాతలు డొనేషన్స్.. ఇస్తే.. అపుడు చక్కటి లేఖలతోటి ఆ డొనేషన్స్ ఫండ్‌ను పేదలకు సద్వినియోగం చేస్తాము. కార్యాలయం మామయ్య అత్తయ్య పేర నిర్మించిన మెడికల్ కాలేజీలో ఒక భవనం.. ఆ భవనానికైన ఖర్చు మా నాన్నగారైన నారాయణమూర్తిగారు ఇస్తారు. ఆ భవంతి పేరు ‘ధర్మానారాయణ’..” చెప్పింది పార్వతి. అందరూ కరతాళ ధ్వనులతో పార్వతిని అభినందించారు.
ఆమె సూచనల ప్రకారం.. సర్క్యులర్ తయారు చేశారు.. అందరూ ఒకసారి పరిశీలించారు. ఇంతవరకూ సభ్యత్వానికి దరఖాస్తు పంపిన వారందరికి న్యూ నోటిఫికేషన్, ఆఫీస్ విలాసం.. కాంటాక్ట్ పర్సన్ పావని పేరును పంపారు.
***
నారాయణమూర్తి.. శృతి తండ్రి లాయర్ గోపాల్రావుగారు నిర్ణయించిన శుభ ముహూర్తాన అన్నా.. పార్వతి, శ్యామ్.. శృతిల వివాహాలు ఎంతో ఘనంగా జరిగాయి.
అన్నదానం.. వస్త్రదానం అనేక మందికి జరిగింది. ఆ నూతన దంపతులకు తమ తల్లిదండ్రులు బంధుమిత్రుల ఆశీస్సులే కాకుండా కొన్ని వందలమంది శుభాశీస్సులు లభించాయి.
వారి ఫస్ట్ నైట్ విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో అరేంజి చేశారు. ఆ ఉదయం నవదంపతులు.. తల్లిదండ్రులు సింహాచల శ్రీ నరసింహస్వామి మహాలక్ష్మి మాతా పితలను దర్శించారు. తీర్థ ప్రసాదాలను సేవించారు.
సాయంత్రం.. ఏడున్నర ప్రాంతంలో అందరూ కలసి డాల్ఫిన్ హోటల్లో భోజనం చేశారు.
అన్నా శ్యామ్‍లకు కేటాయించిన గదుల్లోకి వారు వెళ్లిపోయారు. నవ వధువులు ఇరువురూ పాలగ్లాసులతో సిగ్గు తెరలతో గదుల్లో ప్రవేశించారు.
లోనికి వచ్చిన సుందరాంగిని చూచి.. అన్నా.. “రేయ్!.. శ్యామ్!..” అంటూ పరుగెత్తి తలుపు తెరచుకొని బయటకు వచ్చాడు. అదే స్థితిలో.. శ్యామ్ అన్నాకు ఎదురైనాడు.
అక్కడవున్న ఆడవారు.. ఆనందంగా నవ్వుకొన్నారు.. అన్నా.. శ్యామ్‍లు కళ్లు అప్పగించి వారిని చూస్తూ గది తలుపును మెల్లగా తెరచి లోనికి చూచి.. ఆనందంగా లోనికి ప్రవేశించి తలుపులు బిగించారు.
ఎదురుగా నవ్వుతూ నిలబడివున్న అర్ధాంగులను ఆలింగనం చేసికొని మల్లెల మంచాలపై అనందంగా పారవశ్యంతో వాలిపోయారు.
(సమాప్తం)