Site icon Sanchika

డాక్టర్ అన్నా బి.యస్.యస్.-6

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[రాఘవయ్య – భుజంగవర్మ వంశం గురించి చెప్పబోతుంటే – ఆయన్ని వారించి, ఆ చరిత్ర అంతా వద్దని – ఆయనకీ, భుజంగవర్మకు మధ్య ఏర్పడిన వైరానికి గల కారణం చెప్పమని డా. అన్నా అడుగుతాడు. ఆ కారణాన్ని వివరంగా తెలియజేస్తాడు. భుజంగవర్మ అహంకారంతో ఓ హత్య చేసి, దాన్ని తెలివిగా తన మీదకు నెట్టేసి, తనని జైలు పాలు చేసిన వైనం చెబుతారు రాఘవయ్య. రెండు మూడు రోజులలో రాఘవయ్యని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేస్తామని, ఆయనని తన ఇంట్లో ఉంచుకుంటానని, ఆయన కూతురిని కూడా తీసుకువచ్చి బాగా చదివిస్తానని అంటాడు అన్నా. రాఘవయ్య సంతోషంగా అంగీకరిస్తాడు. మరో పక్క భుజంగవర్మ రాఘవయ్యని చంపడానికి రుద్రని నియమించుకుంటాడు. అమెరికా నుంచి వచ్చిన భుజంగవర్మ కూతురు తాను బాంబేలో దిగానని, హైదరాబాద్ ఎయిర్‍పోర్ట్‌కి కారు పంపించమని ఫోణ్ చేయగా, తానే వస్తానని అంటాడు. ఏం పని చేస్తున్నా రాఘవయ్య ఆలోచనలు అతన్ని వదలవు. రాఘవయ్యకి రక్షణ కల్పిస్తున్న డా. అన్నా సంగతి చూడాలనుకుంటాడు. కానీ భుజంగవర్మ మిత్రుడు, హాస్పటల్ ఎం.డి. పార్వతీశం డా. అన్నా జోలికి వెళ్ళవద్దని హెచ్చరిస్తాడు. బొంబాయి ఎయిర్‍పోర్టులో హైదరాబాద్ వచ్చే విమానంలో పావని, అన్నా కూర్చుని ఉంటారు. వారి సీట్లకి సమీపంలోనే ఓ కుటుంబం వారు కూర్చుని ఉంటారు. ఆ కుటుంబ పెద్ద నారాయణమూర్తి డా. అన్నాని గుర్తుపట్టి అతన్ని మాటలలో దింపుతాడు. ఇక చదవండి.]

“యస్..”

“మీ నాన్నగారి పేరు ఏమిటి?..”

అన్నా.. ఆశ్చర్యంగా వారి ముఖంలోకి చూచాడు.

“నాకో మిత్రుడు ఉండేవాడు.. వారి పోలికలు మీలా ఉన్నాయి.. ఆ కారణంగా..”

“మా నాన్నగారి పేరును అడిగారు!..” అందంగా నవ్వాడు అన్నా..

పార్వతి చూపులు అన్నా పైనే వున్నాయి.

“అవును బాబూ!..”

“ధర్మతేజ..”

“ఆ..”

“అది మా నాన్నగారి పేరు..” చెప్పాడు అన్నా..

ఆ క్షణంలో అతన్నే చూస్తూ వున్న పార్వతి చూపులు అన్నా చూపులతో కలిసాయి. పార్వతి చిరునవ్వు నవ్వింది.

“మా అమ్మగారి పేరు.. మాధవి..” కొన్ని క్షణాల తర్వాత.. “ఇపుడు ఇరువురూ లేరు” మెల్లగా చెప్పి తల పావని వైపు త్రిప్పుకొన్నాడు.

అతని చేతిలోని కర్చీఫ్ క్రింద పడింది. పావని వంగి తన చేతికి తీసుకొని అన్నాకు అందించింది.

“థాంక్యూ… మా..” మెల్లగా చెప్పాడు.

ఆ సమయంలో అతని కళ్లు ఎర్రబడ్డాయి. అతని తల్లిదండ్రుల పేర్లను.. వారు ప్రస్తుతం లేరని చెప్పిన అతని మాటలు విన్న పావని అన్నా ముఖంలోకి విచారంగా చూచింది.

“బాబూ!.. నేను మీకు గుర్తుకు రావడం లేదా!.. దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం నేను నా భార్య నా పెద్దకూతురు పార్వతి అమెరికాలోని మీ ఇంటికి వచ్చాము”.

అన్నా వారిని పరీక్షగా చూచాడు.

‘అవును.. వీరు నాన్నగారి మిత్రులు.. మా యింటికి భార్యా కూతురు కొడుకుతో వచ్చారు. ఆమె గొప్పగా నాట్యం చేసేది.. నాన్నగారు, నేను ఆమె ప్రదర్శనలను అమెరికాలో ఏర్పాటు చేశాము.’ అనుకొన్నాడు.

“సార్!.. చాలాకాలం క్రిందట చూచాను కదా!.. వెంటనే గుర్తించలేకపోయాను.. సారీ సార్!..” అనునయంగా జవాబు చెప్పాడు అన్నా.

“మేము వుండేది విజయవాడలో.. గుర్తుందా!..” అడిగాడు నారాయణమూర్తి.

లేదు అన్నట్టు తల ఆడించాడు అన్నా..

“మీరు భారత్‌కు ఎపుడు వచ్చారు?..’ అడిగారు నారాయణమూర్తి.

“ఆరు నెలలయింది..”

“మీ నాన్నగారు నా ప్రాణ స్నేహితుడు..”

‘అయ్యివుండవచ్చు..’ అనుకొని తల ఆడించాడు అన్నా..

“మీరు డాక్టరు కదా?..” నారాయణమూర్తి ప్రశ్న.

“యస్.. సార్”

“ఎక్కడ వుంటున్నారు?..”

“గుంటూరు..”

గుంటూరు అనే పదం అనటంతోటే.. పావని అతని ముఖంలోకి చూచి నవ్వింది.

“మాదీ గుంటూరే సార్!..” అంది.

“ఓకే..” చిరునవ్వుతో తల ఆడించాడు అన్నా..

‘ఆ పెద్దాయన మూలంగా వీరి పేరు.. వూరూ.. అన్ని వివరాలు నాకు తెలిసాయి. ఆ కిటికి వద్ద కూర్చొని వున్న అమ్మాయి పదే పదే వీరిని చూస్తూ వుంది. మా ఇద్దరికి అందాల పోటీ నిర్వహిస్తే.. ఆ జడ్జీగారు జుట్టు పీక్కోవలసిందే.. నా డౌట్.. నాలాగే మంచి అందగత్తె..’ అనుకొంది పావని.

పార్వతి అన్నా ముఖంలోకి చూచింది. అన్నా కళ్లు మూసుకొని వున్నాడు.

‘నాన్నగారు అతనితో మాట్లాడారు.. మేము గుర్తున్నట్టు లేదు.. మనిషి ఆకారంలో గడచిన మూడున్నర సంవత్సరాల్లో ఏ మార్పు లేదు.. అలాగే వున్నాడు. కాని బుద్ధిలో మార్పు.. చాలా రిజర్వుడుగా వున్నాడు మనిషి.. మంచి అందగాడు కదా!.. ఆ పొగరు.. నావైపు ఐదారు సార్లు చూచి కూడా ‘హలో!..’ అనలేదు.. దాని అర్థం.. అహంకారం.. నాన్న నా గురించి చెప్పాడో లేదో!.. నేనేం తక్కువ కాదుగా!.. అయాం ఏ కలెక్టర్!..’ అన్నా ముఖంలోకి చూస్తూ.. అనుకొంది పార్వతి.

ఓ గంట.. అందరూ కళ్లు మూసుకొని ఎవరి ఆలోచనల్లో వారు వుండిపోయారు.

ఎయిర్ హెస్టర్ ల్యాండింగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. విమాన కదలికలో క్రిందికి దిగుతున్నట్టు చెవులకు సంకేతం… పదిహేను నిముషాల తర్వాత విమానం ల్యాండ్ అయింది. బయటి వాతావరణం కుంభవృష్టి. ఎయిర్ హెూస్టర్ బయటి టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ అని తెలియచేసింది. ఏరోబ్రిడ్జిని విమానానికి చేర్చారు.

అందరూ విమానం దిగారు. రడీగా వున్న బస్ ఎక్కారు.. బస్సు ఎయిర్‌పోర్టు కారిడార్ ప్రక్కనే అగింది. అందరూ ఆ బస్సులోనివారు దిగారు. ముందు సీటే అయినా ఆ బస్సులో అన్నా రాలేదు. పార్వతి కుటుంబం వచ్చేశారు.

అతనిని తమ ఇంటికి రావలసిందిగా చెప్పాలని నారాయణమూర్తిగారి అభిప్రాయం.

“ఆగండి.. ఆ అబ్బాయి రాలేదు..” చెప్పాడు నారాయణమూర్తి.

“అతనితో మనకేం పని?” అడిగింది పార్వతి.

“అమ్మా!.. అతను నా మిత్రుని కొడుకు”

“ఆ విషయం నాకూ తెలుసుగా నాన్నా!..”

“ఓసారి మన ఇంటికి రమ్మని పిలవడం మనకు మర్యాద!..”

“వారు మీనుండి ఆ మర్యాదను ఎదరుచూడటం లేదే!..”

“అలా అని నీకు ఎలా తెలుసు?..” అడిగాడు నారాయణమూర్తి.

“వారు మీతో మాట్లాడిన తీరు చూచాను!..” చెప్పింది పార్వతి.

బస్సు వచ్చింది. అన్నా, అతని వెనకాలే నవ్వుతూ పావని రావడం అందరికంటే ముందుగా చూచింది పార్వతి.

‘ఇరువురూ ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు! ఏమిటో’ అనుకొంది పార్వతి.

అన్నా.. పార్వతిని చూచి నవ్వాడు.

నారాయణమూర్తి అతన్ని సమీపించి.. తన విజిటింగ్ కార్డును అన్నాకు ఇచ్చి.. “వీలు చూచుకొని ఒకసారి మా యింటికి రండి.. ఆ.. మరోమాట.. పైవారం మా అమ్మాయి పార్వతి కలెక్టర్‌గా గుంటూరుకు రాబోతూ వుంది.” చిరునవ్వుతో చెప్పాడు నారాయణమూర్తి.

“ఓ.. అలాగా!..” అంటూ అన్నా తన కార్డును నారాయణమూర్తికి అందించాడు.

“అవును బాబూ!..” అన్నా విజిటింగు కార్డును జేబులో పెట్టుకున్నాడు నారాయణమూర్తి.

“మీ అమ్మాయిని నాకు పరిచయం చేయండి..”

నారాయణమూర్తి పార్వతిని పిలిచాడు.

పార్వతి తండ్రిని సమీపించింది.

“బాబూ!.. నాకంటే ముందు మిమ్మల్ని తనే గుర్తుపట్టి నాతో చెప్పి సీటు మారి మీతో మాట్లాడమని చెప్పింది. ఈమె నా పెద్దకూతురు పార్వతి..” నవ్వుతూ చెప్పాడు నారాయణమూర్తి.

పార్వతి సీరియస్‍గా అన్నా ముఖంలోకి చూచింది.

“సార్!.. వీరిని చూడగానే.. నాకూ అనుమానం కలిగింది.. మనిషిని పోలిన మనిషులు ప్రపంచంలో ఉండటం సహజమని మా అమ్మ అంటుండేది. అలానేమో అనుకున్నాను..” పార్వతి ముఖంలోకి సూటిగా చూస్తూ..

“హాయ్!.. అన్నా..”

“తెలుసు…” ముక్తసరిగా జవాబు ఇచ్చింది పార్వతి.

“వుయ్ విల్ మీట్ అట్ గుంటూరు..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

సరే అన్నట్టు తల ఆడించింది పార్వతి.

“బాబూ.. మీరు తప్పక మా యింటికి రావాలి..”

“సార్.. తప్పక రావాలి.. నారాయణమూర్తి కొడుకు మాధవ్ నవ్వుతూ చెప్పాడు.

“మీ అమ్మ నాకు మంచి స్నేహితురాలు.. ఓమారు మా యింటికి రండి” అంది పార్వతి తల్లి ఇంద్రజ.

“ఓకే.. ఇంతమంది ఆత్మీయులు పిలిచారు కాబట్టి.. ఫోన్ చేసి” పార్వతి వైపు చూస్తూ చిరునవ్వుతో “వస్తాను” అన్నాడు.

అందరూ ఎవరి కార్లలో వారు వారివారి ఇళ్లకు బయలుదేరారు.

***

రుద్రయ్య.. వీరాలాపంతో భుజంగవర్మకు మాట అయితే ఇచ్చాడు కానీ.. అన్నా అండలో వున్న రాఘవయ్యను చంపడం అంత సులువైన పని కాదని.. నలుగురిని కనుక్కొని ఆ నిర్ణయానికి వచ్చాడు. కానీ పని పూర్తి చేయాలి… అది ఎలా సాధ్యం?.. తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. యు.పి., నుంచి లేబర్‍ని తీసుకొని వచ్చి భవన నిర్మాణపనుల్లో పెట్టి, మనిషికి ఇంత అని భవన నిర్మాణదారుని వద్ద నుంచి వసూలు చేసి.. తన కమీషన్ తీసుకొని మిగతా సొమ్ము ఆ లేబర్‌కు పంచే ఛోటూభాయ్‌తో స్నేహం చేశాడు.

ఆదివారం రోజు ఇరువురూ కలసి మందు పొందు పడక జబర్థస్తుగా చేసుకొనేవాళ్లు. బలమైన ఆ స్నేహంతో.. ఓ రోజు రుద్రయ్య తన అవసరాన్ని దానికి తాము యివ్వబోయే మొత్తాన్ని ఛోటూభా‍య్‌కు చెప్పాడు.

ఛోటూ ఏ పని చేయడు. మనుషులను గుత్త కాంట్రాక్టుదారులకు అప్పగించి తలకు ఇంత అని కమీషన్ తీసుకొని బొలెరో కారును మెయింటెయిన్ చేసే గొప్ప మగాడు. రుద్రయ్య చెప్పిన పది ‘లకారాలు’ (లక్షలు) వాడి చెవులకు ఎంతో ఇంపుగా వినిపించాయి. యు.పి.,కి వెళ్లి ఆ తరహా మనుషులను కలుసుకొని మాట్లాడి.. విషయం చెప్పి.. అడ్వాన్సు రెండు లక్షలు ఇచ్చి.. పని ముగించిన మరుక్షణంలో మూడు లక్షలు ముట్టచెపుతామని బేరం కుదుర్చుకొని తిరిగి వచ్చాడు. విషయాన్ని రుద్రయ్యకు తెలియచేశాడు. తనకు ఈ డీల్లో ఐదు లక్షలు.. ఆనందంతో మిత్రులు ఆ సాయంత్రం హాయిగా ఎంజాయ్ చేశారు.

ఇపుడు రుద్రయ్య రాఘవయ్య కదలికలను గమనించే ప్రయత్నంలో వున్నాడు.

“రేయ్!.. రుద్రా!.. ఏమయింది?..”

“కాబోతూ వుంది దొరా!..” నవ్వాడు రుద్ర.

“ఎకిలి నవ్వులు నవ్వకు.. పని ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పు?” కరుగ్గా అడిగాడు భుజంగవర్మ….

రోజులు గడిచే కొద్ది అతనికి భయం.. జైలునుండి బయట పడ్డ రాఘవయ్య.. మునయ్యను చంపింది తనే అనే నిజాన్ని బయట పెట్టి తనను జైలుపాలు చేస్తాడనే భయం?.. రాఘవయ్యను చంపేస్తే తాను సేఫ్.. అనే నమ్మకం.. ఆ మంచివార్త కోసం ఎదురు చూస్తున్నాడు.

“రేయ్!.. రుద్రా.. నా ప్రశ్నకు నీ జవాబేదిరా?..” అవేశంగా అడిగాడు భుజంగవర్మ.

“మీ ఆవేశం.. నా కోపం.. పదిరోజుల్లో చల్లారిపోతాయి.. దొరా!.. వచ్చే మనుష్యులు ఈడోళ్లు కాదు. యు.పి. మనుసులు.. మీరేమీ భయపడొద్దు.. హ్యాపీగా వుండండి..” అంటూ అభయపూర్వకమైన కమ్మని మాటలు చెప్పి సెల్యూట్ కొట్టి వెళ్లిపోయాడు రుద్రయ్య.

భుజంగవర్మ టెన్షన్ కొంత తగ్గింది. కానీ గుండెల్లో ఒక మూల తాను చేసి రాఘవయ్య మీదకు నెట్టిన.. నేరం.. గుండుసూదిలా పొడుస్తునే వుంది.

భుజంగ వర్మ సెల్ మ్రోగింది.

“హలో!..”

“డాక్టర్ అన్నా!..”

“ఏం కావాలి?..” ఆవేశంగా అడిగాడు భుజంగవర్మ

“మీరే కావాలి!..”

“ఏంటీ!..”

“నేను మాట్లాడేది.. మన మాతృభాష తెలుగులోనే!.. అర్థం కావడం లేదా!..”

“నాతో నీకేం పని?..”

“పెద్దవారు.. అంతో ఇంతో.. చరిత్రవున్నవారు.. ఈ ప్రాంతంలో చాలామందికి తెలిసినవారు.. హైదరాబాద్.. వైజాగ్‍ల నుంచి ఢిల్లీకి గాల్లో సేతువును నిర్మించగల సమర్థులు.. మంచి అందమైన అమ్మాయి తండ్రిగారు.. మీ అమ్మాయి పావని.. నాతోనా ప్రక్క సీట్లో కూర్చుని బొంబాయి నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసింది. చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆమె క్షేమం కోసం.. ఆమెకు నీవు మంచి తండ్రివని భావించి మిమ్మల్ని గౌరవించాలనే భావనతో.. మీతో మాట్లాడాలనుకొంటున్నాను. నా ఇంటికి మీరు వస్తారా!.. మీ ఇంటికి నన్ను రమ్మంటారా!..”

“నేనే నీ వద్దకు వస్తాను..”

“ఎపుడు?..”

“నీవే చెప్పు..”

“ఈ సాయంత్రం ఆరున్నర గంటలకు..”

“హాస్పటల్లో కలవాలా?..”

“కాదు.. మా యింటివద్ద.. మీ డ్రైవరుకు తెలుసు..”

“అలాగే..”

“ఓకే.. సార్..” సెల్ కట్ చేశాడు.. అన్నా.

తాను నిర్మిస్తున్న హాస్పటల్ చూచి.. ఇంజనీర్సుతో మాట్లాడి తిరిగి వస్తూ..

కృష్ణయ్యగారి షాపు ముందు కారును ఆపి.. షాపును సమీపించాడు.

కృష్ణయ్య.. సవినయంగా.. “నమస్కారం సార్…” అన్నాడు.

సిగరెట్ పాకెట్ తీసుకొని.. ఒకదాన్ని బయటికి తీసి వెలిగించి..

“కృష్ణయ్య గారూ!.. రాఘవయ్యగారి అమ్మాయి ఎక్కడ వుంది?.. నేను ఆమెను కలవాలి” చిరునవ్వుతో అడిగాడు

కృష్ణయ్యగారు.. రాఘవయ్య బావమరిది చలపతి అడ్రస్ వ్రాసిన కాగితాన్ని అన్నాకు అందించాడు.

“థాంక్యూ.. కృష్ణయ్యగారూ!.. రాఘవయ్యగారు ప్రస్తుతం నా దగ్గరే వున్నారు. కూతుర్ని చూడాలనేది వారి కోరిక.. హాస్టల్‌కు వెళ్లి అమ్మాయిని నాతో తీసుకు వెళతాను.”

“చాలా మంచిపని సార్!.. నేను అడిగినట్టుగా రాఘవయ్యకు చెప్పండి సార్!..”

“అలాగే.. వస్తాను..”

అన్నా కారు.. చలపతి ఇంటిముందు ఆగింది. అన్నా కారు దిగి గేటు దాటి.. వరండాలో వున్న కాలింగ్ బెల్ నొక్కాడు. కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరచుకున్నాయి. దాదాపు పదహారు సంవత్సరాల అమ్మాయి తలుపు తెరచింది.

ఆమెను చూడగానే బాల్యపు ‘సిండరిల్లా’ జ్ఞప్తికి వచ్చింది అన్నాకు.

(ఇంకా ఉంది)

Exit mobile version