Site icon Sanchika

డాక్టర్ అన్నా బి.యస్.యస్.-8

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తలుపు తీసిన ఆ అమ్మాయిని పేరడిగి, తనకి కావల్సినది ఆ అమ్మాయే నని నిర్ధారించుకుంటాడు అన్నా. ఇంతలో చిన్నీ అత్తయ్య గోవిందమ్మ బయటికి వస్తుంది. తానెవరో చెప్పి, చిన్నీని తనతో తీసుకువెళ్తానంటాడు అన్నా. వీల్లేదంటుంది గోవిందమ్మ. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమెను బెదిరించి, చిన్నీని తీసుకుని ఇంటికి బయల్దేరుతాడు. దారిలో చిన్నీకి, రాఘవయ్యకి బట్టలు కొంటాడు. ఇంటిలోకి వస్తుండగా, రుద్రయ్య, మరొక రౌడీ రాఘవయ్యని బయటకు లాక్కుని వస్తూ కనిపిస్తారు. వాళ్ళని కొట్టి గదిలో పడేసి తాళం వేస్తాడు అన్నా. డి.ఎస్.పి. శివకి ఫోన్ చేస్తాడు. తండ్రి రాఘవయ్యను సంతోషంగా అల్లుకుపోతుంది చిన్ని. వాళ్ళిద్దరికీ వంటమనిషి సింధ్యాని, పనిమనిషి లక్ష్మిని పరిచయం చేస్తాడు అన్నా. మీ ఇల్లే అనుకుని ఉండండి అంటాడు. డి.ఎస్.పి. శివ వచ్చాకా, టీ ఇచ్చి, నేరస్థుల గురించి చెబుతాడు అన్నా. ఆయన పోలీసులని పిలిచి, వాళ్ళని జైలుకి పంపుతాడు. సాయంత్రం భుజంగవర్మ కోసం ఎదురుచూస్తాడు అన్నా. అన్నా తనని ఎందుకు రమ్మన్నాడోనని సంశయిస్తూ వస్తాడు భుజంగవర్మ. అతన్ని కూర్చోబెట్టి వాళ్ళ వంశానికి ఉన్న గొప్ప పేరుని ప్రస్తావించి సంభాషణ కొనసాగిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]భుజం[/dropcap]గవర్మ క్షణం సేపు అన్నా ముఖంలోకి చూచి తలను ప్రక్కకు తిప్పుకొని..

“నాకు నీవు ధర్మోపదేశం చేయాలనుకుంటున్నావా?..” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు. సింధ్యా గ్రీన్ టీ తీసుకొచ్చాడు.

భుజంగవర్మకు అందివ్వ బోయాడు.

“వద్దని చెప్పాను గదా!..”

అన్నా నవ్వుతూ “ఏం ఫరవాలేదు.. ఆరోగ్యానికి మంచిదని చెప్పానుగా.. తీసుకోండి..”

భుజంగవర్మ సింధ్యా అందించిన టీ కప్‌ను అందుకున్నాడు.

అన్నా టీ త్రాగుతూ..

“సార్.. తీపి సరిపోయిందా!..”

భుజంగవర్మ సరిపోయిందన్నట్టు తల ఆడించాడు.

మౌనంగా ఇరువురూ టీ త్రాగారు. కప్పులను సింధ్యా అందుకొని లోనికి వెళ్లిపోయాడు.

“నౌ పాయింట్ టు బి డిస్కస్డ్.. సార్.. నేరం చేసిన వాడెవడైనా శిక్షను అనుభవించాలి. మీ ఇరువురు అనుచరులూ తప్పు చేశారు.. జైలు పాలైనారు. మీ వయస్సు దాదాపు మా నాన్నగారి వయస్సే.. ఎందుకు సార్.. తప్పు మీద తప్పు చేయాలనుకొంటున్నారు.. మీరు చేసిన తప్పుకు మీ ఉప్పు పులుసు తిన్న నేరానికి రాఘవయ్యగారు ఏడు సంవత్సరాలు కుటుంబానికి దూరమై జైలు శిక్ష అనుభవించారు. తన మంచితనంతో ఆరు నెలల ముందుగా జైలు నుండి విడుదలైన అతన్ని చంపించడానికి మీరు మనుష్యులను ఏర్పాటు చేశారు. వారు చేయాలనుకొన్నది తప్పు.. నేరం.. కాబట్టి వారిని పోలీసులకు అప్పగించాను. ఇక పై మీరు.. రాఘవయ్య గారికి హాని కలిగించే ప్రయత్నం చేస్తే.. ఆ కథకు నాయకులు మీరేనని.. మిమ్మల్ని జైలుపాలు చేస్తాను.

ఇది బెదిరింపు కాదు.. మీ వయసు రీత్యా మీ మీద నాకున్న అభిమానం.. నేను చెప్పవలసింది చేప్పేశాను. ఇక మీరు వెళ్లవచ్చు.. మీ అమ్మాయి చాలా మంచిది. మంచి యువకుని చూచి పెండ్లి చేసి.. మనుమడు మనుమరాళ్లతో ఆడుకొంటూ.. కృష్ణా రామా అనుకొంటూ.. శేషజీవితాన్ని ఆనందంగా గడపండి సార్!..” చిరునవ్వుతో అనునయంగా చెప్పాడు అన్నా.

భుజంగవర్మ వేగంగా కుర్చీనుంచి లేచాడు. మెట్లు దిగాడు.. పది అడుగులు ముందుకు వేసి.. వెనక్కు తిరిగి అన్నా ముఖంలోకి తీక్షణంగా క్షణంసేపు చూచి వేగంగా వెళ్లి కార్లో కూర్చున్నాడు. డ్రైవర్ రాజు కారును స్టార్ట్ చేశాడు.

కదలిపోయిన కారును చూచి అన్నా.. ‘నా మాటలు వారికి రుచించలేదు. అసూయా ద్వేషాలతో వెళ్లిపోయారు. అమ్మ చెప్పినట్లుగా ‘మనుషులను.. వారి తత్వాలను శాసించ గలిగిన వాడు.. ఆ పైవాడు.. సర్వేశ్వరుడు ఒక్కడే’.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనుకొని సింహద్వారం దాటి హాల్లోకి ప్రవేశించబోయిన అన్నా వెనుతిరిగి వాకిట్లో ఆగిన కారును చూచాడు.

కారునుండి నారాయణమూర్తి.. ఇంద్రజ లోనికి వచ్చారు. ఎదురు వెళ్లి సాదరంగా ఆ పెద్ద దంపతులను అన్నా ఆహ్వానించాడు.

“రండి సార్!.. ప్లీజ్ కమ్!..”

ముగ్గురూ హాల్లోకి ప్రవేశించారు.

“కూర్చోండి.. సార్!..”

ఆ దంపతులు సోఫాలో ప్రక్కప్రక్కన కూర్చున్నారు.

నారాయణమూర్తి నవ్వుతూ.. “బాబూ.. మీ పేరు?..” సందేహంతో ఆగాడు..

“అన్నా..”

“రేపు మా పెద్దమ్మాయి.. పార్వతి పుట్టిన రోజు.. సాయంత్రం ఆరుగంటలకు మీరు మా యింటికి రావాలి.” జేబు లోంచి ఓ కాగితాన్ని తీసి అన్నాకు అందించి “అడ్రస్” అన్నారు నారాయణ మూర్తి.

“తప్పకుండా రావాలి బాబూ..” చెప్పింది ఇంద్రజ.

“ఇంకా నలుగరైదుగురు ముఖ్యమైన వాళ్లని పిలవాలి.. మేము బయలుదేరుతాం బాబూ!..” లేచి చెప్పాడు నారాయణ

ఇంద్రజ లేచి నిలబడింది.

“వచ్చేదానికి ప్రయత్నిస్తానండీ..”

“తప్పకుండా.. రావాలి!.. అన్నాడు నారాయణమూర్తి.

హాలు నుండి బయటకు నడిచారు దంపతులు.. వారిని అనుసరించాడు అన్నా.. వీధి వాకిట వరకు వారితో వచ్చి.. వారు వెళ్లగానే వెనుతిరిగాడు.. అన్నా..

తన తల్లిదండ్రులకు హితులైనవారు.. తనను కలసి తన వారిని గురించి గొప్పగా మాట్లాడిన మాటల కారణంగా.. అన్నా.. మనస్సు నిండా తన తల్లిండ్రుల జ్ఞాపకాలు.. అదే ఆలోచనతో వెళ్లి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకొని.. రాఘవయ్య గారి రూమ్‍కు వెళ్లి వారిని పరీక్షించి.. వేసుకొనవలసిన మాత్రలను గురించి చిన్నీకి చెప్పి.. వారిరువురికీ కావాల్సిన ఆహారాన్ని తెలుసుకొని ఏర్పాటు చేయాల్సిందిగా సింధ్యాతో చెప్పి.. తన గదికి వచ్చాడు అన్నా.

ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మూడు పెగ్గుల విస్కీని.. బాదమ్.. క్యాజూలను తింటూ తీసుకోవడం అన్నాకు అలవాటు.

వారు కూర్చొని వున్న సోఫాకు దగ్గరగా టీపాయ్‍ని జరిపి.. విస్కీ బాటిల్.. ఐస్ బాక్స్.. గ్లాస్.. బాదమ్.. క్యాజూ ప్లేట్లను క్రమంగా అమర్చాడు సింధ్యా..

కళ్లు మూసుకొని సోఫాలో వెనక్కు వాలియున్న అన్నాను చూచి..

“సాబ్!.. మిలావూ!..”

కళ్లు తెరవకుండానే.. అన్నా.. వద్దు అన్నట్టు తల ఆడించాడు.

అన్నా చర్యకు.. సింధ్యా ఆశ్చర్య పోయాడు.

“భయ్యా!.. హమ్ పీయింగే.. ఆప్ రాఘవయ్య, చిన్నీ, లక్ష్మీలకు ఆహారాన్ని ఇచ్చి.. మీరు తిని పడుకోండి.. వెళ్లండి..” మెల్లగా చెప్పాడు అన్నా..

అన్నా ఏ విషయాన్ని గురించో బాధ పడుతున్నాడని గ్రహించిన సింధ్యా మౌనంగా యోచనతో నిలబడి దీనంగా అన్నాను చూడటం.. అన్నా చూచి..

“భాయ్.. మిలాయీయే!..”

చిరునవ్వుతో సింధ్య గ్లాస్లో విస్కీని పోసి.. ఐస్ కేక్స్ కూల్ వాటర్ గ్లాస్‍లో వేసి.. గ్లాస్ అన్నాకు అందించాడు.

అన్నా చిరునవ్వుతో గ్లాస్ అందుకొని సిప్ చేసి టీపాయ్ పై వుంచి..

“భాయ్!.. హమ్ పీయేంగే.. ఆజ్ ఆప్ జాయీయే..” సాంత్వనంగా చెప్పాడు అన్నా.

సింధ్యా.. చిరునవ్వుతో సంతోషంగా వెళ్లిపోయాడు..

అన్నా గ్లాస్ లోని మిగతా భాగాన్ని తాగాడు. అతని మనస్సు గతం వైపుకు పరుగుతీసింది.

***

అన్నా.. కారు దిగి ఎంతో ఆనందంగా..

“అమ్మా..” అంటూ పోర్టికో నుంచి వరండాలోకి ప్రవేశించాడు.

“నాన్నా.. ఆగు ..” అమ్మ మాటలు..

రెండవ మెట్టుమీద ఉన్నవాడు అలాగే నిలబడి ఆతృతతో ముఖద్వారం వైపు చూచాడు.

చిరునవ్వుతో తల్లి మాధవి ముందు.. వెనుక తండ్రి ధర్మతేజ నవ్వుతూ నిలబడివున్నారు.

మాధవి చేతిలోని పళ్లెంలో ఎర్రనీళ్లు వున్నాయి. వేగంగా వచ్చి కదలకుండా నిలబడివున్న కొడుకు ముఖంలోకి ప్రీతిగా చూస్తూ.. దిష్టి తీసి పళ్లేన్ని ఇండియన్ సర్వెంట్ లక్ష్మికి ఇచ్చి.. కొడుకు కుడిచేతిని తన ఎడమ చేతిలోకి తీసుకొని.. దగ్గరకు లాక్కొని.. అతని శిరస్సును తన హృదయానికి హత్తుకొంది. ఆ తల్లి కళ్లనుండి ఆనందభాష్పాలు జలజలా రాలాయి. అవి అన్నా శిరస్సుపై అక్షింతలు అయినాయి. లాన్ ప్రక్కన ఓ మూల ఆ నీళ్లను పారబోసి లక్ష్మి లోనికి వెళుతూ అన్నా ముఖంలోకి చూచి..

“చిన్నయ్యగోరూ!.. కంగాస్సులు!..” నవ్వుతూ లోనికి వెళ్లిపోయింది లక్ష్మి..

ఆ తల్లీ తండ్రి తనయుడు లక్ష్మి మాటలకు నవ్వుకొంటూ ఇంట్లోకి ప్రవేశించారు.

అన్నా బ్యాగ్ తెరచి తన యం.యస్. సర్టిఫికెట్‍ను తన తల్లి తండ్రిని ప్రక్క ప్రక్కన నిలబడమని వారి చేతుల్లో వుంచి.. వంగి ఇరువురి పాదాలను తాకి.. కళ్లకు అద్దుకొని లేచి..

“అమ్మా!.. నాన్నా!.. మీ ఆదరం.. అభిమానం.. వలన నా కల ఫలించింది.” వినయంతో చేతులు జోడించాడు.

ప్రతి తండ్రి.. తల్లి.. తమ బిడ్డలు తమకన్నా ఉన్నత స్థాయికి చేరి సంఘంలో సగౌరవంగా.. ఆనందంగా జీవించాలనే కోరుకుంటారు. వారి శక్తి మేరకు పిల్లల విద్యా విధానంలో వారి కోర్కె ప్రకారమే చదివించి.. వారు విజయులైన నాడు ఆ తల్లి తండ్రులకు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి అక్షరాలు లేవు. ఆ క్షణంలో వారి భావోద్రేకాలు భాషకు అందని కమనీయమైన అనుభవాలు.

ప్రస్తుతంలో మాధవీ ధర్మ తేజల పరిస్థితి అదే.. అన్నాను పరవశంతో దగ్గరకు తీసుకొని వారి హృదయాలకు హత్తుకొన్నారు. అన్నా వారి చేతుల్లో పసిబిడ్డలా ఒదిగిపోయాడు.

అన్నా.. సౌత్ శాన్‍ఫ్రాన్సిస్కో సిటీ ఇన్ కాలిఫోర్నియా.. యూనివర్సిటీ నుండి ఫస్ట్ ర్యాంక్లో యం.యస్.డాక్టరేట్ సంపాదించాడు.

వారి నివాసం శాన్‍ఫ్రాన్సిస్కో. అక్కడి మెడికల్ కాలేజీలో అన్నాకు వుద్యోగం కూడా వచ్చింది.

తండ్రి ధర్మతేజ ఇంజనీరింగ్ కాలేజీ సీనియర్ ఫ్రొఫెసర్.. డిపార్టుమెంట్ (సివిల్) హెడ్ అండ్ డీన్ ఆఫ్ ది యూనివర్సిటీ..

చాలా కాలం హాస్టల్లో వుండి చదివి ఇంటికి నెలకు ఒకటి రెండు పర్యాయాలు వచ్చే అన్నా.. ఇపుడు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరి తమతోనే వుంటున్నందుకు ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.. అప్పటికి అన్నా వుద్యోగంలో చేరి నెల రోజులు.. వీక్ ఎండ్.

కాఫీ టిఫెన్ తీసుకొని ముగ్గురూ రిలాక్స్‌డ్‌గా హాల్లో టీవీని చూస్తున్నారు. మధ్యన అన్నా ఇరువైపులా మాధవీ.. ధర్మతేజ కూర్చొని ఇండియన్ న్యూస్ వింటున్నారు.

ధర్మతేజ.. సెల్ మ్రోగింది. చేతిలోకి తీసుకొన్నాడు..

అన్నా.. టీవీ వాల్యూమ్ తగ్గించాడు.

“హలో!..”

“రేయ్.. ధర్మా!.. నేను భార్గవ..”

“ఓ.. రేయ్.. భార్గవా ఎలా వున్నావ్.. కుటుంబ సభ్యులందరూ క్షేమమే కదా!..’

“అంతా క్షేమం.. ముఖ్యమైన విషయం..”

“ఏమిటో చెప్పు!..”

“నా పెద్దకూతురు లాస్య.. యం.యస్. చేసేదానికి వచ్చి.. వాళ్ల చిన్నాన్న.. అదే నా తమ్ముడు సుధీర్ దగ్గర వుంటూ వుంది. నీ కొడుకు అన్నా ప్రశంసలను దినపత్రికల్లో చూచిందట. మరో గంటలో మీ ఇంటికి వస్తోంది. నీ కొడుక్కు ఆమెకు చేయగల సహాయాన్ని చేయమని చెప్పు. ఓ ఐదారు నెలల్లో నేను అమెరికా వస్తాను. అపుడు కలుద్దాం..” అన్నాడు ధర్మతేజ మిత్రుడు భార్గవ.

“అలాగే.. తప్పకుండా చేస్తాము..”

“ఓకే.. బై..” ఎదుటి వ్యక్తి భార్గవ సెల్ కట్ చేశాడు.

అన్నా.. మాధవీలు ఆశ్చర్యంతో చూచారు.. ధర్మతేజ ముఖంలోకి..

“ఎవరండీ?..” అడిగింది మాధవి.

“భార్గవ..”

అతను తనకు చెప్పిన విషయాన్ని భార్యా కుమారులకు వినిపించాడు ధర్మతేజ.

“ఇంతకీ.. ఆ అమ్మాయి ఎపుడు వస్తుందట?..” అడిగింది మాధవి.

“ఈరోజే.. ఎనీ టైమ్!..”

“ఆ అమ్మాయి పేరు ఏమిటి?..”

“లాస్య”

“వయస్సు ఏమాత్రం?..”

ధర్మతేజ భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు కొన్ని క్షణాలు..

“ఏమిటి అలా చూస్తున్నారు.. జవాబు చెప్పండి!..”

“తినబోతూ రుచి అడగడం ఎందుకు!.. వస్తూందిగా.. చూచి నీవే నిర్ణయించు..” నవ్వాడు ధర్మతేజ.

“అవునూ!.. ఆ అమ్మాయి చిన్నాన్న అమెరికాలో ఎక్కడ వున్నాడు?..”

“మిల్మ్”

“అమ్మా!.. ఎందుకమ్మా ఇపుడు నీకు ఆ వివరాలన్నీ? ..” చిరాగ్గా చూస్తూ అడిగాడు అన్నా.

“రేయ్!.. నాన్నా! .. త్వరలో నీకు వివాహం జరగాలి. ఒకటిన్నర సంవత్సరం లోపల.. నా చేతుల్లో మనుమడో.. మనుమరాలో వుండాలి.. అందుకే ఈ ఎంక్వైరీ అంతా!..” కళ్లు ఎగరవేస్తూ నవ్వింది మాధవి.

కాలింగ్ బెల్ మ్రోగింది.

హౌస్ మెయిడ్ లక్ష్మి పరుగున వెళ్లి తలుపు తెరచింది.

బాప్ కటింగ్ జుట్టు.. జీన్స్ ప్యాంటు.. బ్లూ టీషర్ట్.. పెదవులకు లిప్‍స్టిక్.. కోరచూపులతో ఓ మోడరన్ సుందరి.. ఠీవిగా నిలబడివుంది. ఆమె ఎవరో కాదు.. లాస్య..

ఆమెను చూడగానే.. లక్ష్మి..

“అమ్మగారూ!..” బిగ్గరగా పిలిచింది.

“ఏంటే..” అంటూ మాధవి ద్వారాన్ని సమీపించింది.

“లాస్యా!..” నవ్వుతూ పలకరించింది మాధవి.

“యస్..” క్లుప్తంగా పలికింది లాస్య ..

ఎగాదిగా ఓ క్షణం చూచి మాధవి “ప్లీజ్ కమ్!..” అంటూ ఆహ్వానించింది.

యథార్థం.. మాధవి ఊహల్లో ఉన్న యువతికి.. ఇపుడు తాను చూచిన అమ్మాయికి ఎంతో వ్యత్యాసం..

లాస్య.. చిరునవ్వుతో హాల్లో ప్రవేశించింది.

ధర్మతేజ.. లాస్యను చూచి సాదరంగా..

“రామ్మా రా!.. కూర్చో.. మీ నాన్న ఓ అరగంట క్రితం ఫోన్ చేసి మాట్లాడాడు. నీ రాకను గురించి నాతో చెప్పాడు..”

అభిమానంతో చెప్పాడు.

లాస్య కూర్చుంది. అన్నా ముఖంలోకి క్షణంసేపు చూచి తలను త్రిప్పుకొంది.

గమనించిన మాధవి ..

“వీడు నా కొడుకు.. అన్నా!..”

లాస్య నవ్వుతూ అన్నా ముఖంలోకి చూస్తూ..

“గుడ్ మార్నింగ్ సార్!..”

అన్నా ఆమె ముఖంలోకి చూచి..

“గుడ్ మార్నింగ్..” అన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version