Site icon Sanchika

డా. గ్రేస్ నిర్మల – ఒక జ్ఞాపకం

[dropcap]ఆ[/dropcap] సంఘటన తలచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

అలా జరిగి ఉండకుంటే బాగుండు అని ఎన్ని సార్లనుకున్నానో లెక్కలేదు. కానీ మన చేతిలో ఏమి లేదు కద.

సిక్త్స్ సెన్సో , సెవెన్త్స్ సెన్సో అని అనను కానీ అసలా రోజు ఉదయం లేవంగానే అనిపించింది ‘ఈ రోజు సజావుగా సాగబోవడం లేదు’ అని.

అసలేం జరిగిందో చెప్తాను. ఇది తెలుసుకోవాలి అంటే మనం కడపకు వెళ్ళాలి. ఇది 1992 సంవత్సరం ప్రథమార్థంలో జరిగిన ఒక సంఘటన. ఇందులో పెద్ద నాటకీయ పరిణామాలు, కొసమెరుపులు, సస్పెన్స్ ఏమి ఉండవు. ఇందులో విధి ఆడే వింతనాటకం ఉంటుంది.

***

“ఐ ట్రీట్ – హీ క్యూర్స్”

పై కొటేషన్ మొదటిసారిగా కడపలో డాక్టర్ గ్రేస్ నిర్మలగారి హాస్పిటల్లో చూశాను. ఏసుక్రీస్తుది ఒక పెద్ద తైల వర్ణ చిత్రం, ఆ పటంలో పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్. ‘నేను వైద్యురాలిగా చికిత్స చేసినా, తగ్గించేది, బాగు చేసేది ఆయనే. నేను నిమిత్తమాత్రురాలిని సుమా!’ అన్న భావం ఈ కోటేషన్ ఇస్తుంది.

ఇంత వేదాంతంతో నిండిన కొటేషన్ పెట్టుకుని కూర్చుంది కద, ఆవిడ ప్రశాంతంగా, జాలి దయ ఉట్టిపడే చూపులు చూస్తూ ఆదరంగా మాట్లాడుతూ ఉంటుంది అని మీరు అనుకుంటే పొరపాటే.

ఆవిడకి ముక్కుమీదనే కోపం ఉండేది. తెగ చిరాకుపడిపోయేది అందరిమీద. అమె ప్రతి అడుగులోనూ, పలుకులోను విపరీతమైన డిసిప్లిన్ కనిపించేది. ఆవిడది అహంకారమో కోపమో కాదు, ఆత్మవిశ్వాసం అని ఆవిడని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఆవిడ తనచుట్టూ ఒక గిరి గీసుకుని ఉంటారు, అది దాటి ఆమెతో చనువుగా ఉండే ప్రయత్నం ఎవ్వరూ చేయకుండా, ఇలా ఆమె చిర్రుబుర్రులాడుతుంటారని దగ్గరవారికి మాత్రమే తెలుస్తుంది.

నిజానికి ఆవిడ చాలా దయగల మనిషి. చాలా మంచి ఆవిడ. ఆవిడ జీవితంలో విధి ఆడిన వింతనాటకాన్ని, ఆమె ప్రవర్తనలో వచ్చిన విపరీత మార్పులని చెపుతాను ఈ జ్ఞాపకంలో.

నేను ఆవిడ కోపానికి ప్రత్యక్షంగా గురయ్యాను, ఆవిడ దయని కూడా కళ్ళారా చూశాను. ఇవన్నీ చెబుతాను ఈ జ్ఞాపకంలో.

***

ఇప్పట్లా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నవి లేని కాలాలవి. అప్పుడు యువతకి ముందున్న ఉద్యోగ అవకాశాలు ఏదైన ప్రభుత్వ ఉద్యోగాలు, లేదా బ్యాంక్ ఉద్యోగాలు మాత్రమే. ఒకట్రెండు బ్యాంకు ఉద్యోగాలు ఇంటర్వ్యూ వరకు వచ్చి నాకు దక్కకుండా పోయాక, నాకు ఎంతో ఇష్టమైన వృత్తి మెడికల్ రెప్రజెంటేటివ్‌గా ఇప్కా లేబొరెటొరీస్‍లో కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు అవి. కాకపోతే నెమ్మదస్తుడిని అని అప్పటికే పేరు తెచ్చుకున్న నేను ఈ ఉద్యోగంలో ఎలా రాణిస్తానో అని పెద్దలు కాస్తా కంగారు పడ్డ మాట వాస్తవం.

అప్పుడే బొంబాయిలో (అప్పుడు అలాగే అనేవారు ముంబాయిని) ఇరవై ఒక్క రోజుల ట్రెయినింగ్ పూర్తి చేసుకుని, జీవితంలో కొత్త ఉత్సాహంతో ఉన్న రోజులు. రైల్లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం, స్టార్ హోటల్లో బస, దాదాపు అయిదేళ్ళలో డాక్టర్లు నేర్చుకున్నంత జ్ఞానం మాకు ఇరవై ఒక్క రోజుల్లో వచ్చేసింది అన్న ఒక భ్రమతో కూడిన భరోసా, ఇలా చాలా ఉత్సాహంగా ఉండేది మనసు. నేను ఆ వృత్తిని ఇంచుమించు కలలు కని చేరాను.

మెడికల్ రిప్రజెంటేటివ్‍గా రిలాక్స్‌డ్‌ మూడ్‌లో రచయిత 1992 లో

నాకు మొదటినుంచి మెడికల్ రెప్రజెంటేటివ్స్‌ని చూస్తే చాలా క్రేజ్‌గా ఉండేది. వాళ్ళ వృత్తి ఏమిటో, ఆ వృత్తిలో ఉన్న సాధకబాధకాలు ఏమిటో కూడా నాకు తెలియవు. ఇంచుమించు నా పదిహేనవ ఏట నుంచే నాలో ఈ క్రేజ్ మొదలయింది ఈ వృత్తి పట్ల. దిగితే కానీ లోతు తెలియదు కద. విపరీతమైన ప్రయాణాలు, టార్గెట్‌కి సంబంధించిన ఒత్తిళ్ళు, కంప్యూటర్ కూడా లేని రోజులేమో, విపరీతమైన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కూడా ఉండేది. డైలీ రిపోర్టులు, వీక్లీ రిపొర్టులు, మంత్లీ రిపోర్టులు గట్రా.

చూపరులకు ఏదో టై కట్టుకుని జామ్ అని మోటార్ సైకిల్ మీద తిరిగినట్టే కనిపిస్తాం కానీ, చాలా ఛాలెంజెస్ ఉండేవి ఈ వృత్తిలో.

క్లాస్ – మాస్ ఈ రెండింటి మేలి కలియిక ఈ వృత్తి అని చేరిన కొద్ది రోజులకే అర్థం అయింది. మాటకారితనం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ భాషపై విపరీతమైన పట్టు, చాణక్యుడిలా ఎత్తుకు పై ఎత్తులు వేసే నైపుణ్యం ఇవన్నీ ఉన్న వారు ఈ వృత్తిలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఇవి అన్నీ మెదడుకు, తెలివి తేటలకు సంబంధించినవి.

ఇక ఎండనకా, వాననకా బరువైన లెదర్ బ్యాగు, భుజానికి మరో బ్యాగు తగిలించుకుని, ఒక్కో రోజు ఒక్కో ఊర్లో ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ ఏసీలోనూ ప్రయాణించాలి, మరుసటి రోజే ఎర్రబస్సు ఎక్కాలి, వీలయినప్పుడల్లా కాలి నడకకి సిద్దపడాలి.

ఇలా విపరీతమైన శారీరిక శ్రమ కూడా ఉండేది. నాకు నా పదిహేనవ ఏట నుంచే సైనసైటిస్, మైగ్రైన్ తలనొప్పి కూడా ఉండేవి. ఈ శారీరిక శ్రమ, మానసిక ఒత్తిళ్ళ కారణంగా ఒక్కోసారి విపరీతమయిన తలనొప్పితో బాధపడేవాడిని. కానీ ఏది అయినా మొదలెడితే అంతుచూసేదాకా వదిలిపెట్టకూడదనే ఒక మొండి ప్రవృత్తి నాలో ఉండేది.

మార్కెటింగ్‌ని ఇంచుమించు యుధ్ద రంగంతో పోలుస్తారు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వేసుకుంటూ వెళ్ళాలి. విజయం లభించింది ఈ క్షణంలో అని ఆనందపడేలోపు మరో దగ్గర మన పోటీదారుడు మనపై దెబ్బతీస్తాడు. పోటీదారులను మట్టి కరిపిస్తూ పూట పూట ఒక ఛాలెంజి లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలి.

ఫ్రొఫెషనల్‌గా రచయిత 1992 లో

ఇవన్నీ ఒకెత్తు ఐతే, తరచుగా కంపెనీ వారు ప్రవేశపెట్టే కొత్త మోలిక్యూల్స్. వీటిని అధ్యయనం చేసి, వాటి తాలుకు గుణగణాలని డాక్టర్లకు సాధికారికంగా తెలియజేయడం ఒకెత్తు. రోజు రోజుకు పుట్టుకొచ్చే బాక్టీరియాలను ఎదుర్కోవటాన్కి కావచ్చు, సాంకేతిక అభివృద్ధిలో భాగంగా కావచ్చు కంపెనీ వారు తరచు కొత్త కొత్త ప్రాడక్ట్స్ ఇలా ప్రవేశపెట్టేవారు. ఈ రంగంలో పండిపోయిన సీనియర్ మెడికల్ రెప్రజెంటేటివ్స్‌కి ఇంచుమించు ఒక డాక్టర్‌కి ఉన్నంత జ్ఞానం ఉంటుంది అనటంలో సందేహం లేదు.

ఇవేవి చేరేనాటికి నాకు తెలియవు. చక్కగా డ్రస్ చేసుకుని, నీట్‌గా పాలిష్ చేసిన షూస్, మెడలో టై ధరించి చేతిలో మెరిసి పోయే లెదర్ బాగ్ పట్టుకుని, ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే మెడికల్ రెప్రెజెంటేటివ్స్‌ని చాలా ఆరాధనగా చూసేవాడిని.

మా దూరపు బంధువుల కుర్రాడు ఒకరు ఒక పెద్ద అమెరికన్ ఫార్మా కంపెనీ ఫుల్ ఫోర్డ్ అనే కంపెనీ లో, అదే విధంగా మా అన్నయ్య ఫ్రెండ్ తమ్ముడు ఒకతను ‘సీబా గీగీ’ అనే మరో పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో మెడికల్ రెప్స్‌గా చేరటం వల్లనుకుంటాను నాకు ఈ మెడికల్ రెప్రెజెంటేటివ్ వృత్తి మీద ఒక విధమైన క్రేజ్ ఏర్పడింది.

వృత్తిలో చేరిన కొత్తల్లో “అయ్యబాబోయి, ఆడుతూ పాడుతూ ఉంటుందనుకుంటే, ఇది ఇంతకష్టంగా ఉందే” అని నేను కాస్తా కంగారు పడ్డ మాట వాస్తవం. ఏది ఏమయినా నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను ఈ వృత్తిలో. దేవుని దయ వల్ల నేను పనిచేసిన ఇప్కా లేబొరెటరీస్ మాకు పరిపూర్ణజ్ఞానం అందించటంలో చాలా శ్రద్ధ చూపేది. గిఫ్ట్స్, ఇతర మార్గాల ద్వారా సేల్స్ పెంచుకోవాలి అనే పద్దతి కాదు ఇప్కా వారిది.

జ్ఞానం పెంపొందించుకోవటం, కష్టపడి పని చేయటం, నీతి నియమాలకి కట్టుబడి ఉండటం, కలలో సైతం అబద్దాలు ఆడకపోవడం ఇలా ఎన్నో సుగుణాలని మాకు అందించారు ట్రెయినింగ్‌లో.

అదే విధంగా చాలా నాణ్యమైన ప్రాడక్ట్స్ మాత్రమే తయారు చేయాలన్నది ఆ సంస్థ పద్దతి.

ఎలాగోలా, ఏదోకటి అమ్మి మనం సొమ్ము చేసుకుందాం అన్న ధోరణి ఎంతమాత్రం ఉండేది కాదు ఈ కంపెనీలో. ఏది మంచిదో అదే చేద్దాం అనే ధోరణి ఉండేది. ఈ రకమైన విధానాల వల్ల మా కంపెనీకి కాస్తా చాదస్తం కంపెనీ అని పేరుండేది. కానీ అందరూ చాలా గౌరవించేవారు మా కంపెనీని.

నేను ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే, హైదరాబాద్ నుండి మా రీజినల్ మేనేజర్ గారు మురళీ అనే ఆయన జాయింట్ ఫీల్డ్ వర్క్‌కి వచ్చారు.

నేను బొంబాయి నుంచి వచ్చిన తరువాత ఒక నెల రోజులు ఫీల్డ్ వర్క్ చేశాను. మా సీనియర్ కొలీగ్ శశీ అనే కుర్రాడు, ఆయన తర్వాత శీ జగన్ మోహన్ గారు అనే ఫ్రంట్ లైన్ మేనేజర్ నాకు బేసిక్ ఫీల్డ్ ట్రెయినింగ్ ఇచ్చి తిరుపతికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక నెల రోజులు నేనే స్వంతంగా ఫీల్డ్ వర్క్ చేశాను. నిజానికి అదే రియాలిటీ ఆఫ్ ది లైప్. ఫీల్డ్‌కి సంబంధించి మనం ఒంటరివారమే. మన కంపెనీ కొలీగ్స్ ఒక జిల్లాలో ఒకరే ఉండేవారు.

హైదరాబాద్ బర్కత్‌పురాలో మా రీజనల్ ఆఫీస్ ఉండేది. ఈ మురళీగారు రీజనల్ మేనేజర్. నాతో రెగ్యులర్‌గా లెటర్స్‌తో టచ్‌లో ఉండే వారు. నేను వర్క్ స్టార్ట్ చేసింది లగాయతు, ఆయన నాపై చాలా మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. అదొక అదృష్టం.

సరే ఇక ఆయన కడపకి రానే వచ్చారు. రీజినల్ మేనేజర్ గారి పర్యటన అంటే అదో గొప్ప సందర్భం అని చెప్పవచ్చు. ఆయన నుంచి ఒక మూడు రోజులపాటు జ్ఞానాన్ని పొందవచ్చు, ఆయనతో బాటే స్టార్ హోటల్లో చక్కటి భోజనం లభించేది.

సాయంత్రం ఫీల్డ్ వర్క్‌కి మురళీ గారితో బయలుదేరాను. ఆ రోజుల్లో నా వద్ద పాత టీవీఎస్ 50 మోపెడ్ ఉండేది. దానిపై ఆయన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరాను.

ఆయన చాలా చక్కగా ఉండేవాడు మనిషి. ఆయన కర్ణాటక ప్రాంతాలకు చెందిన మధ్వ బ్రాహ్మిణ్ అనుకుంటా. సన్నగా ఉండే వారు. గిల్లితే కందిపోతారేమో అన్నట్టు తెల్లటి తెలుపు, బట్టతల, సౌమ్యంగా మాట్లాడేవారు. తెలుగు ధారాళంగా మాట్లాడలేకపోయేవారు. కన్నడం ఆయన మాతృభాష. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, చాలా తియ్యగా ఉంటుంది. ఎంత తియ్యగా అంటే, చెరకుముక్కలాంటి ప్రతి పలుకుని తేనెలో ముంచి, ఆపై దానికి చక్కెర అద్ది ఆపై పలికినట్టు ఉండేది.

కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాటని నేను ప్రాక్టికల్‌గా అతి దగ్గరనుండి చూసిన సందర్భాలు అవి.

ఆయన కడపకి వచ్చి బస చేయంగానే, ఆయనని వెళ్ళి కలిశాను.

నన్ను చూడంగానే నా క్షేమ సమచారాలని, మా అమ్మా నాన్నల యోగక్షేమాలని అడిగి కనుక్కున్నారు. నా అభిరుచులు, ఇష్టాయిష్టాలు, లైఫ్‌లో నా గోల్ ఏమిటి గట్రాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఫ్రెషర్‌తో భయం పోగొడుతూ ఎలా మాట్లాడాలి, అతన్ని ఎలా మోటివేట్ చేయాలి అనే విషయంలో ఆయన దగ్గర నేర్చుకున్న ఈ టెక్నిక్స్ చాలా సందర్భాలలో వాడాను నా లైఫ్ లో.

ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ద్వారా ఆయన నాదృష్టిలో ఎంతో ఎత్తుకు వెళ్ళి కూర్చున్నారు.

మేము స్నాక్స్, టీలు అయ్యాక ఫీల్డ్ వర్క్ కి బయలు దేరాము.

మేము హరిఓం అని డాక్టర్ గ్రేస్ నిర్మల గారి ఆసుపత్రి కి వెళ్ళాం మొదట. నేను ఆవిడని అప్పటికే ఒక సారి విడిగా కలిసి ఉన్నాను.

ఆవిడ క్లినిక్ కడప స్టేషన్ రోడ్‌లో ఉండేది ఆ రోజుల్లో. ఏడు రోడ్ల కూడలి నుంచి వెళ్ళవచ్చు కానీ ఒన్ వే ట్రాఫిక్ నిభందనల్ని అనుసరించి మనం, క్రిష్టియన్ లేన్ గుండా వెళ్ళి, రైల్వేస్టేషన్ వైపు నుంచి వచ్చే రోడ్డులో కలిసి ఆవిడ అసుపత్రికి వెళ్ళాలి.

వెళ్ళాము. చేరుకున్నాము.

పెద్దగా రద్దీగాలేదు ఆ రోజు. ఒక అయిదారుగురు పేషంట్లు మాత్రమే ఉన్నారు.

కాస్తా బక్కపలచగా చామనఛాయలో ఉన్న ఒక నర్సు మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి, మురళీగారి విజిటింగ్ కార్డ్ తీస్కుని డాక్టర్ గారి కేబిన్ లోకి వెళ్ళింది.

ఒక అయిదు నిమిషాల తర్వాత ఆ నర్స్ కారణంగా ఒక పెద్ద ఉత్పాతం జరగబోతోంది మాకు ఏ మాత్రం తెలియదు.

అది ఒక సీదా సాదా ఆసుపత్రి. పెద్ద అట్టహాసం ఏమీ ఉండేది కాదు.

మురళీ గారు నాపక్కనే కూర్చుని వృత్తికి సంబంధించిన కీలక మెళకువలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబందించి టిప్స్ చెబుతూ ఉన్నారు. చెప్పాను కద, మార్కెటింగ్ రంగంలో చిత్రాతి చిత్రమయిన వృత్తి మెడికల్ రెప్రెజెంటేటివ్ వృత్తి అని.

సాధారణంగా ఏ ఇతర వస్తు ఉత్పత్తులూ మార్కెటింగ్ రంగాల్ని చూసినా, మార్కెటింగ్ వ్యూహాలు, ప్రకటనలు, ఆ ప్రాడక్ట్‌ని ఉపయోగించే వ్యక్తిని ప్రభావితం చేసేలాగా ఉంటాయి. పత్రికా ప్రకటనలు, టీవి యాడ్స్ వంటివాటి ద్వారా.

కానీ ఈ ఫార్మా రంగంలో ప్రాడక్ట్‌ని ఉపయోగించే వ్యక్తికి (అంటే పేషంట్‌కి) మన ప్రాడక్ట్ తాలూకు ఓనమాలూ కూడా తెలిసే అవకాశం లేదు. అతనికి అత్యంత నాణ్యమైన ప్రాడక్ట్‌ని సిఫార్స్ చేసే వ్యక్తి డాక్టర్. ఆ డాక్టర్ కేవలం ఒక మధ్యవర్తి మాత్రమే.

కొనే వానికి ప్రాడక్ట్ గూర్చి తెలియదు, ప్రాడక్ట్ గూర్చి తెలుసుకునే వ్యక్తి ప్రాడక్ట్‌ని కొనడు.

ఈ వస్తువులు అమ్మే వ్యక్తి (స్టాకిస్ట్)కి డాక్టర్‌తో సంబంధం ఉండదు. మందులు కొనుగోలు, అమ్మకం, స్టాకు పెట్టడం ఇదంతా చూసుకునే వ్యక్తులు వేరేవారు.

వారికి డాక్టర్‌తో గానీ, పేషంట్‌తో గానీ సంబంధం ఉండదు. ఇంత మందిని అనుసంధానించే మెడికల్ రెప్రెజెంటేటివ్‌కి నగదు లావాదేవీలతో ఏ దశలోనూ సంబంధం ఉండదు.

డాక్టర్ ఎలాగయితే మధ్యవర్తి పాత్రని పోషిస్తున్నాడో, మెడికల్ రెప్ కూడా ఒక విధంగా మధ్యవర్తే.

ఈ యావత్తు వ్యవహారాన్ని చట్టబద్దమైన పదాలలో చెప్పాలి అంటే ‘ఎథికల్ మార్కెటింగ్’ అంటారు.

అలా కాకుండా డైరెక్ట్‌గా పేషంట్‍నే ఫలాన మందు కొనమని టీవిల్లో ప్రేరేపించే మందుల్ని ‘ఓటీసీ – ఓవర్ ది కౌంటర్’ ప్రమోషన్ అంటారు. అంటే కొన్ని నొప్పి మందులు, దగ్గు మందులు, ఇలాంటివి ఈ కేటగిరి లోకి వస్తాయి. అఫ్ కోర్స్, డాక్టర్స్ ఇలాంటి మందులు తమ ప్రిస్కిప్షన్ మీద వ్రాయరు.

డాక్టర్స్ లేటెస్ట్ మందుల గూర్చి, ఫార్ములేషన్స్ గుర్చి, రీసెర్చిల గూర్చి ఎథికల్ ప్రమోషన్ చేస్తున్న మాలాంటి ఫార్మాస్యూటికల్ సిబ్బంది మీద ఆధారపడతారు. అదే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా వీరికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండటంలో దోహదపడుతుంది. ఈ ప్రాసెస్‌ని కంటిన్యుయస్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) అని పిలవడం కద్దు.

మురళీ గారు చెబుతున్నారు “నేను నీకు బాస్‌ని అని నీవు గౌరవిస్తావు. కానీ క్లయింట్ మనకి బాస్. లోపలికి వెళ్ళాక ఆవిడ నన్ను గౌరవించవచ్చు లేదా గౌరవించకపోవచ్చు. అది ఆవిడ ఉన్న మూడ్‌ని బట్టి ఉంటుంది. ఆవిడ నన్ను గౌరవించలేదని నీవు కంగారు పడకూడదు. అదే విధంగా లోపలికెళ్ళాక ఒక్కటే కుర్చీ ఉందనుకో, నువ్వు కూర్చో. నన్ను కూర్చోమని సీన్ క్రియేట్ చేయకు. అక్కడ మన ప్రాడక్ట్స్ గూర్చి చెప్పి మాట్లాడవలసింది నీవు. అందుకే నీ కంఫర్ట్ ముఖ్యం. ఇక్కడ గౌరవాలు, అగౌరవాలు కాదు, క్లయింట్ (అంటే డాక్టర్) మనకు ఇచ్చే అతి తక్కువ సమయంలో వారి సమయం యొక్క విలువని గౌరవిస్తూ మన కంపెనీ ప్రాడక్ట్స్ గూర్చి చెప్పాలి. మనకి డాక్టర్‌తో సత్సంబంధాలు ముఖ్యం. నీవు వారి దృష్టిలో ఎంత సిన్సియర్ అని పేరు తెచ్చుకుంటావో అంత చక్కగా మన ఉత్పత్తుల మీద వారికి అవగాహన ఏర్పడుతుంది. వారు దానికి అనుగుణంగా మన ఉత్పత్తులని సిఫార్స్ చేస్తారు. డాక్టర్ గారికి సేల్స్‌తో నిమిత్తం లేదు, సేల్స్ పెంచమని వారిని అడిగి వారి దృష్టిలో పలచపడకూడదు. సేల్స్ అన్నవి సెకండరీ. నీవు ఈ టెరిటరీలో ఎక్కువ కాలం విజేతగా ఉండాలి అంటే, క్లయింట్ దగ్గర మన్నన, గుర్తింపు, గౌరవం పొందాలి. బ్రాండ్ రీకాల్ వాల్యూ ముఖ్యం. సేల్స్ గూర్చి అస్సలు మాట్లాడకు. నీ సిన్సియర్ వర్క్ ఆధారంగా సేల్స్ అవంతట అవే వస్తాయి”

సేల్స్ ఫీల్డ్‌లో ఉంటూ సేల్స్ ముఖ్యం కాదు అంటున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోయాను మొదట. కానీ ఆయన చెప్పిన విషయాలు చాలా లోతైనవి. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీలలో ఎంబీఏ చేసినా ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ మనకు లభించవు.

నా జీవితకాలంలో ఇలాంటి గొప్ప మేనేజర్లు ఎందరో చక్కటి ప్రభావం చూపారు. ఈ జ్ఞాపకం ద్వారా వారందర్నీ మరొక్క సారి గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇంతటి గొప్ప వర్క్ కల్చర్ నేర్పిన కంపెనీలలో పని చేయటం నా అదృష్టం. అదే విధంగా, సేల్స్ తప్ప వేరే మాట మాట్లాడని గుజరాత్ కంపెనీలలో కూడా పని చేశాను. డాక్టర్లని ఏదో లాగా ప్రభావితం చేసి, మన సేల్స్ పెంచుకోవటం తప్పేమి కాదు అనే భావన కలిగిన అనేక కంపెనీలు ఉన్నాయి, దేశీయంగానూ, మల్టీ నేషనల్ కంపెనీలలోనూ. ఆ జ్ఞాపకాలు మరోసారి చెబుతాను.

మానవత్వం, ఎథిక్స్, వేల్యూస్ ఇలాంటి మంచి గుణాలు కలిగి ఉన్న కంపెనీ ఇప్కా లేబ్స్. ఇంచుమించు మా మేనేజర్లు అందరూ అలాగే ఉండేవారు. ఒత్తిళ్ళు లేని కంపెనీలో చేరిపోయావు అని అందరూ నన్ను అసూయగా చూసేవారు ఆ రోజుల్లో.

***

ఈ లోగా డాక్టర్ ఛాంబర్‌కి ఉన్న గ్రీన్ కర్టెన్ తొలగించుకుని ఉత్తి తల మాత్రమే బయటకి పెట్టి ఇందాకటి నర్సు, కళ్ళతోటే సైగలు చేస్తూ ,మా వంక చూస్తూ ‘పసలపూడి వంశీ’ సినిమా పాటల్లో, హీరోయిన్ లాగా కళ్ళ భాష మాట్లాడి తిరిగి లోనికి వెళ్ళీపోయింది.

చెప్పాను కద అది ఒక చిన్న ఆసుపత్రి అని, అప్పటికింకా ఆమె పెద్ద ఆసుపత్రి నిర్మించుకోలేదు. ఆ తరువాత ఓ రెండుమూడేళ్ళకి ఆమె కడప కొత్త బస్టాండ్ రోడ్లో, ఎస్పీ బంగ్లా పక్కన సందులో ఒక విశాలమైన ఆధునికమైన నర్సింగ్ హోం నిర్మించుకున్నారు.

ఈ చిన్ని ఆసుపత్రిలో ఆవిడకి ప్రత్యేకంగా కన్సల్టేషన్ రూం అని నిర్మాణం ఏదీ లేదు. ముదురు ఆకుపచ్చ తెరలు చుట్టూ ఏర్పాటు చేయటం ద్వారా లోపలి విషయాలు బయటకి కనపడకుండా ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ, ఇక్కడ ఆమెకి విపరీతమైన పేషంట్లు వచ్చేవారు.

జీవితం చాలా చిత్రమయినదండి.

ఆమె జీవితంలో చాలా పోరాడారు. చాలా కష్ట పడ్డారు. ‘90 వ దశకం ప్రారంభంలో కడప పట్టణంలో గైనకాలజీలో ఎండీ చేసిన ఏకైక వైద్యురాలు ఆమె. అదే జిల్లాలో ఈమె కాక ప్రొద్దటూరు పట్టణంలోఉన్న శ్రీమతి ఎం.వరలక్ష్మీ గారు గైనకాలజీలో ఎండీ చేసిన వారు.

ఈమె రాయవేలూరు సీఎంసీ కాలేజీలో గైనకాలజీలో ఎండీ చేసి, కడప పట్టణానికి వచ్చాక, వెంటనే ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించకుండా దాదాపు ఒక సంవత్సరం పాటు, పులివెందుల రాజారెడ్డి హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేశారు. ఇందుకుగాను ప్రతిరోజూ ఉదయం ఆరుకల్లా బస్సెక్కి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందులకి రోజు అప్ అండ్ డవున్ చేసే వారు. ఇంకా రోడ్లూ, బస్సులు సరిగ్గా ఇప్పట్లా ఆధునికంగా లేని ఆ రోజుల్లో ఆ ప్రయాణం ఒక నరకప్రాయమే. ఆ కష్టాలన్నీ సహించి ఆవిడ అక్కడ పని చెసేవారు ఒక సంవత్సరం పాటు.

ఈవిడ భర్త శ్రీ ఇమ్మాన్యుయేల్ మదనపల్లిలో ఎం.ఎల్.ఎల్ హాస్పిటల్‌లో చీఫ్ సర్జన్‌గా పని చేసే వారు.

మనం టైం లైన్లో ఒకటి రెండు సంవత్సరాలు ముందుకెళితే, ఆవిడ ఎస్పీ బంగ్లా దగ్గరకొత్త నర్సింగ్ హోం కట్టించారని చెప్పాను కద. కానీ అదేమి చిత్రమో, ఆ కొత్త నర్సింగ్ హోంకి వెళ్ళాక ఆమెకి ప్రాక్టీస్ దాదాపు సగానికి పైగా పడిపోయింది అంటారు. అంతే కాదు, ఆమె జీవితంలో ఒక గొప్ప విషాదం జరిగింది. అదేమిటంటే, ఒక ఊబిలో చిక్కుకుని ఆమె కళ్ళ ముందరే ఆమె భర్త, చేతికి అందిరావాల్సిన వయసులో ఉన్న నూనూగు మీసాల నూత్న యవ్వనుడైన ఒకే ఒక కొడుకు ఇద్దరూ మరణించారు. ఆమె నిస్సహాయురాలిగా చూస్తూ ఉండిపోయింది. ఆ వివరాలు మనం కొద్ది సేపట్లో తెలుసుకుందాము.

***

అది మురళీ గారి సమక్షంలో నాకు మొదటి డాక్టర్ విజిట్. అంటే ఆయన నా వర్క్‌ని ప్రత్యక్షంగా చూడబోతున్నాడు.

గోడ మీద ఉన్న ఏసుప్రభువు మా ఇద్దరి వంక జాలిగా చూస్తున్నట్టు నాకు తోచింది ఎందుకో, అది కూడా క్షణంలో వెయ్యవ వంతు మాత్రమే.

నెలక్రితమే బొంబాయిలో ట్రెయినింగ్ పీరియడ్‌లో చాలా మంచి పేరుతెచ్చుకున్నాను, ఇంటర్నల్ రిపోర్ట్స్ ద్వారా ఆయనకు ఆ విషయం తెలుసు. గత నెలగా నా ఫీల్డ్ వర్కు తాలుకూ డైలీ రిపోర్ట్స్ ద్వారా కూడా ఆయన నన్ను గమనిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆయనకు నా మీద మంచి అభిప్రాయమే ఉంది. కంగారు పడవలసింది ఏమీ లేదు అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని అడుగు ముందుకు వేసాను.

ఇంక కొద్ది క్షణాలలో ప్రళయం రాబోతోంది అని మాకు చూచాయగా కూడా తెలియదు.

నర్స్ పిలవటం వల్ల ఆకుపచ్చని తెర తొలగించుకుని లొపలికి వెళ్ళాము.

అక్కడ డాక్టర్ గ్రేస్ నిర్మల గారు తన టేబుల్ ముందు కూర్చుని ఉంటారనుకుని వెళ్ళిన మాకు కాస్త వేరే దృశ్యం కనిపించింది. అదే గదిలో ఒక మూలగా ఎత్తైన ఒక టేబుల్ పై ఒక గర్భిణి పడుకుని ఉంది, ఆ పేషంట్ పల్స్ రేట్ ని పరీక్షిస్తూ, మా వైపు వీపు చేసి నిలబడి ఉన్నారు డాక్టర్ నిర్మల గారు.

డాక్టర్ గారు పరీక్షిస్తూ ఉండటం వల్ల ఆ గర్బిణి తాలూకు వస్త్రాలు, పడుకున్న భంగిమ చూపరులకు కాస్తా ఇబ్బంది కలిగించే ఉన్నాయి. క్షణంలో వెయ్యవ వంతులో మేము జాగురూకులం అయ్యి బయటికి కదిలే లోగా, మా అలికిడి విన్న ఆవిడ, వచ్చింది ఆ గర్బిణి తాలూకు తల్లి అనుకుని,

“రండమ్మ, మీ అమ్మాయికి గర్భంలో నీరు కాస్తా తగ్గింది…” అని ఏదో అంటూ ఇటు వైపు తిరిగారు.

ఊహించని విధంగా మమ్మల్ని అక్కడ చూసి వెయ్యి టన్నుల బాంబు పక్కనే పడ్డట్టు ఆమె ఉలిక్కిపడ్డారు. తక్షణమే ఆమె చేసిన మొదటి పని, ఆ పేషంట్‌ని అడ్డగిస్తూ నిలబడి, తన వెనుకే ఉన్న మరో తెరని మెరుపువేగంతో మూసేశారు.

కనులు మాట్లాడతాయి అంటే ఏమో అనుకుంటాము కానీ ఆ క్షణంలో నేను ఆమె కనుల్లో భావాలు చదవగలిగాను. ఆమె మమ్మల్ని సంస్కార విహీనుల్ని చూసినట్టు చూసింది. మనం ఒక నీచమైన జంతువుని కూడా అంత అసహ్యంగా చూడము.

ఆమెకి వచ్చిన కోపానికి ఆమె ఎలాంటి మాటలయినా వాడి ఉండవచ్చు. కానీ ముక్కు పుటాలు అదిరేలా ఊపిరిపీల్చటం ద్వారా, అరుణిమ దాల్చిన కనులతో మమ్మల్ని చూడ్డం ద్వారా ఆమె కోపాన్ని వ్యక్త పరుస్తూ,

“వై ది హెల్ ఆర్ యూ హియర్?” అని మాత్రమే ఇంగ్లీష్‌లో అడిగారు. ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నాము.

నా నోటి నుంచి వచ్చిన మొదటి మాట “సారీ” ఆ తర్వాత కొనసాగించాను “ఆ నర్స్ మమ్మల్ని లోనికి రమ్మని పిలవటం వల్ల వచ్చాము, వచ్చిన క్షణంలోనే అర్థం అయింది, ఏదో పొరపాటు జరిగిపోయిందని” అని నీళ్ళు నమిలాను.

ఆవిడ కోపంగా నర్సు వంక చూస్తున్నారు.

అప్పుడు మా రీజినల్ మేనేజర్ మురళీ గారు కలగజేసుకుని “క్షమించండి మేడం. తప్పంతా నాది. ఆ అమ్మాయి మమ్మల్ని పిలుస్తోందా లేదా మా పక్కనే కూర్చుని వెయిట్ చేస్తున్న పేషంట్ గారి తల్లిగారినా అని నిర్ధారణ చేసుకోకుండా దూసుకు రావటం ముమ్మాటికి నాది తప్పు. ఇందులో ఈ అమ్మాయి (నర్స్)ది గానీ, మా కొలీగ్ (నేను) ది గానీ ఎటువంటి తప్పు లేదు. ఎక్కడికయినా లోపలికి వెళ్ళే ముందు తలుపుతీసి ఉంచినా సరే ‘మే ఐ కమిని ప్లీజ్’ అని అడిగాకే లోనికి రావాలి అనే కనీస విఙ్జత నేను పాటించి ఉండాల్సింది. గొప్పపొరపాటు జరిగిపోయింది. ఈ కుర్రాడు (నేను) కొత్తగా ఈ టెరిటరీలో చేరాడు. చాలా ప్రామిసింగ్‌గా ఉంది ఇతని పర్ఫార్మెన్స్, ఈ నర్స్‌ని చూడంగానే తెలుస్తొంది కొత్తగా చేరింది, ఆమెకి ఉత్సాహమే తప్ప అనుభవం లేదని. వీరిద్దరిని క్షమించండి. మీ కోపం మొత్తం నామీద చూపించండి. అందుకు పూర్తిగా నేను అర్హుడిని” మృదువైన కంఠంతో స్వచ్ఛమైన ఇంగ్లీష్‌లో చెప్పేసి, ఆయన రెండు చేతులు జోడించి నిలబడి పోయాడు మౌనంగా.

వర్ఛస్సు ఉట్టి పడుతున్న విగ్రహం, సంస్కారం ఉట్టిపడేలాంటి ఆయన మాటలు, ఆయన హావభావాలు ఆ క్షణంలో తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి. అంతటి ఆగ్రహం ప్రదర్శించిన ఆవిడ ‘ఇట్స్ ఓకే’ అని మౌనంగా గొణిగి, తన కుర్చీలో కూర్చుండి పోయింది.

’మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి మేడం, ఫర్ ది ఆబ్వియస్ రీజన్స్ అవర్ ఆక్షన్ ఈస్ అన్-డవుటెడ్లీ రాంగ్, బట్ అవర్ ఇంటేన్షన్స్ వర్ నాట్ రాంగ్’ అని చెప్పేసి మురళీ గారు మౌనంగా బయటికి వచ్చేశారు. ఆయన వెనుకే నేనున్నూ.

లోపల ఇంత తుఫాను చెలరేగింది అన్న విషయం తెలియని బయటి వారందరూ మామూలుగానే ఉన్నారు. ఇంకా కొత్త పేషంట్లు చాలా మంది పోగయ్యారు బయట ఈలోగా.

మేము బయటకు రాంగానే చాలా మంది పేషంట్లు “వాళ్ళ టైం అంతా మేం వృథా చేస్తున్నాం” అన్నట్టు చూపులతో విసుక్కోవడం కద్దే. అదేమి తెలియనట్టు మేము బయటికి వచ్చాము

“ఇట్స్ జస్ట్ ఏ మిస్టేక్. డోంట్ ఫీల్ ఇంబరాస్డ్. హౌ ఎవర్ వాట్ లెసన్ డిడ్ యూ లెర్న్?” అని నా వంక చూస్తూ అడిగాడు ఆయన.

నేను ఒక్కొక్కపదాన్నే కూడబలుక్కుంటున్న వాడిలా “మే….ఐ….కమిన్….ప్లీజ్?” అని నాటకీయంగా అన్నాను.

ఆయన గంభీరంగా తలపంకించి “ఈ విషయానికి ప్రచారం కల్పించకు. వదిలేయ్” అన్నాడు. దాదాపు ముప్పై సంవత్సరాలు నాలోనే ఉండిపోయింది ఈ జ్ఞాపకం, ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను.

కాకపోతే ఆవేళ్టి నుంచి ఈ “మే ఐ కమిన్ ప్లీజ్” అన్న అలవాటు మానలేదు నేను. నన్ను చాలామంది, చాలా సందర్భాలలో చాదస్తుడి కిందకూడా జమకట్టారు, ఎందుకు ఇంత ఫార్మాలిటీస్ అని. కానీ నేను మానలేదు ఈ అలవాటు.

ఒక లీడర్ ఎలా ఉండాలి అన్న విషయం ఈ సంఘటన ద్వారా మురళీ గారు నాకు ప్రాక్టికల్‌గా బోధించారు.

ఇలాంటి సంఘటనే ఏపీజే కలాంగారు చెప్పుకొస్తారు ఒక సారి ఇస్రోలో తన సీనియర్ గూర్చి. విజయం లభిస్తే దాన్ని జూనియర్స్‌కి ఆపాదించటం, ఏదయినా అపజయం లభిస్తే జూనియర్స్ మనోస్థయిర్యం దెబ్బతినకుండా దాన్ని తన భుజాలమీదకి తీస్కోవటం ఒక నిజమైన లీడర్ లక్షణం అని చెప్పుకొస్తారు ఏపీజే కలాం గారు.

ఆ తరువాత కూడా శ్రీ మురళిగారితో నాకు ఎన్నో మంచి అనుభవాలు ఉన్నాయి. ఆయన ఊహించినట్టే నా పర్ఫార్మెన్స్ ప్రామిసింగ్ గానే ఉండింది కెరియర్‌లో.

1995లో రచయిత వివాహంలో మురళీ గారు

ఆ తరువాత ఆయన నా పెళ్ళికి కూడా వచ్చారు. (కింద జతచేయబడ్డ నా పెళ్ళి ఫోటోలో ఎడమ నుంచి మూడవ వ్యక్తి, బట్టతల ఉన్నవారు శ్రీ మురళి గారు).

***

టైం లైన్ లో ఓ రెండు మూడేళ్ళు ముందుకెళదాము.

పుష్పగిరి మఠం సమీపంలో పెన్నా నది ఒడ్డున ఈ సంఘటన జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. కానీ మిత్రులు ఈ ఘటనని కళ్ళకి కట్టినట్టు వివరించారు. మీకు కూడా చక్కగా అర్థం అవటానికి ఒక సాక్షిలాగా దృశ్య రూపంలోనే వివరిస్తాను.

పెన్నానది తీరం. కడప జిల్లా చెన్నూరు దగ్గర పుష్పగిరి పీఠం సమీపంలో ఒక కుటుంబం చక్కగా విహార యాత్రకి వచ్చారు. ఉదయమే అయినా వాతావరణం వెచ్చగా ఉంది.

జరగబోయే ఘోర పరిణామాల్ని చెప్పాలనుకుంటుందేమో అన్నట్టు గాలి రివ్వు రివ్వున వీస్తోంది.

చాలా ఆనందంగా ఉన్నారు వారు. సాయంత్రం దాకా సరదాగా గడపటానికి అన్ని విధాల సిద్దపడి వచ్చారు. పిక్నిక్ టెంట్, టిఫిన్, భోజనం కారియర్స్, ఫిషింగ్ రాడ్స్, సైక్లింగ్ కోసం సైకిళ్ళు, స్టీరియో కాసెట్ ప్లేయర్ ఇలా అన్ని తెచ్చుకున్నారు.

వారు ఎవరో కాదు మన గ్రేస్ నిర్మల డాక్టర్ గారు, ఆవిడ చెల్లి. నిర్మలగారి భర్త, వారి పదహారేళ్ళ కుమారుడు. వారికి సాయం అందించటానికి ఒక నౌకరు, డ్రయివరు కూడా వచ్చారు.

గోదావరి నదిలో నీళ్ళు ప్రవహించడం గోదావరి జిల్లాలవారికి విశేషం కాకపోవచ్చు, అదే విధంగా కావేరి నదిలో నీరు ప్రవహించడం కర్ణాటక ప్రాంతాల వారికి పెద్ద వింతగా అనిపించకపోవచ్చు.

కానీ పెన్నా నదిలో నీరు ప్రవహించడం కడప జిల్లా వాసులకు ఖచ్చితంగా వింతే. ఎప్పుడో అరుదుగా నీళ్ళు ప్రవహిస్తాయి ఆ నదిలో. అలాంటి సందర్భం అది.

అందుకే ఆ కుటుంబం సరదాగా నదీ తీరానికి వచ్చారు. టేప్ రికార్డర్‌లో ఏదో పాప్ సాంగ్ మోగుతోంది.

నది ఒడ్డున ఆపిన కారు పక్కగా కాంపింగ్ టెంట్ ఏర్పాటు చేశారు. అందులో ఓ చాప పరిచి కారియర్ లలో తెచ్చుకున్న టిపిన్ సర్ది పిల్లవాడిని, భర్తని పిలవమని డ్రైవర్‌ని పురమాయించింది గ్రేస్ నిర్మల గారు. ఆవిడకి సాయంగా ఆవిడచెల్లెలు కూడా ఓ చేయి వేస్తున్నారు.

అప్పుడే ఫిషింగ్ ముగించుకుని విజయగర్వంతో ఓ బాస్కెట్ నిండుగా చేపలుపట్టుకొచ్చారు ఆవిడ భర్త డా.ఇమ్మాన్యుయేల్ గారు.

సంవత్సరంలో ఎప్పుడో వారు కలిసేది. వైద్య సేవలు అందిస్తూ ఆయన మదనపల్లిలో, ఈవిడ కడపలో ఉంటుంటారు. వారు ఇలా ఆనందంగా గడిపే సందర్భాలు చాలా అరుదు.

’ఒక్క నిమిషం డియర్, కాస్తా స్విమ్మింగ్ చేసి టిఫిన్‌కి వస్తా. మనబ్బాయి ఇప్పుడే స్విమ్మింగ్‌కి వెళ్ళాడు నన్ను రమ్మని కేకేస్తున్నాడు” అని ఆయన ఈత కొట్టటానికి వెళ్ళారు.

అంతే అదే చివరి చూపవుతుందని ఎవ్వరికీ తెలియదు.

కాసేపట్లో “ఓ మైగాడ్, ఓ మైగాడ్ ఇట్స్ ఎ క్విక్ సాండ్. సేవ్ అస్” అంటూ ఆర్తనాదాలు వినిపించాయి.

వాళ్ళ అబ్బాయి ఈత కొడుతూ కాస్తా ముందుకు వెళ్ళి ఊబిలో చిక్కుకుపోయాడు. అతనే ఆర్తనాదాలు చేస్తున్నాడు ‘డాడి సేవ్ మీ’ అంటూ. డ్రయివర్‌కి, నౌకర్‌కీ ఈత రాకపోవటం వల్ల నిస్సహాయంగా నిలబడిపోయారు.

ఇటుగా ఈత కొడుతున్న డాక్టర్ ఇమ్మాన్యుయేల్ గారు ముందు వెనుక ఆలోచించకుండా పుత్రుడి దిశగా సాగిపోయారు నదిలో.

టెంట్ నుంచి పరిగెత్తి వచ్చారు డాక్టర్ నిర్మల గారు, ఆవిడ చెల్లెలు.

వారి కళ్ళ ముందే డాక్టర్ ఇమ్మాన్యుయేల్ మరియు పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయి నిర్మల గారిని ఒంటరిని చేస్తూ పరలోకానికి వెళ్ళిపోయారు.

***

ఈ సంఘటన దాదాపు 1995 ప్రాంతాలలో జరిగింది.

ఈ సంఘటన తర్వాత గ్రేస్ నిర్మల గారి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది. అధిక భాగం మౌనంలోనే గడిపేవారు. వీలయినంతసేపు పేషంట్ల సేవలో గడపటం ప్రారంభించారు ఆవిడ.

కొత్తగా నిర్మించిన నర్సింగ్ హోం స్థాయిని బట్టి, అక్కడ ఆవిడ ఏర్పాటు చేసుకున్న ఆధునిక ఉపకరణాలని బట్టి, ఎక్కువ చార్జి చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ నామమాత్ర రుసుము మాత్రమే వసూలు చేయటం మొదలెట్టారు. కొందరు పేదలకు పూర్తి ఉచితంగా కూడా సేవలు అందించే వారు.

ఆ తరువాత నేను నా వృత్తిలో భాగంగా ఎన్నో సార్లు కలిసాను. ఆవిడ చాలా ఆదరంగా ప్రవర్తించేవారు నా పట్ల.

ఆ తరువాత ఆమె 26 అక్టోబర్ 2017 లో మరణించారు.

కొన్ని జీవితాల్ని భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తాడో మనకు ఎన్నటికీ అర్థం కాదు.

-సమాప్తం-

Exit mobile version