Site icon Sanchika

డా. సమరం – ఒక జ్ఞాపకం

[box type=’note’ fontsize=’16’] డా. సమరం గారితో తనకున్న జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. రాయపెద్ది వివేకానంద్ ఈ వ్యాసంలో. [/box]

[dropcap]నే[/dropcap]ను డా. సమరం గారిని తరచు కలవాల్సి వచ్చేది ఆ రోజుల్లో. మరి తప్పదు కద. నా అవసరం అలాంటిది. అందుకే తరచుగా కలిసేవాడినన్నమాట.

కంగారు పడకండి. మీరు ఏదో ఆలోచించి త్వరపడిపోయి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి నాగురించి ఏదేదో అనుకోకండి.

ఇది 2001 – 2003 సంవత్సరాలకి సంబంధించిన జ్ఞాపకం.

అప్పట్లో నేను విజయవాడ కేంద్ర స్థానంగా ఏరియా సేల్స్ మేనేజర్‍గా పని చేసేవాడిని, జైడస్ క్యాడిలా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో.

అదివరకు, కోయంబత్తూ‍ర్‍లో నాట్కో ఫార్మాలో పని చేసేవాడిని. విజయవాడకి వచ్చిన కొత్తలవి.

విజయవాడ సిటీలో శ్రీనివాస్ అనే కుర్రాడు, రాజీవ్ అనే కుర్రాడు మెడికల్ రెప్రజెంటేటివ్స్‌గా నా టీమ్‌లో ఉండేవారు.

శ్రీనివాస్ అనే కుర్రాడి నాన్నగారు రైల్వే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా పెద్ద హోదాలో ఉండేవారు. రాజీవ్ అనే కుర్రాడు విశాఖపట్నం గీతం కాంపస్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. మా కంపెనీ వారు నిర్వహించిన కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఎన్నిక అయ్యాడు.

నేను ప్రతి రోజు ఏదో ఒక టెరిటరీలో జాయింట్ ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళి వాళ్ళ పనిని పర్యవేక్షించాలి. ఆ రోజు నా వర్క్ రాజీవ్‌తో.

ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ మొదలెట్టే ముందు “ఈ రోజు మన వర్క్ ప్లాన్ ఏమిటోయ్?” అని అడిగి పని మొదలు పెట్టడం మేనేజర్‌గా నా విధి.

అవేళ్టి డాక్టర్స్ పేర్లు చెప్పి, ఆ పేర్లతో బాటుగా, “ఇవ్వాళ డా. సమరం గారిని కలుస్తున్నాం సర్” అని రాజీవ్ అనేసరికి, అనుమానంగా చూశాను అతని వంక, వెటకారంగా ఏమన్నా అంటున్నాడేమో అని. నిజానికి రాజీవ్ పరిధిలోకే వస్తుంది బెంజ్ సర్కిల్‍లో ఉన్న డాక్టర్ జి. సమరం గారి ఈ వాసవ్య క్లినిక్. వెటకారమేమీ లేదు, పాపం ఆ కుర్రాడు సీరియస్ గానే తన వర్క్ ప్లాన్ చెప్పి, తన వర్క్ డైరీలో జాయింట్ వర్క్ కాలమ్‌లో నాతో సంతకం చేయించుకుని పని మొదలెట్టే ఉద్దేశంలో ఉన్నాడు.

ఫోటోలు ఉన్నవారు – ఎడమ నుంచి కుడికి – రాజీవ్, రచయిత, భీమవరం రిప్రజెంటేటివ్, ఆనంద్ సూరి, శ్రీనివాస్.

ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ఒక పెద్ద ఛాలెంజ్. దీన్ని యుద్దరంగంతో పోలుస్తారు. ప్రణాళిక అనే చిన్న పదం సరిపోదు, ఇక్కడ ‘మోడస్ ఆపరేండీ’ అనే యుద్దతంత్రానికి సంబంధించిన ఇంగ్లీష్ పదం సరిపోతుంది. ఎందుకంటే మా ప్రణాళికలని అంత పకడ్బందీగా రూపుదిద్దుకుంటాం.

ఈ రంగంలో ప్రధానంగా ఉండే  ఛాలెంజ్ ఏమిటి అంటే, కాంపిటీషన్. ఎక్కడైనా కాంపిటీషన్ సహజమే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడి కథే వేరు.

మీకు అర్థం అయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు తెలిసిన టూత్ పేస్టు బ్రాండ్ల పేర్లు చెప్పండీ అంటే మహ అంటే ఓ అయిదో లేదా పదో చెప్తారు మీరు. అలాగే ఏ బ్రాండ్ విషయం తీసుకున్నా ఇలాగే పరిమిత బ్రాండ్స్ మధ్యనే ఉంటుంది పోటీ. కానీ ఆ రోజుల్లోనే ఫార్మా రంగంలో దాదాపు మన భారతదేశంలో పద్దెనిమిది వేల కంపెనీలు ప్రత్యక్ష్యంగా పోటీ పడేవి. ఇంచుమించు అందరి వద్దా ఒకే రకమైన బ్రాండ్స్(మోలిక్యూల్స్)  ఉండేవి.

ఎందుకు ఇన్ని కంపెనీలు అంటే, ఒక్కటే సమాధానం, ఇక్కడ లాభాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఒకమాత్ర తయారి విషయం తీసుకుంటే, దాని తయారీకి ఖర్చు పైసల్లో ఉంటే, లాభం వందలు, వేలల్లో ఉంటుంది. మరి ఇక పోటీ ఉండదా?

అందువల్ల విపరీతమైన పోటీ అన్న మాట. ఇది మొదటి చాలెంజ్.

ఇక రెండో ఛాలెంజ్‌కి వస్తాను.

ఏ  టూత్ పేస్టు  మీరు కొనాలి అనేది మీరు నిర్ణయించుకుంటారు. టీవీలోనో, పేపర్లోనో ప్రకటన ఇస్తే సరిపోతుంది మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు.

కానీ ఇక్కడ మందులు కొనుక్కునే పేషంట్స్‌ని ప్రకటనల ద్వారా ఆకట్టుకునే అవకాశం లేదు. “ఫలానా మందులు నువ్వు కొనుక్కుని వాడు” అని రోగికి నమ్మకంగా చెప్పి ధైర్యం ఇచ్చేవాడు డాక్టర్.

మందు వాడటం వల్ల రోగికి ఉపశమనం. మంచి మందుని రోగికి సలహా ఇవ్వటం ద్వారా వైద్యునికి మంచి పేరు రావటం ఇక్కడ జరుగుతుంది.

‘అయ్యా మా కంపెనీ మందుల్ని కాస్త వ్రాసి పెట్టండి, మా కంపెనీ మందులు నాణ్యామైనవి’ అని చెప్పి ఆ డాక్టర్‌ని కన్విన్స్ చేయటం మెడికల్ రెప్రజెంటేటివ్స్ యొక్క ప్రధాన వృత్తి ధర్మం. ఇవి కాక ఒక టెరిటరీకి సంబంధించిన మొత్తం అడ్మిన్ వ్యవహారం తదితర బాధ్యతలు కూడా ఆ మెడికల్ రెప్రెజెంటేటివ్ పైనే ఉంటాయి.

పోని ఆ డాక్టర్ కన్విన్స్ అయ్యాడు, వ్రాస్తాడు ఒక పని అయిపోతుంది అంటే ప్రతీ సారి అలా కుదరదు. అక్కడ మెడికల్ షాప్‌లో ఆయా బ్రాండ్స్ లేకపోతే మొత్తం మార్కెటింగ్ వ్యూహం దెబ్బతిన్నట్టే. ఆ మందుల షాప్ అతను అదే తరహా మందుల్ని ఇతర నాణ్యమైన బ్రాండ్స్‌ని తను చొరవ తీసుకుని రోగికి ఇస్తాడు.

డబ్బు పెట్టి కొనేవాడు నిర్ణయం తీసుకోలేడు.

నిర్ణయం తీసుకుని కొనమని చెప్పేవాడు డబ్బులుపెట్టి కొనడు.

వీళ్ళిద్దరి మధ్యలో స్టాకిస్టులు, మెడికల్ షాపుల వాళ్ళు ఉంటారు. నాణ్యమైన ప్రత్యామ్నాయ బ్రాండ్స్ ఆ డాక్టర్ గారిని ఒప్పించి మెడికల్ షాప్ వాడు పేషంట్లకి అంటగడితే, మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

ఇది రెండో ఛాలెంజ్.

కాంపిటీషన్ ఒక ఛాలెంజి అనుకుంటే, డబ్బులు పెట్టి కొనే బయ్యర్ మనకు నేరుగా కష్టమర్ కాకపోవడం అనేది రెండో ఛాలెంజ్.

ఈ యావత్తు వ్యవహారాన్ని సాంకేతిక భాషలో ఎథికల్ మార్కెటింగ్ అంటారు. అలా కాకుండా టీవి ప్రకటనలు చూసి పేషంట్ డైరెక్ట్‌గా కొనుక్కోగలిగిన మందులని ‘ఓటీసి ప్రాడక్ట్స్’ అంటారు. విక్స్, సారిడాన్, లాంటివి అన్న మాట.

మొదట్లో ఎథికల్ మార్కెటింగ్ కాటగరీలో ఉన్న కొన్ని మందులు వాటి ఫార్ములాలో చిన్న చిన్న మార్పులు చేయబడి, ఓటీసీ ప్రాడక్ట్స్‌గా దర్శనం ఇస్తుంటాయి మార్కెట్‌లో.

గ్లాక్సో వారి క్రోసిన్ ఒక ఉదాహరణ. మొదట్లో అది డూఫార్ అనే కంపెనీ వారి ఎథికల్ ప్రమోషన్ లిస్ట్‌లో ఉండేది.

ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ పేరుకే ఎథికల్ మార్కెటింగ్. నేతిబీరకాయలో నెయ్యి వంటిది ఇది. ఇంకా లోతుగా నేను వివరాల జోలికి వెళ్ళదలచుకోలేదు. తిమ్మిని బమ్మిని చేసి తమ తమ ఉత్పత్తులను అమాయక పేషంట్లకు అనవసరంగా అంటగట్టే కంపెనీలకు కొదవ లేదు. ఇది ప్రధానంగా అమెరికన్ కంపెనీల ‘మోడస్ ఆపరేండి’. కొన్ని దేశీయ కంపెనీలు కూడా ఈ వ్యూహాల్ని అమలు చేస్తుంటాయి. నేను ఎక్కువ కాలం పని చేసిన ఇప్కా లాబొరేటరీస్ అనే కంపెనీకి అత్యంత నీతివంతమైన కంపెనీ అనే పేరు ఉండేది. మేము మార్కెట్‌లో చాలా మన్నన పొందేవాళ్ళం. మాది చాదస్తం కంపెనీ అని కూడా పేరు కూడా ఉండేది. అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు.

ఈ ఇప్కా లాబొరెటరీలో అధిక భాగం షేర్లు సినీనటుడు అమితాబ్ బచ్చన్ గారికి ఉండేవి. వీరి సోదరుడు అజితాబ్ బచ్చన్ మా కంపెనీ చైర్మన్‌గా ఉండేవారు.

సరే ఇప్పుడు మన కథలో నేను విజయవాడలో పని చేస్తున్న కంపెనీ అది కాదు. ఇది ఒక గుజరాత్ కంపెనీ. వీరి మార్కెటింగ్ వ్యూహాలు చాలా దూకుడుగా ఉండేవి.

వేసుకున్న ప్రణాళీక ప్రకారం, ఒక్కొక్క డాక్టర్‍ని విజిట్ చేస్తూ, ఆ తర్వాత  వారి ఛాంబర్ నుంచి బయటకి వచ్చాక  రాజీవ్‌తో మా తదుపరి కార్యాచరణ పథకాన్ని చర్చిస్తూ, చివరికి వాసవ్య క్లినిక్ పరిసర ప్రాంతాలకి రానే వచ్చాము.

నిజం చెప్పొద్దూ, విధి నిర్వాహణలో భాగంగా నేను  దేశంలో ఎందరో ప్రముఖ డాక్టర్లని కలిసినప్పటికి, డాక్టర్ సమరం గారిని కలవబోయే ముందు కాస్తా ఉద్విగ్నతకి గురయ్యాను.

ఆయనకి మన తెలుగు నేలపై ఉన్న ప్రత్యేక గుర్తింపు మీకు తెలిసిందే కద.

ఈనాడు దినపత్రిక మొదలెట్టిన మూడవరోజునుంచే గౌరవ రామోజీరావు గారి ప్రోత్సాహంతో, అన్ని అంశాలలాగా ఇది కూడా ఒక సైన్సే కద అని చెప్పి పత్రికాముఖంగా అన్ని అంశాలను చర్చించిన డాక్టర్ గారు కద వీరు.

ఆ తరువాత మన వేమూరి బలరాం గారు కూడా చొరవతీసుకుని సపరివారపత్రికలో సకుటుంబంగా చదివేదానికి ఒక వినూత్న ప్రశ్నోత్తర శీర్షికని కూడా మన డాక్టర్ గారితో ప్రవేశపెట్టారు కద.

అదే విధంగా మన టీవీ చానెళ్ళవారు కూడా వీరితో అర్ధరాత్రులు ప్రసారమయ్యేలాగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు అప్పటికే.

1990 ప్రాంతాలలో కడపలో సాగర్ అని ఒక మిత్రుడు ఉండేవాడు నాకు. ఈ సాగర్ క్రైస్తవ మతావలంబకుడు. అతను కాస్త చాదస్తుడు అంటే మంచి క్రైస్తవుడు అన్నమాట, సినిమాలు చూడడు, నవలలు, గట్రా బుక్స్ చదవడు. ఇప్పుడు ఒక ప్రభుత్వ బాంకులో మేనేజర్ గా ఉన్నాడు.

అప్పట్లో ఒక సారి ఏదో మాటల మధ్యలో దిగజారిపోతున్న విద్యాప్రమాణాలు, విద్యారంగంలో పడిపోతున్న విలువలు గూర్చి తీవ్రంగా వేదన వ్యక్తం చేశాడు సాగర్.

“ఆనంద్! ఇప్పుడు ఇంటర్మీడియేట్ వారికి (లేదా డిగ్రీ వారికో) సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశ పెట్టేశారు” అని ఆందోళనగా వచ్చి చెప్పాడు నాతో.

అతను ఎందుకు అంతలా బాధ పడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఇంతకూ విషయం ఏమిటి అంటే విద్యార్థులకు ఆ రోజుల్లో దాశరథి గారి పుస్తకం ‘తిమిరంతో సమరం’ నాన్ డీటయిల్డ్ గా పెట్టారట.

దానిలో అంత అభ్యంతరకరమైనది ఏమి ఉందో నాకు అర్థం కాలేదు. అదే అడిగాను.

“అబ్బ ఎంత అమాయకుడివి ఆనంద్! ఈ పుస్తకం పేరులో రెండో భాగం చదువు” అని ‘సమరం’ అన్న పదాన్ని చూపాడు.

నాకు మిడిగుడ్లు పడ్డాయి.

మన తెలుగునాట సమరంగారికి ఎలాంటి కీర్తి ఉందో చెప్పటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్న మాట.

***

సరే మళ్ళీ విజయవాడకు వద్దాం.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. వారి క్లినిక్ చాలా బాగుంది. విశాలమైన ఆవరణలో చక్కగా పరిశుభ్రంగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఒకరిద్దరు పేషంట్లు ఉన్నారు ఆయనని కలవటానికి.

మేము విజిటింగ్ కార్డ్ లోపలికి పంపి, ఈ లోగా వారి ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీని (మెడికల్ షాప్) చూసి అక్కడ మా కంపెనీ మందుల స్టాక్ పొజిషన్ చూసుకుని, కుశలప్రశ్నలు వేసి, మళ్ళీ తిన్నగా వచ్చి విజిటర్స్ చాంబర్‌లో కూర్చున్నాము.

అక్కడి వాతావరణంలో ఒక ప్రశాంతత ఉంది. చక్కగా అమర్చిన ఫర్నిచర్, అసుపత్రి నడుమ చిన్ని పూల తోట, మొత్తం మీద చాలా బాగుంది అక్కడి వాతావరణం. నేను ఊహించినట్టు అక్కడ పేషంట్లు ఏమీ ‘విచిత్రమైన’ వ్యాధులతో రాలేదు. సాధారణ ఆసుపత్రి లాగానే జ్వరం, జలుబు, ఒళ్ళునొప్పులు తదితర వ్యాధులతో వచ్చిన వారే ఉన్నారు. అదే విధంగా అక్కడి ఫార్మసీలోని ఇతర కంపెనీల మందుల  స్టాక్ ని బట్టి, వృత్తి రీత్యా నాకు అలవడిన జ్ఞానం వల్ల నాకు అర్థమయింది ఆయన ఒక మంచి ఫిజిషియన్ అని. వారపత్రికలో, టీవీల్లో ఆయనని సంప్రదించే తరహా వ్యాధిగ్రస్థులు ఎవ్వరూ నాకు అక్కడ తారసపడలేదు.

ఈ లోగా మాకు పిలుపు వచ్చింది. లోనికి వెళ్ళాము.

ఆయన తెల్లటి దుస్తులు ధరించి, ప్రశాంతతకి మారుపేరులా చక్కగా చిరునవ్వు చిందిస్తూ మమ్మల్ని ఆహ్వానించారు.

నవ్వులో చల్లదనం, వెన్నెలలో తడిసిన అనుభూతి అని వాడుతుంటారు కద రచయితలు. బహుశా ఇలాంటప్పుడూ వాడాల్నేమో ఆ పోలికలు. ఆయనని చూడగానే సాంత్వనగా అనిపించింది.

ఒక పసి పిల్లాడిలా భేషజాలు లేకుండా ఆప్యాయంగా మాట్లాడారు.

“మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే, కొత్తగా వచ్చారా?” అన్న అర్థం వచ్చేలా  “మీ పేరు?” అని ఆప్యాయంగా పలకరిస్తూ, ముందుకు వంగి షేక్ హేండ్ ఇచ్చారు.

మా సంభాషణ యావత్తు స్వచ్ఛమయిన అంగ్లంలో, వృత్తి పరమైన విషయాల పట్ల కొనసాగింది. మా కంపెనీ ఉత్పత్తుల పట్ల, నాణ్యత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయన సూక్ష్మ గ్రాహి, నా విజిట్ లోని కీలకాన్ని అర్థం చేసుకుని, మా మెడికల్ రెప్రజెంటేటివ్ రాజీవ్ పని తీరు పట్ల నేను అడుగకనే సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కుర్రాడ్ని కాసేపు అభినందించారు. ఆయన అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారో నాకు అర్థం అయింది.

ఆ తరువాత ఆయనని అనేక సందర్భాలలో కలవడం జరిగింది.

ఆ మొదటి విజిట్‌లో నేను ఆయనతో ఇంకేమి మాట్లాడలేదు. ఒక సెలబ్రిటీని మొదటిసారి కలిసినప్పుడు మనం వారు ఎన్నుకున్న కళారంగాన్ని గూర్చి ప్రస్తావించి వారిని కలవడం మనకు ఆనందం కలిగించింది అన్న భావాన్ని వ్యక్తం చేస్తాం కద. కానీ నాకు ఇక్కడ ఒక ఇబ్బంది ఎదురు అయ్యింది.

ఒక రచయితనో, నటుడినో కలిసినప్పుడు ‘మీ నవల చదివామనో, మీ సినిమాలు చూస్తామనో, మీ నటన ఇష్టమనో’ ఏదో చెప్పి వారిని ఆనందపెడ్తాము కద. ఈయనకి ఏం చెప్పి ఇలాంటి సంభాషణ ప్రారంభించాలో అర్థం కాలేదు నాకు అసలు.

‘మీ అర్ధరాత్రి ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు బాగుంటాయాని చెప్పాలా, స్వాతి సపరివారపత్రికలో సమాధానాలు బాగుంటాయని చెప్పాలా, నవభారత్ పబ్లికేషన్స్ వారు కొన్ని భాగాలుగా విడుదల చేసిన వారి ఫలానా సైన్స్ పుస్తకాలు బాగుంటాయని చెప్పాలా, ఏమి చెప్పి సంభాషణ ప్రారంభించాలో అర్థం అయ్యేది కాదు.

చివరికి నా సమస్యకి పరిష్కారమా అన్నటు, చిరంజీవి గారి ఇంద్ర సినిమా విడుదల సందర్భంగానో, లేదా నూరు రోజులపండగ సందర్భంగానో ఈయన చిరంజీవితో కల్సి ఉన్న ఫోటోలు అన్ని పత్రికలలో పడ్డాయి.

“టీవిలో మీరు చిరంజీవి గారి గూర్చి చక్కగా చెప్పారు సర్” అని ఒక సారి సంభాషణకి తెర ఎత్తాను.

“వివేకానంద్ గారు! మీరు తెలుగు వారా! అరెరె! ఏ బెంగాలీ వారోఅనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళూ” అని ఆయన అనడంతో మా పరిచయం మొదలయింది.

వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గూర్చి, అనేక విషయాల గూర్చి చక్కగా వివరించేవారు.

ఇటీవలే వాట్సాప్‌లో వారి గూర్చి ఎవరో ఓ వ్యాసం పంపారు ఇవన్నీ గుర్తు వచ్చాయి ఈ సందర్భంగా.

ఆ రోజుల్లో స్మార్ట్  ఫోన్లు ఉండేవి కావు. అప్పటికింకా నోకియా వారి బ్లాక్ అండ్ వైట్ సెల్ ఫోన్స్ ఉండేవి వాడుకలో. అందువల్ల ఆయనతో ఫోటో తీసుకునే అవకాశం కలగలేదు.

అవండీ సమరం గారితో నా జ్ఞాపకాలు.

Exit mobile version