ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్విందా!

0
3

[dropcap]హ[/dropcap]రికథల్లో, బుర్రకథల్లో, సినిమాలలో మయసభలో దుర్యోధనుడి పరాభవం చూసి ద్రౌపది నవ్విందనీ, అందుకు ప్రతీకారంగా ఆమెని నిండుసభలో అవమానించాడనీ ప్రచారంలో ఉన్నది. ఇప్పటికీ ఈ విషయంలో చాలామందికి సందేహంగానే ఉంటుంది. మూల భారతంలో వ్యాసులవారు ఏం చెప్పారు? అసలు కథ  ఏమిటో చూద్దాం.

ద్రౌపదీ స్వయంవరం తర్వాత అప్పటివరకూ అజ్ఞాతంగా ఉన్న పాండవుల ఉనికి అందరికీ తెలుస్తుంది. పాండవులను పిలిపించి వారి రాజ్యం మొత్తం కాకపోయినా, అర్ధభాగమైనా ఇవ్వమని దృతరాష్ట్రుడికి హితబోధ చేస్తారు భీష్మ ద్రోణులు. కౌరవుల క్షేమాన్ని అలోచించి అర్ధరాజ్యంగా అరణ్యప్రాంతమైన ఖాండవ ప్రస్థాన్ని వారి కప్పగించాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు అర్ధరాజ్యమే నాకు ఎందుకు? అరణ్యప్రాంతం నాకెందుకు అని తిరస్కరించలేదు. వినయ విధేయతలతో పెదతండ్రి మాట అంగీకరించాడు. శ్రీకృష్ణుడి సాయంతో, విశ్వకర్మ నైపుణ్యంతో ఒక మహానగరాన్ని అక్కడ నిర్మించాడు.

ఇలా ఉండగా ఒకసారి నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు కట్టిన మయసభను మెచ్చుకుంటూ మాటల సందర్భంలో పాండురాజు యముడి సభలో ఉన్నట్లు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. “అలా ఎందుకు?” అని అడిగిన ధర్మరాజుతో హరిశ్చంద్రుడు రాజసూయ యాగం చేయటం వలన ఆ స్థితి లభించిందని చెప్పాడు. “అయితే ఆ యాగం నేను కూడా చేస్తాను” అన్నాడు ధర్మరాజు. “రాజసూయ యాగం చాలా కష్టతరమైనది. దానిని విఘ్నం చేయటానికి రాక్షసులు ప్రయత్నిస్తూ ఉంటారు. నిర్విఘ్నంగా పూర్తి చేస్తే ఒక మహాయుద్ధం సంభవిస్తుంది. అలోచించి చెయ్యి” అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు.

తర్వాత రాజసూయ యాగం సమయంలో శ్రీకృష్ణుడిని ప్రథమ పూజనీయుడిగా ఎంచి ధర్మరాజు పూజించటం, శిశుపాలుడు నిందించటం, శిశుపాల వధ, అనంతరం రాజసూయం నిర్విఘ్నంగా జరిపోవటం అంతా అయిపోయింది. వచ్చిన రాజులందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకకు వెళ్ళిపోయాడు. కానీ దుర్యోధనుడు, శకుని మాత్రం వెళ్ళలేదు. అక్కడే ఉండిపోయారు. దానికి కారణం మయసభను చూడాలనే కోరికతో (సినిమాలో చూపించినట్లు మయసభను దుర్యోధనుడికి విడిదిగా ఇవ్వలేదు). ఆ మాట ధర్మరాజుతో చెబితే సంతోషంగా అంగీకరించటమే కాక, తగిన ఏర్పాట్లు చేసేవాడు. కానీ ఇక్కడ దుర్యోధనుడు సహజసిద్ధమైన అహంకారంతో “ఆయనను అడిగేదేమిటి? ఇందులో నాకు తెలియనిది ఏముంది?” అనుకున్నాడు. శకునితో కలిసి మయసభను చూడటానికి వెళ్ళాడు. అక్కడి విశేషాలు చూసుకుంటూ చెరొక దారి అయ్యారు. ఆ సమయంలో ద్వారమని భావించి కుడ్యాన్ని డీకొనటం, జలాశయం లేని చోట జలాశయంగా భ్రమపడటం, జలాశయం ఉన్నచోట తెలియక నీటిలో పడటం జరిగింది. అతని పాట్లు చూసి అక్కడ కావలిగా ఉన్న భటులు ఫక్కున నవ్వారు. శకునితో తిరిగి కలిసిన తర్వాత కావలివాళ్ళు చూసి నవ్వినట్లు చెబుతాడు దుర్యోధనుడు.

హస్తినాపురం తిరిగివచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడి మనసుకు శాంతి లేకుండా పోయింది. అనుక్షణం పాండవులు మహా ఐశ్వర్యంతో సార్వభౌములై ప్రకాశించటం ఓర్చుకోలేక పోయాడు. శకుని సాయంతో ఆ ఐశ్వర్యాన్ని హరించాలనుకున్నాడు. అందుకు వారిని ద్యూతానికి ఆహ్వానించాలంటే తండ్రి సహకారం కావాలి. మెల్లగా తండ్రి దగ్గరకు జేరి మయసభలో తన పరాభవం చూసి శ్రీకృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది నవ్వారని, ఇంకా ఎన్నెన్నో కల్పించి చెప్పి పాండవుల మీద కోపం వచ్చేటట్లు చేసి, విదురుని పంపించి ధర్మరాజుని జూదానికి పిలిపించేటట్లు ఒప్పించాడు.

వాస్తవానికి రాజసూయ యాగం పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి పరాభవం సమయంలో అయన అక్కడ లేనే లేడు. ద్రౌపది కూడా లేదు. భర్తలు గానీ, బంధువులు గానీ, తనవారు ఎవరూ లేనిచోట, పరమవిరోధి దుర్యోధనుడు ఉన్నచోట ద్రౌపది ఒంటరిగా ఎందుకు ఉంటుంది? పైగా అతిథిగా వచ్చిన వ్యక్తిని అపహాస్యం చేసి, అవమానించేంత అల్పురాలు కాదు ద్రౌపది. ఇదంతా సంస్కృత భారతంలోని కథ.

కానీ తెలుగు భారతంలోకి వచ్చేసరికి ఇక్కడ నన్నయ గారు కొంత మార్పు చేశారు. ఆ విచిత్ర శాలలో దుర్యోధనుడి భంగపాటు చూసి “వానిం జూసి పాంచాలియు పాండుకుమారులు నగిరి” అని ఒక్క చిన్నవాక్యం రాసారు. అది కూడా వచనంలోనే. పద్య రూపంలో కూడా చెప్పలేదు. అప్పుడు ధర్మరాజు మంచి వస్త్రాలు, ఆభరణాలు భీముడి చేత ఇచ్చి పంపించారు. అసలే భీముడంటే స్పర్ధ దుర్యోధనుడికి. దానికి తోడు భీముడు నవ్వుతూ అందించేసరికి పుండు మీద కారం చల్లినట్లు అయింది.

పాండవులను వదలి హస్తినాపురానికి వచ్చాడు. పాండవుల వైభవం గుండెల్లో మంట పెట్టినట్లు బాధించింది. అసూయతో రగిలిపోయాడు. కంటినిండా నిద్రపోలేదు. అన్ని భోగాలూ వదిలి దిగులుతో రోజులు గడపసాగాడు. శకుని అతని మనోవేదన తెలుసుకుని పాండవుల సంపదను హరించటానికి తాను సాయం చేస్తానన్నాడు. అనుమతి కోసం తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇక్కడ దుర్యోధనుడు లేనిపోనివి కల్పించి చెప్పలేదు తండ్రితో. తన అసూయను సూటిగానే తండ్రి ముందు వెళ్ళగక్కాడు. ధర్మరాజు రాజ్య వైభవాన్ని అనుభవించటం నేను సహించలేను అన్నాడు. అనుమతిస్తే మాయాజ్యూత నెపంతో శకుని అపహరించి ఇస్తానని అన్నాడని చెప్పాడు. అనుమతించకపోతే అగ్నిలో పడి ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు. పుత్ర వ్యామోహంతో దృతరాష్ట్రుడు అతని మాటలకు తలవంచాడు.

ఈ విధంగా మూలంలో లేని కొన్ని మార్పులు చేసారు నన్నయ గారు. ఆ విధంగా చేయటం తప్పని అనలేము. రామాయణంలో కూడా లక్ష్మణరేఖలు, శబరి ఎంగిలి పండ్లు వంటి కల్పనలు ఇతర కవులు కల్పించారు. వాల్మీకంలో లేవు. ఆ కల్పనలు కూడా మనోజ్ఞంగా ఉండి ప్రజాదరణ పొందాయి. అది ఆ కవి యొక్క సృజనాత్మక అనుకోవాలి. అయితే వ్యాసుల వారు మహాభారతం జరిగేటప్పుడు ప్రత్యక్షంగా చూశారు. తనని ఒక పాత్రగా చేసి భారతాన్ని రచించారు. కనుక వ్యాసభారతంలో చెప్పినదే యథార్థమని భావించాలి.

ఆ తర్వాత కొడుకు మాట విని వేయిమంది శిల్పులను పిలిపించి ఒక విచిత్ర మణిమయ మహాసభను అప్పటికి అప్పుడు నిర్మిoపచేసాడు దృతరాష్ట్రుడు. వెంటనే ధర్మరాజుకి “నువ్వు ఇక్కడికి వచ్చి నీ సభతో సమానమైన నీ సోదరుల సభ చూసి, నీ సోదరులతో కలిసి ద్యూతం జరపవలసింది. మీ సాంగత్యం చూసి మేమంతా సంతోషిస్తాం” అని విదురుడి చేత సందేశం పంపిస్తాడు. కొద్దిరోజుల క్రితమే రాజసూయానికి వెళ్ళిన తనని ధర్మరాజు ఎంతో గౌరవించి, సత్కరించి పంపించిన విషయం మర్చిపోయాడు. కొడుకు ఏవేవో కల్పించి చెప్పగానే నమ్మేశాడు. చెప్పుడు మాటలకు చెవి యొగ్గే వారు అలా ప్రవర్తిస్తారు.

ఇక్కడ ధర్మరాజుకి అనేక దుశ్శకునాలు కనిపిస్తాయి. తన దగ్గరకు వచ్చిన వ్యాసులవారిని చూసి “ఇవన్నీ శిశుపాలుడి మరణం వల్ల సంభవించినవేనా?” అని అడుగుతాడు. వ్యాసులవారికి జరగబోయేవి అన్నీ తెలుసు. కానీ ఎంతవరకు అవసరమో అంత వరకే చెబుతాడు. “పదమూడు సంవత్సరాల తర్వాత నీ కారణంగా, దుర్యోధనుడి కారణంగా ఒక భయంకర యుద్ధం సంభవించబోతుంది. దీన్ని గురించి నువ్వు విచారించకు. కాలం బలీయమైనది. రాజుగా ఇంద్రియ నిగ్రహంతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు” అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయాజూదంలో సర్వస్వం కోల్పోవటం, అరణ్య అజ్ఞాత వాసాలు చేయటం మొదలైనవన్నీ జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here