[box type=’note’ fontsize=’16’] “సీరియస్‌గా తీసుకోకపోతే ఈ చిత్రం బాగుందనే చెప్పాలి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘డ్రీం గల్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఆ[/dropcap]యుష్మాన్ ఖురానా అంటే కొంత నూతనత్వాన్ని ఆశిస్తాము. అతనూ మన ఆశలను వొమ్ము చేయడు. రాజ్ శాండిల్యా స్క్రిప్ట్, సంభాషణలు, దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ చిత్రం సీరియస్ గా తీసుకోకపోతే బాగుందనే చెప్పాలి. ఇలాంటివి ఇదివరకు రాలేదని కాదు. ఆ మధ్య మిసెస్ డౌట్‌ఫైర్ ప్రేరణతో కమల్ హాసన్ తీసిన “చాచీ 420” వచ్చింది. అది slapstick comedy అయినప్పటికీ కమల్, అమ్రిష్ పురి, ఒం పురి వగైరాల నటన వల్ల కడుపు నెప్పి వచ్చేంతగా నవ్వించింది. అందులో కమల్ స్త్రీ పాత్ర ధరిస్తే, అతని ఆకర్షణలో ముగ్గురు నడి వయస్కులు (?) పడతారు. ఇలాగే స్త్రీ పాత్రలు పురుషులు ధరించిన చిత్రాలు చాలానే వచ్చాయి. రిషి కపూర్, ఆమిర్ ఖాన్ లు కూడా అలాంటి వేషాలు వేశారు. అయితే ఇందులో ఆయుష్మాన్ కాస్త అతి కాకుండా జాగ్రత్తగా చేశాడు.
కరం (ఆయుష్మాన్ ఖురానా) కి చిన్నప్పటినుంచీ ఆడ గొంతులో మాట్లాడగలగటం అనే వరం వుంది. అది గమనించి చిన్నప్పటినుంచీ అతని చేత నాటకాలలో సీత పాత్ర వేయిస్తారు, అతనికి ఇష్టం లేకపోయినా. పెద్దయ్యాక ఉద్యోగం వెతుక్కోవాల్సిన సమయంలో అతని దృష్టికి వొక ప్రకటన కనిపిస్తుంది. మగవాళ్ళను ఫోన్ మీద సెక్సీ కబుర్లు చెప్పి రంజింపజేసే స్త్రీలకు ఉద్యోగ ప్రతిపాదన. మరే ఉద్యోగమూ దొరక్క, అప్పుల్లో కూరుకుపోయిన తండ్రిని చూడలేక అతను ఆ ఉద్యోగానికి ప్రయత్నించాలనుకుంటాడు. మొదట అతన్ని చూసి అందరూ నవ్వుకున్నా, ఆ రోజు శలవు మీద వున్న పూజ అనే అమ్మాయి స్థానంలో తను వొక కాల్ ని తీసుకుని అమ్మాయిలా మాట్లాడి అవతల కస్టమర్‌ని, ఇవతల ఆ కాల్ సెంటర్ యజమానినీ ప్రభావితం చేస్తాడు. ఆ విధంగా అతనికి ఆ ఉద్యోగం లభిస్తుంది. ఇక అతనికి వచ్చే ఫోన్లలో కుర్రవాడి నుంచి, నడివయసు వాడు, ముసలాడు ఆఖరికి వో అమ్మాయి కూడా నుంచి వస్తుంటాయి. అతని మాటల తీయదనానికి వాళ్ళందరూ అతని/ఆమె ప్రేమలో పడిపోతారు. ఇక్కడి నుంచి ఎలాంటి హాస్యానికి వీలుందో వూహించుకోవచ్చు. యెక్కువ కథ చెబితే హాల్లో చూసినపుడు మీకు నవ్వు రాదు. ఇక్కడితో విరమిస్తాను.
రాజ్ శాండిల్యా వ్రాత, దర్శకత్వం గొప్పగా లేదు, కాని బాగానే వుంది. సినెమా నచ్చడానికి ముఖ్య కారణం ఆ నటుల నటనే, హాస్యం కూడా కాదు. వాళ్ళనుంచి ఆ రకమైన నటన రాకపోతే ఆ హాస్యం అంతగా నవ్వించేది కూడా కాదు. అందరి నటనా బాగున్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయుష్మాన్ ఖురానా, అన్ను కపూర్‌ల నటన. ఆయుష్మాన్ ఖురానా ప్రియురాలిగా చేసిన నుస్రత్ భరూచా అందంగా వుంది. ఆ పాత్రకు ఎక్కువ స్కోప్ కూడా లేదు, నటన గురించి చెప్పడానికి.
ఈ spoiler alert వొక పక్క నన్ను వెనక్కి లాగుతుంటే యేమీ చెప్పకుండా వుండడం ఎలా అని ఇది వ్రాస్తున్నాను. ఎంత హాస్య చిత్రమైనా politically correct అనిపించుకోవాలి కాబట్టి చివర్న వో లెక్చర్ దంచి, ఈ వృత్తి చాలా మందిని వాళ్ళు అనుభవిస్తున్న ఒంటరితనం నుంచి కొంత సాంత్వన ఇస్తుంది అంటాడు దర్శకుడు, నటుడు ద్వారా చెప్పించి. కాని అదొక్కటే కారణం కాదు. ఇంకా ముఖ్యమైన కారణాలు మగవాళ్ళలో వుండే కుతూహలం, ఆకర్షింపబడాలని, ప్రేమించబడాలని, గుర్తింపు పొందబడాలనీ వున్న కాంక్ష, శృంగారం విషయం లో వింత పోకడల పట్ల ఆసక్తి వగైరా. అవన్నీ అవాంఛనీయాలనో, రోగలక్షణాల సూచన అనో చెప్పేటప్పుడు పరిహరించి వుంటారు. మరి ఆ వృత్తిలో వున్న ఆడవాళ్ళ సంగతో? ఆర్థిక పరిస్థితుల కారణంగా చేస్తుండవచ్చు. కాని వొక వాక్యంతో తెర దించేస్తాడు : వాళ్ళే లేకపోతే ఆ యజమానీ లేదు, కస్టమర్లూ లేరు అని.
పూర్తిగా ఇలాంటి పాత్ర కాకపోయినా “తుమ్హారీ సులూ” లో విద్యా బాలన్ కూడా లేట్ నైట్ రేడియో షో కోసం సెక్సీ గా మాట్లాడే ఉద్యోగాన్ని ఇష్టంగా, స్వతంత్రంగా తీసుకుంటుంది. ఆ చిత్రంలో హాస్యం, గాంభీర్యం సమపాళ్ళలో కుదిరింది. అన్ను కపూర్ పూజ అనే స్వరంతో ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి అసలు హిందువు కాదు వొక ముస్లిం అమ్మాయి అని కరం చెబితే అతనే స్వల్ప కాలంలో ఉర్దూఒ నేర్చేసుకుని వో ముస్లిం లా తయారైపోతాడు. ఇదంతా మూసపోసిన బాలివుడ్ ముస్లిం పాత్ర లా వున్నా అన్ను కపూర్ వలన కడుపు చెక్కలయ్యేలా నవ్వుతాం. అతనికి contrast గా ఆయుష్మాన్ ఖురానా కాస్త సరితూకంతో నటిస్తాడు, కుడితిలో పడ్డ ఎలుకలా, ఎక్కడా అతి చేయ్యకుండా. మూడు ప్రేమలలో విఫలం అయిన వో అమ్మాయి మగవాళ్ళంటే ద్వేషం పెంచుకుని పూజ ప్రేమలో పడిపోతుంది. వొక వైఫల్యం కారణంగా మనిషి స్వలింగ ఆకర్షణలో పడడు/పడదు. మానసికంగా ముందే ఆ సూచనలు వుంటాయి. వొకవేళ స్త్రీ పాత్రనే పెట్టవలసిన అవసరం కనిపించి వుంటే వో లెస్బియన్ పాత్ర గా ఆమెను పరిచయం చేస్తే నమ్మించేది. సరే, వినోదాత్మక చిత్రాలలో ఏడు హత్యలు చెల్లు!