రంగుల హేల 25: డ్రీమ్ హస్బెండ్స్… అండ్… రియల్ హస్బెండ్స్

0
2

[box type=’note’ fontsize=’16’]  “అసలు భర్త అనే పోస్ట్‌లో ఎవరున్నావారి ఆకారం, ప్రవర్తనా రంగూ, రుచీ, వాసనా లేని పదార్ధంలా ఉంటుంది. అది ఏ తరంలోనైనా సరే” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]ఇ[/dropcap]ప్పటి అమ్మాయిల సంగతి ఏమో గానీ డెబ్భై, ఎనభై దశకాల నాటి పెళ్లికాని అమ్మాయిలందరూ శోభన్‌బాబులా సరదాగా, చిలిపిగా ఉండే భర్తలు కావాలనుకునేవారు. కమల్ హాసన్ లాగా, రజనీకాంత్ లాగా యూత్‌ఫుల్‌గా కూడా ఉండాలని ఆశించేవారు.

భార్యల్ని వాళ్ళు ప్రేమగా చూసుకునే విధానం, నిరంతరం ఆమె వెనకాలే తిరుగుతూ ఆమెని అపురూపంగా చూసుకోవడం, భార్యతో ఆయా పాత్రలు జరిపే ముద్దుమురిపాలూ వాళ్ళకలాంటి ఊహలు కలిగించేవి. వివాహానంతర జీవితం పంచ రంగులుగా కనబడేది.

ఆ రోజుల్లో లైబ్రరీల నిండా నోరూరించే, మనసులు దోచే ప్రేమ కథలు నిండిన నవలలుండేవి. ఆ నవలల్లో హీరోల గురించయితే ఇంక చెప్పక్కర్లేదు. హీరో హీరోయిన్ల ప్రేమాయణం పేజీలు కొన్ని వందల సార్లు చదువుకునేవారు అమ్మాయిలు. అంతగొప్ప హృదయమున్న హీరోలుండేవారు ఆ నవలల్లో.

భార్య పట్ల అంతటి ఆరాధనా, అనురాగమూ చూపించే హీరో పాత్రలపట్ల వారికి గొప్ప గౌరవం పొంగిపొరలేది. సాధారణ చదువుతో ఇంట్లో ఉండే అమ్మాయిల నుండీ ఉద్యోగాలు చేసే అమ్మాయిల వరకూ సినిమా కథల్లో, నవలల్లో ఉండే హీరోపాత్రలంటే వారికి గొప్ప ఆరాధనా భావం ఉండేది.

పెళ్ళయితే రాబోయే భర్త అనే వ్యక్తి మనల్ని ఇంత అపురూపంగా, ఇష్టంగా ఆత్మీయంగా చూసుకుంటాడా? అయితే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసిందే! అనుకునేవారు ఆడపిల్లలు. కానీ అమ్మని నాన్న అలా చూసుకుకోవడం లేదేంటి? అని అనుమానం వచ్చినప్పుడల్లా ‘ఆ! అమ్మా నాన్నా ముసలి తరం కాబట్టి అలా ఉన్నారు మనం యూత్ కదా! అలా ఎందుకుంటాం?’ అని సరిపుచ్చుకునేవాళ్ళు.

అసలు భర్త అనే పోస్ట్‌లో ఎవరున్నావారి ఆకారం, ప్రవర్తనా రంగూ, రుచీ, వాసనా లేని పదార్ధంలా ఉంటుంది. అది ఏ తరంలోనైనా సరే. ఉత్సవ విగ్రహంలో భావాలు కనబడనట్టే భర్తలలో కూడా కనబడదు..

భర్త అనబడే ప్రత్యేకమైన శాల్తీ ఒక ఖరీదైన పురాతన ఫర్నిచర్ లాంటిది. దానిని రీమోడల్ చెయ్యడం కాదు కదా కనీసం పక్కకి జరపడం కూడా ఎవరి వల్లా కాదు. అందుకే మిగిలిన ఇల్లంతా సర్ది దాన్ని ముట్టుకోకుండా పక్కనుంచి తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని జోలికి పోరాదు. ఆ శాల్తీ మెదడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ అమాయకంగా వేసిన విత్తనాల వల్ల పుట్టి విస్తరించిన వృక్షాలతో కూడిన కీకారణ్యంలా ఉంటుంది. మార్పుకు పూర్తి వ్యతిరేకం. భార్య మనసులో ఏముందో తప్ప ప్రపంచమంతా దానికి అర్థమవుతుంది

భర్త అనే జీవి అమలాపురంలో ఆక్వా బిజినెస్ చేస్తున్నా, అమెరికాలో సాఫ్ట్‌వేరు ఇంజినీర్ అయినా ఒకే లక్షణాలతో మరియూ ఆలోచనలతో అలరారుతూ ఉంటుంది. ఇంకా తన భార్యకు తనను మించిన తెలివితేటలు ఉండే అవకాశమే లేదని గట్టిగా నమ్ముతూ ఉంటుంది. ఒక వేళ ఆమె ఇతనికన్నా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ అదేదో ‘యెడ్డీమార్ గుడ్డీగా’ వచ్చి ఉంటుందని ఈ జీవి యొక్క ప్రగాఢ విశ్వాసం.

ఇతని ప్రవర్తన కూడా ఒక్కొక్కప్పుడు వింతగా ఉంటుంది. భార్యగారి దూరపు బంధువులు వచ్చినపుడు వారిని అల్లుకుపోవడం, ఆమెకు దగ్గరి వారొచ్చినప్పుడు బిగిసిపోయి ఉండడం ఎందుకు చేస్తాడో ఎవరికీ అర్ధం కాదు.

అతని అమ్మా, నాన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఊరి విశేషాలు అడుగుతూ నవ్వుతూ, తుళ్ళుతూ “ఏం వండుతున్నావ్?” అంటూ వంటింట్లో తిరుగుతూ “అన్నీ సరుకులూ ఉన్నాయా?” అంటూ భార్యని మరీ మరీ అడుగుతాడు. అదే భార్య అమ్మా, నాన్నా వచ్చినపుడు వాళ్లతో తనకు ఎక్కువ పరిచయం లేనట్టు, తక్కువ మాట్లాడుతూ బెట్టుసరిగా ఉంటాడు. నోరు తెరిచి అడిగినప్పుడే అవసరమైన సరుకులు తెస్తాడు. ‘ఏంటి, మీ ఉద్దేశం?’ అని భార్య నిలదీస్తే ‘ఇలాంటి అనుమానాలు మీ ఆడవాళ్లకే ఉంటాయి, మా మగవాళ్ళకి కూడా నేర్పిస్తారు’ అంటూ ఎదురు దాడి చేస్తా డు.

ఒకోసారి ఇంట్లో భార్యతో ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్టు కనబడుతూనే అకస్మాత్తుగా అపరిచితుడుగా మారిపోతూ ఉంటాడు. అతన్ని మార్చి సామరస్యంగా ఉండేట్టుగానూ సరసుడుగా ఉండేట్టుగానూ మార్చుకోవాలని భార్య ఓ పదేళ్లు ప్రయత్నించి విజయవంతంగా విఫలమైన తర్వాత జ్ఞానోదయమై అతనితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితం ప్రశాంతంగా సాగడం మొదలవుతుంది. భర్తతో ముద్దూ మురిపాలూ అనేవి వచ్చే జన్మకి వాయిదా వేసుకుంటుంది.

అందుకే ఎప్పుడూ మౌనంగా తమ పనులు తాము చేసుకుంటూ ఉండే మన అమ్మలు అప్పుడప్పుడూ వీరంగాలు వేసే నాన్నలతో ఘర్షణ పడిన సంఘటనలు మనం చూడలేదు. అదంతా సహనం అని మనం అపార్థం చేసుకున్నాం. అది నాన్నల మనసులు రంజింపచేయబూనడం, వివేకవంతుల్ని చెయ్యడం అనేది నిరర్థకం, అసాధ్యం అని గ్రహించిన అమ్మల అనుభవ సారం అన్నమాట.

యాభయేళ్ల వయసు తర్వాత సాధారణ భర్తలంతా భార్యల తప్పులు వెదుకుతూ అత్తగారి అవతారం ఎత్తుతుంటారు. ఏ కష్టం చెప్పబోయినా ‘నేను నీకు అనేక సార్లు చెప్పాను అలా చెయ్యొద్దని. నా మాట విన్నావా? అందుకే ఇలా అయ్యింది’ అని ఒక్క మాటతో ఆ సమస్య నుంచి గొప్ప చాణక్య తెలివితో తప్పుకుని దూరంగా నిలబడి పక్కింటి పిన్ని గారిలా తమాషా చూస్తూ ఉంటారు. సానుభూతి ప్రసక్తే ఉండదు. మోస్ట్ అన్ ఫ్రెండ్లీ హస్బెండ్స్ అన్నమాట.

ఆడవాళ్లకుండే సున్నితత్వాలూ, భావుకత్వాలూ, కలలూ మగవాళ్ళకి ఉండవు కాబట్టి వాళ్ళు రోబోల్లా ఫీలింగ్స్ లేకుండా, చీకూ చింతా లేకుండా శుభ్రంగా టిఫిన్లూ, భోజనాలూ వేళకి తింటూ (ఇంట్లో వీలు కాకపోతే బైటయినా సరే) బతుకు బండి లాగించేస్తూ ఉంటారు. అందుకే నవలలు చదివేదీ, సినిమాలూ, సీరియల్స్ చూసేదీ ఆడవాళ్లే. వాటిల్లో వాళ్ళకి వాళ్ళు పెళ్ళికాకముందు కన్నకలల తాలూకు శకలాలు కనబడి కాస్త ఊపిరి వస్తుంటుంది. జైలర్ లాంటి భర్తతో జైలు లాంటి సంసారంలో వాళ్ళకి అవే కదా రిలాక్సింగ్ సమయాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here