అందమైన దృశ్యం : అరుదైన మంచి సీక్వెల్

1
2

[dropcap]ఇ[/dropcap]దివరకు జితు జోసెఫ్ తీసిన “దృశ్యం” వచ్చింది. ఎంత హిట్ అయ్యిందంటే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేసారు. దాంట్లో వున్న మంచి గుణం ఏమిటంటే చాలా టైట్ స్క్రీన్‌ప్లే, తన వెంట లాక్కు పోయే కథనం. చివరిలో న్యాయాన్ని వ్యక్తి చేతుల్లోకి తీసుకున్నాడు అన్న విషయం ఉన్నా, ఆ సందర్భం లో వ్యవస్థ తనే అన్యాయాన్ని కాపు కాస్తున్న పరిస్థితిలో ఇది పెద్ద నేరంగా అనిపించలేదు. సరే, అన్యాయానికి శిక్ష పడింది, రహస్యం భూస్థాపితం అయ్యింది అనుకున్న తర్వాత ఇక దానికి సీక్వెల్ ఎలా తీస్తారు? తీసినా అంతే ఆసక్తికరంగా వుంటుందా? నమ్మ బుధ్ధి కాదు గానీ, ఈ సీక్వెల్ అంతే చక్కగా వుంది. చాలా అరుదైన విషయం ఇది.


ఆరేళ్ళ తర్వాత జార్జికుట్టి (మోహన్ లాల్) తన భార్య రాణి (మీనా), కూతుళ్ళు అంజు (అన్సిబా), అను (ఎస్థర్ అనిల్) ల తో కేరళ లోని వో చిన్న వూరులో వుంటున్నాడు. ఇదివరకు కేబల్ ఆపరేటర్ అయిన జార్జికుట్టి ఇప్పుడు ఒక సినెమా హాల్ నడుపుతున్నాడు. అది కాకుండా అతనికి చాలా బలమైన కోరిక ఓ సినిమా తీయాలని. రెండేళ్ళుగా దాని స్క్రిప్ట్ పనిలో వున్నాడు. అంజు తనకు జరిగిన సంఘటన వల్ల ఫిట్స్ వ్యాధికి గురయ్యి వుంది. కొద్దికొద్దిగా కోలుకుంటూ వుంది. post trauma stress disorder గురించి సహజంగా చూపించాడు. టీనేజి అను తరం స్వేచ్ఛా జీవులు, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అనుకునే రకం. తల్లి రాణి మాత్రం పాత కాలపు ఆలోచనలు కలిగి వుండడమే కాకుండా ఇదివరకటి అనుభవం తో రెండో అమ్మాయిని ఎక్కువ కట్టుబాట్లలో వుంచి, కాపాడుకుందామనుకుంటూ వుంటుంది. దాదాపు ఈ గంట వరకూ కథనం నెమ్మదిగా కానీ ఏ వొక్క సీన్ అనవసరం కాకుండా తీసాడు. మొత్తం చూసాక ఈ మొదటి భాగంలో వున్న ప్రతి సీన్ చెప్పకుండా చెప్పే కథ గ్రహింపులోకొచ్చి జితూ జోసెఫ్ ని మెచ్చుకోకుండా వుండము. సినిమా ప్రపంచంలో పడి డబ్బు, ఆరోగ్యం (తాగుడు వల్ల) పాడు చేసుకుంటాడని రాణీ ఎప్పుడూ దెబ్బలాడుతూ వుంటుంది.
సాఫీగా సాగుతున్న ఈ కథనంలో మలుపు పోలీసులు ఈ కేసును వదిలెయ్యలేదనీ, రహస్యంగా దాన్ని తిరగతోడుతున్నారనీ తెలుస్తుంది. ప్రేక్షకులుగా మనకు వాళ్ళ పని తెలుస్తూ వుంటుంది. పోలీసు జీపు రాక పోకలు రాణి,అంజు, అను లను భయపెడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. జార్జికుట్టి కైనా తెలుసా? అంచెలంచెలుగా పోలీసు వ్యవస్థ పరిశోధనలో ముందుకు సాగుతూ వుంటుంది. క్రమంగా కాని నిశ్చయంగా జార్జికుట్టి ఇరుకున పడుతూ వుంటాడు. ఈ ఎత్తుకు పై ఎత్తుల ఆటలో ఎవరు గెలుస్తారు? అన్నది మిగతా కథ.
జితూ జోసెఫ్ రచన, దర్శకత్వం బాగున్నాయి. అనిల్ జాన్సన్ సంగీతం, సతీష్ కురూప్ చాయాగ్రహణం కూడా బాగున్నాయి. అందరి నటనా బాగుంది. మోహన్‌లాల్‌ది కాస్త ఎక్కువ. ఇంకేదన్నా చర్చించాలన్నా సస్పెన్స్ కథ కాబట్టి వీలు లేదు. రెండున్నర గంటల చిత్రమైనా ఎక్కడా బోర్ కొట్టదు.
చిత్రం అమేజాన్ ప్రైం లో వుంది, చూడాలంటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here