Site icon Sanchika

దృష్టి మారనంత కాలం..!

[dropcap]హా[/dropcap]మీలెన్నైయినా ఇవ్వచ్చు
ఆచరణలో అమలైనప్పుడే కదా
వాటికి సార్థకత చేకూరేది
అద్భుత వాక్యాలు ఎన్నైనా రావచ్చు
ఆలోచనలను రగిలించినప్పుడే కదా
వాటికి ఫలితం దక్కేది
ప్రసంగాలెన్నైయినా చేయవచ్చు
నరనరాల్లో శక్తి జనిస్తేనే కదా
వాటికి ప్రశంసల జల్లులు కురిసేవి..!

విభిన్న వ్యక్తీకరణల
అంతరంగాల ఘర్షణలతో
చెలగాటాలతో అనునిత్యం
అనుభవించే వేదనలతో
అపరిష్కృతం కాని
జటిలమైన సమస్యలతో
బతుకు పుస్తకంలో
రకరకాలైన పుకార్లతో
అపురూపమైన బహుమతులను
అందుకుంటున్న సన్నివేశాలతో
తెలియకుండానే దుఃఖభరితమైన
ఊబిలోకి దిగబడ్తుంటాం విచిత్రంగా..!

వై ఫై లా ఆవరించిన అశాంతి
పద్మవ్యూహాన్ని తలపిస్తున్నది
మనల్ని మనం మోసపుచ్చుకోవడం వద్దు
ఆధిపత్యాన్ని ధిక్కరించడం మాత్రమే
స్వేచ్ఛ జీవనానికి నిజమైన నిర్వచనం
ఒక చోటనే చెట్టులా నిలవడమనేది
అందరికీ సాధ్యం కాకపోవచ్చు
విస్తరిస్తూనే వికసించాలి
వికసిస్తూనే అల్లుకుపోవాలి
అల్లుకుపోతూనే వ్యాపించాలిక..!

దృష్టి మారనంత కాలం
గొంతు విప్పనంతకాలం
పెత్తనం సాగుతూనే ఉంటుంది
సుమనసుల దీపాలు వెలగాలంటే
సామాజికమైన శాంతి పరిరక్షణకు
మనమంతా పూనుకోవాల్సిందే
అశాంతికి కారణమవుతున్న
నిర్బంధాల వంటి చిక్కుముళ్ళ
సంకెళ్లను ఛేదించాలిక..!

Exit mobile version