Site icon Sanchika

దృశ్యాదృశ్యం

[బెల్జియం రచయిత ఫ్రాంక్ రోజర్ ఆంగ్లంలో రచించిన ‘బియాండ్ హెల్ప్’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 1

[dropcap]మా[/dropcap] తోట చుట్టూ కంచెలగా వేసిన మొక్కలకి బహుశా ట్రిమ్మింగ్ అవసరమేమో చూద్దామని తోటలోకి వెళ్ళాను. అక్కడ హఠాత్తుగా ఎర్రటి జుట్టున్న ఓ మనిషి ప్రత్యక్షమయ్యాడు. నన్ను గమనించిన వెంటనే,

“ఎరిక్, నాకు సహాయం చెయ్యి, రా, ఇది చివరి అవకాశం కావచ్చు! నేను విఫలం కాకూడదు!” అంటూ అరిచాడతను.

నేను అతని వైపు చూస్తూ ఉండిపోయాను, ఒక్క మాట కూడా బదులు చెప్పలేక ఆశ్చర్యంగా ఉండిపోయాను. ఎవరితను? ఇతనికి నా పేరెలా తెలిసింది? అసలు మా తోటలోకెలా వచ్చాడు? అతను దేని గురించి మాట్లాడుతున్నాడు?

“అక్కడే నిలబడిపోకు, ఎరిక్!” అతను అరిచాడు, అతని కంఠంలో భయం! అతని ముఖం కోపంతో ముడుచుకుంది. “ఓ దేవుడా, ఈ మనిషికి ఏమీ తెలియడం లేదు, ఎరిక్, ఇలా మనం ఎన్నిసార్లు కలవాలి? నన్ను గుర్తు పట్టలేదా?”

“గుర్తుపట్టడమా?” నేను అరిచాను. “అసలు మనం ఇంతకు ముందు కలుసుకున్నామని నేను అనుకోను. ఎవరు నువ్వు?”

“అంటే? మనం ఎప్పుడూ కలవలేదనా నీ ఉద్దేశం? ఓ దేవుడా, నాకు అర్థమైంది. మనం కలుసుకోవడం ఇదే మొదటిసారి అయితే, ఇది నా చివరి ఊగాట (స్వింగ్) అని అర్థం. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లుంది. బహుశా నువ్వు చేయగలిగింది కూడా ఏమీ ఉండకపోవచ్చు..”

ఇలా చెబుతూనే ఎంత హఠాత్తుగా వచ్చాడో, అంతే ఆకస్మికంగా మాయమయ్యాడు. నా తోట ఎప్పటిలాగే ఉంది. విస్తుపోయాను. ఇదంతా నిజంగా జరిగిందా? పగటి కలా లేదా భ్రమా? నేను కొన్ని సెకన్లు వేచి ఉన్నాను, కానీ అక్కడంతా మామూలుగానే ఉంది. సరే, కంచె సంగతి చూడాలి. దానికి కటింగ్ అవసరమో చూడమని సిసిలియా చెప్పింది. నేను వసంతపు సూర్యకాంతిని, వెచ్చని గాలిని ఆస్వాదిస్తూ తోట వెనుక వైపు నడిచాను.

అధ్యాయం 2

కంచెకి కొంత ట్రిమ్మింగ్ అవసరమనిపించింది. వెనక్కి తిరిగి గార్డెన్ షెడ్ వైపు వెళ్లబోతున్నాను. ఇంతలో ‘ఇదివరకు లాగే’ ఆ ఎర్రటి జుట్టు మనిషి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.

“ఎరిక్,” అంటూ అరిచాడు, “అమ్మయ్యా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, థాంక్ గాడ్. మరింత ఆలస్యం కాకముందే నువ్వు నాకు సహాయం చెయ్యాలి” అన్నాడు.

“ఓ, మళ్ళీ వచ్చావా,” అన్నాను. “కొన్ని క్షణాల క్రితం నువ్వు అక్కడ కనబడ్డావు. అసలు నువ్వెవరు? ఇలా కనబడి అలా ఎలా మాయమవుతున్నావ్? పైగా నా తోటలోనే ఎందుకు?”

అతను ఆవేశంగా సైగలు చేస్తూ “అదంతా నీకు ముందే చెప్పాను” అన్నాడు. “మళ్ళీ అవన్నీ వివరించడానికి సమయం లేదు. నాకు సహాయం కావాలి, నువ్వు మాత్రమే అందుబాటులో ఉన్నావు.”

“ముందుగా నేను కొన్ని విషయాలు స్పష్టం చేయాలనుకుంటున్నాను,” చెప్పాను. “ఇది నా తోట. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియాలి.”

“అయ్యో, దేవుడా! ఎరిక్, మనం విలువైన సమయాన్ని కోల్పోతున్నాం. పరిస్థితిని యథాతథంగా అంగీకరించి, ఆలస్యం కాకముందే నాకు సహాయం చేయలేవా?” అన్నాడు. అతను సహనం కోల్పోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. భయాందోళనలకు గురికాకపోయినా, దేని గురించో ఆదుర్దా పడుతున్నాడు. ఏం చేసి ఉంటాడో?

“అయితే సరే,” అన్నాను. ఈ వ్యక్తికి ఓ అవకాశం ఇవ్వాలి. బహుశా, మంచివాడేనేమో, నిజంగా సహాయం అవసరమై ఉండవచ్చు. “నేనేం చేయగలను?”

కాస్త స్థిమితపడినట్టున్నాడు. “చూడు,” అన్నాడు. “నువ్వు నాకు..” అని చెబుతూనే మళ్ళీ అదృశ్యమైపోయాడు. నేను శూన్యం లోకి చూస్తూ, ‘ఈ మనిషికి నిజంగానే సమస్య ఉన్నట్లుంది’ అనుకున్నాను.

ఇక కంచె ట్రిమ్మింగ్ పై దృష్టి పెట్టాలనుకుంటూ నేను వెనుదిరిగి గార్డెన్ షెడ్‌ వైపు నడిచాను.

అధ్యాయం 3

తోట పనిముట్లతో కంచె వైపుకి వెళుతున్నాను, ఆ వ్యక్తి మూడవసారి కనబడ్డాడు.

నన్ను చూస్తూనే “మళ్ళీ నువ్వేనా” అంటూ అరిచాడు.

“అవి నేను అనాల్సిన మాటలు” బదులిచ్చాను. “ఏదో సహాయం కావాలన్నావ్?”

“ఇప్పటికి నీకు సరిగ్గా అర్థమైనట్టుంది. నేను నా మూల స్థానం నుండి ముందుకు వెనుకకు దూకుతున్నట్లు అనిపిస్తోంది. ఏం తప్పు జరిగిందో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ నాకు పరిస్థితి స్వభావం తెలుస్తోంది.”

“నీ మూల స్థానం ఏది?” అని అడిగాను. “ముందుకు వెనుకకు దూకడం అంటే ఏంటి? నీ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి?”

“నేను టెంపోరల్ కో-ఆర్డినేట్‌ల మధ్య ఊగిసలాడుతున్నాను. ప్రయోగంలో ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రభావాన్ని అదుపు చేయలేకపోతే, స్థలకాలాదులలో నా స్థిరత్వం నశించి, అంతస్స్ఫోటనం చెంది శూన్యంలో క్షయించిపోతాను. నా ఉనికినే కోల్పోతాను!”

“నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మామూలు మనుషుల భాషలో మళ్ళీ చెప్పవా?”

“సారీ, వాటన్నింటికీ సమయం లేదు. అయినా, నాకు సహాయం చేయడానికి నా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు.”

“అయితే నేను ఏం చేయాలో చెప్పు. త్వరగా. నువ్వు ఒకటి కంటే ఎక్కువ వాక్యాలను పూర్తి చేసేలోపే – కనబడి, మాయమవతున్నావు.”

“నిజంగానా? నేను తరచూ ఇక్కడికి వస్తున్నానని నీ ఉద్దేశమా? అది కూడా కేవలం కొన్ని క్షణాల కోసం?”

“అవును.”

“దేవుడా! అలా అయితే..” అంటూనే ఆ మనిషి అదృశ్యమైపోయాడు. నేను భుజాలెగరేసి, పనిముట్లను అందుకున్నాను. మళ్లీ అంతరాయం కలిగే లోపు కంచె ట్రిమ్మింగ్ చేయడం మంచిది.

అధ్యాయం 4

ఆ వ్యక్తి నాలుగోసారి కనిపించినప్పుడు కంచె ట్రిమ్మింగ్ సగం పూర్తయింది.

“ఎరిక్! నిన్ను మళ్లీ చూడటం ఆనందంగా ఉంది, అయితే నేను మరోసారి ఇక్కడకొస్తానని ఊహించలేదు.”

“చూడు, విలువైన సమయాన్ని పోగొట్టుకోకు. నేనేం తెలుసుకోవాలో చెప్పు, ప్రత్యేకంగా నీకు సహాయం చేయడానికి నేనేం చేయాలో చెప్పు” అన్నాను.

“నాకు సాయమా? కాలంలో నేను కొన్ని ఊహించని గెంతులు గెంతి ఉండవచ్చు, కానీ నా సమస్యను నేను స్వయంగా పరిష్కరించుకోగలనే? నాకు సహాయం అవసరమని నీకెందుకు అనిపించింది?”

“కనబడ్డప్పుడల్లా నువ్వు నన్ను సాయం చేయమనే అడిగావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు, చాలా భయాందోళనలతో ఉన్నావు. ఇక అసలు విషయానికొస్తావా?”

“అంటే, నేను ఇక్కడకి కొన్ని సార్లు కంటే ఎక్కువగా వచ్చాననా నీ ఉద్దేశం?”

“అవును, ఇక్కడికే మళ్ళీ మళ్ళీ వస్తున్నావు.”

మనిషి ముఖం చిట్లించాడు. “అయ్యో, అయితే ఇది శుభవార్త కాదు. దీనర్థం.. అది మాత్రమే” అంటూ అతను ఆలోచనలో కూరుకుపోయాడు. నోట్లోంచి మాటలు రాలేదు.

“ఏదో ప్రయోగం వికటించిందన్నావు. అన్ని వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ నేను నీకు సహాయం చేయాలంటే, కనీస సమాచరం తగినంతగా తెలుసుకోవాలి. ఇప్పుడైనా దయచేసి దీని గురించి చెప్పు.”

ఆ వ్యక్తి మూగబోయి నా వైపు చూశాడు. “వివరాలు వెల్లడించడానికి నాకు అనుమతి లేదు. కానీ నేను నీకు ఇంతకు ముందే చెప్పినట్లయితే.. గత్యంతరం లేకపోయి ఉంటుంది” అన్నాడు.

“ముందుకు వెనుకకు దూకడం గురించి ఏదో చెప్పావు.”

“అవును, ఈ నిర్దిష్ట సమయ వ్యవధిలో నేను గడిపిన క్షణాలను మాత్రమే నువ్వు చూశావు, ఈ ఆపరేషన్ మొత్తం అవగతమవ్వాలంటే ఇది సరిపోదు, పైగా ఇది చాలా రహస్య వ్యవహారం. కాబట్టి నా ఊగాటకి (స్వింగ్‌కి) అవతలి వైపు ఏమి జరుగుతుందో నేను మీకు ఏమీ చెప్పలేను. అర్థం చేసుకో..” చెప్తునే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు.

అతని రహస్యాన్ని, సహాయం కోసం చేసిన అభ్యర్థనను తన వెంట తీసుకెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి ఇలా.. వెనుకకు దూకడం – ప్రతి సందర్భంలోనూ కాలంలో నిర్దిష్ట సమయం కన్నా ముందుగా వచ్చినప్పుడు – సాధారణ సంభాషణలు నిర్వహించడానికి, సంక్లిష్ట పరిస్థితులను వివరించడానికి లేదా సహాయం అందించడానికి అనువైనది కాదు. అయినప్పటికీ, దాని గురించి నేను చేయగలిగేది చాలా తక్కువ.

సరే, నేను కంచె ట్రిమ్మింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.

అధ్యాయం 5

కంచెని చివరిగా పరిశీలించాను, అవసరమైన మేరకు తగినట్టుగా ట్రిమ్ చేశాను. పనిముట్లని గార్డెన్ షెడ్‍లో పెట్టేయడానికి వస్తుండగా ఆ వ్యక్తి మరోసారి ప్రత్యక్షమయ్యాడు.

“మళ్ళీ వచ్చావా,” అన్నాను. “ఇప్పుడైనా చెప్పు, నేను నీకెలా సహాయం చేయగలను?”

“నేను నీకు తెలుసా?” ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ అడిగాడు. “మనం ఎక్కడ కలుసుకున్నాం? నువ్వు నాకేం సహాయం చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు.

“నా పేరు ఎరిక్,” అన్నాను. “నువ్వు ఇక్కడికి తరచూ వస్తున్నావు. నువ్వు కాలంలో ముందుకు వెనుకకు దూకుతున్నట్లు అనిపిస్తోంది. నువ్వు నా సహాయం కోసం తహతహలాడుతున్నావు. సరే, నువ్వు ఇక్కడకు రావడం మొదటిసారే అనుకుందాం. నీ దృష్టికోణంలో, ఇది చివరిసారి. లేదా అదే చివరిసారి అవుతుంది. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది.”

“నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు,” ఆ వ్యక్తి నన్ను అనుమానంగా చూస్తూ అన్నాడు. “మనం ఇంతకు ముందెన్నడూ కలవలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇక, దయచేసి, నన్ను ఒంటరిగా వదిలేసి, ఈ ‘కాల సమస్య’ అని నువ్వంటున దాని గురించి మాట్లాడటం మానేస్తే బావుంటుంది.”

“నువ్వు నా తోటలో ఇలా ప్రత్యక్షమైనప్పుడు నిన్ను ఒంటరిగా వదిలివేయమని నన్ను అడగలేవు,” నేను గట్టిగానే బదులిచ్చాను.

“ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం.” పరిస్థితిని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ అతడితో అన్నాను.

“నువ్వు నన్ను మొదటిసారి కలిసినప్పటి నుండి నాతో అనేక సందర్భాల్లో మాట్లాడావు. ఏదో భయంకరమైన సమస్యను పరిష్కరించడానికి తహతహలాడుతున్నావు. ఎక్కడ ఏం తప్పు జరిగిందో, అదెంత తీవ్రమైనదో అప్పటికే నీకు తెలిసిందనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడేమో, మొదటిసారిగా, నేనెవరో అసలు తెలియదన్నట్టు, నీ రహస్య ప్రయోగాల గురించి మళ్ళీ ఈసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు నాకు ఏం చెప్పబోతున్నావో నీకు తెలియదంటున్నావు. అసలు నేనెవరో, ఇదంతా ఎందుకు అని బహుశా ఆలోచిస్తూ ఉంటావు. ఇదే నేను నీకు చెప్పదలచినది” అన్నాను.

ఆ వ్యక్తి నన్ను కోపంగా చూస్తూ ఇలా అన్నాడు: “నిజంగా చెప్పాలంటే, ఏం చెప్పాలో తెలియదు. ఇది చాలా దూరం వెళుతోంది. ఇప్పుడు దయచేసి, నన్ను క్షమించినట్లయితే, నేను నిర్ధారించుకోవాలి..” అని ఏదో అంటూనే మళ్ళీ అదృశ్యమైపోయాడు.

నేను మరోసారి ఒంటరిగా నిలబడి ఉన్నాను. ఇప్పుడిది నిజంగా ఆ మనిషి మొదటి గెంతు అయితే, నేను అతనిని మళ్లీ చూడలేను. నేను కొన్ని సెకన్లపాటు వేచి చూశాను, ఏమీ జరగలేదు. పరికరాలను భద్రపరచడానికి గార్డెన్ షెడ్‌కి వెళ్లాను. నేను ఊహించినదే నిజమే. ఆ మనిషి బహుశా ఇక మళ్ళీ కనబడడు.

నేను లోపలికి వెళ్ళేసరికి, అప్పుడే స్నానం చేసొచ్చిన సిసిలియా ఎదురొచ్చింది.

“నువ్వు ఎవరితోనో మాట్లాడటం విన్నాను,” అంది, ఆమె స్వరంలో ఆందోళన! “మన తోటలో ఎవరైనా ఉన్నారా? ఎవరా వ్యక్తి?” అడిగింది.

“పట్టించుకోకు,” నెమ్మదిగా చెప్పాను. “ఏ సమస్యా లేదు. సాయం కావాలంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. సాయానికి అతీతుడు. డోంట్ వర్రీ” అన్నాను.

ఆంగ్ల మూలం: ఫ్రాంక్ రోజర్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్


ఫ్రాంక్ రోజర్ 1957లో బెల్జియంలోని ఘెంట్‌లో జన్మించారు.

ఆయన మొదటి కథ 1975లో ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన కథలు అన్ని పత్రికలు, సంకలనాలలో చోటుచేసుకున్నాయి. 2000 నుండి, వివిధ భాషలలో కూడా కథా సంకలనాలు ప్రచురించబడ్డాయి. ఫిక్షన్ కాకుండా, ఆయన సర్రియలిస్ట్, సెటైరిక్ పద్ధతులలో కొలేజ్‌లు, గ్రాఫిక్ వర్క్‌లను కూడా రూపొందిస్తారు. ఇవి వివిధ పత్రికలు, పుస్తకాలలో వచ్చాయి.

ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ కథలు వెలువరించారు, వాటిలో కొన్ని హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగుతో సహా 40 కంటే ఎక్కువ భాషలలో అనువాదమయ్యాయి.

సంచికలో గతంలో వీరి మరో అనువాద కథ ‘అంతరిక్షంలో ఆగంతకులు’ ప్రచురితమైంది.

Exit mobile version