[dropcap]”మ[/dropcap]న తమిళనాడులా జయలలితమ్మ సచ్చినబుడు ఆయమ్మ సావు సుద్ది విని శానా జనము సచ్చిపోయిరి. అట్లే ఆంధ్రాలా రాజశేఖర రెడ్డి సారు సచ్చినబుడు అయె. ఏ టీవిలా చూసినా సావు సమాచారమే. కాని మన దేశానికి తన బుద్ది తెలివితో ఎంతో మేలు చేసిన పెద్దాయన అబ్దుల్ కలామ్ గారు పోయినబుడు ఇట్ల కాలే, ఏలనా?” అంటా నంజన్నని అడిగితిని.
“రెయ్! పెద్దాయనది బుద్ది బలము, వీళ్ళది దుడ్డు బలము. అది అసలు సమాచారము. దాన్నింకానే ఇట్లాయ” అనె అన్న.
“అంటే మన దేశములా దుడ్డే దొడ్డప్ప అంటావానా?” తిరగా అడిగితిని.
“మన దేశములానే కాదు, దేశానుదేశాలలో కూడా దుడ్డే దొడ్డప్ప” అనె.
“మనిషి పుట్టబడి చేసిన దుడ్డు మనిషికి ఎట్ల దొడ్డప్ప ఆయే” అంటా అనుమానం పడితిని.
“ఆ… ఆ… ఆడేవుందిరా అసలు కత. ఆ దుడ్దును నేనే పుట్టబడి చేసింది అనె బుద్ది మనిషికి ఇబుడు లేకపోయ” అని పాయ అన్న.
అన్న అట్ల పోతానే నేను పోయి మనుషులందరికి ఈ విషయము చెప్పితిని.
నన్ని చూసి కొందరు జాలిపడిరి, కొంద్రు తిట్టుకొనిరి. ఇంకొంద్రు ముసిముసి నగవులు నగిరి (నవ్విరి).
***
దుడ్డు = డబ్బు