దుఃఖ నివారణ కోసం సాధనా మార్గం

0
46

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దుఃఖ నివారణ కోసం సాధనా మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:
అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుసోచంతి పండితాః
(భగవద్గీత 2వ అధ్యాయం, శ్లోకం 11)

భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు దుఃఖించరు.

మానవాళికి తమ హృదయాలలో జన్మ జన్మలుగా పేరుకొని పోయివున్న దుఃఖాని తొలగించుకునేందుకు భగవానుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకొని పల్కిన పలుకులు ఇవి.

అర్జునుడు, తనకు మాత్రం సరి అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ, కృష్ణుడు అతనిపై జాలి పడలేదు, సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. ‘అర్జునా, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు-వివేకము కలిగినవారు-ఎప్పుడూ శోకింపరు, అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే, అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది. పైగా అధర్మాన్ని నశింపజేసే ప్రక్రియలో అవతలివారు మనకు హితులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, రక్త సంబంధీకులైనా సరే ఉపేక్షించరాదు. రక్త సంబంధాలకు, మమతానురాగాలకు లొంగిపోయి, వారిని ఉపేక్షిస్తే మనమే స్వయంగా అధర్మానికి మద్దతు ఇచ్చినవారివి అవుతాం అన్నది భగవంతుని ఉవాచ. కర్తవ్య కర్మలలో ప్రతీ ఒక్కరూ విధిగా గుర్తుంచుకొనవలసిన అద్భుతమైన బోధ ఇది.

భగవంతునికి సత్వశ్య శరణాగతి చేసిన వారు, తమ కార్యాలను నిర్వర్తించిన తర్వాత వచ్చే ఫలితాల చేత ప్రభావితం కాకుండా, వాటిని ఎప్పుడూ ఆశింపక, అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు, అని భగవానుడు ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఇచ్చాడు.. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్నీ ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు మరియు ప్రసాద భావంతో సదా జీవిస్తారు.

అర్జునుడికి తాను ఒక గొప్ప వీరుడినన్న అహంకారంతో పాటు గొప్ప ప్రాజ్ఞుడినన్న గర్వం కూడా వుంది. అయితే భౌతిక పదార్ధాల కంటే ఆత్మ జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం, ఆత్మ విచారణ లోపించినందున అతను ప్రాజ్ఞుడు కాడని, అతని భౌతిక విజయాలు అల్పమని భగవంతుడు పరోక్షంగా ఈ పలుకుల వలన తెలిపాడు.

మరొక శ్లోకం ద్వారా భగవానుడు దుఃఖ నివారణోపాయానికి ఒక అద్భుతమైన సాధనా మార్గం తెలిపాడు. ‘అర్జునా! ఏ వ్యక్తి అయినా దుఃఖనివారణ పొందాలంటే ముందుగా రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. అంతఃకరణాన్ని తన అధీనంలో ఉంచుకొని, ఇంద్రియాలను వశపరచుకోగలగాలి. అప్పుడు మనస్సు మన స్వాధీనంలోకి వస్తుంది. దాంతో అతనిలోని ‘విషయలౌల్యం’ కాస్తా మటుమాయమవుతుంది. అప్పుడతను ఎన్ని విషయాలమధ్య తిరుగాడినా ఎంతో మానసిక ప్రశాంతతను సాధించి, దుఃఖానికి దూరమవుతాడు.మనం చేసిన కర్మలే సుఖదుఃఖాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. వాటిని అనుభవింపజేసేది పరమేశ్వరుడే అయినా, అనుభవించాల్సింది మనమే! అందుకే ఓంకార వాచ్యుడైన పరమేశ్వరుడు మనల్ని దుఃఖ విముక్తులను చేయడానికి సర్వసమర్థుడు కనుక అతనినే మనం స్మరించాలి. ఆయన్నే ధ్యానించాలి, ఉపాసించాలి. అన్యధా శరణం నాస్తి అంటూ భగవంతునికి సర్వశ్య శరణాగతి చేయాలి. అదియే అత్యుత్తమ సాధనా మార్గం.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here