Site icon Sanchika

దుఃఖలిపి

[box type=’note’ fontsize=’16’] “అందరికీ దుఃఖం యొక్క బాహ్య రూపమే తెలుస్తుంది కాని అంతర్ రూపం గురించి పట్టించుకోరు. అంతర్గతమైన దుఃఖానికి మౌనం తప్ప అసలు మాటలు వస్తేగా” అంటున్నారు సలీం – ‘దుఃఖలిపి’ కల్పికలో. [/box]

[dropcap]నే[/dropcap]ను ఇంటర్ చదివే రోజుల్లో మా యింటిపక్కన కొత్తగా అద్దెకు ఓ కుటుంబం దిగింది. మొగుడూ పెళ్ళాం, మూడున్నరేళ్ళ పాప.. ఆయన చిన్నపాటి వ్యాపారమేదో చేసేవాడు. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. రబ్బరు బొమ్మలా ముద్దొచ్చే ఆ పాపకూ నాకూ మధ్య అనుబంధం పెరిగింది. నేను కాలేజీ నుంచి ఎప్పుడొస్తానా అని ఎదురుచూసేది. నేనొచ్చాక రాత్రి నిద్ర ముంచుకొచ్చేవరకు మా యింట్లోనే ఉండేది. ఒక్కోసారి మా యింట్లోనే పడుకుంటే వాళ్ళమ్మ వచ్చి ఎత్తుకెళ్ళేది. నేను బజారుకెళ్తే పాపని పిల్చుకెళ్ళాల్సిందే. క్షణం వదిలి ఉండేది కాదు. ఆ పాప పేరు రమ్య.

నేను చెప్పే కథలు వినడమంటే చాలా ఇష్టం రమ్యకు. రోజూ పడుకునేముందు దానికో కథ విన్పించాల్సిందే. రాజుల కథలు, మాంత్రికులు, మాయలు, పులులు, సింహాలు… ఇలాంటి కథలంటే చెవి కోసుకునేది. బాగా కల్పించి రకరకాల కథలు చెప్పటం నాకూ అలవాటైంది. నేను చదువుకుంటుంటే వచ్చి ‘కథ చెప్పన్నా ప్లీజ్’ అని ముద్దుగా అడిగేది. ‘మొదట చదువు… తర్వాతే కథలు’ అనడం ఆలస్యం వాళ్ళింటికి తూనీగలా పరుగెత్తుకెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని బుద్ధిగా చదువుకునేది. చాలా తెలివిగల పిల్ల. రైమ్స్ చెప్పమంటే చాలు ‘ట్వింకిల్ ట్వింకిల్…’ అంటూ మొదలెట్టి చక్రాల్లాంటి కళ్ళని నక్షత్రాల్లా మెరిపిస్తూ అన్నీ వొప్ప చెప్పేసేది.

అన్ని విషయాల్లో వాళ్ళమ్మ మాట వినేది కానీ తిండి దగ్గర మాత్రం పేచీ పెట్టేది. అన్నం తినేది కాదు. మ్యాగీలు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు.. వీటిని మాత్రమే ఇష్టంగా తినేది. ఓ రోజు భారతం కథ చెప్తూ అన్నంలో పప్పు, నెయ్యి కలుపుకుని తినడం వల్లనే భీముడికి చాలా బలమొచ్చిందని చెప్పాను. ‘మ్యాగీ తింటే బలం రాదా?’ అని అడిగింది. ‘రాదు’ అంటే మొహం దిగులుగా పెట్టి ‘అయ్యో అన్నా.. నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా’ అంది. కానీ ఆ రోజునుంచి పేచీ పెట్టకుండా అన్నం తినేది.

ఇంటర్ తర్వాత కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో డిగ్రీలో చేరాను. రమ్య నా కోసం బెంగెట్టుకుందని అమ్మ ఉత్తరం రాస్తే కాలేజీలో చేరిన రెండు వారాలకే ఇంటికొచ్చి ఓ నాలుగు రోజులు పాపను లాలించి తిరిగి కాలేజీకెళ్ళిపోయాను. అమ్మ రాసే ఉత్తరాల్లో ఎక్కువగా పాపకు సంబంధించిన కబుర్లే ఉండేవి. ఎంత ముద్దుముద్దుగా మాట్లాడేదో.. ‘అన్న ఎపుడొస్తాడు?” అని అమ్మను రోజూ విసిగించేదట. నేను లేకున్నా ఎక్కువ సమయం మా యింట్లోనే వేలాడేదట. ‘అన్నకు చెప్పు. నేను రోజూ అన్న చెప్పినట్టే అన్నం తింటున్నానని. నేను గుడ్ గర్ల్‌లా ఉన్నానని చెప్పు’ అని అమ్మ ద్వారా తనకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసేది. డిగ్రీ రెండో సంవత్సరం హాఫ్ ఇయర్లీ పరీక్షల తర్వాత వూరికి ప్రయాణమైనాను. పాప కోసమని బొమ్మలు, చాక్లెట్లు కొన్నాను.

బస్ దిగి ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి పది దాటింది. భోజనం చేశాక “అమ్మా పాప పడుకుని ఉంటుందా?” అని అడిగాను. అమ్మ ఏదో పని చేసుకుంటూ వూ అంది. మరునాడు ఉదయం పాప రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో వాళ్ళమ్మ వచ్చింది. ఎంత మారిపోయిందో… మూణెల్ల క్రితమేగా చూసింది… పెద్ద కళ్ళతో ఎప్పుడూ చెరగని నవ్వుతో కళకళలాడుతూ ఉండే మొహం వాడిపోయి వడలిపోయి ఉంది. పది లంఖణాలు చేసిన దానిలా నీరసంగా వచ్చి నాకు కొద్ది దూరంలో నిలబడింది. నేను ఏదో అడిగేలోపలే “మా పాప చచ్చిపోయింది బాబూ… నెల కావస్తోంది” అంది. అనంతమైన దుఃఖమేదో నా ముందు కుప్పలుగా ఒంపేసినట్టు అన్పించింది.

“ఎలా చచ్చిపోయింది?” అని అడక్కముందే ఆమె చెప్పసాగింది. “ఆ రోజు కూడా యూనిఫాం వేసుకుని, టై కట్టుకుని చక్కగా తయారయి నాకు బై మమ్మీ అని చెప్పి స్కూల్ కెళ్ళింది. స్కూల్ వదిలాక ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అది కూచుని ఉన్న రిక్షాని వెనకనుంచి వేగంగా వచ్చిన బస్ గుద్దేసిందట. పాప ఎగిరి రోడ్డు మధ్యలో పడిపోయిందట. తలకు బలమైన దెబ్బలు తగిలాయని డాక్టర్ చెప్పాడు. ఆస్పత్రిలో పాపకు ఆపరేషన్ చేశారు. ఐనా పాప బతకలేదు. యాక్సిడెంట్ జరిగిన మూడోరోజు చనిపోయింది బాబూ. స్పృహ వచ్చినపుడల్లా ‘అన్న ఎపుడొస్తాడు మమ్మీ’ అని అడిగేది. ‘అన్న నాకు కథలు చెప్పి ఎన్ని రోజులైందో. ఈ సారి అన్న వస్తే ఇన్ని కథలు చెప్పించుకుంటా’ అనేది”

ఆమె ఏడుస్తోంది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. మొదట నేను షాక్‌కి లోనై శిలలా ఘనీభవించాను. ఆ సమయంలో ఏం చెప్పి ఆమెను ఓదార్చాలో అర్థం కాలేదు. ఏం చెప్పినా ఆ కడుపుకోతకు ఓదార్పు లభిస్తుందా నా పిచ్చి గానీ. నాలోనూ అనంతమైన దుఃఖం నదిలా పొంగి రక్తనాళాల్లో ప్రవహించసాగింది. ‘ఆ దుఃఖం మీదే కాదు నాది కూడా’ అంటోంది మనసు. కానీ దాన్ని మాటల్లో ఎలా తర్జుమా చేయడo? సంతోషాన్ని పంచుకోవడం సులభం… దాన్ని వ్యక్తపర్చడమూ సులభమే. దుఃఖపడటం తప్ప ఆ దుఃఖాన్ని ఎలా వ్యక్తపర్చాలో తెలియటం లేదు.

ఆమెతో పాటు నేనూ కన్నీళ్ళు పెట్టుకుంటేనే బాధపడినట్టా? కన్నీళ్ళు రెప్పల చెలియలికట్ట దాటి ప్రవహిస్తేనేనా బాధకు సంకేతం? లోపల్లోపల సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ళ సంగతేమిటి? హృదయం కరిగి కన్నీటి సంద్రమైందే… దాని మాటేమిటి?

నా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు ఆమె మరికొన్ని క్షణాలు నా ముందు నిలబడింది. నేను గడ్డకట్టుకుపోయాగా.. నేనేమీ మాట్లాడకపోవటం వల్లనో ఏమో మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. “అదేంట్రా అబ్బాయ్. పాపం ఆమె తమ పాప చనిపోయిన విషయం చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు గమ్మునుండిపోయావు? ఆమె ఏమనుకుంటుంది? పాప చనిపోయిన సంగతి నేను ఉత్తరంలో రాస్తానంటే నువ్వా వార్త విని తట్టుకోలేవని వద్దని వారించింది. నువ్వొచ్చినా నన్ను కూడా ఆ విషయం చెప్పొద్దని చెప్పింది. తనే స్వయంగా నీతో చెప్పి తన బాధని పంచుకోవాలని నెలనుంచీ నీ రాకకోసం ఎదురుచూస్తుంటే పాపం ఆ తల్లిని ఎంత నిరాశకు గురి చేశావో కదా” అంటూ అమ్మ కోప్పడింది.

ఇది జరిగి దాదాపు నలభై యేళ్ళు. ఇప్పటికీ నాకు ఎవరైనా పరిచయస్థులు, ఆత్మీయులు, స్నేహితులు చనిపోయారని తెలిసినపుడు ఎలా స్పందించాలో తెలియదు. “రాయటం తప్ప మాట్లాడటం చాతకాదు” అనుకుంటూ ఉంటాను. అది నిజం కాదేమో. నేను కూడా దుఃఖపడ్తున్న విషయాన్ని ఎలా ఎదుటి వ్యక్తికి తెలియచేయాలో తెలీని పరిస్థితి. అందరికీ దుఃఖం యొక్క బాహ్య రూపమే తెలుస్తుంది కాని అంతర్ రూపం గురించి పట్టించుకోరు. అంతర్గతమైన దుఃఖానికి మౌనం తప్ప అసలు మాటలు వస్తేగా..

పదేళ్ళ క్రితం నా క్లాస్‌మేట్ ఒకతను గుండెనొప్పితో చనిపోయాడు. గుండెలో బ్లాక్స్ ఉన్నాయని స్టెంట్లు వేసిన వారంలోపే మరణం సంభవించింది. ఇద్దరు ఆడపిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నారు. నేను వెళ్ళి అతని పార్థివ శరీరాన్ని చూసి బైటికొచ్చేశాను. భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న ఆమెతో ఏం మాట్లాడాలి? “చావనేది ఎవ్వరికైనా తప్పదు కదమ్మా.. కొందరు ముందు కొందరు తర్వాత.. అంతే” అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడినా ఆమె దుఃఖం ఉపశమిస్తుందా? శుష్క ప్రవచనం అనుకోదా? చాలామంది ‘ఐ యాం సారీ’ అంటుంటారు. ఎందుకు సారీ? వాళ్ళేం చేశారని సారీ? ‘అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లీ నీకు… ఇద్దరాడపిల్లలు.. ఒంటిచేత్తో ఎలా నెగ్గుకొస్తావో ఏమిటో’ అంటూ సానుభూతి చూపిస్తారు మరికొందరు. కొన్ని సమయాల్లో మనుషులు చూపించే సానుభూతి బాధను, భవిష్యత్తుమీది భయాన్ని ఇనుమడింప చేస్తుంది తప్ప ఉపశమింపచేయదు.

చాలామంది ‘రెస్ట్ ఇన్ పీస్’ అనో ‘అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అనో మెసేజ్లు పెడ్తూ ఉంటారు. అన్నిటికంటే సులభమైన పద్ధతి ఇదే అనిపిస్తుంది. ఎటొచ్చీ ఆత్మలుంటాయని నమ్మని వ్యక్తులైతే మరోలా మెసేజ్ పెడ్తారనుకుంటా. కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబంతో ప్రత్యక్షంగా మాట్లాడాల్సి వచ్చినపుడే ఇబ్బంది వస్తుంది. ఈ మధ్య ఓ తమిళ కథ చదివాను. ముప్పయ్ రెండేళ్ళ తమ కొలీగ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ వార్తను అతని భార్యకు చేరవేయమని ఒకతన్ని పురమాయిస్తారు. అంతటి దుఃఖపూరితమైన విషయాన్ని ఎలా చెప్పాలో తెలీక అతను పడే ఇబ్బందే కథంతా. నా ఉద్దేశంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి మాట్లాడటం కూడా ఇబ్బందే. ముఖ్యంగా ఆ వ్యక్తి హఠాత్తుగా అర్ధాయుష్చుతో చనిపోయిన సందర్భంలో… నిండు నూరేళ్ళు బతికి చనిపోతే ‘జీవితాన్ని సంపూర్ణంగా జీవించిపోయాడు. అదృష్టవంతుడు’ లాంటి మాటలు మాట్లాడవచ్చు. ‘ఇంకా కొన్నేళ్ళు బతికి మంచంలో పడి తీస్కుని తీస్కుని చావడంకంటే ఇలా తిరుగుతూ తిరుగుతూనే పోయాడుగా. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అందుకు మీరు సంతోషించాలి’ అని అతని చావులోని పాజిటివ్ కోణాన్ని కూడా చెప్పవచ్చు.

మనకు బాగా ఆత్మీయులైన వ్యక్తులు చనిపోయినపుడు తప్పకుండా మనమూ బాధపడతాం. దుఃఖంలో మునిగిపోతాం. కానీ దాన్ని మాటల్లో చెప్పడం సాధ్యమా? తీవ్రమైన భావోద్వేగాల్ని అనుభవించడం తప్ప మాటల్లోకి పూర్తిగా తర్జుమా చేయగలమా? దానికి మనకు తెల్సిన భాష సరిపోతుందా? బోలుగా నాలుగు మాటలు మాట్లాడే బదులు మౌనంగా దుఃఖాన్ని మోసుకుంటూ తిరిగి రావడమే మంచిది కదూ.

Exit mobile version