దురదలలో పలు రకాలు!

1
2

(సంచిక పాఠకుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ అందిస్తున్న వ్యంగ్య హాస్య రచన.)

కం.

తీటగల భాగ్యశాలికి
వాటముగ గోళ్ళు వుండి – వేడినీళ్ళున్నన్
సాటియె సౌఖ్యము భువిలో
తీటే దేవేంద్ర పదవి తెలియుము నరుడా!

అన్నాడు వెనకటికి అధిక ప్రసంగి అయిన ఒక కవి.

తీటని దురద అని, జిల అని, దూల అని కూడా అంటారు. రాయలసీమలో మేం దీన్ని ‘నవ్వ’ అంటాము. ఇంగ్లీషు వాడు దీన్ని ‘ఇచ్చింగ్ సెన్సేషన్’ అన్నాడు. రూపాలు వేరయినా పరమాత్మ ఒక్కడే కదా! అందుకే, ‘ఏకం సత్, విప్రాః బహుధా వదన్తి’ అంటూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మాటలు వేరైనా అరిస్టాటిల్ గారు చెప్పినట్లు, దాని ఇంపోర్ట్ (పర్మార్థం) ఒక్కటే.

చిన్నప్పుడు నేను ప్రతిదానికీ ఆరాటపడిపోతుంటే, మా అమ్మ “ఈ వెధవకి అతి ఉలగరం!” అని ప్రేమగా విసుక్కునేది. అమ్మలెప్పుడూ ప్రేమగానే విసుక్కుంటారు. కానీ భార్యలు మాత్రం నిజంగానే విసుక్కుంటారు సుమండీ! ‘ఉబలాటం’ అనే పదం కూడా దురదకు సమానార్థకమే తెలుసాండీ? ‘దురదగుండాకు’ అని ప్రకృతితో ఒకదాన్ని దేవుడు సృష్టించాడు. అది పూలు పూయదు. కాయలు కాయదు. కానీ దాని కొమ్మతో మేని మీద నిమిరితే, ఒళ్ళంతా విపరీతంగా దురదలు పుట్టుకొస్తాయి. మన పాత జానపద సినిమాలలో యన్టీఆర్, అంజిగాడితో కలిసి, విలన్లు రాజనాలనో, సత్యనారాయణనో – దురదగుండాకు పూసి ఏడిపిస్తూంటారు, మారు వేషాలలో! హాల్లోని ప్రేక్షకులందరికీ మారు వేషగాళ్ళు ఫలానా అని తెలుసు, విలన్లకి తప్ప. అదే చలన చిత్ర చమత్కారమంటే!

అసలు విషయం వదిలేసి, ఎక్కడికో.. వెళ్ళిపోయాను. ఈ రోజు నేను చెప్పదలచుకున్నది శరీరం మీద వచ్చే దురద గురించి కాదండోయ్! మనస్సులో వచ్చే దురద గురించి. మొదటిది కాసేపు గోక్కుంటే తగ్గుతుంది. గోక్కోడం వేరు, గోకించుకోవడం వేరు. మీకు తెలియంది కాదు. వెనకటి ఒకాయన కొడుకుని అడిగాడట, “జంధ్యం వల్ల ప్రయోజం ఏమిటి?” అని. “వీపు గోక్కోవడానికి భేషుగ్గా పనికొస్తుంది పితాశ్రీ!” అని చెప్పాడట ఆ పుత్ర రత్నం. చక్కగా రోజూ సంధ్య వార్చుకునే శ్రోత్రియులు నన్ను క్షమించాలి! పెళ్ళితో బాటు వడుగు చేసుకునే నవ యువకులు, ‘సంధ్య’ అంటే అదేదో అమ్మాయి పేరనుకునే నాగరికులకు మాత్రం నో అపాలజీ!

ఇంగ్లీషు వారికి ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’ అని ఉంది లెండి. పెళ్లయిన ఏడేళ్ళకు భార్య మొహం మొత్తి, పక్క చూపులు చూడడాన్ని అలా అంటారు. “అదేం పోయే కాలం?” అని విస్తుపోతున్నారా? మనలాగా జీవితాంతం ఒక్కరికే కట్టుబడి ఉంటే పవిత్ర వివాహ బంధం కాదు వాళ్ళది. ‘నాతి చరామి’లూ, ‘నాతి చరితవ్యా’లూ వాళ్లకు ఉండవు. ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’ మీద చాలా జోక్స్ ఉన్నాయి. నెట్‍లో చదివి ఎంజాయ్ చేయండి.

‘కీర్తి కండూతి’ కూడా దురద క్రిందకే వస్తుంది. ‘కండూతి’ అన్నది సంస్కృత పదం. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకోవడం, దాని కోసం మీడియాలో అవాకులూ చెవాకులూ వాగడం, డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవడం, డబ్బులిచ్చి పి.హెచ్.డి. థీసిస్‍లు రాయించుకోవడం, ఇలాంటివన్నీ అవే!

షాపింగ్‍లు చేసి, మాల్స్ వాళ్ళను పోషించడం కూడా ఒక విధమైన తీటే. ఆఫర్ల పేరుతో అనవసరమైనవన్నీ వాళ్ళు అమ్ముతారు. కొనేవాళ్ళకు ఇంగితం ఉండాలి కదా! దీన్ని ‘కన్స్యూమరిజమ్ ఇచ్’ అందామా? ఇ.ఎమ్.ఐ.ల కల్చర్ వచ్చి, ఈ దురద ఇంకా పెరిగింది. వీకెండ్ ఔటింగ్‍లు సరేసరి! వీటివల్ల టెక్కీల పర్సుల weakened అవుతుంటాయి. బంగారంలా ఉన్న కారును ప్రతి మూడు సంవత్సరాలకు మార్చి, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‍లో కొత్తది తీసుకోవడం ఒక దురద. జీవితాంతం కార్ లోన్ తీరుస్తుంటే గాని వారికి తోచదు. “వారి డబ్బు వారిష్టం! నీకెందుకోయ్?” అంటున్నారా? నాదీ ఒక రకమైన దురదేనండి!

‘దూల’ అనేదొకటుంది. మన కొత్త సినిమాల్లో రవితేజ, బ్రహ్మానందం లాంటి వారు “దూలా తీరిందా?” అంటూ హాస్యాన్ని పండిస్తుంటారు. “బాగా శాస్తి అయ్యిందిలే” అని కవి హృదయం. ఇక ‘సెల్లు దూల’ అని ఒకటి వచ్చింది. తనకి తెలిసినది, అవతలి వాడికి తెలియనిది (ముఖ్యంగా నెగటివ్ అంశాలు) వెంటనే ఫోన్ చేసి చెబితే గాని, ఆ దూల తీరదు. ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్నట్లుగా ఈయన కల్పనా చాతుర్యం కొంత జోడించి, వండి వారిస్తే గాని కడుపుబ్బు తగ్గదు. “నీకు తెలుసా వదినా! ఆ త్రిపుర సుందరి కొడుక్కు ఆల్రెడీ పెళ్ళయి, రెండేళ్ళ కొడుకున్నాడట, అమెరికాలో! కోడలు కిరస్తానం పిల్లట! ఈమేమో ‘మా వాడికి సంబంధాలు చూస్తున్నామ’ని గొప్పగా చెబుతూంటుంది”. వాళ్ళ కుటుంబం తిప్పలు వాళ్ళు పడతారు. ఈమెకెందుకు చెప్పండి? ఈ ‘అట’లు చాలా థ్రిల్‍ను కలిగిస్తాయి చెప్పేవారికి, వినేవారికి కూడా! దీన్నే ‘సందేశ దూల’ అనవచ్చు.

ఉచిత సలహాలు ఇవ్వడం కూడా అలాంటిదే! ‘నిన్నెవడిగాడు?’ అంతే సరి! పరువు పోతుంది. దూల అనేదే లేని వారు సమాజంలో ఉండరు. దాన్ని నియంత్రించుకోవడంలోనే వివేకం ఉంది. పరస్పర ప్రశంసలు కూడా ఈ కోవకే వస్తాయి. ‘నా వీపు నీవు గోకు, నీ వీపు నేను గోకుతా!’ అన్నట్లు, అవి సుఖంగా ఉంటాయి. అదన్న మాట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here