దుర్వాస మహర్షి

0
2

[dropcap]దు[/dropcap]ర్వాసుడు అంటే కోపానికి ప్రతీక. అయన చాలా సందర్భాలలో ఆగ్రహించి ఇచ్చిన శాపాలు లోక కల్యాణానికి తోడ్పడ్డాయి. అందువల్ల మహర్షుల శాపాలు మంచికే తప్ప చెడుకి కాదు అన్న విషయము దుర్వాసుని చరిత్ర చూస్తే తెలుస్తుంది. వారి ఆగ్రహానికి శాపాలకు ఒక అర్థము పరమార్థము ఉంటాయి. ఇతని కోపము తెలిసిన వారు అవటం చేత ఈయనను అందరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈయన ఆగ్రహానికి గురి అయినవారు మన పురాణాలలో అనేకమంది దేవతలతో సహా తారసపడుతూ ఉంటారు. తనని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి వరాలు కూడా ఇస్తూ ఉంటాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాలలో దుర్వాసుని ప్రమేయము మనకి గోచరిస్తుంది. అత్రి మహర్షి తపస్సుకు, అనసూయ ప్రాతివత్యానికి త్రిమూర్తులు ఇచ్చిన వర ప్రసాదమే దుర్వాసుడు. అత్రి అనసూయల కోరిక మేరకు త్రిమూర్తులు వారి కుమారులుగా జన్మిస్తారు వారిలో రుద్రంశ దుర్వాస మహర్షిగాని చెపుతారు కాబట్టి కోపము ఎక్కువ. దుర్వాసునికి ఉపనయనము చేసినాక బ్రహ్మచర్యము తీసుకొని గొప్ప తపస్సు చేస్తే దేవతలు మెచ్చి ముల్లోకాలలో తిరిగే శక్తిని ప్రసాదించారు.

ఆ శక్తితో దుర్వాసుడు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు దర్శనము చేసుకుని అయన ఇచ్చిన పారిజాత పుష్పాన్ని, మధ్యలో వింధ్యధర స్త్రీలు ఇచ్చిన పూల దండను తీసుకుని వస్తు మార్గమధ్యములో ఎదురైన ఇంద్రునికి ఆ దండను బహుకరిస్తాడు. ఇంద్రుడు నిర్లక్ష్యముగా ఆ దండను తన ఐరావతమునకు ఇస్తాడు. ఆ ఐరావతము ఆ దండను కాళ్ళతో తొక్కేస్తుంది. ఇది చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడి ఐశ్వర్యము గంగపాలు అవుతుందని, ఐరావతము తల తెగి పోతుందని శపిస్తాడు. శాపఫలితముగానే అమృతము సముద్రము పాలవుతుంది. దీని కారణముగానే దేవతలు రాక్షసులు కలిసి సాగరమథనము చేస్తారు. ఐరావతము తల వినాయకుడికి చేరుతుంది.

దుర్వాసుడు ధర్మదేవత నిజరూపాన్ని చూడాలని దత్తాత్రేయునితో కలిసి ఘోరమైన తపస్సు పదివేల సంవత్సరాలు చేసినా, ధర్మదేవత సాక్షాత్కారము కాకపోవటం వల్ల ఆగ్రహించిన దుర్వాసుడు ధర్మదేవతను శపించాలనుకుంటాడు. అప్పుడు ధర్మదేవత బ్రాహ్మణుని రూపములో ప్రత్యక్షమై, “మహర్షి ఋషులకు ఇంత కోపము తగదు” అంటాడు. “నీవు ఎవరు నాకు చెప్పటానికి” అని ప్రశ్నిస్తే ధర్మదేవత ప్రత్యక్షమవుతాడు. అప్పటికి కోపము తగ్గని దూర్వాసుడు, “నాకు దర్శనము ఇవ్వటానికి నీకు పది వేల సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు కూడా నా శాపానికి భయపడి ప్రత్యక్షమైనావు. కాబట్టి నీవు సుఖము తెలియని రాజుగాను, దాసీ కొడుకుగాను, చండాలుడిగాను పుడతావు” అని శపిస్తాడు. అందుచేతనే ధర్మరాజు, విదురుడు, వీరబాహులు గా కర్మఫలము అనుభవించటానికి పుడతారు.

కృతయుగములో సుప్రతీకుడు అనే మహారాజుకి దుర్వాసుని వరము వల్ల భార్య విద్యుత్ ప్రభకు దుర్జయుడు అనే కొడుకు పుడతాడు. అతడిని వెంటనే పదహారేళ్ళవాడిగా చేసి మరో భార్యకు సుద్యుమ్నుడు అనే కొడుకు కలిగేలా వరమిస్తాడు. దుర్వాసుడు గంధమాదన పర్వతముపై తపస్సు చేసుకుంటూ ఉండగా బలిచక్రవర్తు కుమారుడు సాహసికుడు, తిలోత్తమ విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటే ఆగ్రహించిన దుర్వాసుడు ఇద్దరినీ రాక్షసులుగా జన్మించమని శపిస్తాడు.

శ్రీకృష్ణుని చేతిలో సంహరించబడ్డ గార్దభాసురుడు, బాణాసురిని ఇంట జన్మించిన ఉష ఆ విధముగా దుర్వాసుని శాపము వల్ల పుట్టినవారే. దుర్వాసుడు వివాహము చేసుకోదలచి, ఔర్య మహర్షి దగ్గరికి వెళ్లి తన కూతురిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు ఔర్యుడు తన కుమార్తె అయినా కందళిని దుర్వాసునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకనాడు దుర్వాస మహర్షి గాఢ నిద్రలో ఉండగా సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందని గ్రహించిన ఆమె ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాస మహర్షిని తట్టి లేపింది. అప్పుడు కోపిష్టి అయిన దుర్వాస మహర్షి నిద్ర భంగం కలిగిందని కోపంతో కళ్ళు తెరిచి భార్యని చూడగా, కంటి నుండి అగ్ని రావడంతో ఆమె భస్మం అయిపోతుంది. ఆ తరువాత తన తప్పుని తెలుసుకున్న దుర్వాస మహర్షి, తన భార్య పేరు భూమిపైనా శాశ్వతంగా ఉండేలా, భగవంతుడికి ప్రసాదంగా ప్రాణకోటికి ఆరోగ్యాన్ని కలిగించేలా ఉండాలని భావించి, ఆ భస్మంతో ఒక చెట్టుని సృష్టించాడు. అదే కదళీ వృక్షం, అంటే అరటిచెట్టు. ఈవిధంగా తన భార్యకి వరాన్ని ఇచ్చాడు. తన కూతురిని భస్మం చేసాడని తెలుసుకున్న ఔర్యుడు ఆగ్రహంతో ఒక సామాన్య భక్తుని చేతిలో ఘోరమైన అవమానాన్ని పొందుతావని దుర్వాసుడిని శపిస్తాడు.

అంబరీషుడు విష్ణు భక్తుడు. ఏకాదశీ వ్రతాన్ని భక్తీ శ్రద్ధలతో చేసేవాడు. ఒక సారి ఏకాదశి ఉపవాసం వుండి, మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధమైన సమయంలో దూర్వాసుడు, ఆయనకు అతిథిగా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు. ద్వాదశి ఘడియలు పూర్తి అయే సమయం అయినా మహర్షి రాలేదు. అక్కడున్న మహర్షుల అనుమతితో, కొద్దిగా జలాన్ని తీర్థంగా త్రాగాడు. తర్వాత దూర్వాసుడు వచ్చి, జరిగిన దానికి ఆగ్రహించి తన శిరస్సు లోని ఒక జటను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు. అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి, రాజు, శ్రీహరిని మనసులో ధ్యానించాడు. వెంటనే విష్ణుచక్రం ఉద్భవించి, పిశాచాన్ని చంపి, దుర్వాసుని చంపటానికి మీదకు వెళ్ళింది. భయంతో దుర్వాసుడు పారిపోవటం ప్రారంభించాడు. చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది. మూడు లోకాలూ తిరిగినా ఎవరూ, దుర్వాసునికి అభయం ఇవ్వలేదు. చివరికి విష్ణువు ఆజ్ఞతో అంబరీషుడినే శరణు వేడాడు. అంబరీషుడు అతన్ని క్షమించాడు. వెంటనే చక్రం అదృశ్యమైంది. భగవంతుని కంటే, భక్తుడే శక్తి కలవాడు అని అంబరీషుడు వృత్తాంతము మనకు తెలియజేస్తుంది. ఈ విధముగా ఔర్యుని శాప కారణముగా దుర్వాసుడు విష్ణు భక్తుని చేతిలో అవమానము పొందుతాడు.

రామాయణములో కూడా దుర్వాసుని ప్రసక్తి వస్తుంది. లక్ష్మణుని అవతార పరిసమాప్తికి దుర్వాసుడు కారణమవుతాడు. ఒకనాడు రాముడు బ్రాహ్మణుని వేషములో వచ్చిన యమధర్మరాజుతో ఆంతరంగికముగా మాట్లాడటానికి ఎవరిని లోపలి రానివ్వదని లక్ష్మణుడిని ద్వారము వద్ద కాపలాగా ఉంచుతాడు. ఆ సమయములో దుర్వాసుడు శ్రీరాముని దర్శనార్థము వస్తాడు. వద్దని అంటే మహర్షి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది పంపితే అన్నగారి ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుంది. చివరికి రాజ్య శ్రేయస్సు అలోచించి దుర్వాసుని రాకను తెలియజేయటానికి శ్రీరాముని మందిరంలోకి వెళతాడు. యమధర్మరాజుకు ఇచ్చిన మాట ప్రకారము వారిద్దరూ ఉన్నప్పుడు వచ్చినవారు ఎవరైనా వారిని శిక్షించాలి. అందుచేత లక్ష్మణుడిని ఏ విధముగా శిక్షించాలో అర్థము కాని శ్రీరామునికి వసిష్ఠుడు సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారము లక్ష్మణుడు సరయు నదిలో ప్రాణత్యాగము చేసి అవతార సమాప్తి చేస్తాడు. మహాభారతంలో దుర్వాసుడు తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు అతని దగ్గరకు అతిథిగా వస్తాడు. అతను దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. అతను తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది. ఆ బిడ్డే కర్ణుడు. ఆ తరువాత పాండురాజును వివాహము చేసుకున్నాక దుర్వాసుని వరప్రభావము వల్ల కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రికి నకుల సహదేవులు జన్మిస్తారు. శివ పురాణము ప్రకారము ఒకసారి దుర్వాసుడు స్నానము చేస్తున్నప్పుడు గాలికి అయన వస్త్రాలు కొట్టుకుపోతే ద్రౌపది అతని వస్త్రాన్ని ఇస్తుంది అందుచేత ద్రౌపదికి ఎప్పటికి వస్త్రాల లోటు ఉండదని వరము ఇస్తాడు. ఆ వర ప్రభావమే కౌరవులు ద్రౌపది వస్త్రాపహరణ సమయములో శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా వస్త్రాలు అందుతాయి. దుర్యోధనుని మాయమాటలు నమ్మి అరణ్యవాసములో ఉన్న పాండవులను ఇబ్బంది పెట్టాలని చుసిన దుర్వాసునికి శ్రీకృష్ణ పరమాత్ముడు గర్వభంగము చేస్తాడు. ద్వాపర యుగాంతములో యాదవ కుల నాశనము కూడా దుర్వాసుని శాపము వల్లే జరుగుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమములో శకుంతల దుర్వాసుని రాకను గమనించకపోవటంతో ఆగ్రహించిన దుర్వాసుడు శకుంతల దుష్యంతుల ఎడబాటుకు కారణ మవుతాడు. ఆ విధముగా ఎందరినో ఆగ్రహించి శపించాడు. ఎందరికో వరాలు ఇచ్చాడు. అజాంఘర్ అనే ప్రదేశములో దుర్వాసునికి గుడి ఉంది. ఆయన అక్కడ ఉన్న శివలింగములో ఐక్యం అయినాడని అక్కడి స్థానికుల నమ్మకము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here