దుష్కర్మలు విడనాడాలి

1
2

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దుష్కర్మలు విడనాడాలి’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]హిం[/dropcap]దూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ప్రతి మనిషి  పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు. ఎవరు కూడా ఏ విధమైన కర్మాచరణా లేకుండా ఉండటం కుదరదు. ప్రకృతి నియమాలను అనుసరించి ప్రతి జీవీ ఏదో కర్మ చేయక తప్పదు అంటుంది భారతీయ సనాతన ధర్మం. అయితే మనం చేసే కర్మలను ఎంచుకునే విచక్షణా జ్ఞానాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఈ విచక్షన ఏ ఇతర ప్రాణికీ ఇవ్వకపోవడం వలనే మానవ జన్మకు గొప్ప విలువ, ప్రాచుర్యం లభించింది. ఈ యుక్తాయుక్త విచక్షణ ద్వారా మానవులు ఎల్లప్పుడూ సత్కర్మలే చేయాలని, దుష్కర్మలకు దూరంగా వుందాలన్నది శాస్త్రవచనం.

మనం జన్మ జన్మలుగా చేసే దుష్కర్మల ఫలితం మనల్ని ప్రతీ జన్మలో వెంటాడుతునే వుంటుంది. ఏదో ఒక రోజు దాని ఫలితం అనుభవించాల్సిందేనని శాస్త్రాలు మానవులను హెచ్చరిస్తున్నాయి. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు! అని శ్రీకృష్ణుడు దృతరాష్టునితో స్పష్టంగా చెప్పాడు. మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు, అహంకార మమకారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి అని కూడా భగవానుడు హెచ్చరించినా ధృతరాష్ట్రుడు వినలేదు. ఫలితంగా వందమంది పుత్రులను కనడం కోసం ఆయన గత జన్మలుగా చేసుకున్న పుణ్యం ప్రస్తుత జన్మలో దుష్కర్మలను చేయడం ద్వారా కురుక్షేత్ర మహా సంగ్రామంలో పుత్రులను పోగొట్టుకోవడం ద్వారా కోల్పోయి దుష్కర్మల  ఫలితం అనుభవించాడు. ఈ కథ మానవాళి కంతటికీ ఒక హెచ్చరిక వంటిది.

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం॥

అంటే సత్కర్మలు చేస్తే మంచి ఫలితం. దుష్కర్మలు చేస్తే ఏజన్మకైనా దుష్ఫలితం రాక తప్పదు. కర్మ, దాని ఫలం అనేది నిరంతర ప్రక్రియ. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఏదైనా అధికంగా చేస్తే మంచిగానీ, చెడుగానీ—దాని ఫలం ఈ జన్మలోనే అనుభవానికి వస్తుంది. కాబట్టి సత్కర్మలు చేయండి అని ఆధ్యాత్మికవాదులు తరచుగా చెబుతుంటారు. కర్మఫలాన్ని అనుభవించకుండా ప్రకృతిలో ఏ శక్తి ఆపలేదు. ఒక చెడ్డ పని చేస్తే దానివలన బాధ అనుభవించి తీరాలి. ఒక మంచి పని చేస్తే దాని ఫలితం తప్పక లభిస్తుంది. నిత్యం అనేకమంది పాపప్రక్షాళన కొరకు గంగాస్నానం చేస్తున్నారు. వారి పాపాలన్నీ అందువలన తొలగిపోతాయా? అని రామకృష్ణ పరమహంసను శిష్యులు ప్రశ్నించగా, వారి పాపాలు గంగ ఎందుకు స్వీకరిస్తుంది? వారు స్నానానికి వెళ్లేముందు ఆ పాపాలు ఒడ్డునగల చెట్లపై ఆగుతాయి. స్నానం చేసి రాగానే తిరిగి ఆవహిస్తాయి అన్నారు. కర్మలు ఎప్పుడు ఫలితాలను ఇస్తాయో చెప్పడం కష్టం. అది ఈ జన్మలోనే కావచ్చు లేదా రాబోయే జన్మలలో కావచ్చు. అందరికీ కర్మ ఫలాలను ఇచ్చే భగవంతునికి మాత్రమే తెలుసు. మంచి మరియు చెడు కర్మలు రద్దు చేయబడవు. మానవులు  ప్రతి మంచి లేదా చెడు, దాని ప్రభావాలను విడిగా ఎదుర్కోవాలి. పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.

తప్పుడు పనులలో మునిగి తేలుతున్న వ్యక్తి ఇప్పటికీ వివిధ సౌకర్యాలను ఎలా అనుభవిస్తున్నాడని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. దానికి ప్రత్యుత్తరం ఏమిటంటే, అతని చెడు పనుల ప్రభావం అతన్ని కలవరపెట్టడం ప్రారంభించలేదు, కానీ సరైన సమయం కోసం వేచి వుంది. సరైన సమయం రాగానే దుష్కర్మల తాలూకు ప్రభావం చూపించడం ప్రారంభమై మానవులు అష్టకష్టాలకు గురవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here