దుష్టచతుష్టయం

0
3

[dropcap]మ[/dropcap]న విద్యా విధానంలో ఒకటవ తరగతి నుంచీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు రామాయణ, భారత, భాగవతాంశాలు గేయాల రూపంలో, కథల రూపంలో, నీతిపద్యాల రూపంలో లేదా ఆ గ్రంథాలలో కొంత భాగాన్ని గానీ పాఠ్యాంశాలుగా చేర్చి విద్యార్థులకు బోధిస్తూ ఉంటారు. మంచయినా చెడయినా బీజం పడేది విద్యార్థిదశ లోనే కాబట్టి పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేయటానికి అలా చేస్తూ ఉంటారు.

రామాయణం ఒక కావ్యం. అంటే ప్రధానకథతో పాటు అనేక వర్ణనలు చోటుచేసుకుంటాయి. ప్రకృతి వర్ణనలు, సూర్యోదయ, సూర్యాస్తమయ, ఋతువుల వర్ణనలు, అందలి పాత్రల అందచందాలు మొదలైనవి వర్ణిస్తూ కథను మనసుకు హత్తుకుపోయేటట్లు చెబుతారు. మహాభారతం ఇతిహాసం. ఇతి అంటే ఈ విధంగా, హాసం అంటే జరిగింది అని అర్ధం. అంటే ఇది ఒక చరిత్ర. ఇందులో వర్ణనలు తక్కువ. జరిగినది చెప్పటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక భాగవతం ఒక పురాణం. ఇందులో అనేకమంది భాగవతోత్తముల కథలు ఉంటాయి. అంటే భగవంతుడిని చేరుకోవాలంటే ఎలా జీవించాలో తెలియజేస్తుంది భాగవతం. ఈ మూడు గ్రంధాలు మానవ నాగరికతకు పట్టుకొమ్మలు.

నాయకుడి గురించి, అతడి ఉదాత్తమైన ప్రవర్తన గురించి చాలామంది చెబుతారు. కానీ ప్రతినాయకుడి గురించి, దుష్టపాత్రల గురించి చెప్పేవాళ్ళు తక్కువ. కానీ అవి కూడా తెలుసుకోవటం అవసరం. ప్రతినాయకుడిలో కూడా అనేక మంచిగుణాలు ఉన్నా, కొద్దిగా తప్పుదారిన నడవటం వలన అతడి జీవితం ఎలా పతనమైనది తెలుసుకుని, అలాంటి లక్షణాలకు దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు దుష్టచతుష్టయంగా పేరుపొందిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ శకునుల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.

***

దుర్యోధనుడు

యుగాలు నాలుగు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు. ధర్మదేవత గోరూపం ధరించి కృతయుగంలో నాలుగు పాదాలతో నడుస్తుంది. అంటే ఈ యుగంలో అందరూ ధర్మంగా నడుచుకునేవారే ఉంటారు. అధర్మం అనేది లేశమాత్రంగా కూడా ఉండదు. త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది. అంటే కొంతమంది అధర్మ వర్తనులు ఉన్నా కూడా న్యాయంగా, ధర్మంగా నడుచుకునే వారే ఎక్కువ. ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలతో నడుస్తుంది. అంటే ధర్మాత్ములు ఎంతమంది ఉంటారో, అంతకు సమానంగా అధర్మవర్తనులు కూడా ఉంటారు. ఇక కలియుగంలో అధర్మానిదే పైచేయి. ఈ నాలుగు యుగాల కాలం గడిచిన తర్వాత మహాప్రళయం సంభవించి అందరూ తుడిచి పెట్టుకుపోతారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కృతయుగం మొదలు అవుతుంది. ఈ విధంగా కాలచక్ర భ్రమణం కొనసాగుతూ ఉంటుంది.

దుర్యోధనుడు జన్మించింది ద్వాపరయుగం చివరలో. దుర్యోధనుడు కలిపురుషుడి అంశతో జన్మిస్తాడు. కలి అంటే జగడం. అంటే దుర్యోధనుడు కలహప్రియుడు అన్నమాట. నూరుమంది సోదరులలో ఇతడు పెద్దవాడు. రాక్షసులందరూ అతడి తమ్ములుగా జన్మిస్తాడు. ఇతడు పుట్టగానే కేర్ కేర్ మని ఏడవలేదు, గాడిదలా ఓండ్ర పెట్టాడు. సుడిగాలి వీచింది. నక్కలు ఊళలు వేశాయి. కాకులు, గద్దలు అరిచాయి. ఇవన్నీ చూసి తండ్రి ధృతరాష్ట్రుడు ఆందోళన పడి వీటి ఫలితం ఏమిటి అని బ్రాహ్మణులను అడిగితే నీ పెద్దకుమారుడు పుట్టినప్పుడు ఇవన్నీ జరిగినవి కాబట్టి, అతడి వల్ల కీడు జరుగుతుంది, వెంటనే ఆ బిడ్డని విడిచిపెట్టమని చెప్పారు. కానీ ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో అందుకు అంగీకరించలేదు.

దుర్యోధనుడు బాల్యం నుంచే పాపపు ఆలోచనలు కలవాడు. పినతండ్రి కొడుకులైన పాండవులు బలవంతులు, ధర్మాత్ములు, పదిమంది మెప్పుపొందుతూ ఉంటారు. వారిలో భీముడు అత్యధిక బలవంతుడు. అందువల్ల భీముడిని ఏ విధంగానైనా మట్టుపెట్టి, ధర్మరాజుని చెరలో పెడితే తను ఒక్కడే నిరాటంకంగా రాజ్యం ఏలవచ్చుననుకుంటాడు. అందులో భాగంగా విందు భోజనంలో విషం కలిపి, భీముడి చేత తినిపించి, కాళ్ళు చేతులు కట్టేసి గంగలో పడేయిస్తాడు. కానీ దైవకృప చేత క్షేమంగా తిరిగివస్తాడు భీముడు. అప్పటి నుంచీ యువకుడు అయ్యేదాకా దుర్యోధనుడు, భీముడిని చంపటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. విదురుడు, భీష్ముడు వంటి వారు కౌరవపాండవులు కలిసి ఉండటమే క్షేమం అని ఎంత చెప్పినా పెడచెవిని పెట్టి ధృతరాష్ట్రుడు కూడా కొడుకుకి సహకరిస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారీ పాండవులు క్షేమంగా బయటపడుతూ ఉంటారు.

పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రుపదుడితో బంధుత్వం కలిసి బలం చేకూరినప్పుడు అసూయతో రగిలిపోయాడు దుర్యోధనుడు. ఒకసారి మైత్రేయ మహర్షి వచ్చినపుడు దుర్యోధనుడు ఆయన్ని లక్ష్య పెట్టకపోవటమే కాకుండా అహంకారంతో తొడ చరుస్తాడు. మహర్షి కోపంతో “నీ వలన భవిష్యత్‌లో ఒక మహాయుద్ధం సంభవిస్తుంది. ఆ యుద్ధంలో భీమసేనుడు నీ తొడలు విరగగొడతాడు” అని శపిస్తాడు. మాయద్యూతంలో పాండవుల అర్ధరాజ్యాన్ని అపహరించటమే కాకుండా వారిని, వారి ధర్మపత్నిని తీవ్రంగా అవమానిస్తాడు దుర్యోధనుడు. తాత ముత్తాతలందరూ చూస్తుండగా వదిన అయిన ద్రౌపదిని జుట్టుపట్టుకుని నిండు సభలోకి ఈడ్పిస్తాడు. వివస్త్రను చేయటానికి ప్రయత్నిస్తాడు. తొడమీద కూర్చోమని సైగ చేస్తాడు. దాసీ.. దాసీ.. అంటూ గేలి చేస్తాడు. చివరకు పాండవులను అడవుల పాలు చేస్తారు.

భీముడికి దుర్యోధనుడిని చంపటానికి అరణ్యవాస సమయంలో అవకాశం చిక్కినా, అన్నగారి ధర్మం అడ్డువచ్చి విడిచి పెడతాడు. ఆ కసి, ఆ అవమానం అంతా కురుకేత్ర యుద్దంలో తీర్చుకుంటాడు భీముడు. పదకొండు అక్షౌహిణుల సైన్యం కౌరవుల పక్షాన, ఏడు అక్షౌహిణుల సైన్యం పాండవుల పక్షాన కురుక్షేత్రం యుద్దంలో పద్దెనిమిది రోజుల పాటు పాల్గొంటారు. సంఖ్యాపరంగా చూస్తే కౌరవ సైన్యమే ఎక్కువ. కానీ అందరూ అగ్నిలో పడిన శలభాల లాగా పాండవుల ఆగ్రహానికి మసి అయిపోతారు.

యుద్ధం తర్వాత దుర్యోధనుడు భయంతో మడుగులో దాగుంటే భీముడు కవ్వించి ద్వంద యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధం చేసేటప్పుడు భీముడిని దెబ్బతీసే క్రమంలో దుర్యోధనుడు గాలిలోకి ఎగిరినప్పుడు అతడి తొడల మీద గదతో వేటు వేస్తాడు భీముడు. మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోతాడు దుర్యోధనుడు. ఎంతో ప్రేమగా జీవించాల్సిన అన్నదమ్ముల జీవితాలు, ఆ విధంగా దుర్యోధనుడి అసూయా మాత్సర్యాల కారణంగా ఒక మహాయుద్దానికి దారి తీస్తుంది.

***

దుశ్శాసనుడు

కౌరవులలో దుర్యోధనుడి తర్వాత పెద్దవాడు దుశ్శాసనుడు. ఇతడికి అన్నని అనుసరించటం తప్ప స్వంత వ్యక్తిత్వమున్నట్లు కనపడదు. భీమార్జునులు ధర్మరాజు మాట అనుసరించినట్లు, దుశ్శాసనుడు కూడా అన్నను అనుసరిస్తాడు. అయితే పాండవులు ధర్మబద్ధంగా ప్రవర్తించారు కనుక చివరికి విజయం వరిస్తుంది, కౌరవులు అధర్మంగా వ్యవహరిస్తారు కనుక చివరికి అందరూ అధోగతి పాలవుతారు.

దుర్యోధనుడు ద్రౌపదిని నిండుసభలోకి ఈడ్చుకురమ్మని చెపితే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే వెళ్లి ఆమెని జుట్టు పట్టుకుని ఈడ్చుకువస్తాడు దుశ్శాసనుడు. పాండవుల పట్ల ఈర్ష్యాద్వేషాలు పెంచుకుని, వారికి అపకారం చేయటంలో అన్నకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే దుష్టచతుష్టయంలో ఒకడు అయాడు.

కురుక్షేత్రయుద్దంలో ఇతడు అభిమన్యుడి చేతిలో, సాత్యకి చేతిలో, సహదేవుడి చేతిలో ఓడిపోతాడు. చివరికి ద్రౌపదీ మానభంగ ఫలితంగా భీముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం గుండెలు చీల్చి రక్తపానం చేయగా మరణిస్తాడు దుశ్శాసనుడు.

***

శకుని

గాంధార దేశపు రాజైన సుబలుడి కుమారుడు శకుని. సుబలుడి కుమారుడు కాబట్టి సౌబలుడు అని అతడికి పేరు. గాంధారికి స్వయానా అన్న. దృతరాష్ట్రుడికి, గాంధారికి వివాహమైన తర్వాత శకుని కూడా అక్కడే తిష్ట వేస్తాడు. తన సోదరుడు దుష్ట స్వభావం కలవాడనీ, అతడిని వెంటనే పంపించి వేయమనీ మొదట్లోనే భర్తతో చెబుతుంది గాంధారి. కానీ మేనల్లుళ్ళపై మమకారం పెంచుకుని బాల్యం నుంచీ వారికి సహాయంగా ఉంటున్న శకునిని వెళ్ళగొట్టలేకపోతాడు ధృతరాష్ట్రుడు.

శకుని దుర్మంత్రంలో అందెవేసిన చేయి. బాల్యం నుంచీ పాండవుల పట్ల మత్సరం పెంచుకుంటున్న దుర్యోధనుడు తనని ప్రేరేపిస్తున్న శకునినే ఆత్మీయుడిగా భావించాడు తప్ప విదురుడు లాంటి వారిని విశ్వసించలేదు. ద్రౌపదీ స్వయంవరానికి దుర్యోధనుడు కూడా వెళ్లి, ఆమెను గెల్చుకోలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శకుని మేనల్లుడిని ఓదార్చి, పాచికలాటతో పాండవశ్రీని పొందే ఉపాయం చెబుతాడు. ఆ ప్రకారంగా ఇద్దరూ ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళతారు. నీ కొడుకు కుళ్ళి కృశించి పోతుంటే నీకు చీమకుట్టినట్లయినా లేదేం అని అక్షేపిస్తాడు శకుని. ఆమాట బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది ధృతరాష్ట్రుడి మీద. ధృతరాష్ట్రుడికి పెద్దకొడుకు మీద అంతులేని ప్రేమ. అతడి బలహీనత మీద గురిచూసి దెబ్బ కొడతాడు శకుని.

పాండవుల సంపదలను, అభివృద్ధిని చూసి సహించలేక పోతున్నానని తండ్రితో అంటాడు దుర్యోధనుడు. ఆమాట పూర్తికాకుండానే ద్యూతక్రీడకు అనుమతి ఇవ్వమనీ, ధర్మరాజుని ఓడించి అతడి సంపదనంతా నీ కొడుకు పరం చేస్తాననీ అంటాడు. పుత్రప్రేమతో అంగీకరిస్తాడు గుడ్డిరాజు. ఎదుటివారి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే స్వభావం ఉన్నవారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా ఇరుపక్షాల వారికీ విభేదం కల్పించటానికి, ఒక పక్షం వారికి కుతంత్రం నేర్పటం ఈరోజుల్లో కూడా చాలామందిలో చూస్తాం. ఆ బాపతు వాడే శకుని కూడా.

జూదం ఆడటానికి మొదట ధర్మరాజు మొదట ఇష్టపడడు. జూదంలో మోసం ఉంటుంది అనీ, అది అనేక అనర్ధాలకు దారి తీస్తుంది అనీ చెబుతాడు. అప్పుడు శకుని “క్షత్రియుడు క్షత్రియుడి పైన, విద్వాంసుడు విద్వాంసుడి పైన యుద్దానికి పోవటం ద్రోహం ఎలా అవుతుంది? నీకు ధైర్యం ఉంటేనే ఆడు” అని రెచ్చగొడతాడు. ద్రౌపదిని అవమానించిన తర్వాత భీముడు ఒక్కడే ప్రతిజ్ఞలు చేసినట్లు మనం సినిమాల్లో చూస్తాం. వాస్తవానికి వాస్తవానికి ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులు నలుగురూ ప్రతిజ్ఞలు చేస్తారు.

దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాననీ, దుశ్శసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతాననీ ప్రతిజ్ఞ చేస్తాడు భీముడు. నాతో యుద్ధం చేసే మూర్ఖులందరినీ యముడి వద్దకు పంపిస్తానని అర్జునుడు అంటాడు. పదమూడేళ్ళ తర్వాత మాకు రాజ్యం అప్పగించక పోతే కురువంశం భూమిపైన లేకుండా చేస్తానని నకులుడు అంటాడు. రాబోయే యుద్దంలో బాణాలతో పాచికలు ఆడి శకునిని చంపుతానని సహదేవుడు అంటాడు.

పాండవులు అడవుల పాలై కష్టాలు పడుతున్నా, ద్వైతవనంలో ఉన్న వారి దగ్గరకు వెళ్లి తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించి, అసూయ పడేటట్లు చేయాలని ఉన్నదని అంటాడు దుర్యోధనుడు. అయితే ఘోషయాత్ర నెపంతో వెంటనే అక్కడకు వెళదాం అని ఉపాయం చెబుతాడు కర్ణుడు. తనకన్నా ముందు కర్ణుడు ఆ ఉపాయం చెప్పినందుకు లోలోపల అసూయపడుతూ ఆ విషయం తానేప్పుడో అనుకున్నానని అంటాడు శకుని. అనుమతి కోసం దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇప్పటికే కష్టాలు పడుతున్న పాండవులను అవమానించటం మనకి క్షేమం కాదని ధృతరాష్ట్రుడు మొదట ఒప్పుకోడు. ఊరికే మృగయావినోదం కోసం వెళుతున్నామే కానీ, పాండవుల జోలికి వెళ్ళమని చెప్పి అంగీకరింప జేస్తాడు శకుని. అక్కడ కర్ణదుర్యోధనులతో పాటు శకుని కూడా గంధర్వులతో యుద్ధంచేసి చావుదెబ్బలు తింటాడు.

గంధర్వుల చేతిలో ఓడిపోయి అవమానంతో ప్రాయోపవేశానికి సిద్ధపడుతున్న దుర్యోధనుడితో “నేను కష్టపడి సంపాదించి ఇచ్చిన రాజ్యం చేయలేక చస్తానంటావేమిటి? పిరికివాడిని లక్ష్మి వరింపదు. పోనీ పాండవులు నిన్ను కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా నీ రాజ్యం వారికి ఇచ్చివేయి. అంతేతప్ప చావటం పరిష్కారం కాదు” అని చెబుతాడు శకుని. పాండవులతో సఖ్యంగా ఉండమంటే దుర్యోధనుడు ససేమిరా వినడని కచ్చితంగా తెలుసు శకునికి.

కురుక్షేత్రంలో ఉత్సాహంగానే యుద్ధం చేసాడు శకుని. ఎంతైనా క్షత్రియుడే కదా! భీముడు, సహదేవుడితో శకుని, అతడి కొడుకు ఉలూకుడు యుద్ధం చేస్తారు. సహదేవుడి చేతిలో ఉలూకుడు మరణిస్తాడు. శకుని సహదేవుడితో తలపడతాడు కానీ అతడి ధాటికి తట్టుకోలేక పలాయనం చిత్తగిస్తాడు. సహదేవుడు వెంబడిస్తాడు “క్షత్రియుడవైతే నిలబడు. ఆనాడు మాయాద్యూతంలో గెలిచి మమ్మల్ని పరిహసించిన దానికి ఫలితం అనుభవించు” అంటూ అతడి శిరసు ఖండించి గాలిలోకి ఎగురవేస్తాడు. ఆ విధంగా ఘోరమరణం పొందుతాడు శకుని. యుద్ధోన్మాదం, కపటం ఎవరికీ ఏనాటికీ పనికి రాదని శకుని జీవితం పాఠం బోధిస్తుంది.

***

కర్ణుడు

కర్ణుడు కుంతీదేవికి సూర్యుడి అనుగ్రహం వల్ల జన్మించినవాడు. జన్మతః కొన్ని ఉత్తమ గుణములు కలవాడు. మహాదాత. దాతృత్వగుణంలో శిబి చక్రవర్తితో పోల్చదగిన వాడు. మహాభారతంలో కర్ణుడి ప్రవేశం ఆదిపర్వంలో కౌరవ పాండవుల అస్త్ర విద్యా ప్రదర్శనం సమయంలో మొదలు అవుతుంది. అక్కడి నుంచీ కర్ణపర్వం వరకు కర్ణుడి ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అవమానానికి గురైన కర్ణుడిని అంగరాజుని చేసి, ఆ అవమానం నుంచీ కాపాడతాడు దుర్యోధనుడు. అందుకు కృతజ్ఞతగా తన జీవితాన్నే అతడికి అంకితం చేస్తాడు కర్ణుడు.

కర్ణుడి వ్యక్తిత్వం ఉన్నతమైనది. శ్రీకృష్ణుడు రాయబారం తర్వాత కర్ణుడితో అతని జన్మరహస్యం చెప్పి పాండవ పక్షాన చేరమని చెబితే ఇలా అంటాడు. “నేను కుంతీదేవి ప్రథమ పుత్రుడిని అని తెలిస్తే ధర్మరాజు రాజ్యం స్వీకరించడు. నన్నే రాజుని చేస్తాడు. నేను కృతజ్ఞతా పూర్వకంగా ఆ రాజ్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. అందువల్ల ధర్మాత్ముడైన యుధిష్టురుడే శాశ్వతంగా రాజు కావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, పాండవుల పట్ల నేను కటువుగా మాట్లాడినా అది దుర్యోధనుడి ప్రీతి కోసమే చేసాను తప్ప వారిపై ద్వేషంతో కాదు. అందుకు నేను ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను” అని చెబుతాడు. దీనిని బట్టి కర్ణుడికి రాజ్యకాంక్ష లేదనీ, పాండవుల పట్ల మత్సరం కూడా లేదనీ మనకి తెలుస్తుంది.

కర్ణుడు ప్రతిరోజూ గంగలో నిలబడి సూర్యుడికి అర్ఘప్రదానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బ్రాహ్మణులు వచ్చి యాచిస్తూ ఉంటారు. వారు ఏది అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు. ఒకసారి సూర్యుడు కలలో కనిపించి “ఇంద్రుడు తన కొడుకు విజయం కోసం నీ కవచకుండలాలు అడగటానికి వస్తున్నాడు. అవి మాత్రం ఇవ్వవద్దు. అవి ఉన్నంత కాలం నిన్ను ఎవరూ వధించలేరు” అని చెబుతాడు. “తండ్రీ! బ్రాహ్మణుడు వచ్చి ప్రాణం ఇవ్వమని అడిగినా ఇచ్చేస్తాను. అది నా వ్రతం. దయచేసి నా వ్రతం నుంచీ నన్ను దూరం చేయవద్దు” అని చెబుతాడు కర్ణుడు. తన ప్రాణానికి ముప్పు ఉన్నది అని తెలిసి కూడా కవచకుండలాలు ఇంద్రుడికి దానం ఇచ్చేస్తాడు.

కర్ణుడిలో ఇన్ని సుగుణాలు ఉన్నా దుష్టచతుష్టయంలో ఒకడుగా నిలిచిపోయాడు. దానికి కారణం కూడా భీష్ముడి నోట ఇలా చెప్పిస్తాడు కావ్యకర్త. “కర్ణా! పెద్దల అనుమతి లేకుండా కుంతి నిన్ను కన్నది. ఆమె చేత పరిత్యజించబడి సూతుడి ఇంట పెరిగావు. ఆ కారణంగా వైదిక సంస్కారహీనుడవు అవటం వల్ల నీలో ధర్మం లోపించింది. దానితోపాటు అతి నీచమైన ఈర్ష్యా ద్వేష స్వరూపుడైన దుర్యోధనుడిని ఆశ్రయించావు. నీచాశ్రయం వలన గుణవంతులకు కూడా మాత్సర్యం ఏర్పడుతుంది” అని అంటాడు.

భీష్ముడు అన్నట్లుగానే దుర్యోధనుడు పాండవులకు చేసిన ప్రతి అపకార సమాలోచనలోనూ కర్ణుడి పాత్ర ఉన్నది. ఇంద్రుడి చేతిలో వృతాసురుడు మరణించినట్లుగా చివరకు అర్జునుడి చేతిలో మరణిస్తాడు కర్ణుడు. దుష్ట సాంగత్యం వలన చేటు కలుగుతుందని కర్ణుడి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here