[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత శ్రీ. ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచించిన కామెడీ కథల సంపుటి ‘దుశ్శాలువా కప్పంగ’.
ఇందులో – దుశ్శాలువా కప్పంగ, 31/11, శ్రీమంతుడు కారు, విజయవాడ ఆర్టిస్టు, పని మనిషి, డెంటల్ డాక్టర్, హరే, శ్రీనివాస!, గిల్లు – బిల్లు, టు-లెట్, గ్రీన్ సిగ్నల్, కెవ్వు కేక, ‘వైకుంఠ’ దర్శనం, చక్కెర మామ, అభినందనలతో…, ‘లాకర్’ గోల్డ్, కాదంబరి కన్నీరు, ఫేస్ ‘బుక్’, తోట ‘కల’, డ్రంక్ & డ్రైవ్, స్టేషన్ టు హోటల్ – అనే 20 కథలు ఉన్నాయి.
***
“భోజనం పెట్టేటప్పుడు ‘మెనూ’ చెప్పాలి కానీ, విస్తట్లో వడ్డించాక ప్రతి పదార్థం రుచి చెప్పి, బలవంతంగా తినేవాడి నాలిక్కి రాయకూడదని నా అభిప్రాయం.
కథలకి ముందుమాట కూడా అలాంటిదే. కథని ఆస్వాదించేవారికి దాని గురించి రెండు ముక్కలు చెబితే కథ చదవాలన్న కుతూహలం కలుగుతుందని నా ఆశ. రాజుగారి కొన్ని కథలు చదువుతుంటే ‘అరే, నేనెందుకు రాయలేదు ఈ పాయింటు మీద’ అనుకుంటారు కొంతమంది రచయితలు.
రాజుగారి మరికొన్ని కథలు చదువుతుంటే, ‘ఈ సంఘటన మా ఇంట్లో జరిగింది, మా ఊళ్ళో జరిగింది, ఈయనకు ఎలా తెలిసింది?’ అనిపించేటంత వాస్తవంగా వుంటాయి. ఏ విధమైన అతిశయోక్తులు, మెలోడ్రామాల్లేకుండా కొంతమంది పాఠకులకి, ‘కథలో కొన్ని పాత్రలు మా చుట్టాల్లో, స్నేహితుల్లో వున్నారు, మరి రాజుగారికి వాళ్ళతో పరిచయం ఎలా అయింది?’ అనిపిస్తుంది.
ఏది ఏమైనా ముందుమాట ముచ్చటగా మూడు ముక్కలు వుండాలే కాని, కథలా, వ్యాసంలా వుండకూడదని నా అభిప్రాయం.
నాతో ఏకీభవిస్తారు కదూ! చక్కగా ‘దుశ్శాలువా కప్పుకుని’ కథలు చదవండి, రచయితను అభినందించండి.” అన్నారు ప్రసిద్ధ సినీనటులు, రచయిత శ్రీ పోలాప్రగడ జనార్ధనరావు (జెన్ని) తమ ‘ముందుమాట’లో.
***
“‘దుశ్శాలువా కప్పంగ’ హాస్య కథల సంపుటిని ఎంతో ఆనందంగా వదలకుండా చదివాను. ఈ కథల్లో అనవసరపు వర్ణనలు లేవు. ఊక దంపుడు ఉపన్యాసాలు లేవు. తనకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని అంతటినీ ఏదో ఒక విధంగా పాఠకుల మీద కుమ్మరించేద్దామన్న ధ్యాస అసలే లేదు! మరి ఏముంది?
నేరుగా కథ చెప్పడం ఉంది. గిలిగింతలు పెట్టి నవ్వించే హాస్య ధోరణిలో కథ నడిపించటం ఉంది. ఉత్కంఠభరితమైన విధానంలో పాఠకుల్ని చేయి పట్టుకుని కథలో ముందుకు నడిపిస్తూ తీసుకు వెళ్ళటం ఉంది. అందువలన కథ చదవటం పూర్తిగా అవగానే మనసు నిండా ఆనందం ఆవరించినట్లు అవుతుంది కొంతసేపు. హాయిగా నవ్వుకుంటాం. ఏ హాస్య కథకైనా ఇంతకంటే పరమార్థం ఏముంటుంది! మన నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సంఘటనలనుండి, సమస్యలనుండి చిక్కని హాస్యాన్ని పిండి బయటకు లాగి మన ముందు ఉంచుతారు రచయిత. బుల్లిబుల్లి వాక్యాలతో, అరుదైన హాస్యభరితమైన సామెతలతో, రాజసం ఉట్టిపడే రాయలసీమ యాసతో, అలవోకగా రాజుగారు హాస్య కథను చెప్పుకుపోతూ ఉంటే పెదాలపై చిరునవ్వుతో, మనసు నిండా ఆనందంతో మనం మైమరచి వింటూ తన్మయత్వంలో మునిగిపోతాం.
దుశ్శాలువలు వదిలించుకోటానికి ఎనగొండ నాయుడు పడిన పాట్లు, కారు తెచ్చే ఫాల్స్ స్టేటస్ కోసం వెంపర్లాట, ‘లారీలకు ప్రవేశం లేదు’ అనే నినాదం ఆధారంగా పోలీసు ఉద్యోగాల మీద సంధించిన వ్యంగ్యాస్త్రాలు, ఫేస్ బుక్‌లో అతిగా వివరాలు అందిస్తే జరిగే అనర్థాలు; ఇలా చిన్న చిన్న వ్యవహారాలను హాస్యభరితంగా, అందంగా మలచి మన ముందుంచుతారు రచయిత. ‘చదువరులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో పుస్తకం పట్టుకుంటే చాలు సన్మానం చేస్తామనే రోజులు వచ్చాయని’ రచయిత చేసిన వ్యంగ్య రచన మనలను ముందు నవ్వించినా తర్వాత కనుల నిండా నీరు నింపుతుంది!
ఆర్.సి. కృష్ణస్వామి రాజుగారి ఈ కథల సంపుటి, దాచుకుని మళ్లీ మళ్లీ చదువుకోతగ్గ పుస్తకం, వారికి నా అభినందనలు.” అన్నారు ప్రసిద్ధ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, చివరి అట్ట పై ‘దాచుకోతగ్గ కథలు…’లో.
***
దుశ్శాలువా కప్పంగ (కామెడీ కథలు)
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పేజీలు: 140
వెల: ₹ 140
ప్రచురణ: ప్రియమైన రచయితలు, విశాఖపట్నం
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు