ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -12

0
2

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పన్నెండవ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]స్తవ్యస్త కారు వెళ్ళగలగినంత దూరం వెళ్లి ఆగిపోయింది. వెంటనే స్క్రీన్ మీద వివరాలు వచ్చాయి. “నువ్వు వెతుకుతున్న వస్తువు ఇదుగో అక్కడ వుంది” అని వివరంగా చెప్పింది. అందరూ దిగి ఆ దిశగా వెళ్లారు.

ఎక్కువ శ్రమ పడకుండానే దొరికింది వినాష్ కారు. ఒక్క పరుగున దగ్గరకు వెళ్ళి వెతికాడు శాంత కుమార్.

కారుంది గానీ కొడుకు లేడు. గుండె పగలేలా ఏడవసాగాడు.

అస్తవ్యస్త ఓదార్చాడు. “మనిషి లేడు. కానీ అతను మరణిస్తే బాడీ వుండాలి. అదీ లేదు. కాబట్టి ఎవరో అతడిని కాపాడి వుంటారు. వెతుకుదాము” అన్నాడు.

ఆయనకు పోతున్న ప్రాణం నిలబడింది. “ఎలా వెతుకుతాం ఈ అడవిలో” అన్నాడు దీనంగా.

అస్తవ్యస్తకి కొండ వారి భాష వచ్చు. గతంలో భగీరథ వెంట తిరిగినప్పుడు నేర్చుకున్నాడు.

కాస్త పక్కకు వెళ్లి కొండ భాషలో పొలికేక పెట్టాడు. దిక్కులు అదిరిపోయాయి. కొంచెం సేపటి తరువాత అటువైపునుంచి ఒక కేక సమాధానంగా వినిపించింది. అస్తవ్యస్తకి ప్రాణం లేచి వచ్చింది. మరోసారి కేక పెట్టాడు. అటువైపు నుండి సమాధానం.

అలా అరుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇద్దరూ కలిశారు. వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు అస్తవ్యస్త.

అవడానికి అన్ని కొండ భాషలే అయినా చాలా తేడా ఉంది. కళింగాంధ్రకి రాయలసీమకి మాండలికంలో ఉన్నంత తేడా ఉంది, అయినా పర్వాలేదు కొంత కష్టంగా ఉన్నా అర్థమవుతూనే ఉంది.

వినాష్ గురించి అడిగితే, బోలెడన్ని వివరాలు చెప్పాడు అతగాడు. అది విని అస్తవ్యస్తకి పరమానందం కలిగింది.

“మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడట” అని చెప్పాడు.

శాంత కుమార్ ఆనందంతో పిచ్చివాడయిపోయాడు.

“పదండి వెళదాం నా పిచ్చి తండ్రి ఎక్కడున్నాడు” అన్నాడు. ముగ్గురూ కలిసి అతని వెంట అడవిలోకి వెళ్లారు. ఇక్కడ అంతా చాలా సందడిగా ఉంది.

గుడిసెలోకి ప్రవేశించారు. అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు. ‘ఇదిగో’ అని చూపించాడు దారి చూపించిన వ్యక్తి.

అందులో తమ కొడుకు ఎక్కడ కనిపించలేదు వారికి.

“నాన్నా” అని ఏడిస్తే గాని గుర్తుపట్టలేదు కొడుకుని. శుభ్రంగా గుండు చేశారు. మొహానికి రంగులు పూశారు. మెడలో రకరకాల పూసల దండలు, ఈకలు వేశారు.

“ఏమిటి” అని అడిగితే ఆ వేళ అతనికి వివాహమట.

కాబోయే వియ్యంకుడు వివాహ సమయానికి వచ్చినందుకు చాలా సంతోషించాడు.

ఇదంతా అయోమయంగా అనిపించింది వీళ్ళకి. ‘ఏమిటి’ అనుకున్నారు

అస్తవ్యస్త వాళ్లతో మాట్లాడి విషయం అంతా తెలుసుకున్నాడు. భాష వచ్చినా యాస వలన అర్ధం చేసుకోవటానికి చాలా సమయం పట్టింది.

తను అర్థం చేసుకున్నది ఇవతల వాళ్లకు చెప్పటానికి ఇంకొంత సమయం పట్టింది. కొండలరావు తల పట్టుకున్నాడు

“అక్కడే ఫోన్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా” అన్నాడు.

“ఎట్లా చేస్తాను చార్జీ అయిపోయింది. అంతేకాదు, వీళ్ళు ఫోన్ విరగ్గొట్టి పాతపెట్టేసారు” అన్నాడు వినాష్.

“అదేమిటి” అని అడిగాడు అస్తవ్యస్త.

“అదేదో విషపు గురువు పురుగు అనుకుని దాని నాశనం చేసేసారు” అని చెప్పాడు.

జరిగిందేదో జరిగింది. ప్రాయశ్చిత్తంగా కొంత డబ్బు చెల్లిస్తే కొడుకుని వదిలిపెడతారేమో అడిగి చూడమన్నాడు శాంత కుమార్.

అతను అగ్గి బుగ్గి అయిపోయాడు. “ఇంకా నయం. వాళ్లకి అనుమానం వచ్చింది అంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలరు. మాలో పెళ్లి చాలా పవిత్రమైనది. ఒకసారి పెళ్లి కుదిరితే అది తప్పిపోకూడదు. మీ వాడే కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు కాదు అంటే చువ్వకు గుచ్చి మేకను కాల్చినట్టు అతన్ని కాల్చేస్తారు” అన్నాడు

“కొండలరావు గారు కొంప మునిగింది” అన్నాడు ఏడుస్తూ వినాష్.

“చాల్లే ఊరుకోండి. ఈసారి అలా అంటే నేను ఊరుకోను. చావబోతున్న మిమ్మల్ని ప్రాణాలతో కాపాడింది. అంతకంటే సాయం ఎవరు చేస్తారు. కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోండి” అని కోప్పడ్డాడు కొండలరావు.

“మరి ఎలారా నాయనా? కాదంటే. వాళ్లు చంపేస్తారుట. చావడం కన్నా పెళ్లి సుఖం కదా. ఎలాగో పెళ్లి చేసేసుకో. కావాలిస్తే మన ఊరు వెళ్లాక విడాకులు ఇచ్చేద్దాం” అన్నాడు శాంత కుమార్.

వీళ్లు ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే పెళ్ళికొడుకుని తీసుకుపోయి మండపంలో కూర్చోబెట్టి పెళ్లి చేసేసారు. జంబుక వినాష్ దంపతులు అయిపోయారు.

వాళ్ళ పద్ధతిలో జరిగింది పెళ్లి. ఆ తర్వాత అందరూ ఆనందంగా డాన్స్ చేశారు. వినాష్ నిరుత్సాహంగా ఉండటం గమనించి జంబుక సరదాగా అతని పట్టుకుని డాన్స్ చేసింది.

పెళ్లి అయ్యాక కొత్త దంపతులను వెంట తీసుకువెళదామని అనుకున్నారు వీళ్ళు. కానీ వాళ్ల పద్ధతి ప్రకారం ‘భర్త భార్య ఇంట్లో ఉండటం ఆచారం’ కాబట్టి పంపం అన్నారు.

శాంత కుమార్‌కి మతి పోయింది. ఒక్కడే కొడుకు. వీడు ఈ అడవిలో అత్తవారింట్లో ఇల్లరికం ఉండిపోతే అక్కడ వ్యవహారాలు అన్ని ఎవరు చూస్తారు? అందుకే ఇదంతా వాళ్లకి చెప్పి ఒప్పించమని అస్తవ్యస్తను బతిమాలాడు.

అస్తవ్యస్త శాయశక్తులా ప్రయత్నించి చూశాడు.

వాళ్ళు కాస్త మెత్తబడ్డారు. అయితే ఓ షరతు పెట్టారు. వాళ్ళు వచ్చి వీళ్ళ ఇల్లూ సంసారం చూస్తారు. వాళ్లకి నచ్చితే అప్పుడు ఆలోచిస్తారు.

శాంత కుమార్‌కి ప్రాణం కుదుట పడింది. ‘మా వైభవం చూస్తే కళ్లు తిరుగుతాయి వీళ్ళకి’ అనుకున్నాడు.

వాళ్ళని తీసుకువెళ్ళడానికి టాక్సీలు తెప్పించారు. “ఈ డబ్బాల్లో ఎక్కం. హాయిగా కాలినడకన వస్తాం” అన్నారు వియ్యాలవారు.

“నడుచుకుంటూ వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు పైగా వుంది. ఎప్పటికీ వస్తారు?” అని వాళ్లని బతిమాలి ఓ లారీ ఎక్కించాడు. గాలి ఆడుతోంది, ఆకాశం కనిపిస్తుంది కాబట్టి లారీ ఎక్కారు పేచీ పెట్టకుండా.

వాళ్ళ ఊరికి చేరారు. వీళ్ళ ఇల్లు చూసి ఆనoదించలేదు సరికదా, “ఇదేమిల్లు? చెట్లు తక్కువ, ఇల్లు ఎక్కువ. ఎండలో కోడిగుడ్డులా ఉంది” అని విసుక్కున్నారు.

“పిల్లని ఇక్కడ వదలము” అని ఖచ్చితంగా చెప్పేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయారు.

జంబుక పక్కనే వున్న భర్తని భుజాన వేసుకుని లారీ ఎక్కేసింది.

తల బాదుకున్నాడు శాంత కుమార్. కొండలరావుకి ఓ ఆలోచన వచ్చింది.

వాళ్లకి వూరు చివర ఓ ఫామ్‌హౌస్ వుంది. అక్కడ అయితే వుంటుందేమో జంబూక అని ఆశ కలిగింది.

అక్కడికి తీసుకు వెళ్ళి చూపించారు.

అక్కడి తోటా ఇల్లూ చూసి సణుగుతూనే ఒప్పుకున్నారు. “ఆరు మాసాలు ఇక్కడ, ఆరు మాసాలు అక్కడ వుంటారు” అని తీర్మానించి వెళ్ళిపోయారు.

వినాష్, జంబూక ఫామ్‌హౌస్‌లో కాపురం పెట్టారు.

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here