[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పదమూడవ భాగం. [/box]
[dropcap]అ[/dropcap]నుకోని వివాహం వలన వినాష్ జీవితం మారిపోయింది.
కొడుకుకి వైభవంగా పెళ్లి చేసి వూళ్ళో అందరినీ పిలిచి రిసెప్షన్ ఇవ్వాలి అని ఎంతో ఆశపడిన శాంత కుమార్ నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు.
ఇక వినాష్‌కి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది అంతా.
‘నేను డోలాయను ప్రేమించాను. తను అస్తవ్యస్తను ప్రేమిస్తోంది. ఎలాగైనా తన మనసు గెలుచుకుని తనని వివాహం చేసుకోవాలి అని నా ఆశ. ఈ లోగా ఈ సంఘటన జరిగిపోయింది. నీకు పుణ్యం వుంటుంది. నాకు విడాకులు ఇచ్చెయ్’ అని బ్రతిమాలుకుందామంటే భార్యకు భాష రాదు.
పైగా జంబూకకి భర్త అంటే తగని భక్తి ప్రేమ. వాళ్ళల్లో భర్తే దైవం. భర్తే ప్రాణం. కాబట్టి భర్తను ఒక్క క్షణం వదిలిపెట్టదు. ఎన్నో సేవలు చేస్తుంది.
ప్రతిరోజూ ఆకులు అలములు వెతికి తెచ్చి నూరి రసం తీసి అతని ఒంటికి పట్టించి ఎండలో కూచోపెడుతుంది. రక రకాల పువ్వులూ ఆకులూ తెచ్చి రోజుకో విధంగా అలంకారం చేస్తుంది. నాలుగు రోజులకు ఒకసారి నున్నగా గుండు చేస్తుంది.
పెళ్లయిన వారం రోజుల తర్వాత శాంతి కుమార్ ఫామ్ హౌస్‌కి వెళ్ళాడు. కొడుకుని చూడగానే ఏడుపు వచ్చింది ఆయనకి.
“ఏవిట్రా ఇది. నీ వ్యాపారాలు వ్యవహారాలు అన్ని వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్నావు” అన్నాడు.
బావురుమని ఏడిచాడు వినాష్. “నా భార్య నన్ను వదిలితేగా. గడప దాటి బయటకు వెళ్ళనివ్వదు” అన్నాడు.
“ఎందుకు? నువ్వు నీ పని చేసుకుంటే తనకేం బాధ?” అడిగాడు.
“ఏమో. ఏం మాట్లాడాలన్నా భాష రాదు కదా” వాపోయాడు.
“ఇంకా భాష రాలేదా నీకు?” అడిగాడు తండ్రి
“అదేం భాషో గానీ ఒక్క ముక్క అంతు పట్టడం లేదు్” అన్నాడు వినాష్.
ఇదో తలనెప్పి అని సణుక్కుని, “అతనే దిక్కు మనకు” అని అస్తవ్యస్తకు ఫోన్ చేశాడు.
“ఇప్పుడు బిజీగా ఉన్నా. సాయంత్రం వస్తాను” అన్నాడు అతను.
రాత్రి ఏడు గంటలకు డోలాయను వెంట బెట్టుకుని వచ్చాడు. “ఇదీ విషయం. మీరు వచ్చి కాస్త మధ్యవర్తిత్వం జరపాలి” అని ప్రాధేయపడ్డాడు.
మర్నాడు పొద్దున్నే అందరూ ఫామ్ హౌస్‌కి వెళ్ళారు.
అప్పుడే భర్తకు నీళ్లు పోసి అలంకారం ముగించింది జంబూక.
కొడుకుని అతడి అవతారాన్ని చూసి కడుపులోంచి దుఃఖం తన్నుకు వచ్చింది శాంత కుమార్‌కి.
“చూసారా వీడి ఖర్మ. చక్కగా సూట్ వేసుకుని ఏసీ ఛాంబర్‌లో కూచోవలసినవాడు. ఆ గుండు, ఆ గుండుకు పూలదండలు… ఎట్లా భరించను అస్తవ్యస్త గారూ” అని వాపోయాడు.
అస్తవ్యస్త ఆయన్ని ఓదార్చి జంబూకతో మాట్లాడాడు.
“తింటానికి తిండి వుంది. వుండటానికి ఇల్లు వుంది. హాయిగా విశ్రాంతిగా వుండక ఇంకా పనీ సంపాదన ఎందుకూ? అవసరం అయితే అప్పుడు కష్టపడాలి. అన్నీ వుండగా కూడా ఇంకా సంపాదించాలి అని ఆరాటపడితే ఇంక అనుభవించేది ఎప్పుడు?” అంది జంబూక.
వాళ్ళ పద్ధతి అదే. అవసరానికి మించి సంపాదించి దాచిపెట్టరు. అదీగాక ఆరు నెలలు అవగానే వాళ్ళింటికి వెళ్ళాలి. హాయిగా వుండక ఈ తగలాటకాలు, బాధ్యతలు ఎందుకు అని ఆమె ఆలోచన. అదీ నిజమే.
శాంత కుమార్ విషయం అర్థం చేసుకుని నిలువునా నీరయిపోయాడు.
కొడుకు ఆశ ఇక లేనట్లే.
కొండలరావు ఆయనకు నచ్చచెప్పాడు.
“మీరు యథార్థం ఆలోచించండి. మీ కొడుకు వల్ల మీకు ఇంతకాలం నష్టాలూ, తలనెప్పీ తప్ప ఏనాడైనా సుఖపడ్డారా? ఇన్నాళ్టికి ఆ జంబూక పుణ్యమా అని కాస్త దారిలో పడ్డాడు. ఇంకొన్నాళ్ళకి అన్నీ చక్కబడతాయి. ఎలాగూ ఆ పిల్ల మొగుడిని వదలదు. మీరే పరిస్థితికి అలవాటు పడాలి” అని హితబోధ చేశాడు.
అస్తవ్యస్త, జంబూక చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అతనికి వన మూలికల మీద ఆసక్తి వుంది అని తెలుసుకుని చాలా ఆనందించింది జంబూక.
“మాతో పాటు మా వూరు వస్తే నేను స్వయంగా అన్నీ చూపిస్తాను” అంది.
అస్తవ్యస్త, డోలాయ మాట్లాడుకున్నారు. ‘ఇది హెర్బల్ యుగం. మంచి హెర్బల్ ప్రోడక్ట్స్‌కి విలువ వుంది. కాబట్టి వాళ్ళతో వెళ్ళి అవన్నీ తెలుసుకుని బిజినెస్ పెంచుకోవచ్చు’ అనుకున్నారు. వినాష్, జంబూకలతో పాటు తాము కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
అలాగే వెళ్లారు. అక్కడ వీళ్లకు ఘన స్వాగతం లభించింది.
వినాష్ సరే అల్లుడు.
వీళ్ళిద్దరూ అతిథులు.
మర్నాటికి కాస్త మార్పు. అల్లుడు గారు కుటుంబంలో సభ్యుడు కాబట్టి అతనికి కొన్ని పనులు అప్పగించారు. కట్టె పుల్లలు కొట్టుకు రావటం, మొక్కజొన్న చేలకు కాపలా కాయటం వంటి చిన్న పనులే ఇచ్చారు.
సకల మర్యాదలు పొందుతూ దర్జాగా డోలాయతో తిరుగుతున్న అస్తవ్యస్తని చూస్తుంటే ఈర్ష్య అసూయలతో దహించుకుపోతోంది వినాష్ హృదయం.
(తరువాత కధ మళ్ళీ).