[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పదహారవ భాగం. [/box]
[dropcap]అ[/dropcap]స్తవ్యస్త అడవిలో నుండి ఎన్నో మూలికలు తీసుకు వచ్చాడు. శాస్త్రజ్ఞుల చేత ప్రయోగాలు చేయించాడు. అవన్నీ విజయవంతం అయ్యాయి. సంతాన ప్రాప్తికి మందు. కీళ్ల నెప్పులు తగ్గటానికి మందు. రక్త లేమికి మందు. ఒకటేమిటి. అరడజను రకాల ఔషధాలు తయారు చేయించి మార్కెట్ లోకి విడుదల చేశాడు.
ఇప్పుడు కాలం మారింది. అప్పట్లో ఇంపోర్టెడ్ వస్తువులు అంటే పడి చచ్చిపోయిన జనాలు ఇప్పుడు మనదేశపు ఉత్పత్తుల మీద మక్కువ చూపిస్తున్నారు. ఆర్గానిక్ ఆహారం, ఆయుర్వేదం ఇవన్నీ వాడటం గొప్ప ఫ్యాషన్ అయిపోయింది.
ఆ కారణంగా అస్తవ్యస్త వ్యాపారం మూడు పువ్వులు పన్నెండు కాయలుగా వుంది. లాభాల్లో కూరుకు పోతున్నాడు. తోడు నీడగా డోలాయ వుండనే వుంది.
కొడుకు ప్రగతి చూసి భాగ్యలక్ష్మి చాలా సంతోషించింది. అటు అనంతరామ్, ఆదిలక్ష్మి కూడా చాలా ఆనందంగా వున్నారు. ఎవరు కనపడినా అస్తవ్యస్త విజయ గాథలు వినిపించి మురిసిపోవటం.
ఇదంతా చూసి చూసి విసిగి వేసారి పోయిన అనంతరామ్ గారి ఇంటి పురోహితుడు నడుము కట్టుకున్నాడు.
“మీ మురిపెం బాగానే ఉంది కాని. వాళ్ళిద్దరికీ వివాహం చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు” అని ప్రశ్నించాడు.
“చిన్న పిల్లలు. ఇప్పుడే ఎందుకండీ పెళ్లి?” అన్నది ఆదిలక్ష్మి.
“అమ్మా మీ అమ్మాయికి ముప్ఫై అయిదు దాటాయి. అతనికి ముప్ఫై యెనిమిది. ఇంకా చిన్న పిల్లలు అంటారేమిటీ?” అని విసుక్కున్నాడు.
ఆయన పోరగా పొరగా “సరే ఆవిడ ఏమంటారో చూద్దాం” అని భాగ్యలక్ష్మికి ఫోన్ చేశారు. ఆవిడ కూడా “ఇప్పుడే ఏం తొందర?” అన్నది.
ఆ తర్వాత లెక్క వేసి చూసింది. ముప్ఫై యెనిమిది వచ్చింది. జాతక రీత్యా వివాహ ఘడియ వచ్చింది. కాబట్టి సరే అన్నది. ముహర్తం పెడదాం అనుకున్నారు.
అస్తవ్యస్త ఆప్తులకు అందరికీ తెలిసి పోయింది ఆ శుభవార్త. అందరూ సంబరపడిపోయారు.
ఒక్క వ్యక్తి తప్ప.
ఆత్రత ఆ వార్త విని హతాశురాలై పోయింది. పరుగున వెళ్ళి భాగ్యలక్ష్మి కాళ్ళ మీద పడిపోయింది.
“నాకు అన్యాయం చెయ్యకండి. ఆయన లేకుండా నేను బతకలేను. నన్ను చూస్తుంటే మీకు జాలి వేయటం లేదా?” అని ఏడ్చింది.
భాగ్యలక్ష్మికి జాలి వేయలేదు సరికదా ఒళ్ళు మండిపోయింది. “ప్రపంచంలో అందరికీ తెలుసు. మా అబ్బాయి డోలాయని పెళ్లి చేసుకుంటాడు అని. ఇంకా నీకు అర్థం కాలేదా. ఏమిటి పిచ్చి గోల” అని బాగా కోప్పడింది.
అస్తవ్యస్త దగ్గరికి వెళ్ళింది ఆత్రత.
“మీరే నా సర్వస్వం అనుకున్నానే! మీ మీదనే నా ఆశలన్నీ పెట్టుకునీ, మీ పాదాల చెంత నా జీవితం నడపాలని అనుకున్నానే! ఇలా చేయటం మీకు న్యాయమా! నా ఆశ నిరాశ చేస్తారా? ఈ దీనురాలను కరుణించరా!” అని అతని కాళ్ల మీద పడి బోరున ఏడ్చింది.
బరువుగా నిట్టూర్చాడు అస్తవ్యస్త. “నీకేమైనా పిచ్చా ఆత్రత? ఎవడైనా వింటే నవ్విపోతాడు. నేను మొదట్లోనే చెప్పేను. నిన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు” అన్నాడు.
“పోనీ ఇప్పుడు చూడండి. ఎన్ని సినిమాలలో చూడలేదు. నాదీ ఆడ జన్మ, పూజ, ఇలా ఎన్నో సినిమాల్లో ముందర ఆ దృష్టితో చూడకపోయినా ఆ తర్వాత మనసు మార్చుకుని ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు?” అంది.
“కానీ నా మనసు డోలాకి అంకితం చేశాను కదా” అన్నాడు అస్తవ్యస్త.
“అయితే పాత సినిమాలో శోభన్ బాబు లాగా మీరు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోండి. ఇద్దరం సఖ్యంగా ఉంటూ మీ జీవితాన్ని నందనవనం చేస్తాం” అన్నది.
అప్పటి దాకా ఓర్పుగా సమాధానం చెప్పింది అస్తవ్యస్తకి చిరాకేసింది. “బుద్ధి ఉందా నీకు? చెప్తే వినవే అవతల నా పెళ్ళికి ముహుర్తాలు పెట్టేశారు. పెళ్లి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇంకా ఈనాటి ఇటువంటి పిచ్చి వాగుడు వాగడానికి నీకు సిగ్గుగా లేదా! నోరు మూసుకో, మళ్లీ పెళ్లి అన్నావంటే మర్యాద దక్కదు” అని వెళ్ళిపోయాడు.
అంతే కాదు. ఆత్రుత తండ్రి ఆదినారాయణ పిలిపించి మందలించాడు. “సైకిల్ వేసుకుని ఉత్తరాలు పంచటం. ఇంటికి వచ్చి నిద్ర పోవటం. అది తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా. ఎదురుగుండా పెళ్లికి వచ్చిన కూతురు ఉంది కదా. తనకి పెళ్లి పేరంటం చెయ్యాలి అని ధ్యాస లేదా మీకు! నేను మంచి సంబంధం చూస్తాను. వెంటనే పెళ్లి చేసేయండి” అన్నాడు.
ఆదినారాయణ ఇంటికి వచ్చి కూతురు దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు.
“నేను అస్తవ్యస్త గారికి మనసిచ్చాను నాన్నా! పెళ్లంటే చేసుకుంటే ఆయననే…” అంది.
“బుద్ధుందా నీకు? అవతల ఆయన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి” అన్నాడు.
“ఏర్పాట్లేగా, జరగనీ! ఆఖరి క్షణాల్లో పెళ్లి తప్పిపోవడం ఎన్నిసార్లు చూడలేదు! ఇక్కడ కూడా నా అదృష్టం బాగుండి ఆఖరి క్షణాల్లో తాళిబొట్టు చేతిలో పట్టుకుని ఆయన మనసు మారి, డోలా నువ్వు పో, ఆతృత నువ్వు రా అని నా మెడలో తాళి కడతారేమో. భవిష్యత్తు మనకు తెలుసా నాన్నా! నేను ఆశతో ఎదురుచూస్తున్నాను” అన్నది మెరిసే కళ్ళతో.
“నిన్ను పెళ్లి చేసుకోను అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేశారు, ఇంకా నీ పిచ్చి నీదేనా?” అన్నాడు కోపంగా.
“అంటే.. నాన్నా అది ఆయనిష్టం. ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం” అంది.
“అయితే ఆయన పెళ్లయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాడు.
“చేసుకోను నాన్నా. వాళ్ళిద్దరికీ గొడవలు వచ్చి విడిపోవచ్చు. లేదా ఏ పురిట్లోనే జరగరానిది జరగవచ్చు. ఆయన రెండో పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు” అన్నది.
ఆదినారాయణకు భయం వేసింది. ఇది ప్రేమ కాదు. ఉన్మాదం. ఇది ముదిరితే ప్రమాదం అని అస్తవ్యస్త దగ్గరికి పరుగున వెళ్ళాడు
“సార్ ఇదీ పరిస్థితి. మరి ఏం చేస్తారో మీ ఇష్టం. శుభ్రంగా మీ పలుకుబడి ఉపయోగించి ఆఫ్రికా దేశం పంపించేయండి” అన్నాడు.
అస్తవ్యస్త దీర్ఘంగా ఆలోచించాడు. ఏదో వెర్రిమొహం అని ఇన్నాళ్లు ఎన్ని తలతిక్క పనులు చేసిన సహిస్తూ వచ్చాడు. ఇప్పుడు పిచ్చి ముదిరింది. ఇక లాభం లేదు.
వెంటనే ఆత్రుతని పిలిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది ఆత్రుత. “ఏమిటి సార్? మీ నిర్ణయం మార్చుకున్నారా, నాకు తెలుసు” అన్నది ఆనందంగా.
“కొట్టానంటే పళ్ళు రాలుతాయి పిచ్చిగా ఉందా. పెళ్లంటే ఆటలా. నా మాట విను నా పెళ్లి కంటే ముందర నీ పెళ్లి చేసేస్తా. నా ఎరుకలో మంచి అబ్బాయి ఉన్నాడు” అన్నాడు.
“వద్దు. నేను పెళ్లి చేసుకోను. మిమ్మల్ని మనసులో నింపుకుని…” అని చెప్తుంటే వారించాడు.
“నోరు మూసుకో. ఇంకా ఇలాగే మాట్లాడావంటే పిచ్చాస్పత్రిలో చేర్పిచ్చేస్తాను. అప్పుడు అక్కడ పడిఉండాలి” అన్నాడు.
“ఫర్వాలేదు అక్కడే పడి ఉంటాను. ప్రేమలో పడి పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. వాళ్లతో పాటు నేనూ” అన్నది.
తల బాదుకున్నాడు అస్తవ్యస్త. ఇలా కాదు, ఈ పిచ్చి వదిలించాలి.. అనుకున్నాడు.
“సరే, నువ్వు నన్ను అల్లరి పాలు చేస్తున్నావ్. నా పరువు తీస్తున్నావు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను” అన్నాడు.
ఆత్రుత గుండె ఠారుమంది
“వద్దు వద్దు. నాకోసం మీరు ఇంత త్యాగం చేస్తుంటే నేను భరించలేను. మీకోసం నేనే త్యాగం చేస్తాను” అన్నది.
“త్యాగం వద్దు, పెళ్లి చేసుకో చాలు” అన్నాడు అస్తవ్యస్త.
“సరే, మీ సంతోషం కోసం అలాగే కానివ్వండి”
“సరే అయితే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
“అవసరం లేదు. మీరు గాడిదని తీసుకొచ్చినా తలవంచుకుని తాళి కట్టించుకుంటా” అన్నది
“అతను గాడిద కాదు. అతను చూడాలిగా నిన్ను” అని మర్నాడే పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు. పెళ్లి కొడుకు పేరు ప్రశాంత్. ఏ హడావిడి లేకుండా నిదానంగా సౌమ్యంగా ఉంటాడు. అస్తవ్యస్త దగ్గరే పని చేస్తున్నాడు. మంచివాడు. బుద్ధిమంతుడు. కంగారు, గాబరా పడిపోయే ఆత్రుతకు అతను సరిజోడి.
అతనికి ఆత్రుత నచ్చింది. ఆత్రుత సరే గాడిద నైనా చేసుకుంటానంది కాబట్టి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ మూడు ముళ్ళు వేయించాడు.
పెళ్లి నాటి రాత్రి భర్తతో తన మనసులోని మాట చెప్పింది ఆత్రుత.
“నా మనసులో అస్తవ్యస్త గారు తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఆ స్థానం వారిదే ఇంకెవరికి ఇవ్వలేను, మీరు నా శరీరానికి మాత్రమే భర్త” అన్నది.
“ఏం పర్వాలేదు, నాకు అలాంటి పట్టింపులు లేవు. నాకు శరీరం చాలు” అన్నాడు ప్రశాంత్ నిదానంగా.
అస్తవ్యస్త పెళ్లి మామూలుగా ధనవంతుల వివాహంలో ఆర్భాటంగా జరగలేదు. కోట్లు ఖర్చుపెట్టి విందులు వినోదాలు చేయలేదు. తను అనాథ కాబట్టి చాలామంది అనాథ పిల్లలకు చదువుకు సాయం చేశాడు, పేద వాళ్ళ కోసం ఇళ్ళు కట్టించాడు. తన పెళ్లి ముహూర్తానికి మరికొంతమంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. తన మిత్రులందరికి సింపుల్‌గా విందు భోజనం పెట్టాడు. అస్తవ్యస్త ఆలోచనా విధానాన్ని మరొకసారి పొగిడారు అందరూ.
అందరి దృష్టిలో అతను మరింత ఎత్తుకు ఎదిగాడు. అందరూ పొగిడారు సరే, వినాష్ కూడా అతడిని ఆకాశానికి ఎత్తేశాడు.
జంబుక నిండు నెలల మనిషి. అయినా అన్న పెళ్లి అని హుషారుగా తిరిగింది.
శాంతకుమార్ ఆ సమయంలో ఒక ప్రస్తావన తెచ్చాడు. అస్తవ్యస్త కంపెనీలో వినాష్‌ని కూడా భాగస్వామిగా చేసుకోమని కోరాడు.
“వాడి సంగతి నీకు తెలుసుగా అదో రకం మనిషి. ప్రస్తుతానికిది గానే ఉన్న మళ్లీ ఎక్కడ మారిపోతాడో అని నాకు టెన్షన్‌గానే ఉంటుంది. మీ అండన ఉంటే నాకు నిశ్చింత” అన్నాడు.
“అలాగే వినాష్‌కి అంగీకారమైతే నేను సిద్ధమే” అన్నాడు అస్తవ్యస్త. మంచి రోజు చూసుకుని వారిద్దరూ భాగస్వాములయ్యారు. కొత్త కంపెనీ ప్రారంభించారు.
దానికి వాళ్ల నలుగురి పేర్లు కలిసి వచ్చేలా ‘అవిడోజ’ అని పేరు పెట్టారు. అర్థం కాకుండా వున్న ఆ పేరు జనాలని బాగా ఆకర్షించింది.
వినాష్‌కి అసిస్టెంట్‌గా ప్రశాంత్‌ను నియమించాడు అస్తవ్యస్త. నిజం చెప్పాలంటే వినాష్‌లో మార్పు వచ్చింది ఇప్పుడు కుదురుగా ఉంటున్నాడు. ఒకవేళ బుర్ర తిరిగి ఏదైనా పిచ్చి పని చేయబోతే ముందే ఊహించి వారిస్తాడు ప్రశాంత్.
ఈ మొత్తం ప్రక్రియలో అమితంగా ఆనందించింది కొండలరావు. అతనికి కొండంత అండగా నిలిచాడు ప్రశాంత్. ఇకముందు వినాష్ తనకు హఠాత్తుగా ఫోన్ చేసి ‘కొండలరావు కొంప మునిగింది’ అని కంగారు పెట్టే పరిస్థితి రాదు. శాంత కుమార్‌తో ‘నేను కొంతకాలం ప్రశాంతంగా కాశీలో ఉంటాను’ అని చెప్పాడు. ఆయన అంగీకరించి డబ్బులు ఇచ్చి సాగనంపాడు.
మొత్తానికి అందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరి జీవితాలు ఒక గాటిన పడ్డాయి. వారి ఆనందాన్ని ఇనుమడింప చేస్తూ జంబుక మగబిడ్డని ప్రసవించింది. ఆ పిల్లవాడికి అవినాష్ అని పేరు పెట్టారు.
కథ కంచికి మనం ఇంటికి.
సమాప్తం