[box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీ లోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంటూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచన చేయగల ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య డిటెక్టివ్ రచన “ఏమవుతుందో??ఎటుపోతుందో??ఏమో??” రెండవ భాగం ఇది. [/box]
ఆత్రత రాసిన వుత్తరం చూడగానే వెంకటస్వామికి లాటరీ తగిలినట్లు అయింది. దీని ఆధారంగా ఆ అస్తవ్యస్తను బ్లాక్‌మెయిల్ చేసి బోల్డంత డబ్బు గుంజవచ్చు అని ప్లాన్ వేసాడు.
అస్తవ్యస్తకు ఫోన్ చేసి “మిమ్మల్ని వంటరిగా కలవాలి. ఓ రహస్యం చెప్పాలి. ఎక్కడికి రమ్మంటారు?” అని అడిగాడు
“ఇంకాసేపట్లో బయలుదేరి ఊరి చివరనున్న పాడుబడిన కోట దగ్గరికి వెళ్తున్నాను. రా” అన్నాడు అస్తవ్యస్త.
అతనలా ఠపీమని ఒప్పేసుకుంటాడని ఊహించని వెంకటస్వామి గతుక్కుమన్నాడు.
“నిజమేనా? వస్తావా? వంటరిగానే వస్తావా??” అని అడిగాడు
“వస్తావా ఏమిటీ? వచ్చేస్తున్నా. నువ్వూ మరి బయలుదేరు. ఆలస్యం అయితే నీకే నష్టం” అన్నాడు అస్తవ్యస్త.
వెంకటస్వామికి అయోమయంగా అనిపించింది. ఎందుకైనా మంచిది అని చిన్నా చితకా దొంగతనాలు చేసే కోటేశ్వరరావు దగ్గరికి వెళ్లి అతడిని తోడు తీసుకుని ఊరిబయట పాడుబడ్డ కోట దగ్గరికి చేరాడు.
అప్పటికి అయిదు నిముషాల క్రిందటే అక్కడి చేరాడు అస్తవ్యస్త.
అటుతిరిగి వున్న ఆ మనిషిని చూస్తే కాస్త భయం వేసింది వెంకటస్వామికి.
“ముందు నేను మాట్లాడతాను. తరవాత నిన్ను పిలుస్తాను” అని చెప్పి కోటేశ్వరరావుని అక్కడే ఆపేసి వంటరిగా వెళ్ళాడు.
అలికిడి విని వెనక్కి తిరిగాడు అస్తవ్యస్త.
“నువ్వేనా? నన్ను రమ్మని ఫోన్ చేసిందీ?” అని అడిగాడు
“అవును. నేనే” చెప్పాడు వెంకటస్వామి.
వాళ్లిద్దరి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది.
అ: “ఎవర్నువ్వు.”
వె:. “అదంతా నీకు అనవసరం.”
అ: “నన్నెదుకు కలవాలనుకున్నావ్?”
వె: “నీకు సంబంధించిన ఓ సీక్రెట్ తెలుసు నాకు.”
అ: “నీకేవిటీ. అందరికీ తెలుసు.”
వె: “అందరికీ తెలుసా.”
అ: “తెలుసు.”
వె: “అయినా సరే. రుజువు నా దగ్గరుంది.”
అ: “అదేమైనా గొప్పా. అందరిదగ్గరా వుంది రుజువు.”
వె: “అంటే ఆ దొంగ పీనుగ ఇలాటి ఉత్తరాలు ఇంకా కొందరికి ఇచ్చిందా?”
అ: “ఏ దొంగ పీనుగా? ఏ ఉత్తరం?”
వె: “ఆత్రత. ఆత్మహత్య ఉత్తరం.”
అ: “ఆత్రతా?? ఆవిడెవరు?”
వె: “నీకు ఆత్రత తెలియదా?”
అ: “తెలీదు.”
వె: “తెలీకుండానే నువ్వు పెళ్లి చేసుకోకపొతే ఆత్మహత్య చేసుకుంటానంటుందా?”
అ: “ఆత్మహత్యా? ఎందుకు?”
వె: “పెళ్ళికి ఒప్పుకోకపోతే!”
అ: “ఎవరొప్పుకోవాలి?”
వె: “ఎవరేమిటీ నువ్వే.”
అ: “నేను పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటుందా? అయ్యో పాపం. అలా అయితే నేను ఒప్పుకున్నానని చెప్పు పో.”
వె: “ఏవిటీ ఒప్పుకుంటావా.”
అ: “ఆ. లేకపోతే ఆవిడెవరో ఆత్మహత్య చేసుకుంటుందన్నావుగా.”
వె: “అలా వీల్లేదు. నువ్వు వద్దనాలి. నేను నిన్ను బ్లాక్‌మెయిల్ చెయ్యాలి.”
అ: “ఆత్మహత్య అన్నావు. పెళ్ళన్నావు. ఇప్పుడు మళ్ళీ బ్లాక్‌మెయిల్ అంటావు. నీకేమైనా పిచ్చా?”
వె: “నాకేం పిచ్చి లేదు. ఆత్రత ఆత్మహత్య చేసుకుంటే నేరం నీ మీదికి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నాకు డబ్బివ్వాలి నువ్వు. ఇవ్వకపోతే నిన్ను నేను బ్లాక్‌మెయిల్ చేస్తా.”
అ: “నీ బొందలా వుంది. అవన్నీ నీ వల్లకావులే.”
వె: “ఎందుకు కావు? నేనెవరో తెలుసా నీకు? రాములపురం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌ని.”
అ: “అయితే మాత్రం? నన్నేమీ చెయ్యలేవు. ఎందుకంటే ఇంకాసేపట్లో నేను ఆత్మహత్య చేసేసుకుంటున్నా.”
వె: “ఆత్మహత్యా?”
అ: “అవును.”
వె: “వీల్లేదు. వీల్లేదంతే. నువ్వు చస్తే నేనెవర్ని బ్లాక్‌మెయిల్ చెయ్యాలి?”
అ: “ఇంకెవరినైనా వెతుక్కుని చెయ్యి బ్లాక్‌మెయిల్.”
వె: “ఇప్పటికిప్పుడు ఇంకెవర్ని వెతుక్కోను? ఆత్రత నీ గురించేగా వుత్తరం రాసింది. అది నా దగ్గరుంది. పోనీ ఆత్రత ఇంకెవరినైనా ఇలాగే బెదిరిస్తూ రాసిందా? ఉంటే చెప్పు వాళ్ళని చేస్తా బ్లాక్‌మెయిల్.”
అ: “ఏమో. ఆత్రత ఎవరో తెలియదు నాకు. అవన్నీ నాకేం తెలుసు?”
వె: “అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్?”
అ: “నన్నడిగితే నేనేం చెప్పనూ?”
వెంటస్వామికి బుర్ర పని చెయ్యటం మానేసింది. వెంట తెచ్చుకున్న కోటేశ్వరావు సాయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తోచింది. వెంటనే విజిల్ వేశాడు.
ఆ సంకేతం అందుకుని గంభీరంగా వచ్చాడు కోటేశ్వరరావు.
అప్పటికి చీకటి పడుతోంది. పరీక్షగా చూస్తే తప్ప ఎవరెవరో గుర్తించటం కష్టమే.
“చెప్పు. డబ్బివ్వనని మొండికేస్తున్నాడా? తాట ఒలిచేస్తా, నెత్తురు కక్కిస్తా” అన్నాడు కోటేశ్వరరావు.
“ఇవ్వనంటే ఆ పని చేసేవాళ్ళం. కాదుట. ఆత్మహత్య చేసుకుంటాడట” అంటూ వివరంగా చెప్పాడు వెంకటస్వామి.
వాళ్ళలా మాట్లాడుకుంటుంటే ఆ మనిషిని గుర్తు పట్టేశాడు అస్తవ్యస్త.
“కోటేశ్వర్రావ్ నువ్వట్రా?” అన్నాడు
గతంలో ఎప్పుడో కోటేశ్వరరావు అస్తవ్యస్త దగ్గర డ్రైవరుగా పనిచేసేవాడు. చేతివాటం ఎక్కువ. ఓ రోజు స్టెప్నీ దొంగిలించి పారిపోయాడు. ఇప్పుడు హఠాత్తుగా అతను పలకరించేసరికి ఉలిక్కిపడ్డాడు.
“అయ్యగారూ మీరా? అయ్యబాబోయ్” అని పారిపోబోయాడు.
వెంకటస్వామి వాడిని పట్టేసుకున్నాడు. “ఆయన్ని బెదిరిస్తావని తీసుకొస్తే నువ్వు బెదిరిపోయి పారిపోతే ఎట్లారా కోటేసూ” అన్నాడు.
“ఆయన సంగతి నీకు తెలీదు. కరాటే వచ్చు. కొట్టాడంటే పళ్ళు రాలిపోతాయి” అని వదిలించుకు పారిపోబోయాడు.
“అలాగైతే నేనూ వస్తా” అని వెంకటస్వామి కూడా పారిపోబోయే ప్రయత్నం చేసాడు.
ఇద్దర్నీ పట్టుకుని ఆపేసాడు అస్తవ్యస్త. ఆ తరవాత రన్నింగు ఛేసింగూ. రోడ్డుకి అడ్డంగా. అప్పుడే అటువైపు ఓ కారు వస్తోంది. దానికి అడ్డం పోయారు ముగ్గురూనూ.
ఆ కారాయన సడన్ బ్రేక్ వేసి కారాపేసి విండో గ్లాస్ దించి ” ఏవిటిది? సినిమా షూటింగా? రియల్ లైఫ్‌లో ఫైటింగా?” అని అడిగాడు.
“రెండూ కాదు నేరస్తుల ఛేసింగ్” అన్నాడు అస్తవ్యస్త.
“అయితే నేనూ సాయం చేస్తా” అంటూ కారు దిగి ఒకడిని పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి వాళ్ళిద్దర్నీ కార్లో పడేసి కాళ్ళూ చేతులూ కట్టేశారు.
“ఏవిటీ వీళ్ళు చేసిన నేరం?” అని అడిగాడు ఆయన.
“వీడు దొంగ. వీడు పోలీసు. ఇద్దరూ కలిసి నన్ను బ్లాక్‌మెయిల్ చేద్దామని ప్లానేసుకున్నారట” చెప్పాడు అస్తవ్యస్త.
“అసలు బ్లాక్‌మెయిల్ చెయ్యటమే నేరం. ఓ పోలీసు ఆ పని చెయ్యటం ఇంకా దారుణం. దానికి ఓ దొంగని హెల్ప్ అడగటం దారుణం. వీళ్లిద్దరికీ చెరో రెండు వురి శిక్షలూ వెయ్యాలి. పదండి పోలీసులకి అప్పచెపుదాం” అన్నాడాయన.
“అవును అలాగే చేద్దాం. నా కార్లో వెళ్తాను. మీరు నావెంట రండి” అన్నాడు అస్తవ్యస్త.
రెండు కార్లూ బయలుదేరాయి. రోడ్ పక్కన ఓ టీకొట్టు కనిపిస్తే కారాపేడు అస్తవ్యస్త. “తలనెప్పిగా వుంది.టీ తాగుదాం” అన్నాడు.
ఇద్దరూ కూచుని టీ ఆర్డర్ ఇచ్చారు.
అక్కడ లైట్లు పట్టపగల్లా వున్నాయి. ఆయన అస్తవ్యస్త వంక కళ్లప్పగించి చూడ్డం మొదలెట్టాడు.
అంతటితో ఆగక “మిమ్మల్ని ఎక్కడో చూసినట్లూ వుంది” అన్నాడు. ఇబ్బందిగా కదిలాడు అస్తవ్యస్త. ఆమధ్య పేపర్లలోనూ ఛానెల్స్ లోనూ అతని మొహం జనాలకు విసుగెత్తేలా కనిపించింది.
ఆ మాటే చెప్పాడు.
“కాదు చానల్లో చూసిన వాళ్ల మొహం తెల్లారేసరికి మర్చిపోతాం. మీరలా కాదు” అని ఆలోచిస్తూ వుండిపోయాడు.
టీ తాగటం అయింది. బిల్ చెల్లించి “ఇక వెళ్దామా” అన్నాడు అస్తవ్యస్త. అప్పుడు ఫ్లాష్ వెలిగింది ఆయనకి.
“మీరు భగీరథ గారి అబ్బాయి కదా?” అని అడిగాడు సంభ్రమంగా.
ఆశ్చర్యపోయాడు అస్తవ్యస్త.
“అవును. వారి అబ్బాయినే. మీరూ?”
“నేను నారాయణని. విదేశాలకి వెళ్ళిపోయాక అందరూ రాయ అని పిలుస్తున్నారు.”
“మీకు మా నాన్నగారు తెలుసా?”
“యెంత మాట? తెలియటం కాదు ఆయన మా పాలిటి దేవుడు. అప్పట్లో నాకు పచ్చకామెర్ల వ్యాధి వచ్చి డాక్టర్లు ఆశ వదిలేస్తే పసరు వైద్యం చేసి బతికించింది ఆ దేవుడే” అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
“ఆ తరువాత ఆయన కోసం చాలాకాలం వెతికాను. కానీ ఆయన ఆచూకీ తెలియలేదు” అన్నాడు గద్గద కంఠంతో.
“ఎలా తెలుస్తుంది? ఆయన పోయారు” అన్నాడు అస్తవ్యస్త కూడా గద్గద కంఠంతో.
“అవునుట. విన్నాను. అప్పుడు ఆయన దగ్గర మీ ఫోటో చూశాను. అందుకే గుర్తుపట్టాను. ఎలావున్నారు? ఏం చేస్తున్నారు?” అని అడిగాడు రాయ.
బరువుగా నిట్టూర్చి”అదో పెద్దకథ. వ్యాపారంలో మునగనూ తేలనూ, మళ్ళీ మునగనూ మళ్ళీ తేలనూ. అదే నడుస్తోంది” అంటూ అంతా చెప్పుకొచ్చాడు అస్తవ్యస్త.
“అయితే ఇప్పుడు మునిగి వున్నావన్న మాట” అన్నాడు రాయ.
“అవును. పీకలదాకా. అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను” అన్నాడు దీనంగా .
“మీ నాన్నగారెంతో పుణ్యాత్ములు. వారి కొడుక్కి ఆ గతి పట్టదు. నీకు డబ్బు కావాలి. అంతేగా. నేనిస్తాను. నాకు అక్కడ అన్నీ వున్నాయి. పిల్లలూ సెటిల్ అయ్యారు. ఇక్కడేమో ఎవరో అప్పు తీసుకుని కట్టలేక కొంత భూమి ఇచ్చారు. అప్పట్లో రాళ్ళూ రప్పలూ, బీడు భూమి అయినా ఇప్పుడు ఆ పక్కనే పెద్ద కంపెనీలు వచ్చి ధరలు విపరీతంగా పెరిగాయిట. ఏదో చెయ్యండి. లేపోతే ఎవరో ఆక్రమిస్తారు అని పోరుతుంటే వచ్చాను. అవి నీ పేర పెడతాను. నువ్వు వాటి సాయంతో మళ్ళీ పుంజుకో” అన్నాడు రాయ.
ఆశ్చర్యపోయాడు అస్తవ్యస్త. “అలా వద్దు. అప్పివ్వండి. లేదా మీరూ పార్ట్‌నర్‌గా జేరండి” అన్నాడు.
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కొట్టు కట్టేసే టైం అయింది.
వెనక సీట్లో పడున్న దొంగా పోలీసు అప్పటికి మూడుసార్లు చిటికెనవేలు చూపించారు. నాలుగుసార్లు దాహం అని మొత్తుకున్నారు. అందాకా టీ కొట్టు కుర్రాడికి ఓ ఐదొందల నోటు ఇచ్చి ఆ దొంగా పోలీసులకి ఏం కావాలో చూడమని, పారిపోకుండా కనిపెట్టి ఉండమని చెప్పాడు రాయ.
ఆ టీ కొట్టువాడు వాళ్ళిద్దరినీ మరింత బలమైన తాడుతో కట్టి వాళ్ళ మంచీ చెడ్డా చూసుకున్నాడు.
అందుకు గాను అతనికి మరో వెయ్యి చేతుల్లో పెట్టాడు రాయ.
“నేను హోటల్లో దిగాను. అక్కడికి పోయి మాట్లాడుకుందాం పద” అన్నాడు రాయ.
ఇద్దరూ ఊళ్లోకి ప్రవేశించారు.
“మనకు బోలెడన్ని పనులున్నాయి. ఇప్పుడీ దొంగా పోలీసులని పోలీసు స్టేషన్‌కి తీసికెళ్ళి అప్పగిస్తే అదో తలనెప్పి వ్యవహారం. వాళ్ళనొదిలి మనల్ని పీక్కు తింటారు. వాళ్ళచుట్టూ తిరగలేక చావాలి” అన్నాడు రాయ.
“ఔన్నిజమే. వీళ్ళిద్దర్నీ ఏంచేద్దాం ?” అన్నాడు అస్తవ్యస్త.
“ఇక్కడే వదిలేద్దాం” అన్నాడు రాయ.
కట్లు విప్పేశారు. “పోండి” అంటే దొంగ ఊరుకున్నాడు గానీ పోలీసు “ఇలా ఇక్కడొదిలేస్తే ఇంటికెట్లా పోతాము? మీమీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నా. నాకేఁవిటి మరీ” అని నస మొదలు పెడితే ఓ అయిదొందలు చేతులో పెట్టి కారెక్కాడు రాయ.
ఇద్దరూ హోటల్‌కి వెళ్లారు.ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఏం చెయ్యాలో ఓ కాయితం మీద రాసుకుని కాయితం మడత పెట్టి కవర్లో పెట్టారు.
అదే సమయానికి అస్తవ్యస్త ఇంట్లో ఓ కవరు విప్పింది భాగ్యలక్ష్మి. “సాయంత్రం అనగా వెళ్లిన వాడు అర్ధరాత్రి దాటినా రాలేదేమిటా. అసలే మనసు బాగాలేక పిచ్చివాడిలా తిరుగుతున్నాడు” అనుకుంటూ అస్తవ్యస్త గదిలోకి వచ్చింది ఆవిడ. బల్లమీద ఓ కవరు కనిపించింది. అది తెరిచి అందులోంచీ ఓ వుత్తరం బయటికి తీసింది
“అమ్మా, ఓడిపోయాను. అలిసిపోయాను. ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయినా నీకు ఏవిధమైన ఇబ్బందీ కలగకుండా అంతా ఏర్పాటు చేశానమ్మా. క్షమించు. ఇట్లు అస్తవ్యస్త”
ఆ వుత్తరం చదవగానే భాగ్యలక్ష్మి మొహం వెలిగిపోయింది. హమ్మయ్య. ఈ శుభ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను నాయనా అనుకుంది.
ఆమెకు భర్త మాటలు గుర్తుకొచ్చాయి.
ఆమె భర్త గౌరీనాథ శాస్త్రి. పేరు ప్రతిష్ఠా అంతగా లేకపోయినా జ్యోతీష్యంలో గొప్ప పండితుడు.
“అస్తవ్యస్త జాతకం అంతా అయోమయంగానే వుంది. కాకపొతే ఒడిదుడుకులు వున్నా అంతిమవిజయం సాధిస్తాడు. నిరాశ చెంది నాలుగు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. చేసిన ప్రతిసారీ అతని జీవితం ఊహించని రీతిలో మలుపు తిరుగుతుంది” అని స్పష్టంగా చెప్పాడు. గతంలో రెండుసార్లు అలాగే జరిగింది ఇది మూడోసారి.. ఇప్పుడూ మంచే జరుగుతుంది..
అయినా ఆవిడ తల్లి మనసు కలుక్కుమంది. ఏవిటో వెర్రి సన్నాసి. వీడికి అడుగడుగునా కష్టాలు ఏవిటో అనుకుంది
ఆవిడ బాధ సహజమే. పాపం అతని జీవితం అంతా సమస్యలే. ఎవరో కని రోడ్డుమీద పారేసి పొతే అనాథాశ్రమంలో జేర్చారు. పిల్లాడు పనస పండులా వున్నాడని తీసికెళ్ళి పెంచుకుందామని నలుగురైదుగురు వచ్చారు
ప్రతిమారూ ఏదో ఆటంకమే. ఒకళ్ళు అన్నీ మాట్లాడుకున్నాక ఆ ఇల్లాలికి నెల తప్పింది.
ఇంకో జంట వచ్చారు. వాళ్ళూ అన్నీ నిర్ణయించుకుని తీసికెళదాం అనుకుంటూ ఉండగా ఆయనకీ గుండె పోటొచ్చి పోయాడు.
ఇంకోసారి పెంచుకుందామనుకున్న వాళ్ళ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు.
ఇదంతా చూసి ఇదెక్కడి పిల్లాడో అస్తవ్యస్త జాతకుడు అని విసుక్కున్నాడు అనాథ శరణాలయం అధికారి.. ఆ పేరే స్థిరపడిపోయింది.
బాల్యం గడిచినా సమస్యలు తీరలేదు.
ఇంటర్ మూడుసార్లు చదివాడు.. పాసవలేదు.
ఒక యేడాది ఫీజుకి డబ్బులు లేవు.
రెండోసారి బస్సు పాడై పోయి సమయానికి సెంటరుకి జేరలేక పోయాడు.
మూడోసారి పేపర్లు లీక్ అయ్యాయి అని కేన్సిల్ చేసేశారు.
తెలివితేటలు పుష్కలంగా వున్నా కనీసం ఇంటర్ కూడా పాస్ అవని వాడికి ఉద్యోగం ఎలా దొరుకుతుంది?
అస్తవ్యస్తకి అయిన వాళ్లంటూ లేకపోయినా అభిమానించే వాళ్ళున్నారు. మంచి కుర్రాడు. తోచిన రీతిలో సాయం చేద్దాం అనుకునే వాళ్ళు వున్నారు.
ఓ పెద్దాయన పెట్టుబడి పెట్టి సినిమా హాళ్లు వున్న సెంటర్‌లో ఓ షాపు పెట్టించాడు.
అస్తవ్యస్త తన తెలివి ఉపయోగించి ఆమ్లెట్ తింటే కూల్‌డ్రింక్ ఉచితం అన్నాడు.
ఓ జనం విరగ బడ్డారు.
వారం గడిచిందో లేదో సర్వనాశనం.
అటూఇటూ ఉన్న హాల్స్‌లో వేరు వేరు హీరోల సినిమాలు విడుదలై, వాళ్ళిద్దరి అభిమానులకూ
గొడవలు వచ్చి అస్తవ్యస్త షాపులోని సరుకులతో కొట్టుకు చచ్చి పోలీసు కేసు అయి షాపు మూతపడింది.
పోనీ కదా అని పాతపేపర్లు అమ్మే షాపు పెడితే అగ్నిప్రమాదం.
ఆ తరువాత తెలిసినవాళ్ళ దగ్గర అప్పు తీసుకుని పిండివంటల వ్యాపారం. అది పుంజుకుని పెద్ద ఆర్డర్లు వస్తున్న సమయంలో గాలీవానా. రేకులు ఎగిరిపోయి సరుకు తడిసిపోయి మళ్ళీ చేతికి చిప్ప.
అవన్నీ తట్టుకుని బ్యాంకు నుండి అప్పుతీసుకుని పరుపులూ దిళ్ళూ తయారు చేసి అమ్మి నిలదొక్కుకుని హమ్మయ్య అనుకునే సమయంలో మళ్ళీ అవాంతరం. ఓ పోటీదారు అడ్డంపడి నాశనం చేసేసాడు.
ఇక లాభంలేదు. ఆత్మహత్యే శరణ్యం అని ఓ నిర్జన ప్రదేశంలో రైలు కిందపడదాం అని రైలుకు ఎదురు చూస్తూ కూచున్నాడు. దూరంగా రైలు కూడా. ఆ తరువాత రైలు దీపం. మరో అయిదు నిముషాలు అంతే. అని కళ్ళు మూసుకుని దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండగా భుజం మీద చెయ్యి పడింది.
కళ్ళు తెరిచి చూస్తే ఒక వృద్ధుడు. బీదగా, అనారోగ్యంగా వున్నాడు.
“ఆత్మహత్యా ప్రయత్నమా?” అని అడిగాడు.
తలాడించాడు అస్తవ్యస్త.
“విరమించుకుని నాతో రా. నీ జీవితం మారిపోతుంది” అన్నాడా వృద్ధుడు.
అటు మరో నిముషంలో వచ్చే రైలు. ఇటు నిస్సహాయంగా వున్న వృద్ధుడు.
అస్తవ్యస్త మనసులో అలజడి. పావునిముషం.
నిర్ణయం తీసుకుని అడుగు వెనక్కి వెశాడు అస్తవ్యస్త.
ఒక నూతనోధ్యాయం ఆరంభం అయింది.
(తరువాయి భాగం తరువాత)