ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 10

0
2

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

బూట్ క్యాంప్ నాలుగవ రోజు

“మైడియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి ఇక మన అసలు లక్ష్యం అయిన ‘స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్’ నేర్చుకోవటం మొదలుపెడుతున్నాము” స్టేజ్‌పై నిలబడి చిరునవ్వుతో అందరి వంక చూస్తూ చెప్పాడు సంతోష్.

ఏసీ నిశ్శబ్దంగా చల్లదనాన్ని పంచిపెడుతోంది. క్లాసులో ఉన్న అందరూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.

గొంతు సవరించుకుని తిరిగి చెప్పటం ప్రారంభించాడు.

“ఈ రోజు మనం ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్ అన్నఅతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. మన మొత్తం కోర్స్ మోడ్యూల్ ఈ ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్ మీద ఆధారపడి నిర్మింపబడింది.

ఇంతకీ ఏమిటి ఈ ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్?, అని మీరడిగితే నేను ఒకే వాక్యంలో చెప్పాలి అంటే, ‘సక్సెస్ కావాలీ’ అంటే ఈ నాలుగు అంశాలు కావాలి. అంతే కాదు ఈ నాలుగు అంశాలలో ఏ ఒక్కటి తక్కువ అయినా మీ విజయం సంపూర్ణం అవదు. ఆ నాలుగు అంశాలు ఏమిటో చెబుతాను.

1) లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ

2) కమ్యూనికేషన్ స్కిల్స్

3) సాఫ్ట్ స్కిల్స్

4) పర్సనాలిటీ డెవలెప్‍మెంట్

ఒక్కొక్క అంశం గూర్చి వివరంగా చెబుతాను. దానికంటే ముందుగా ఒక విషయం చాలా క్లియర్‌గా చెబుతున్నాను. అది ఏమిటి అంటే, ఒక కుర్చీ స్థిరంగా నిలబడాలి అంటే దానికి కనీసం నాలుగు కాళ్ళు ఉండాలి. ఆ నాల్గు కాళ్ళలో ఏ ఒక్క కాలు విరిగి పోయినా సరే మనం ఆ కుర్చీలో కూర్చోవటానికి సిద్దపడం. ‘ఆ ఏమి ఫర్వాలేదు, ఒక్క కాలే కదా ఊడిపోయింది, కూర్చుందాములే’ అని అనుకోలేము కద.

అంటే నాలుగు కాళ్ళ కుర్చీలో ఏ ఒక్క కాలు ఊడిపోయినా ఆ కుర్చీ ఉపయోగం లేకుండా పోతుంది. అదే విధంగా ఉద్యోగ జీవితంలో విజయం లభించాలన్నా, ఏ రంగంలో అయినా సరే స్థిరత్వం, భద్రత, ఎదుగుదల కావాలన్నా పైన చెప్పిన నాలుగు అంశాలు అత్యంత ముఖ్యమైనవి.

మళ్ళీ ఒకసారి నొక్కి చెబుతున్నాను, ఈ నాలుగు అంశాలలో ఏ ఒక్కటి లోపించినా మీరు ఎన్నుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్ళలేరు. అవునండి నిజాలు ఎప్పుడు నిష్ఠురంగా ఉంటాయి. కొన్ని నిజాలని తియ్యటి మాటలతో చెప్పాలని చూడకూడదు. ఉన్న మాటలు ఉన్నట్టు చెప్పటమే మంచిది.

మీలో చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది, ఏమిటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ అయి దాదాపు మూడు రోజులు పూర్తయింది, ఇప్పటి దాకా గ్రామర్ గానీ, సెంటెన్స్ స్ట్రక్చర్ గానీ, వొకాబులరీ గానీ చెప్పించలేదు ఎంత సేపున్నా ‘పవర్ ఆఫ్ సబ్‌కాన్షస్ మైండ్, కాన్షస్ మైండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ వంటి మాటలు, స్వాట్ అనాలిసిస్, గోల్ సెట్టింగ్, గోల్ షీట్స్’ వంటి అంశాలు చెప్పి కాల యాపన చేస్తున్నారు అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు.

అక్కడికే వస్తున్నాను.

మనం బస్సు ఎక్కంగానే కండక్టర్ వచ్చి, ‘మీరు ఎక్కడికి వెళ్ళాలి అని?’ అడిగితే మనం ఫలానా చోటికి అని చెప్పి టికెట్ తీస్కుని నిశ్చింతగా కూర్చుంటాము కద.

ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వ్యక్తికి నిశ్చింత, దాని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తాయి.

ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వ్యక్తికి ఏ రూట్‌లో వెళ్ళాలి, ఏ వాహనం ద్వారా వెళ్ళాలి, ఎన్నింటికి బయలు దేరి ఎన్నింటికి చేరుకోవచ్చు అన్న విషయాల పట్ల క్లారిటీ ఉంటుంది.

మన జీవిత ప్రయాణానికి కూడా ఇవి వర్తిస్తాయి.

ఏదో గుడ్డిగా గ్రామర్ నేర్చుకోవటం, ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియకుండా సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవటం కాకుండా, ‘నా జీవిత లక్ష్యం ఇది, దీని కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను’ అనే ఫీలింగ్‌తో మీరు నెర్చుకుంటే మీకు చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. ఫలితాలు కూడా చాలా బెటర్‌గా ఉంటాయి. ముఖ్యంగా, అనవసరమైన ఆత్మన్యూనత, భయం, సంకోచం, బిడియం ఇవన్నీ పోయి వాటి స్థానంలో మీ సెల్ఫ్ ఎస్టీం (ఆత్మగౌరవం) లెవెల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. అప్పుడు మీలో మీరే కొత్త శక్తిని చూస్తారు.

వాస్తవానికి ఏ ఇన్స్టిట్యూట్ కూడా తక్కువైనది ఏమి కాదు. అందరూ ట్రైనర్స్ మిమ్మల్ని విజేతగా మార్చాలనే ప్రయత్నమే చేస్తారు. అయినా ఎందుకు అందరూ సక్సెస్ పొందలేకపోతున్నారు అంటే దానికి ఒకటే కారణం, మీ ఆత్మవిశ్వాసం పెంపొందించి, మీ ఉత్సాహంలో సమూలమైన మార్పు తీస్కు రాకుండా ఎంత గొప్ప ట్రైనర్ వచ్చి పాఠాలు చెప్పినా కూడా ఉపయోగం ఉండదు.

మనం ఇప్పటి దాకా సాధించినది తక్కువేమీ కాదు. మిమ్మల్ని మీరు కొత్తగా తెల్సుకున్నారు, మీ గోల్స్ ఏమిటి అనే విషయంలో మీకు సూపర్ క్లారిటీ వచ్చింది, ఇంగ్లీష్ భాష అస్సలు కష్టం కాదు, సునాయాసంగా నేర్చుకోవచ్చు అనే ఆత్మ విశ్వాసం తెచ్చుకున్నారు. అవునా కాదా?’” ప్రశ్నించాడు సంతోష్.

“ఎస్, నిజం, నిజం” అందరూ గట్టిగా ప్రతిస్పందించారు.

“ఒక సారి అందరూ లేచి నిలబడండి” అని చెప్పాడు సంతోష్

అందరూ నిలబడ్డారు. అందరినీ ఒకరికి ఒకరు బాగా ఎడంగా నిలబడమని చెప్పాడు. ఆ తరువాత అందరిని తమ తమ కుడి చేయి పిడికిలి బలంగా బిగించి నిలబడమని చెప్పాడు.

వేదిక మీద నుంచుని ఉన్న సంతోష్ కూడా తన కుడిచేయి పిడికిలి బిగించి, ఆ చేతిని బలంగా గాల్లోకి విసురుతూ నినాదాలు ఇచ్చే లీడర్ లాగా గట్టిగా అరవటం మొదలెట్టాడు.

“English is Easy

English is Fun

I am lovable

I am Capable

I am Important

I can Speak

I can Win”

అతడు అరుస్తూ చెబుతున్న ఆ వాక్యాలలో, ప్రతి వాక్యం అనంతరం అతనిచ్చిన విరామంలో క్లాసులో ఉన్న వారందరూ కూడా, తమ కుడిచేతి పిడికిలిని గాల్లో విసురుతూ, అతనితో బాటుగా అవే వాక్యాలని గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టారు.

క్లాసు రూం అంతా ఒక విధమైన పాజిటివ్ ఎనర్జీతో నిండి పోయింది.

ఆ తరువాత అందరినీ కూర్చోమని చెప్పాడు సంతోష్.

నెమ్మదిగా వైట్ బోర్డ్ వైపు నడుస్తూ చెప్పాడు “ఇప్పుడు మనం ఈ ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్ గూర్చి వివరంగా తెలుసుకుందాం”.

1) లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ:

ఇది మొదటి పిల్లర్. దీనిని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే భాషా పాటవం. అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం ఎన్నుకున్న భాషపై పూర్తి పట్టు సాధించటం. మాట్లాడేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడగలగడం. సరయిన పదాలు తెలిసి ఉండటం. సరయిన వాక్య నిర్మాణాలు తెల్సి ఉండటం. భాషతో చమత్కారాలు చేయగలగడం. కథలు, జోకులు, మన అనుభవాలు హాయిగా చెప్పగలగడం ఇవన్నీ ఈ లాంగ్వేజీ ప్రొఫిషియెన్సీ కిందకి వస్తాయి.

2) కమ్యూనికేషన్ స్కిల్స్:

కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే, భావప్రసరణా సామర్థ్యం అని చెప్పాలి. మామూలుగా అర్థం అయ్యే భాషలో చెప్పాలి అంటే, మన మనసులో ఫీలింగ్స్‌ని ఎదుటి వ్యక్తి మనసులోకి ట్రాన్స్ఫర్ చేయగలగటం.

నా దగ్గరకు వచ్చే చాలా మందిని “ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు” అని నేనడిగినప్పుడు

“కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు” అని సమాధానం చెబుతారు.

అప్పుడు నేను ఉండుకుని సంభాషణని పొడిగిస్తూ “మీకు ఇంగ్లీష్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా?” అని రెట్టించి అడుగుతాను.

“అదేంటి సార్, ఇంగ్లీష్ వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే కాదా?” అని వారు అయోమయంగా అడుగుతారు.

మీక్కూడా ఇలాంటి అనుమానం ఉంటే నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను” అని ఆగాడు సంతోష్. ఆయన వంక అందరూ ఆసక్తిగా చూస్తుండి పోయారు.

మన మనసులో ఉన్న భావాలకి ఒక రూపం ఇవ్వటానికి ఒక భాష కావాలి. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు లేదా వేరే ఏ ఇతర భాష అయినా కావచ్చు.

మన భావాలని ఇతరులకు చేర్చటానికి పనికివచ్చే ఒక పరికరం భాష.

మీకొక విషయం తెలుసా, మనం అసలు ఏ భాషా ఉపయోగించక ముందే, ఎదుటి వ్యక్తులకి మనం చెప్పదలచుకున్న విషయాలు అర్థం అయిపోతూ ఉంటాయి.

అంటే మన కళ్ళ కదలికలు, చేతుల కదలికలు, మన శరీర భంగిమల ఆధారంగా వారికి మనం చెప్పదలచుకున్న విషయం అర్థం అవుతూ ఉంటుంది.

దీనిని నాన్ వెర్బల్ లాంగ్వేజ్ అంటాము.

మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పదలచుకున్న విషయాన్ని, దాదాపు 93% మన నాన్ వెర్బల్ లాంగ్వేజి ద్వారా తెలుపుతూనే ఉంటాము. అంటే మనం మాట్లాడే భాష కేవలం 7% మాత్రమే పాత్ర వహిస్తోంది మన కమ్యూనికేషన్‌లో. కాబట్టి కొందరు అనుకుంటున్నట్టు, కేవలం గ్రామర్ నేర్చేసుకుని, సెంటెన్స్ స్ట్రక్చర్స్ బట్టీ కొట్టేసి మాట్లాడేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి అనేది భ్రమ.

మీకు ఇంకొక ఆసక్తి కరమైన ఫార్ములా చెబుతాను. 7-38-55 ఫార్ములా అంటారు దీన్ని.

7% = అంటే మనం మాట్లాడేటప్పుడు మన భావాలని తెలియజెప్పడంలో మనం వాడే భాష యొక్క పాత్ర కేవలం ఏడు శాతం మాత్రమే.

38% = మన కంఠ ధ్వని, ఉచ్చారణ, పదాల్ని పలికే తీరు ఇవన్నీ 38% పాత్ర పోషిస్తాయి మన కమ్యూనికేషన్‌లో.

55% = మన బాడీ లాంగ్వేజి ద్వారా అంటే అంటే మన కళ్ళ కదలికలు, చేతుల కదలికలు, మన శరీర భంగిమల ద్వారా 55% భావాలని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నమాట.

కాలిఫోర్నియాలోని సైకాలజీ ప్రొఫెసర్ ఆల్బర్ట్ మెహ్రబియాన్ 1971లో వెలువడిన తన గ్రంధం ‘ది సైలెంట్ మెసేజెస్’ లో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించారు.

కాబట్టి లాంగ్వేజి వేరు, కమ్యూనికేషన్ వేరు అని తెల్సుకోవాలి.

లాంగ్వేజి ద్వారా మన భావాలకి ఒక రూపం వస్తుంది.

ఆ రూపాన్ని ఎదుటి వ్యక్తులకు మనం ట్రాన్స్ఫర్ చేయటాన్ని కమ్యూనికేషన్ అంటాం. మరి ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ అనే ఈ టైటిల్‍లో రెండవ పదం స్కిల్స్ అంటే ఏమిటి అంటే మీకు తెల్సు. అత్యంత సమర్థవంతంగా చేయగలగడం.

3) సాప్ట్ స్కిల్స్:

సాఫ్ట్ స్కిల్స్ అనే పదం మేనేజిమెంట్ బుక్స్‌లో మొదట వాడేవారు. ఇప్పుడు విస్తృతంగా ప్రతి ఒక్క ట్రయినర్ వాడుతున్నారు ఈ పదాన్ని.

కానీ ఈ పదానికి అర్థం చెప్పమంటే చాలా మంది కొండవీటి చేంతాడంత లిస్టు ఒకటి తీసి, పెద్ద పెద్ద డెఫినిషన్లు చెబుతూ మనకు అసలేమి అర్థం కాకుండా చెపుతుంటారు.

థాంక్ గాడ్! ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నది అంత కఠినమైంది ఏమి కాదు. నేను చాలా సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతాను.

విషయం ఎటువంటిది అయినా సరే, ఎదుటి వారిని నొప్పించని విధంగా సున్నితంగా చెప్పగలగటమే సాఫ్ట్ స్కిల్స్. ‘నొప్పింపక తానొవ్వక’ అన్న విధంగా చెప్పగలిగే విధానమే సాఫ్ట్ స్కిల్స్.

ఒక్క మాట్లాడే విధానం లోనే కాదు, మన ప్రతి కదలికలోనూ సాఫ్ట్ స్కిల్స్ అవసరమే. ఆ మాటకొస్తే మనం మాట్లాడే భాష, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా సాఫ్ట్ స్కిల్స్ ద్వారా మెరుగు పరచుకోవాల్సిన అంశాల కిందకే వస్తాయి.

4) పర్సనాలిటీ డెవలెప్ మెంట్:

కాసేపు, ఇక్కడ ఒక చిన్న పిట్టకథ చెబుతాను.

ఒక వ్యక్తి తెల్లటి షర్ట్, తెల్లటి పాంట్ ధరించి ఒక పార్టీకి వెళతాడు. అక్కడ ఆయన చేతిలో కప్ సాసర్ పట్టుకుని ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటు బ్లాక్ కాఫీ త్రాగుతూ నిలబడ్డాడు.

ఆ పార్టీకి వచ్చిన గెస్ట్స్ తాలూకు పిల్లలు అటూ ఇటూ పరిగెత్తుతూ ఆడుకుంటున్నారు. అనుకోకుండా ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు హఠాత్తుగా వచ్చి ఈ కాఫీ త్రాగుతున్న వ్యక్తిని ఢీ కొన్నాడు. ఈ సందట్లో ఆయన తెల్లటి చొక్కా మీద బ్లాక్ కాఫీ మొత్తం ఒలికి పోయింది.

సరే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.

అతని చొక్కా మీద బ్లాక్ కాఫీ ఎందుకు పడింది? అదేం ప్రశ్న సర్ అంటారా, చాలా సులువుగా చెప్పేయవచ్చు సమాధానం, ఆ పిల్లవాడు వచ్చి ఢీ కొట్టడం వల్ల కాఫీ ఒలికింది అని చెబుతారు చాలా మంది. మీరు కూడా అదే సమాధానం చెప్పబోతున్నారా? అది తప్పేమి కాదు. మీరు సరిగ్గానే చెప్పారు. కానీ నేనేమి చెబుతాను అంటే

“అతని షర్ట్ మీద బ్లాక్ కాఫీ ఎందుకు ఒలికింది అంటే, కప్పులో బ్లాక్ కాఫీ ఉంది కాబట్టి” అని.

నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఆ కప్పులో ఏ లిక్విడ్ ఉంటే అదే లిక్విడ్ షర్ట్ మీద ఒలుకుతుంది. ఆ కప్పులో బ్లాక్ కాఫీ ఉంది కాబట్టి, బ్లాక్ కాఫీ ఒలికింది. అదే కప్పులో ఆరెంజ్ జ్యూస్ ఉండి ఉంటే ఆరెంజ్ జ్యూస్ ఒలికి ఉండేది.

మనం కప్పుని ఏ తరహా లిక్విడ్‌తో నింపాము అన్నది ఇక్కడ ప్రధానం.

ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఇస్తాను: మీరు రోడ్డు మీద మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళుతున్నారనుకుందాము. మీరు అన్ని విధాలా రూల్స్ పాటిస్తూ, క్రమ పద్దతిలో వెళుతున్నారు. రోడ్డుకు ఎడమ వైపునే వెళుతున్నారు. అనుమతించబడినంత వేగంగా వెళ్తున్నారు. హెల్మెట్ ధరించారు.

ఇంతలో హటాత్తుగా రాంగ్ సైడ్‌లో ఒక ఆటో వచ్చి మిమ్మల్నిఇంచుమించు గుద్దేసినంత పని చేసింది.

కాసేపు చదవడం ఆపేసి, కళ్ళు మూసుకుని ఆ సీన్ మీ మనసు తెరపై ఊహించుకోండి. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉందో గమనించండి.

అంటే మీరు ఎలా ఉద్రేక పడ్డారు, మీరు ఎలాంటి భాష వాడుతున్నారో గమనించారా? ఇందాకటి బ్లాక్ కాఫీ ఉదాహరణ లాగానే ఇది కూడానూ.

మంచి శిక్షణ ద్వారా మీరు మీలోని అంతరంగాన్నీ, మీ ఆలోచనలని నియంత్రించుకోగలరు, మీ భావోద్వేగాలని అంటే మీ ఎమోషన్స్ ని నియంత్రించుకోగలరు.

ఎటువంటి స్థితిలో అయినా మీరు నిబ్బరంగా ఉంటూ, పనులు చక్కబెట్టుకోగలిగే మనోస్థైర్యం  తెచ్చుకోగలరు.

పర్సనాలిటీ డెవలెప్‍మెంట్ ద్వారా, మీతో మీరు ఆనందంగా ఉండగలరు. చక్కటి పాజిటివ్ మైండ్‍సెట్ ఏర్పడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకోగలరు. అందరిలో గొప్పనాయకుడిగా చలామణి అవగలరు. మీ స్వప్నాలన్నీ నిజం అవుతాయి. మీ సాన్నిధ్యాన్ని అందరూ కోరుకుంటారు. మీ సలహాలకి సంప్రదింపులకి అందరూ విలువ ఇస్తారు.

ఉత్తిగా ఇంగ్లీష్‌లో గ్రామర్ సూత్రాలు నేర్చుకోవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు.

ఈ విధంగా ఈ ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్ మీకు ఒక చక్కటి గైడ్ లాగా ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here