[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.
~
క్లాస్ రూం వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంది.
వైట్ బోర్డ్ మీద ‘3 రహస్యాలు’ అని వ్రాసి అందరి వంక తిరిగాడు సంతోష్.
అందరూ ఆసక్తిగా చూస్తుండిపోయారు అతని వంక.
“మిమ్మల్ని ఫ్లూయెన్సీకి దూరం చేస్తున్న మూడు సీక్రెట్స్ ఇవ్వాళ మీకు తెలియజేస్తాను. ముందుగా మీ అందరితో ఒక చిన్న యాక్టివిటీ చేయిస్తాను. అందరూ సిద్ధమేనా?”
అందరూ అత్యంత ఉత్సాహంగా “సిద్దమే” అని బదులు పలికారు.
“సరే, అయితే ఇప్పుడు అందరూ నేను చెప్పే మూడు సూచనలు శ్రద్ధగా వినండి. ఈ మూడు సూచనలు ఇచ్చిన తర్వాత నేను స్టాప్‌వాచ్ సెట్ చేసి మూడు నిమిషాల టైం ఇస్తాను. ఆ టైం లోపల నేను చెప్పే యాక్టివిటీ మీరు పూర్తి చేయాలి”
అందరిలో ఈ ప్రకటన చాలా ఉత్సాహం రేకెత్తించింది.
ఆయన చెప్పటం కొనసాగించాడు “ఆ మూడు సూచనలు శ్రద్ధగా వినండి
- మీ అందరికీ స్టికీనోట్ పాడ్ లోని ఒక స్టికర్ కాగితం, ఒక స్కెచ్ పెన్ను అందజేస్తాను. ఆ రంగు స్టికర్ కాగితంపై పెద్ద అక్షరాలతో మీ పేరు వ్రాయండి
- ఆ తరువాత ఆ స్టిక్కర్ కాగితాన్ని వీలయినంత ఎత్తులో అతికించండి
- ఈ మొత్తం యాక్టివిటీ పూర్తి అవటానికి మీకు కేవలం మూడు నిమిషాల సమయం ఇస్తున్నాను.
ఇప్పుడు మీకు ఈ సూచనల పట్ల ఏమయినా సందేహాలు ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు.”
అందరూ కాసేపు తర్జన భర్జనలు పడ్డాక ’మాకేమీ సందేహాలు లేవు’ అని చెప్పాక, సంతోష్ టైమర్ సెట్ చేసి “స్టార్ట్” అని ప్రకటించాడు.
అప్పుడు మొదలైంది కోలాహలం క్లాసులో. కుర్చీలు ఎక్కి రూఫ్‌ని తాకే ప్రయత్నం చేసేవారు, బల్లపైకి ఎక్కేవారు, కిటికీ గ్రిల్స్ పట్టుకుని పైకి ఎగబాకే వారు ఇలా అక్కడ సాక్షాత్తు ఒక కిష్కిందకాండ లాంటి వాతావరణం కనిపించింది.
అందరూ దాదాపు ఒకట్రెండు నిమిషాలలోనే తమ తమ స్టిక్కర్లను గోడలపై, రూఫ్‌పై, సీలింగ్ ఫాన్‌పై, కిటికీపై ఇలా ఎవరికి తోచిన దగ్గర వారు అతికించేసి కూర్చున్నారు.
ఈ యావత్తు తతంగం ఒకటి ఒకటిన్నర నిమిషాల లోపలే ముగిసి పోయింది. సంతోష్ వారి యాక్టివిటీస్ అన్నింటినీ వీడియోలో చిత్రీకరించాడు.
ఆ తరువాత ఎవరు ఎక్కువ ఎత్తులో అతికించారు అన్న చర్చ జరిగింది. రూఫ్‌పై అతికించిన వారే అందరికన్నా ఎత్తులో అతికించారు అని తీర్మానం అయింది.
అప్పుడు సంతోష్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఒక ప్రశ్న వేశాడు.
“మీరు నా సూచనలని సరిగ్గా విన్నారా?” అని
“ఆ! సరిగ్గానే విన్నాం” అని అందరూ ఒక్క సారిగా చెప్పారు.
అప్పుడు ఆయన అందర్నీ మరోసారి ఆశ్చర్యపరుస్తూ “మీరంతా నా వెంబడి రెండో అంతస్తులో నా ఛాంబర్ పక్కనే ఉన్న పెద్ద కాన్పరెన్స్ హాల్‌కి నడవండి. వెళ్ళేటప్పుడు మరచిపోకుండా స్టాప్‌వాచ్ పెట్టుకుని రండి” అని చెప్పి చక చక మెట్లు ఎక్కడం ప్రారంభించాడు.
అందరూ పైకి చేరేటప్పటికి సరిగా అరవై సెకన్ల కంటే తక్కువ సమయమే పట్టింది. ఆ కాన్ఫరెన్స్ హాల్‌లో అప్పటికే రూఫ్ పైన అలాంటి స్టిక్కర్లు ఒకట్రెండు ఉండటం గమనించారు అందరూ.
రెండో అంతస్తూలోని ఆ పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లోని వేదిక పైకి ఎక్కి నుంచుని గొంతు సవరించుకుని చెప్పటం ప్రారంభించాడు సంతోష్
“మైడియర్ ఫ్రెండ్స్, ఈ కాన్ఫరెన్స్ హాల్‌కి వచ్చి, ఈ రూఫ్‌కి మీ పేరున్న స్టిక్కర్ అంటించి తిరిగి మన క్లాస్ రూంకి వెళ్ళటానికి మూడు నిమిషాలకంటే తక్కువ సమయమే పడుతుంది. కానీ మీలో ఎవ్వరూ ఇందాక క్లాసు రూం దాటి బయటకు రాలేదు. ఆ క్లాస్ రూం దాటి బయటికి వచ్చి అతికించవచ్చు అనే ఆలోచన కూడా చేయలేదు. అదే క్లాసు రూంలో గోడలు ఎక్కి, గుంజలు ఎక్కి, కిటికీలు ఎక్కి తిప్పలు పడ్డారే కానీ గది తలుపులు దాటి మెట్లెక్కి ఇలా పైకి వచ్చి అతికించవచ్చు అనే ఆలోచన చేయలేదు.
అది మీ తప్పేమి కాదు.
నేనిచ్చిన సూచనలు సరిగ్గ గుర్తు తెచ్చుకోండి. ఎత్తైన ప్రదేశంలో అతికించమన్నాను, మూడే నిమిషాల టైం అన్నాను, అంతే కానీ అదే రూంలో అని నేను అనలేదు. కానీ మీ అంతట మీరు అదే రూంలో అతికించాలి అని ఫిక్స్ అయ్యారు. దాన్నే కంఫర్ట్ జోన్ థింకింగ్ అంటారు.
మీ శరీరం కూడా మీకు తెలియకుండానే ఇలా కంఫర్ట్ జోన్‌లో ఉండటానికే ప్రయత్నం చేస్తుంది.
థింకింగ్ అవుటాఫ్ ది బాక్స్:
కానీ విజేతలు అయిన వారందరు ఇలా రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఆలోచిస్తారు. దీనిని థింకింగ్ అవుటాఫ్ ది బాక్స్ అంటారు.
‘నా వల్ల ఇంతే అవుతుంది, నేనింతే చేయగలను, నా దగ్గర ఇంక వేరే ఏ అవకాశాలు లేవు’ ఇలా సాగుతాయి కంఫర్ట్ జోన్ లో ఆలోచనలు చేసే వారిలో.
అలా కాకుండా ‘దీనిని ఇంకా వేరే విధంగా చేయగలమా? ఎందుకు నన్ను నేను తక్కువ అంచనా వేసుకోవాలి, వేరే ఇంకా ఏయే అవకాశాలు ఉన్నాయి’ అని ఆలోచిస్తారు విజేతలు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనం ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి అని చెప్పాను కద, వాటిలో మొదటిది ‘సైకలాజికల్ రీజన్’
ఈ మానసిక భావనలు చాలా బలంగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి మన ఆలోచనల మీద. ఆ ఆలోచనల కారణంగా మనం మనల్ని బ్రాండ్ చేసుకుంటాము. అదే విధంగా మన జీవితం యావత్తు ఈ ఆలోచనలకు బందీగా గడిపేస్తాము.
ఉదాహరణకి ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అన్న ఊహకే చాలా మంది భయపడి పోతుంటారు. ‘నేనా ఇంగ్లీషా, అది కుదరని పని. నావల్ల కాదు’ అని అనేస్తారు.
ఇంగ్లీష్‌లో మాట్లాడటం సాధన చేయాలి అనంగానే వారిలో ఏదో భయం కలుగుతుంది.
ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనంగానే వారి ఆలోచనలు మూస ధోరణిలో సాగుతాయి. అంటే, రొటీన్‌గా ‘పెన్ను పేపర్ పట్టుకోవడం, వ్రాయటం, గ్రామర్ సూత్రాలు నేర్చుకోవటం, తెలుగు నుంచి తమ థాట్స్‌ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయటం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవటం ఇలా మూస ధోరణిలోనే సాగుతాయి’
నిజం చెప్పాలి అంటే ఈ టెక్నిక్స్ ఏవీ కూడా పని చేయవు. మీరు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాలి అంటే మీరు చేయాల్సిన పనులు ఇవేవి కావు. మరేం చేయాలి. చాలా సింపుల్, ఇందాకా థింకింగ్ అవుటాఫ్ ది బాక్స్ అని చెప్పాను కద, సరిగ్గా అలాగే చేయాలి.
అదేమిటి అంటే, మాట్లాడటమే పరిష్కారం.
మన చుట్టూ ఉన్న వారెవ్వరికీ తెలుగు రాదు, నేను ఏమి చెప్పినా ఇంగ్లీష్ లోనే చెప్పాలి, అప్పుడే వారికి అర్థం అవుతుంది అని అనుకుంటూ అస్సలు తెలుగులో మాట్లాడకుండా మనం చెప్పదలచుకున్న విషయాన్ని ఇంగ్లీష్ లోనే చెప్పాలి అని మనం మొదలెట్టాలి.
మరి తప్పులు పోతేనో? పోతే పోనివ్వండి.
సైకిల్ నేర్చుకునేటప్పుడు కిందపడకుండా ఎవరైనా సైకిల్ నేర్చుకున్నారా?
‘నాకు ఇంగ్లీష్ లో ఎక్కువ పదాలు తెలుసు. తెలుగులోకంటే కూడా నాకు ఇంగ్లీష్ భాషలోని పదాలతోనే పరిచయం ఎక్కువ. నేను ప్రయత్నం చేస్తే తప్పక ఇంగ్లీష్‌లో మాట్లాడగలను’ ఇలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మాట్లాడుతూ ఉండటమే మీ పని. ఇది తప్పక మంచి ఫలితాలని ఇస్తుంది.
మీకు ఒక విషయం చెబుతాను.
మీరు ఏనుగుని ఎప్పుడైనా చూశారా? ఏ గుడి దగ్గరో, సర్కస్ డేరా వద్దో ఏనుగుని దగ్గర నుంచి చూడండి ఈసారి. దానిని ఎలా కట్టేసారో గమనిస్తే ఆశ్చర్యపోతారు. ఈ భూమ్మీద ఉన్న ప్రాణులన్నింటిలోకి అత్యంత బలమైన జంతువు ఏనుగు కద. అలాంటి ఏనుగుని బంధించాలి అంటే ఎంతో బలమైన తాళ్ళతోనో, ఇనుప గొలుసులతోనో బంధించాలి కద. కానీ నిజానికి ఏనుగుని చిన్న తాడుతో కట్టేసి ఉంచుతారు.
చేదబావిలోనుంచి మనం నీళ్ళు తోడుకోవడానికి వాడే తాడుని ఏనుగుని బంధించి ఉంచేటందుకు వాడతారు. ఆ తాడుని ఏనుగు ఒక సారి బలంగా గుంజేస్తే ఏనుగు సులభంగా స్వేచ్ఛ పొందవచ్చు. కానీ అంత బలమైన ఏనుగు తాను జీవించినంత కాలం ఆ బలహీనమైన ఆ పల్చటి తాడుకు బందీగా పడి ఉంటుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కద.
కానీ ఇది నిజం.
కాస్తా లోతుగా ఆలోచిస్తే దీని వెనుక కారణం తెలుస్తుంది.
ఏనుగు చిన్నగా గున్నగా ఉన్నప్పుడు ఇలాంటి చేదబావిలో నీళ్ళు తోడేలాంటి తాడుతోనే బంధించి ఉంచి ఉంటారు. కానీ అప్పుడు దానికి అంత బలం ఉండదు. అది మాత్రం ఉత్సాహంగా ఆ తాడుని తెంచుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉంటుంది. దాని ప్రయత్న లోపం ఏమీ లేదు. కానీ తగినంత శక్తి లేకపోవటం వల్ల అది ఆ తాడుని తెంచుకోలేదు. స్వేచ్ఛని పొందలేదు. అలా ప్రయత్నాలు అనేకం చేసిన పిమ్మట అది ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది.
“ఈ తాడుని తెంచుకోవడం నా వల్ల కాదు. ఈ తాడు చాలా బలమైనది. నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ తాడుని తెంచుకోవటానికి వీలు కావడం లేదు. ఇక నా జీవితం ఇంతే. ఈ మానవులు ఇచ్చే నాల్గు చెరకు ముక్కులు గడ్డి పరకలూ తింటూ ఇలాగే పడి ఉంటాను. నా తలరాత ఇంతే” అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేస్తుంది.
అది ఇక ఆ తాడుని తెంచుకోవటానికి ప్రయత్నం చేయదు.
చూశారా దాని మనసులో కలిగిన ఒక భావన దాన్ని జీవిత పర్యంతం బందీగా మర్చేస్తోంది.
మీకు ఇంకొక విషయం చెబుతాను.
మీకు టార్జాన్ కథ తెల్సు కద, బ్రిటిష్ రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి ఆయన భార్య ఆఫ్రికా అడవులలో చిక్కుపడి పోతారు. ఒక శిశువుకు జన్మనిచ్చాక అనుకోని పరిస్థితులలో వారిద్దరూ మృతి చెందుతారు. అప్పుడా శిశువుని అడవి లోని వానర జాతికి చెందిన జంతువులు పెంచి పెద్ద చేస్తాయి. ఆ తరువాత కథ మీకు తెలిసిందే కద. అతను తనను తాను జంతువుగానే భావిస్తాడు, అదే విధంగా ప్రవర్తిస్తాడు.
ఇందాకటి ఏనుగు కథలో కావచ్చు, ఈ టార్జాన్ కథలో కావచ్చు మనసు ప్రధాన పాత్ర పోషిస్తోంది.
అంటే ఒక భ్రమని నిజం అని మనసు నమ్మి, ఆ భ్రమకి అనుగుణంగానే మన జీవితాల్ని శాసిస్తుంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, ఈ మనసుకు సూచనలు ఇచ్చేది కూడా మన మనసే.
కాస్తా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
మన మైండ్‌ని ప్రధానంగా మూడు రకాలుగా విభజించుకోవచ్చు.
- కాన్షస్ మైండ్ : ఇది లాజికల్‌గా ఆలోచించి ఇది కష్టం, ఇది సులభం అని చెబుతు ఉంటుంది. మీరు చూసే, వినే వాటికి అనుగుణంగా ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది.
- సబ్‌కాన్షస్ మైండ్: ఇది అల్లాఉద్దీన్ అద్భుత దీపం కథలో దీపం వంటిది. ఇది మీ కాన్షస్ మైండ్ ఏది చేయమని చెబితే అది చేస్తుంది. మీ కాన్షస్ మైండ్ ఏది చెబితే దానిని గుర్తు పెట్టుకుని మీ జీవితాల్ని శాసిస్తుంది. దీన్ని మంచిగా ఉపయోగించుకున్నవాడు విజేతగాఎదుగుతాడు.
- అన్‌కాన్షస్ మైండ్ : మీ శ్వాసని, గుండె పని తీరుని, మీ ఇతర ముఖ్య శారీరిక భాగాలు, కిడ్నీ, లివర్, తదితర భాగాలు తమ పని తాము చేసుకునేలాగా చూసుకుంటూ ఉంటుంది. దీనిని సబ్‌కాన్షస్ మైండ్ నియంత్రిస్తుంది.
ఇప్పుడు మీరు ఈ వాక్యాలు చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, ‘ఇవన్నీ నిజమేనా’ అని ఆలోచిస్తూ కాస్తా ఆగి మీ గత అనుభవాలతో పోల్చి చూస్తూ ‘అవునేమో అని అనుకుంటూ ఉన్నారు కద’ ఇవన్నీ చేస్తున్నది మీ కాన్షస్ మైండ్‌తో.
ఈ కాన్షస్ మైండ్ కేవలం 12% మాత్రమే పాత్ర వహిస్తుంది మీ నిర్ణయాలలో, మిమ్మల్ని మీరు విశ్వసించటంలో. ఇది లాజికల్‌గా ఆలోచిస్తుంది.
‘నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను,
నేను పల్లెటూరి నుంచి వచ్చాను,
ఇంగ్లీష్ చదవటం కష్టం,
నాకు ఇంగ్లీష్ రాదు,
నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను,
ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి మంచి వాతావరణంలో పెరిగి ఉండాలి’
అని ఇలా మీరు ఆలోచించే మాటలన్నీ మీ కాన్షస్ మైండ్‌తో ఆలోచిస్తున్నారు. మీరు కాన్షస్ మైండ్‌తో చేసే ప్రతి ఆలోచనని మీ సబ్‌కాన్షస్ మైండ్ గుర్తు పెట్టుకుంటుంది.
కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా మలచుకోవాలి అనుకుంటున్నారో పూర్తిగా మీ చేతిలో ఉంది.
ఈ క్షణం నుంచి, మీరు ఎట్టి పరిస్థితులలోనూ నెగెటివ్‌గా సూచనలు ఇచ్చుకోవద్దండి.
‘నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడగలను
చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా మాట్లాడగలను
ఇంగ్లీష్ చాలా సులభమైన భాష
నేను ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడతాను’
ఇలా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే మీ సబ్ కాన్షస్ మైండ్ మీకు కావాల్సిన విధంగా ఫలితాలని ఇస్తుంది.
***
చివరగా ఒక మాట చెబుతాను.
మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న అనుభవం గుర్తు ఉందా? అలా మీరు సైకిల్ తొక్కుతూ ఉంటే మీ మిత్రులు, లేదా పెద్దవారు వెనుకే సైకిల్ పట్టుకుని పరిగెత్తుతూ ఒక దశలో వదిలేస్తారు.
అప్పుడు మీరు బాలెన్స్ పట్టుకునేలా చేసింది ఎవరో తెలుసా? అది మీ సబ్‌కాన్షస్ మైండ్.
నేను పడి పోకుండా నిలబెట్టగలను ఈ సైకిల్‌ని అని మీ సబ్‌కాన్షస్ మైండ్ విశ్వసిస్తే, మీరు సైకిల్‌ని పడిపోకుండా తొక్కగలరు. ఈ విశ్వాసం సడలిందా కిందపడతారు.
ఒక విజేతని – ఒక పరాజితుడిని వేరు వేరుగా నిలబెడుతున్నది వారి సబ్‌కాన్షస్ మైండ్ మాత్రమే.
తమ సబ్‌కాన్షస్ మైండ్‌కి సరిగ్గా శిక్షణ ఇచ్చుకున్న వాడు విజేతగా నిలబడతాడు, లేని వాడు పరాజితుడు అవుతాడు.
“నేను ఇంగ్లీష్ మాట్లాడగలను” అని మీరు అనుకుంటే, ఇంగ్లీష్ మాట్లాడగలరు.
“నేను ఇంగ్లీష్ మాట్లాడలేను” అని అనుకుంటే ఇంగ్లీష్ మాట్లాడలేరు.