ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 3

0
2

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

“మీ అందరీకీ ఇంగ్లీష్‍లో అనర్ఘళంగా మాట్లాడాలనుందా” మెదటి ప్రశ్న సంధించాడు. అందరూ ముక్త కంఠంతో ‘ఎస్’ అని సమాధానం చెప్పారు.

“అనర్ఘళంగా మాత్రమే కాక, ఇంగ్లీషే మీ మాతృభాషేమోనన్నంత సునాయాసంగా మాట్లాడాలనుందా?” అందరూ ముక్త కంఠంతో మరోసారి ‘ఎస్’ అని అరిచి చెప్పారు.

‘వెరీ గుడ్’ ఒక సారి గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు రాజు.

“మనం ఈ క్లాసులని ‘వర్క్‌షాప్’ అని అందాం. మామూలు క్లాసులకు మన క్లాసులకు చాలా తేడాలున్నాయి. మన ‘వర్క్‌షాప్’లో నూటికి నూరు శాతం ఇంటరాక్టివ్ పద్దతిలో విజయం దిశగా పయనం వుంటుంది.

మీరంతా నిజంగా విజయాన్ని కోరుకుంటున్న వారైతే, మన వర్క్‌షాప్‌లో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తామని మాట ఇస్తారా మరి?”

అందరూ ఉత్సాహంతో ఉరకలెత్తుతూ వున్నారు. ఒక్కసారిగా అందరూ నిలబడి “తప్పకుండా రాజు, నీవు చెప్పినట్టు వింటాం. నీ విజయాన్ని కండ్లారా చూసి కూడా, మేము నువ్వు చెప్పినట్టు వినకుంటే ఎలా?” అన్నారు.

“దట్స్ గుడ్. అయితే వినండి.

  1. ఈ ముప్ఫై రోజులు మనం ప్రతి రోజు తొంభై నిమిషాలు ఈ వర్క్‌షాప్ ఆవరణలో కలుద్దాం.
  2. అందరికీ అనుకూలమైన టైం ఒకటి ఎన్నుకుని దాన్ని ఫిక్స్ చేసుకుందాం.
  3. ఒక సారి టైం ఫిక్స్ చేసుకున్నాక ఎట్టి పరిస్థితిలోనూ అదే టైంలో వర్క్‌షాప్ మొదలవ్వాలి.
  4. అందరూ పది నిమిషాల ముందరే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలి.
  5. ప్రతి రోజూ ఒకటే సీట్లో కూర్చోకూడదు. ప్రతి రోజూ వేరే వేరే వాళ్ళ ప్రక్కన కూర్చోవాలి.
  6. ఎట్టి పరిస్థితులలోనూ లేట్‌గా రాకూడదు.
  7. ఎట్టి పరిస్ఠితులలోనూ సెషన్ మిస్ కాకూడదు.
  8. ముఖ్యంగా మీరెవ్వరూ సెల్ ఫోన్ తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మ్యూట్‌లో , సైలెంట్ మోడ్‌లో కూడా పెట్టుకోకూడదు.
  9. మన వర్క్‌షాప్‌లో నూటికి నూరు శాతం ఇంటరాక్టివ్ మెథడ్‌లో నేర్చుకోవటం వుంటుంది. దీన్ని ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ అంటారు. కాబట్టి స్టేజి మీదకి (బోర్డ్ దగ్గరికి) ఎవర్ని రమ్మంటే వారు, ఎటువంటి సంకోచం లేకుండా రావాలి; అనవసరమైన మొహమాటాలు, సిగ్గు, బిడియం మీ డెవలెప్‍మెంట్‍కి అడ్డు అన్నది గుర్తుంచుకోండి.
  10. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ‘నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలను’ అని ప్రతి ఒక్కరూ తనను గూర్చి తాను బలంగా నమ్మాలి.
  11. ఈ ముప్పై రోజులు నేను ఏమి చెబితే అది చేయాలి. నా మాటల్ని మీరు నమ్మితే ఖచ్చితంగా విజయం మీ స్వంతం అవుతుంది.
  12. అన్నింటికన్న అతి ముఖ్యమైన విషయం, ఇది అందరూ తప్పక పాటించాలి. అదేంటంటే, మనవెవ్వరమూ ఈ క్షణం నుంచి ఏ ఇతర భాషలో మాట్లాడుకోకూడదు. కేవలం ఇంగ్లీష్‍లో మాత్రమే మాట్లాడుకోవాలి.

ఆ చివరి మాటకి ప్రసాద్ కిసుక్కున నవ్వాడు. ‘ఆయనే వుంటే..’ అన్న సామెత లాగ, మేము తిప్పలు పడుతున్నదే ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చుంటే ఇక ఇబ్బందేముంది అన్నట్టుగా నవ్వాడు, గదిలో అందరీ పరిస్థితీ ఇంచుమించు అలాగే వుంది.

రాజు అదేమి పట్టించుకోకుండా అందర్నీ ఒకసారి లేచి నించోమన్నాడు.

ఆ తరువాత వారిలో ఒకర్ని వేదిక వద్దకు, అదే వైట్ బోర్డ్ వద్దకు రమ్మని చెప్పి, అతన్నికుడి చేయి చాచి అందరి ఎదురుగా నిల్చుకోమన్నాడు. అందరిని తమ కుడి చేయి చాచి నించోమని చెప్పాడు.

ఇప్పుడు అందరూ ఏదో శపథం చేస్తున్న వారిలా ఆరచేయి సాచి నిలబడ్డారు. అందరూ ఆసక్తిగా చుస్తూ ఉన్నారు, రాజు ఏమి చేయించబోతున్నాడా అని.

వేదిక మీద ఆ కుర్రాడి పక్కన నిలబడి, తాను కూడా తన కుడి చేయి చాచి, ఇందాకటి పన్నెండు సూత్రాలను గట్టిగా ఒకటొకటే పైకి చదివాడు. ఒక్కో సుత్రాన్ని తాను చదవంగానే మిగతా అందర్ని గట్టిగా రిపీట్ చేయమని కోరాడు.

ఇదంతా చాలా ఉత్సాహంగా తోచింది అందరికి. ఈ శపథం పూర్తయ్యాక, అందర్నీ కూచోమని చెప్పాడు రాజు.

తాను వేదిక మీద నిలబడి, అందరి వంక స్థిరంగా చూస్తూ, గొంతు సవరించుకుని, అడిగాడు “మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా లేదా తెలుగు బాగా వచ్చా?”

“నిస్సందేహంగా తెలుగే” అందరూ ఒక్క సారిగా సమాధానం చెప్పారు.

అప్పుడు చెప్పాడు రాజు.

“నేనొకటి చెపితే మీరు ఆశ్చర్యపోతారు. మనకెవ్వరికీ తెలుగు సరిగా రాదు. మనకందరికీ తెలుగుకంటే, ఇంగ్లీష్‍లోనే ఎక్కువ పదాలు తెలుసు. అయినా సరే, మనమంతా ఎవరికి వారం ‘నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకు తెలుగు బాగా వచ్చు’ అనే భ్రమలో జీవిస్తున్నాము.”

రాజు మాటలకి పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు అందరు. ఆ మాటలు కల్గించిన ప్రభావం నుంచి కోలుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టింది అందరికి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది ఆ గదిలో. ఆ మాటలు కలిగించిన ప్రభావం అలాంటిది.

అందరూ కాసేపు అయోమయానికి గురయ్యారు. తాము సరిగానే వింటున్నామా అన్న అనుమానానికి గురయ్యారు అందరూ.

“అవును ఫ్రెండ్స్! మనకందరికీ తెలుగులో కంటే ఇంగ్లీష్‍లోనే ఎక్కువ పదాలు తెలుసు. ఇంకా చిత్రమేమిటంటే మనం సునాయాసంగా వాడే ఇంగ్లీష్ పదాలకు సరయిన పదాలు మనకు తెలుగులో తెలియవు.”

రాజు, తను పెట్టిన పన్నెండో నిబంధన అమలు చేయటం ఆరంభించేసి అప్పటికే చాలా సేపయ్యింది. వారంతా సమావేశమయినప్పటి నుండీ అతడు చాలా సరళమైన ఇంగ్లీష్‍లోనే మాట్లాడుతున్నాడు.

ప్రసాద్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. ఈ రోజే కాదు, రాజు హైదరాబాద్ నుంచి వచ్చినది లగాయతు కేవలం ఇంగ్లీష్‍లోనే మాట్లాడుతున్నాడు, ఒక్కటంటే ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడలేదు.

నిజం చెప్పాలంటే ‘స్టైల్ కొడుతున్నాడు వెధవ’ అనే అనుకున్నాడు ప్రసాద్.

“చూడండి, గత కొన్ని రోజులుగా నేను ఇంగ్లీష్‍లోనే మాట్లాడుతున్నాను నేను మాట్లాడే మాటలు మీకు బాగా అర్థం అవుతున్నాయి కూడాను. వెధవ స్టైల్ కొడుతున్నాడు అని అనుకునుంటారు కూడా బహుశా.”

ఉలిక్కిపడ్డాడు ప్రసాద్. తన ఉలికిపాటు బయటకు కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ నవ్వు మొహంతో రాజు వంక చూస్తుండి పోయాడు.

“నిజానికి మీరర్థం చేసుకోనవలసింది ఏమిటంటే,

  • ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే మీకు చక్కగా అర్థం అవుతుంది.
  • చదవటం విషయానికి వస్తే, సరళమైన వాక్య నిర్మాణంలో వున్న కథలు వ్యాసాలు అర్థం అవుతాయి అని మీరే చెప్పారు.
  • వ్రాయటం విషయానికి వస్తే – ఇంటర్మీడియేట్ నుంచి కొందరు, డిగ్రీ నుంచి కొందరూ ఇంగ్లీష్ మీడియం కారణంగా కనీసం పరీక్షలైనా ఇంగ్లీష్ లోనే వ్రాశారు.
  • మాట్లాడే విషయానికి వస్తే మీరు ఎక్కువ భాగం ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నారు.”

అదెలాగ అన్నట్టు సందేహంగా చూశారందరూ.

“సరే మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ముందుగా మీరంతా కళ్ళు మూసుకోండి. నేను చెప్పే సూచనల ఆధారంగా మీరు ఊహించుకోవాలి”

“నేను కొన్ని ప్రదేశాల పేర్లు చెబుతాను. మీరు ఆ ప్రదేశాలు ఊహించుకోవాలి. ఎంత చక్కగా ఊహించుకోవాలి అంటే, ఆ ప్రదేశంలో నిజంగా మీరు ఉన్నారా అన్నట్టు ఊహించుకోవాలి. అక్కడ ఉన్న ప్రతి వస్తువునూ మీరు మీ ఊహల్లో చూడగలగాలి, ఇందులో ఇబ్బందేమీ లేదు కదా?”

అతని సూచనలన్నీ అర్థం అయ్యాయని, అతను చెప్పిన విధంగా ఊహించుకోవటానికి ఏమి ఇబ్బంది లేదని ప్రకటించారు ఆ పాతిక మంది కుర్రాళ్ళూ. వాళ్ళకిదంతా సరదాగా ఉంది.

రాజు నెమ్మదిగా చెప్పటం ప్రారంభించాడు.

“మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, మొదట మీ ఇంటిలోని వంట గదిని ఊహించుకోండి. అక్కడ ఏయే వస్తువులు ఉంటాయో ఒకసారి మీ మనో నేత్రంతో తేరిపారా చూడండి. ప్రశాంతంగా ఊపిరి పీలుస్తు, నెమ్మదిగా ఒక్కో వస్తువునే ఊహిస్తూ, కాసేపు మీ ఊహల్లో ఆ గదిలోనే ఉండిపోండి.”

అలా సూచనలు ఇస్తూ వారిని అనేక ప్రదేశాలు ఊహించుకోమని చెప్పాడు.

  • వంటగది
  • హాలు
  • డ్రాయింగ్ రూం
  • ట్రాఫిక్ తో నిండిన మెయిన్ రోడ్
  • బస్టాండ్
  • రైల్వే స్టేషన్
  • కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్
  • కాలేజి

ఇలా వివిధ ప్రదేశాలకి వారిని వారి ఊహలతో షికారు చేయించాడు. ఆ తరువాత అందర్నీ కళ్ళు తెరవమని చెప్పాడు.

“ఇప్పుడు మీరు ఏయే ప్రదేశాలలో ఏయే వస్తువులు చూశారో ఆడుగుతాను. ముందుగా ఎవరైన మీ వంట ఇంటిలో ఏ వస్తువులు వుంటాయో ఒకసారి చెప్పగలరా?”

ఓ కుర్రాడు లేచి ఓ అదెంత పని అని చెప్పి ఓ పెద్ద లిస్టే ఏకరువు పెట్టాడు.

  • స్పూన్
  • ప్లేట్
  • కుకర్
  • గ్యాస్ స్టవ్
  • సిలిండర్
  • లైటర్
  • టీ
  • మిక్సీ
  • గ్రైండర్
  • మైక్రోవేవ్ అవెన్
  • రిఫ్రిజిరేటర్
  • డైనింగ్ టెబుల్
  • చెయిర్
  • వాటర్ ప్యూరిఫైయర్
  • చిమ్నీ
  • ట్యూబ్ లైట్
  • సింకు
  • గ్లోవ్స్
  • ఎలక్ట్రిక్ కుకింగ్ టాప్
  • ఎలక్ట్రిక్ రైస్ కుకర్

“చాలు చాలు” ఆవేశంగా చెప్పుకుపోతున్న ఆ కుర్రాడి దూకుడుకు కళ్ళెమేశాడు రాజు.

“నీవు సులభంగా చెప్పేసిన ఈ పదాలన్నింటిలో ఒక అంశం కామన్‌గా వుంది గమనించావా? అదేమంటే ఈ పదాలన్నీ ఇంగ్లీష్ పదాలే. అంతే కాదు వీటిలో ఏదో ఒకటి రెండు పదాలను మినహాయించితే, చాలా పదాలకి సరయిన తెలుగు పదం మనకు తెలియదు.

ఒక్క వంటగదే కాదు. ఏ టాపిక్ అయినా సరే తీసుకో మెయిన్ రోడ్, క్లాస్ రూమ్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. ఆయా ప్రదేశాలని ఒక సారి ఊహించుకో. ఆక్కడ నీకు కనిపించే పదాలన్నింటినీ ఒక సారి ఏకరువు పెట్టు. అవన్ని ఖచ్చితంగా ఇంగ్లీష్ పదాలే వుంటాయి.

ఒకసారి నీవు నిత్యం వాడే వస్తువులనే తీసుకో.

  • సెల్ ఫోను
  • ల్యాప్ టాప్
  • డెస్క్ టాప్
  • హెడ్ ఫోన్స్
  • మెమొరీ కార్డ్
  • మోటార్ సైకిల్
  • కార్
  • షూస్
  • లేస్
  • చప్పల్స్
  • సిటీ బస్
  • ట్రైన్

ఇలా అన్నీ ఇంగ్లీష్ పదాలే. వీటిలో మళ్ళీ ఒక్కొక్కటే ఊహించుకో. ఉదాహరణకి నీ డెస్క్‌టాప్‌ని ఊహించుకో. దానికి సంబంధించి ఎన్ని పదాలు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నామో చూడండి.

  • మానిటర్
  • కీ బోర్డ్
  • మౌస్
  • సీపీయూ
  • యూపీఎస్
  • మదర్ బోర్డ్
  • పెన్ డ్రైవ్
  • డాటా
  • సీడీ
  • ఈ మెయిల్

ఇవి కేవలం కొన్ని పదాలు మాత్రమే. ఇలా మనకు తెలియకుండానే మనం నిత్య జీవితంలో ఎన్నో పదాలు ఇంగ్లీష్‌లో చాలా సునాయాసంగా మాట్లాడెస్తుంటాము.

ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే మనకు ఇంగ్లీష్ తెలియదని, తెలుగులోనే ఎక్కువ పదాలు తెలుసని, ఇంగ్లీష్ కష్టం అని ఒక విధమైన తప్పు అభిప్రాయంలో వుండిపోయాము.”

“సరే ఇప్పుడు చెప్పండి, మనకు తెలుగులో ఎక్కువ పదాలు తెలుసా లేదా ఇంగ్లీష్‌లో ఎక్కువ పదాలు తెలుసా?” ముసి ముసి నవ్వులు నవ్వుతూ అడిగాడు రాజు.

ఈ సారి అందరు తమకు తెలియకుండానే నిలబడిపోయి “ఇంగ్లీషే” అని చప్పట్లు చరుస్తూ సమాధానం చెప్పారు.

“కాబట్టి మైడియర్ ఫ్రెండ్స్ మనకు మనకు మన మాతృభాష అయిన తెలుగులో కన్నా ఇంగ్లీష్ లోనే ఎక్కువ పదాలు తెలుసు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను.

ఇంగ్లీష్‌లో మనం అనర్ఘళంగా (ఫ్లుయంట్లీ) మాట్లాడాలి అంటే మనకు కేవలం పదిహేను వందల పదాలు తెలిస్తే చాలు. కానీ మన భారతదేశంలో సామాన్యడికి సైతం కనీసం అయిదువేల ఇంగ్లీష్ పదాలు తెల్సు. మీరు టెక్నికల్ కోర్స్ చేశారు. మీకు కనీసమంటే పదివేల ఇంగ్లీష్ పదాలు తెలిసుంటాయి. అయినా మాకు ఇంగ్లీష్ రాదు అని అనుకుంటూ ఉన్నారు.

మిమ్మల్నిపుడు జర్మన్ లోనో, ఫ్రెంచ్ లోనో మాట్లాడమంటే మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఆ భాషల్లో మీకు ఒక్క పదం కూడా తెలియదు కనుక.

కానీ ఇంగ్లీష్‌లో మీకు ఇన్ని పదాలు తెలిసుండి కూడ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడలేక పోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మీ అతి వినయం, అతి భయం. ఒప్పుకుంటారా?”

“ఎస్” అందరూ ముక్త కంఠంతో అరిచారు.

“మీ అందరికీ చిన్న హోం వర్క్ ఇస్తున్నాను. మీరు ఇది చేయాలి. ఒక A4 సైజు ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీస్కుని దానిపై “I KNOW MORE AND MORE WORDS IN ENGLISH” అని వ్రాసి మీ బాత్ రూం మిర్రర్ వద్దనో, లేదా మీరు రోజు చూసే ఒక ప్రదేశంలోనో అతికించండి. ప్రతి రోజు పడుకునే ముందు ఆ వాక్యాలని గట్టిగా బయటికే చదవాలి.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here