ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 5

0
2

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

రాజు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా సంగీతం వింటున్నాడు.

అతనికి తెలియకుండానే, అతని మనసు హైదరాబాద్‌లో రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‍లో ట్రెయినింగ్‌కి అటెండ్ అయిన రోజులు గుర్తు వస్తున్నాయి.

అక్కడ తాను చూసిన శిక్షణా విధానంలో పదో వంతు కూడా ఇక్కడ తాను రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. అయినా కూడా వీరిపై ఇంత సత్ఫలితాలు ఇస్తోంది అంటే అది ఆ శిక్షణా విధానంలోని గొప్పతనం అని అర్థం చేసుకుంటున్నాడు రాజు.

రాజుకు తెలియకుండానే అక్కడి తమ ట్రెయినర్స్ ఇచ్చిన శిక్షణ, ఆ రోజులు సినిమా రీలు లాగా గుర్తువస్తున్నాయి రాజుకు.

***

రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్.

విశాలమైన ఏసీ గది.

ట్రెయినర్ సంతోష్ గదిలోకి ప్రవేశించగానే అందరూ ఉత్సాహంగా ‘గుడ్ మార్నింగ్ సర్’ అని గ్రీట్ చేశారు.

దాదాపు పాతిక మంది ఉన్నారు ఆ గదిలో. అందరూ ఉన్నత విద్యలు చదువుకున్న వారే, వారిలో సగం మంది మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లూ కూడా ఉన్నారు వారిలో.

అయిదారు మంది ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు.

మొదటి రోజు ఇంట్రడక్టరీ సెషన్ అయ్యాక, రెండో రోజు నుంచి బూట్ క్యాంపు ప్రారంభం అయ్యింది..

ఆ జ్ఞాపకాలన్నీ రాజు మదిలో మెదలడం మొదలయ్యాయి.

బూట్ క్యాంపు మొదటి రోజు

“మనం మొదట నాలెడ్జి, స్కిల్ గూర్చి తెలుసుకుందాము” క్లాస్ రూంలో సంతోష్ సర్ కంఠం ఖంగున మ్రోగింది.

అందరూ శ్రధ్దగా వినసాగారు.

వైట్ బోర్డ్ మీద పెద్ద అక్షరాలతో ఇలా వ్రాశారు సంతోష్.

“నాలేడ్డ్ VS స్కిల్”

“మనకు స్కూళ్ళలో, కాలేజీలలో జ్ఞానం అందించారు కానీ, స్కిల్‌ని అందివ్వలేదు.

ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక మోటార్ సైకిల్ ఎలా నడుస్తుంది అనేది టెక్ట్ బుక్ ద్వారా తెలుసుకుంటే అది జ్ఞానం.

అదే మోటార్ సైకిల్‌పై కూర్చుని నడుపుతూ నేర్చుకుంటే అది స్కిల్ (నైపుణ్యం).

స్కూల్లో మోటర్ సైకిల్ ఎలా నడపాలి అన్న విషయాన్ని నేర్పించారనే అనుకుందాం. స్కూళ్ళలో ఎంత ఆధునిక పద్దతులలో బోధించినప్పటికి నిస్సందేహంగా స్కూళ్ళలో మనకు జ్ఞానం మాత్రమే లభిస్తుంది. ఆయా స్కూళ్ళ స్థాయిని బట్టి బ్లాక్ బోర్డు, లేదా వైట్ బోర్డ్, డిజిటల్ బోర్డు, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియో ప్రెజెంటేషన్ ఇలా ఎన్ని విధాలుగా చెప్పినా, చివరికి వారు మనకు థియరీ మాత్రమే నేర్పించి వదిలిపెడతారు.

థియరీ ముఖ్యమైనదే, నేను కాదనటం లేదు. కానీ కేవలం థియరీ వల్ల మోటార్ సైకిల్ నడపటం వస్తుందా? రాదు గాక రాదు.

ఇక స్పోకెన్ ఇంగ్లీష్ బోధన విషయానికి వస్తే, మనకు స్కూళ్ళలో కాలేజీలలో ఇంగ్లీష్‌కి సంబంధించి జ్ఞానం అందించారు కానీ, నైపుణ్యం (స్కిల్) నేర్పించలేదు. గ్రామర్ సూత్రాలు నేర్పించారు, వాక్య నిర్మాణం నేర్పించారు, పదజాలం (వొకాబులరీ) నేర్పించారు. కానీ మనకు వీటన్నింటి వల్ల ఇంగ్లీష్ భాషకి సంబంధించిన జ్ఞానం వచ్చిందే కానీ స్కిల్ రాలేదు.

కానీ చిత్రంగా, మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నారా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా, పరీక్షలు పెట్టేసి, మీ ఇంగ్లీష్ భాషకి సంబంధించిన జ్ఞానాన్ని టెస్ట్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తూ వచ్చారు.

పదవ తరగతి, ఇంటర్ మీడియేట్, డిగ్రీ , పీజీ, పీ.హెచ్.డీ ఇలా పట్టాల మీద పట్టాలు పొందుతూ వెళ్ళాము మనం. కానీ ఎక్కడాకూడా ఇంగ్లీష్‌కి సంబంధించి మాట్లాడగలుగుతున్నామా లేదా అన్న పాయింట్ మీద మన విద్యా విధానం రూపుదిద్దబడలేదు.

ఇక స్కిల్ విషయానికి వద్దాము.

క్రికెట్ ఆడటం, మోటారు సైకిల్ నడపటం, కారు నడపటం, ఈత కొట్టడం, డాన్స్ చేయటం, పాట పాడటం, వంట చేయటం ఇవన్నీ స్కిల్సే.

ఏ స్కిల్ అయినా సరే, ఎవరైనా నేర్చుకోగలరు, ఆసక్తి, ఉత్సాహం ఉండాలి అంతే.

స్కిల్ కి సంబంధించి నేను ఒక మాట చెబుతాను. దానిని మీరు పెద్ద అక్షరాలతో ఎర్రటి రంగు ఇంకుతో ఒక పెద్ద పేపర్ మీద వ్రాసుకుని మీ గదిలో అతికించుకోండి.

అదేమిటి అంటే,

“ఒక స్కిల్‌ని వేరే ఎవరైనా నేర్చుకున్నారంటే, మీరు కూడా సునాయాసంగా నేర్చుకోగలరు

ఒకరు ఒక పని చేయగలుగుతున్నారంటే, మీరు కూడా సునాయాసంగా చేయగలరు

ఒకరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నారంటే మీరు కూడా సునాయాసంగా మాట్లాడగలరు”

ఒక స్కిల్‌ని సాధించటానికి స్కూల్లో, కాలేజీల్లో నేర్పించిన విధానాలు పని చేయవు. ఎందుకు అంటే స్కూళ్ళలో కాలేజీలలో జ్ఞానం అందివ్వటం మీద మాత్రమే ఏకాగ్రత చూపుతారు. మన విద్యా వ్యవస్థ యావత్తు జ్ఞానం అందివ్వటానికే రూపు దిద్దబడింది.

ఒక స్కిల్ లాగా ఇంగ్లీష్‌ని బోధించే విధానం నాకు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ లో లభించింది.

ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోవటం మానసిక సమస్య మాత్రమే. అది గ్రామర్‍కి సంబంధించిన సమస్య కాదు.

ఒక పెద్ద అపోహ గురించి చెపుతాను ఇప్పుడు.

గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చేస్తుంది. టెన్సెస్ బట్టీ కొట్టి, ఓ పది సార్లు వ్రాస్తే ఇంగ్లీష్‌లో మాట్లాడటం వచ్చేస్తుంది అన్న అపోహా చాలా మందికి ఉంది.

ఇది అపోహ అని ఎందుకంటున్నాను అంటే, అదే నిజమైతే, చాలా మంది ఇంగ్లీష్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇంగ్లీష్ రచయితలు ఇంగ్లీష్‌లో సునాయాసంగా మాట్లాడేయాలి కద. ఎంతో మంది ఇంగ్లీష్ లెక్చరర్లు, ఇంగ్లీష్‌లో ఎమ్మే, పీ.హెచ్ డీ చేసిన వారు కూడా నాతో పాటు కూర్చుని రాయల్ సాఫ్ట్ స్కిల్స్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అన్న క్లాసెస్‌కు అటెండ్ అయ్యారు.

ఇంగ్లీష్ లోనే కాదు ఏ భాషలో అయినా గ్రామర్ చాలా ముఖ్యమైనది. కానీ గ్రామర్ వచ్చినంత మాత్రాన మాట్లాడటం వస్తుంది అనే గారంటీ లేదు. ఎమ్మే ఇంగ్లీష్ చేసి లెక్చరర్లుగా పనిచేసే చాలామందికి ఉత్తిగా లెసన్స్ చెప్పటం వచ్చే కానీ ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటం రాదు.

ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాలి అంటే మొదట ఇంగ్లీష్ అంటే భయం పోవాలి.

ఇంగ్లీష్ అంటే ఏ దెయ్యమో భూతమో కాదు. అదే విధంగా ఇంగ్లీష్ అంటే చాలా గొప్ప భాష కూడా ఏమి కాదు. అన్ని భాషలలాగా అది కూడా ఒక భాష అంతే.

కాబట్టి గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీష్‌లో మాట్లాడటం వస్తుంది అని లేదు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోవడం అన్నది భాషకు, గ్రామర్‌కి సంబంధించిన సమస్య కాదు.

ఇది కేవలం మానసిక సమస్య.

గ్రామర్ అవసరం లేదు అనటం లేదు నేను. ఉత్తగ గ్రామర్ మాత్రమే నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనే గారంటీ ఏమి లేదు అని గట్టిగా చెబుతున్నాను. ఇక్కడ ఇంకో చిక్కుంది. మనకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించిన విధానంలోనే పెద్ద లోపం ఉంది.

మాట్లాడటం సహజంగా వచ్చేస్తే , గ్రామర్‌పై పట్టు అత్యంత సునాయాసంగా వస్తుంది.

ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగు మీ మాతృభాష. అలాగన్చెప్పి మీకు తెలుగు వ్యాకరణం మొత్తం వచ్చా? యణాదేశ సంధి, గుణ సంధి, ద్విరుక్త టకార సంధి, సమాసాలు, ఛందస్సు, అలంకార శాస్త్రం ఇవన్నీ మీకు వచ్చా? చాలా మందికి రాదు కద. మరి తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు?

గ్రామర్ వచ్చినంత మాత్రాన, ఒక భాషలో మాట్లాడగలం అన్న గారంటీ లేదు.

గ్రామర్ తెలియకపోయినంత మాత్రాన, ఆ భాషలో మాట్లాడలేము అని కాదు.

మనకు తెలియకుండానే మాతృభాషలో గ్రామర్ పై మనకు పట్టు వచ్చేస్తుంది.

‘ఎవరక్కడ’ అని సునాయాసంగా అడిగేస్తాము ఎవరైనా వ్యాకరణ పండితులు వచ్చి – ఎవరు + అక్కడ (ఉకార సంధి) అని చెప్పి, ఉకార సంధి సూత్రం చెప్పమంటే మనం గుడ్లు వెళ్ళబెడతాము.

ఇలాగే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి నియమాలు తెలియకున్నా మనం వాడుకలో కరెక్టుగా మాట్లాడగలము. అదే మాతృభాషలాగా మాట్లాడగలగటం అంటే.

మనం సంధులు, సమాసాలు తదితర వ్యాకరణ సూత్రాలు నేర్చుకుని తెలుగు మాట్లాడటం మొదలెట్టలేదు.

కాబట్టి ఇక్కడ నేను బలంగా చెప్పదలచుకుంది ఏమిటి అంటే, మనలోనే మనకు తెలియకుండా ఒక అద్భుత శక్తి ఉంది. ఆ శక్తి పేరు “సబ్‌కాన్షస్ మైండ్“.

మనం చేసే ఏ పనిలో అయినా విజయం లభించాలి అంటే మన సబ్‌కాన్షస్ మైండ్ మనకు సహకరించాలి.

సబ్‌కాన్షస్ మైండ్:

ఈ సబ్‌కాన్షస్ మైండ్‍యొక్క అసలైన శక్తిని మనం పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు.

మీకు అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెబుతాను. నాలుగు చక్రాల కారు భూమి మీద నిలబడటానికి స్టాండ్ వేయాల్సిన అవసరం లేదు.

కానీ రెండు చక్రాల వాహనం స్టాండ్ తీయంగానే పడిపోతుంది.

అలాంటి రెండు చక్రాల సైకిల్‌కి స్టాండ్ తీసి దాని మీద మనం కూర్చుని అది పడిపోకుండా నడపగలుగుతున్నాము అంటే దానికి ఒకే ఒక కారణం దానిని మనం బాలెన్స్ చేయటం. మనతో సక్రమంగా బాలెన్స్ చేయించగలుగుతున్న శక్తి మన సబ్‌కాన్షస్ మైండ్‌దే.

మీరు రెండు చక్రాల సైకిల్ నేర్చుకున్న తొలి రోజులు బాగా గుర్తుకు తెచ్చుకోండి.

మొదట సహజంగానే మీరు భయపడి ఉంటారు.

రెండు చక్రాల సైకిల్‌కి, స్టాండ్ తీసి వేస్తే పడిపోకుండా ఉండటమే కాకుండా, మీరు దానిమీద కూర్చుని ముందుకు వెళ్ళగలగటం ఒక అద్భుతంగా కూడా అనిపించి, దాన్ని నడపటానికి ఉత్సాహపడి ఉంటారు. అ సైకిల్ ఎక్కి తొక్కుతూ రివ్వున ఊరంతా తిరిగినట్టు ఊహించుకుని ఉంటారు.

ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన రెండు పదాలు “ఉత్సాహం”, “ఊహించుకోవటం”

మన సబ్‌కాన్షస్ మైండ్ మీరు ఊహించుకునేవన్నీ గుర్తుంచుకుంటుంది. మీరు ఏవైతే కలలు కంటారో అవన్నీ నిజం చేయటానికి మీకు పూర్తిగా సహకారం అందిస్తుంది.

మీరు ఉత్సాహంతో ఉన్నప్పుడు మీ కోరికలన్నింటినీ మీ మనసు అనే తెర మీద ఒక సినిమాలాగా ఊహించుకుంటారు. ఈ ఉదాహరణలో సైకిల్ తొక్కినట్టు, రివ్వున వేగంగా రౌండ్స్ వేసినట్టు, సినిమాకు, షికారుకు వెళ్ళినట్టు ఇలా అనేక రకాలుగా ఊహించుకుని ఉంటారు. మీ ఊహలని ఖచ్చితంగా నిజం చేస్తుంది మీ సబ్‌కాన్షస్ మైండ్ .

మీరు సీట్ మీద కూర్చుని నడుపుతూ ఉండగా, మొదట్లో మీ నాన్నగారో, అన్నయ్యనో, మిత్రులో ఎవరో ఒకరు మీకు ధైర్యం చెబుతూ వెనుక మీ సైకిల్ ని పట్టుకుని బాలెన్స్ చేయటంలో మీకు సహకరిస్తారు. ఆ తర్వాత వారు చేతులు వదిలేసినా మీ అంతట మీరు బాలెన్స్ చేసుకోగలుగుతున్నారు.

మీరు బాలెన్స్ చేసుకోవటానికి ప్రధాన కారణం మీ సబ్‌కాన్షస్ మైండ్.

మీ సబ్‌కాన్షస్ మైండ్‌కి మీరు “నేను నడపగలను సైకిల్” అన్న సూచనని బలంగా ఇవ్వటం వల్ల, ఈ బాలెన్స్ తదితర వ్యవహారాలన్నీ సబ్‌కాన్షస్ మైండ్ చూసుకుంది.

మీకిక్కడ ఇంకో విషయం చెప్పాలి. నా మిత్రులలో కొంత మందికి సైకిల్ నడపటం రాదు. అలా ఎందుకా అని నేను కాస్తా లోతుగా వారినే అడిగినప్పుడు నాకర్థమయిందేమిటి అంటే, వారు చిన్నప్పుడు సైకిల్ నడపటం నేర్చుకునేటప్పుడు “సైకిల్ నడపటం నాకు రాదేమో, సైకిల్ తొక్కటం కష్టం సుమా, అసలు స్టాండ్ తీసేశాక రెండు చక్రాల సైకిల్ నిలబడటమే విశేషం అనుకుంటే, ఇక దానిపై కూర్చుని నేను నడపటం ఇక దాదాపు అసాధ్యమే” అనే లాంటి ఫీలింగ్స్‌తో, తమను తాము అనుమానపడుతు సైకిల్ నేర్చుకునే ప్రయత్నం మొదలెట్టారట”

చెప్పటం ఆపి అందరి వంకా ఒక సారి చూశాడు సంతోష్.

“దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనల్ని మనం కించపరచుకుంటు, మనల్ని మనం అనుమానించుకుంటూ, ఉత్సాహం లేకుండా ఏదైన పని మొదలు పెడితే మనకు ఆ పనిలో విజయం లభించదు.

మన సబ్‌కాన్షస్ మైండ్ ఎంత శక్తివంతమైనది అంటే, మనం ఇంగ్లీష్ మాట్లాడగలము అని బలంగా అనుకుంటే మనకు తప్పక సహకరిస్తుంది.

కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు, మనం పాఠించాల్సిన ముఖ్యమైన నియమాలు రెండే రెండు.

ఒకటి. ఉత్సాహం

రెండు. మనసులో వీలయినంత స్పష్టంగా ఊహించుకోగలగటం.

నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి రెండు మూడు ఇన్‌స్టిట్యూట్లు చేరాను, అనేక పుస్తకాలు చదివాను కానీ ఎక్కడా కూడా ఇలా సబ్‌కాన్షస్ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించి ఇంగ్లీష్ నేర్పించటం నాకు ఎదురుకాలేదు.

గుడ్డెద్దు చేలో పడ్డట్టు గ్రామర్ సూత్రాలు బట్టి కొట్టిచ్చటం, హోమ్ వర్కులు ఇవ్వటం, వ్రాసిందే వ్రాసుకుంటూ కూర్చోబెట్టటం ఇలా కాలం చెల్లిన విధానలతో నేర్పించే ప్రయత్నం జరిగిందే తప్ప ఇలా ఒక అద్భుతమైన విధానంతో స్పొకెన్ ఇంగ్లీష్ నేర్పించిన వారు నాకు ఎక్కడా తారసపడలేదు”

ఇంతటి శక్తివంతమైన సబ్‌కాన్షస్ మైండ్‌ని మనం ఎప్పుడు కూడా అనుమానాలతో నింపకూడదు.

మనకు సూపర్ సోనిక్ జెట్ విమానం నడపటం రాకున్నా, దాని పైలట్ ని తన మానానా తనను, దాన్ని నడుపుకోనిస్తే అతను మనల్ని క్షేమంగా గమ్యం చేరుస్తాడు. అదే పనిగా కాక్‌పిట్ లోకి వెళ్ళి పైలట్‌ని మాటల్లో దించి అతన్ని డిస్టర్బ్ చేస్తే అతను దాన్ని సక్రమంగా నడపలేడు కద.

మన సబ్‌కాన్షస్ మైండ్ కూడా ఆ కేప్టన్ లాంటిదే. దానికి మన కలల్ని, కోరికల్ని తెలిపి వదిలేస్తే చాలు. దానికి తెలుసు మనల్నిఎలా మన గమ్యం చేర్చాలో. తప్పకుండా మన కలల్ని నిజం చేస్తుంది.

అలా కాకుండ మన అనుమానాలతో, భయాలతో కూడిన ఆలోచనలతో మనం సబ్‌కాన్షస్ మైండ్‌ని నింపేస్తే అది మనల్ని మన గమ్యం చేర్చలేదు.”

ఇప్పుడు మనం సబ్‌కాన్షస్ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించి విజయం ఎలా సాధించాలో తెలుసుకుందాము.

మీరంతా సిద్దమేనా?”

అందరూ సిద్దమేనని బదులు చెప్పారు.

మనసు భాష:

“మీ మాతృభాష ఏది?” సంతోష్ అడిగిన ప్రశ్నకి చాలా మంది తెలుగు అని, కొందరు హిందీ అని, ఇంకొందరు కన్నడ అని ఇలా సమాధానాలు చెప్పారు.

“ఇప్పుడు నేను అడిగే ప్రశ్నని జాగ్రత్తగా విని బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. మీ మాతృభాష చెప్పారు సరే. మరి మీ మనసు యొక్క మాతృ భాష ఏమిటి?”

మనసుకు మాతృభాష ఏమిటి అని తికమక పడ్డారు అందరూ. “మన మనసు/మైండ్‌ని కంప్యూటర్ అనుకుంటే, మైండ్ యొక్క ప్రాసెసింగ్ లాంగ్వేజి ఏమిటి?” తిరిగి ప్రశ్నించాడు సంతోష్.

అందరూ తిరిగి ఆలోచనలో పడ్డారు. మన మాతృభాషనే మన మనసు యొక్క మాతృభాష కద. అదే చెప్పారు. కానీ కాదు అని చెప్పాడు సంతోష్.

‘కొద్దిగా ఏదయినా హింట్ ఇవ్వ’మని అడిగారు.

“మీ మనసులో ఆలోచనలు ఏ భాషలో కొనసాగుతాయి? అదే విధంగా మీ మనసు పాత జ్ఞాపకాలని ఎలాగ స్టోర్ చెసుకుంటుంది? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టు, మీ మనసు ఒక కంప్యూటర్ అనుకుంటే, దాని యొక్క ప్రాసెసింగ్ లాంగ్వేజి ఏమిటి?”

అందరూ అయోమయంలో పడ్డారు.

అప్పుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు సంతోష్.”డోంట్ వర్రీ. నేను మీకు కొన్ని పదాలు చెబుతాను. ఆ పై ఒక చిన్న కథ చెపుతాను. అవి రెండు విన్న తరువాత మీరే చెబుతారు మీ మనసు భాష ఏదో”

అందరూ ఉత్సాహంగా చూస్తూ ఉండి పోయారు సంతోష్ వంక.

ఒక ఆక్టివిటీ:

ఇప్పుడు మనం ఒక చిన్న ఆక్టివిటీ చేద్దాము.

మీరంతా కళ్ళు మూసుకుని ఒక అయిదు సార్లు దీర్ఘంగా శ్వాస తీసి వదలండి.

వారంతా అతను చెప్పిన విధంగా అయిదు సార్లు ఊపిరి తీసి వదలటం చేశాక, అతను నెమ్మదిగా చెప్పటం ప్రారంభించాడు. “మీరలాగే కళ్ళు మూసుకుని నేను చెప్పే మాటలు వింటూ ఉండండి. వేరే ఏ ఇతర కండిషన్లు లేవు. హాయిగా కళ్ళు మూసుకుని నేను చెప్పే మాటలు వింటు ఉండండి చాలు. ఇందులో ఏ ట్రిక్కు లేదు. నేను ఏదో పజిల్ అడగబోవటం లేదు.

ఇప్పుడు నేను మీకు కొన్ని పదాలు చెబుతాను. ఊరికే వినండి చాలు. ఈ పదాలకు ఒక దానితో ఒక దానికి సంబంధం లేదు కూడా”

అతను చెప్పటం మొదలెట్టాడు.

దట్టమైన అడవి

అడవి మధ్య నుంచి వెళుతున్న నల్లటి తారు రోడ్డు

తారు రోడ్దుకు మధ్యలో తెల్లటి గీత

పెద్ద పులి

చిరుతపులి

రోడ్డు మీద తెల్లటి కారు

ఆ కారులో మీ అభిమాన సినీ నటుడు

ఎత్తైన కొండలు

కొండల పైనుండి దూకుతున్న ఒక పెద్ద జలపాతం

అక్కడ ఫోటోలు తీసుకుంటున్న టూరిస్టులు.”

వాళ్ళందరూ కళ్ళు మూసుకుని అతను చెప్పే మాటలు చక్కగా వింటూ ఉన్నారు.

అతను తిరిగి చెప్పటం ప్రారంభించాడు.

“మీరు కళ్ళు తెరవకుండా నేను చెప్పే మాటలు వింటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెబుతాను.

ఖరీదైన ఒక బిల్డింగ్ పోర్టికోలో నీలం రంగు బీ.ఎం.డబ్యూ కార్ వచ్చి ఆగింది. తెల్లటి యూనిఫారం వేసుకుని, తలకి టోపి పెట్టుకున్న డ్రైవర్ డోర్ తెరవగా, హుందాగా కారు దిగాడు మన కథా నాయకుడు.

ఆరడుగుల యువకుడు మన కథలో కథా నాయకుడు. ఇతను చాలా అందంగా, తెల్లటి మేని ఛాయతో ఉన్నాడు. చూట్టానికి హాలివుడ్ సినిమా హీరోలా ఉన్నాడు. ఇతను తెల్లటి షర్ట్, నేవీ బ్లూ కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు. బంగారు వర్ణం టై వేసుకుని ఉన్నాడు. చక్కగా పాలిష్ చేయబడిన షూస్, లాప్ టాప్ ఉన్న నల్లటి లెదర్ బాగ్ అతని భుజానికి వేలాడుతోంది.

అతను నేరుగా లిఫ్ట్ వద్దకు వెళ్ళి నిలబడ్డాడు……

నెమ్మదిగా లిఫ్టు తలుపు తెరచుకుంది. యూనిఫాంలో ఉన్న లిఫ్ట్ బాయ్ మన కథానాయకుడికి సెల్యూట్ చేసి, లిఫ్ట్‌లో ఒదిగి నించున్నాడు.

మన హీరో లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వంగానే, లిఫ్ట్ బాయ్ పదిహేనో ఫ్లోర్ అన్న బటన్ ప్రెస్ చేశాడు. లిఫ్ట్ నెమ్మదిగా బయలుదేరింది. లిఫ్ట్‌కి మూడు వైపులా ట్రాన్స్పరెంట్‌గా ఉండటం వల్ల నగరం స్పష్టంగా కనిపిస్తోంది లిఫ్ట్ లోంచి.

హీరో పదిహేనో ఫ్లోర్లోని తన ఆఫీస్‍లోకి ప్రవేశించగానే స్టాఫ్ అందరూ వినయంగా ‘గుడ్ మార్నింగ్’ చెపుతూ గ్రీట్ చేశారు.

ఇలా ఎంత సేపయినా కథ చెబుతూనే ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ కథని ఇక్కడ ఆపేస్తాను.

నేను ఈ ఆక్టివిటీ మొదలుపెట్టే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను గుర్తు ఉందా?

“మీ మనసులో ఆలోచనలు ఏ భాషలో కొనసాగుతాయి? అదే విధంగా మీ మనసు పాత జ్ఞాపకాలని ఎలాగ స్టోర్ చేసుకుంటుంది? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీ మనసు ఒక కంప్యూటర్ అనుకుంటే, దాని యొక్క ప్రాసెసింగ్ లాంగ్వేజి ఏమిటి?”

అదే ప్రశ్నని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను.

ఇప్పుడు మీరు ఈజీగా సమాధానం చెప్తారు” అని ముగించాడు సంతోష్.

చాలా మంది చేతులు ఎత్తారు.

“మాకు అర్థమయిపోయింది. మా మనసు యొక్క ప్రాసెసింగ్ లాంగ్వేజి ‘పిక్చర్స్’. నీవు మాటలు చెబుతూ ఉంటే, ఆ మాటలకు అనుగుణంగా మా మనసులో పిక్చర్స్ వచ్చాయి.”

“ఎస్. మన మనసు భాష ‘విజువల్ లాంగ్వేజి’. అంతే కాకుండా స్పర్శ, రుచి, వాసన, శబ్దం ఆధారంగా కూడా ఆలోచనలని స్టోర్ చేసుకుంటుంది. విజువల్ అంటే దృశ్యం అధారంగా ఎక్కువ భాగం మన ఆలోచనలు సాగుతాయి.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది.

అందరూ మనసు పెట్టి వినండి.

మన సబ్‌కాన్షస్ మైండ్ చాలా శక్తివంతమైనది అని మనం ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం కద. మన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు అన్నీ కూడా ఈ సబ్‌కాన్షస్ మైండ్‌లో స్టోర్ అయి ఉంటాయి.

‘నేను ఇంగ్లీష్ లో మాట్లడలేను’ అని మీరు పదే పదే అనుకుంటే అది నిజమని నమ్మేసి మీ సబ్‌కాన్షస్ మైండ్ మరే విధమైన ప్రశ్నలు వేయకుండా ఆ విషయాన్ని తనలో స్టోర్ చేసుకుంటుంది.

మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడబోతే, మీరు ఇదివరకే తనకు ఇచ్చిన సూచనల ఆధారంగా, మీ సబ్‌కాన్షస్ మైండ్, మీకు ఇంగ్లీష్ రాదని తీర్మానం చేసుకుని ఉంటుంది కద. అది మీకు గుర్తు చేస్తుంది ‘నీకు ఇంగ్లీష్ రాదు కద’ అని.

చెప్పాను కద మీ సబ్‌కాన్షస్ మైండ్ ఎల్లప్పుడూ మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుందని. మీరు తీరా ఏదయినా వేదిక మీద ఎక్కి ఇంగ్లీష్ మాట్లాడబోయినా, ఎవరైన ఫ్రెండ్స్‌తో ఇంగ్లీష్ మాట్లాడబోయినా, మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని మీ సబ్‌కాన్షస్ మైండ్ మీకు గుర్తు చేస్తుంది.

కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఎలాంటి సూచనలని ఇస్తూ పోతామో, మన సబ్‌కాన్షస్ మైండ్ దానికి అనుగుణంగానే మన గుర్చి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. సబ్‌కాన్షస్ మైండ్‌కి మీ గురించి మీరు సరదాగా వేసుకునే జోకులు అర్థం చేసుకోలేదు.

సరదాకు కూడా మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుని మాట్లాడవద్దండి. అవన్నీ నిజాలే అనుకుంటుంది మీ సబ్‌కాన్షస్ మైండ్.

‘నాకు ఇంగ్లీష్ రాదు అని మీరనుకుంటే, రాదేమోలే అని అనుకుంటుంది’

’నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నేను ధైర్యంగా మాట్లాడగలను అని మీరు అనుకుంటే’ అది నిజమే అని నమ్ముతుంది మీ సబ్‌కాన్షస్ మైండ్.

కాబట్టి పదే పదే మీరు ఇచే సూచనలని తప్పక నిజం చేయాలి అని అనుకుంటుంది.

ఇలా మీ మనసుకు మీరు ఇచ్చే సూచనలని మీకు మేలు చేసే లాగా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియని ‘సెల్ఫ్ అఫర్మేషన్ టెక్నిక్’ అంటారు.

ఈ సెల్ఫ్ అఫర్మేషన్ టెక్నిక్‌లో మీకు మీరే పదే పదే పాజిటివ్ సజేషన్స్ ఇచ్చుకుంటూ, విజయం సాధిస్తారు.

మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన పని చేయబోతున్నాము. అదేమిటంటే, ఈ సెల్ఫ్ అఫర్మేషన్స్‌ని ఎలా ఇచ్చుకోవాలి అనే విషయం తెలుసుకోబోతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here