[ఝాన్సీ కొప్పిశెట్టి గారు ఇటీవల వెలువరించిన ‘ఎడారి చినుకు’, ‘ఆర్వీయం’ అనే పుస్తకాలని సమీక్షిస్తున్నారు డా. కె.ఎల్.వి. ప్రసాద్.]
సుఖ దుఃఖాల సమ్మేళణంకు కవితాత్మక రూపం ‘ఎడారి చినుకు’ (దీర్ఘ కవిత)
[dropcap]జీ[/dropcap]వితంలో కష్టసుఖాలైనా, సుఖదుఃఖాలైనా, అందరూ ఏదో రూపంలో ఎదుర్కొనక తప్పదు. వాటి తీవ్రతను బట్టి ఆయా మనుష్యుల మనస్తత్వాన్ని బట్టి, ఆయా సమస్యలను అప్పుడప్పుడూ సింహావలోకనం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సున్నితమైన మనసుగలవారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. మిగతావారు పెద్దగా పట్టించుకోరు. రచనా నైపుణ్యం గలవారు, రచనా వ్యాసంగం మీద అభిరుచి గలవారు, తమ తీపి లేదా చేదు అనుభవాలను అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఆయా సంఘటనలు వ్యక్తుల జీవిత విశేషాలు కలకాలం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. భావితరాల కోసం కాస్త ముందు చూపున్నవారు ముఖ్యంగా రచయితలూ/రచయిత్రులు, కవులు/కవయిత్రులు ఇటువంటి విశేషాలను, కథల రూపంలోగానీ, కవిత్వం రూపంలోగానీ, నవల రూపంలోగానీ నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది జీవిత చరిత్రల రూపంలో, మరికొంతమంది స్మృతి కావ్యాల రూపంలో గాని రచనలు చేస్తున్నారు. దీనికి తోడు వంశవృక్షం వివరాలు కూడా పొందుపరుస్తున్నారు. భావితరాలకు కుటుంబ సమాచారాన్ని అందించగలుగుతున్నారు. అదుగో అలాంటి గొప్ప ప్రయత్నమే చేశారు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. స్వతహాగా ఆమె నవల, కథ, వ్యాస రచయిత్రి. అడపాదడపా కవిత్వం తలుపు తడుతుంటారు, సమీక్షల వైపూ కన్నేస్తుంటారు. కానీ ఈసారి దీర్ఘ కవిత రాసి సంచలనం సృష్టించారు. సంచలనం అనడానికి కారణం, కవితకు తీసుకున్న వస్తువులోని ప్రత్యేకత, కవిత్వం వైపు అంతగా ఆసక్తి చూపని రచయిత్రి, పుష్టికరమైన దీర్ఘ కవిత రాసి, కవయిత్రుల జాబితాలో చేరడం, ప్రముఖుల మన్ననలు పొందడం. ఈ దీర్ఘ కవిత పేరు ‘ఎడారి చినుకు’.
‘ఎడారి చినుకు’ దీర్ఘ కవిత కూడా అనేక ప్రత్యేకతలు కలిగి వుంది. నాకు తెలిసి ఇంతవరకూ ఇలాంటి దీర్ఘ కవిత ఎవరూ రాసినట్టు లేదు (రాసినా బహుశా నా దృష్టికి రాకపోవచ్చు). ఒకే కవితలో రెండు భిన్నమైన జీవిత అంశాలను తీసుకుని దీర్ఘ కవితగా తనదైన శైలిలో పాఠకుడిని ఏకబిగిన చదివించేలా రాశారు. ‘ఎడారి చినుక’ శీర్షికలోని పాఠకుడికి వైవిధ్యం కనిపిస్తుంది. ‘ఎడారి చినుకు’ నేపథ్యం వెనుక అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం కవితను వెనువెంటనే చివరి వరకూ చదివిస్తుంది.
‘ఎడారి చినుకు’ ముఖ్యంగా రెండు భాగాలుగా కనిపిస్తుంది. కవిత చదవడం ప్రారంభించగానే, ఇదేదో స్మృతిగాథ అనిపిస్తుంది. పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక బాధ్యురాలు ప్రొఫెసర్ (శ్రీమతి) కాత్యాయని విద్మహే గారు పేర్కొన్నట్టుగా ‘ఎడారి చినుకు’ – ‘స్వీయాత్మక కథన కవిత’ కనుక ఈ మొదటి భాగంలో కవయిత్రి భర్త చనిపోవడంతో కలిగే బాధ, వ్యథ, మరణానంతర కర్మకాండ చేసే విషయంలో వీరికి కుమారులు లేకపోవడం; హిందూ సంప్రదాయం ప్రకారం కొడుకు/మగవారు మాత్రమే కొరివి పెట్టాలనే నియమం (కొడుకులు లేని సందర్భంలో ఈ పని కూతుళ్లు చేసిన సందర్భాలు వున్నాయి); తమకున్న ఇద్దరు ఆడపిల్లలూ కూడా విదేశాల్లో ఉండడం, వారిలో ఒకరు గర్భిణీ, మరొకరు బాలింతరాలు కావడం, అలా ఆడపిల్లలు స్వదేశానికి వచ్చే వెసులుబాటు లేకపోవడం; ఆ రకంగా కూడా తండ్రి చితికి నిప్పంటించి అవకాశం, తండ్రి తలకి కొరివిపెట్టేవారు లేకపోవడం ఒక సమస్యకు దారితీస్తుంది. ఈ సన్నివేశాన్ని కవయిత్రి ఇలా చెబుతారు..
“నా పంచ ప్రాణాలకు నిప్పెవరు పెడతారని
నా నాథునికి తలకొరివి పెట్టె నాథులెవరని
మగ నలుసు లేని మగనికి ముక్తినెవరు కలిగిస్తారని
పార్థివదేహం వంక బంధుమిత్రుల జాలి చూపులు..!’’
కాస్త మెత్తని మనస్సుగల వాళ్లకి పై నాలుగు పాదాలు గుండెను ద్రవింపజేస్తాయి. భర్త పోయాడన్న బాధ ఒక పక్క, ఎదురైన సమస్య పరిష్కారం కోసం ఆమె మనసులో వ్యథ మరొక పక్క, ఆమె పరిస్థితిని ఊహించుకున్న పాఠకుల కళ్ళల్లో నీళ్లు తిరగక మానవు. ఎవరు కర్మకాండ చేయాలన్న (అది కూడా మగవాళ్ళు) తర్జనభర్జనలు బంధువుల్లో. అయోమయస్థితిలో రకరకాల అర్థంలేని సంప్రదాయాల గురించి ఏకరువు పెడుతున్న సమయంలో, ఆమెలో దాగివున్న విప్లవకారిణి బయటపడుతుంది. కర్మకాండ తానే చేస్తానని, సంప్రదాయవాదుల మెదడుకు ఒక ఝలక్ ఇస్తుంది. అక్కడివారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆమె కవిత్వ రూపంలో చెప్పిన మాటలు గమనించండి.
“ఇరవై నాలుగు గంటలు
భాగస్వామి సాన్నిహిత్యంలో
ప్రేమతో, సేవతో, లాలనతో
శ్రీనివాసుని నా పేరులో లీనం చేసుకుని
కొప్పిశెట్టిని మకుటంగా ధరించి
కష్టసుఖాల్లో పాలుపంచుకుని
తన బీజంతో వంశోద్ధారణ చేసిన నన్ను
చెల్లని నాణెం చేసిన శ్రేయోభిలాషులు”
అనడంలో, ఇతరులకంటే తానే అర్హురాలని ప్రకటించి, భర్త కర్మకాండ ఆమె పూర్తి చేయడం హిందూ సంప్రదాయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక చర్యగా అభివర్ణించవచ్చు. ఆమె ఈ చర్యను తన కవిత్వ పాదాల్లో ఇలా బల్ల గుద్ది ప్రకటించింది..
“ఎవరైనా నా అడుగుజాడల్లో నడిస్తే
నాదే ముందడుగు..
…..
……
నాకు మాత్రం ఇది ఘనతే..!”
సమాజంలో ఇది ఎవరూ ఊహించని తిరుగుబాటుగా, అది కూడా అర్థవంతమైన తిరుగుబాటుగా, బాధలో వుండి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెను గొప్ప సాహసిగానే చెప్పుకోవచ్చు.
ఈ దీర్ఘ కవిత మొదటి భాగం ఇలా స్మృతి కవిత్వం అనిపించినా మిగతా భాగం ఈ ‘ఎడారి చినుకు’ దీర్ఘ కవితకు అర్థాన్ని అందించి దుఃఖంలో వున్న ‘ఆమె’ కు పై ఘటనను మరచిపోయేంతగా సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రేమను అందించే సన్నివేశం మొదలు ఆవుతుంది. ఎడారిగా మారిన తన జీవితంలో, ఒక చినుకు చుక్క రూపంలో తన మనవరాలు ప్రవేశించి, అమ్మమ్మను ‘అమ్మ’ గా మార్చడం సారాంశం. అందుకే ఆమె ఇలా అంటుంది-
“చిగురించిన అమ్మతనం
ఆర్తితో పాపాయి ఆలింగనాలూ
ఆ పరిష్వంగమ్ ఇచ్చే స్వాంతన
కొత్త వరుస ‘అమ్మనై’ నేను..!’’
ఈ దీర్ఘ కవితకు అదనపు ఆకర్షణ, వంశవృక్షం చేర్చడం. ఇది తరతరాలకు పెరుగుతూ ముందుకు కొనసాగాలని ఈ కవయిత్రి ఆలోచన ముందు చూపు కావచ్చు. అంతమాత్రమే కాదు చక్కని ఛాయాచిత్రాలు పుస్తకాన్ని దాచుకోవాలనిపిస్తాయి.
చివరగా, తన ముందుమాటలో శ్రీమతి కాత్యాయని విద్మహే గారు చెప్పినట్టు ‘ఎడారి చినుకు’ – స్వీయాత్మక కథన కవిత. ఇందులో జీవితం వుంది, తాత్వికత వుంది, విషాదం, లోకం తీరు, విప్లవం సమాధానం అన్న నాలుగు అంచెలలో కవితా నిర్మాణం ఇది,
ఆలోచింపచేయగల చక్కని అంశంతో, తన మొదటి దీర్ఘ కవిత ‘ఎడారి చినుకు’ అందించిన కవయిత్రి/రచయిత్రి, శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి అభినందనలు, శుభాకాంక్షలు.
***
ఎడారి చినుకు (దీర్ఘ కవిత)
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
ప్రచురణ: నాగమణి పబ్లికేషన్స్
పేజీలు: 52
వెల: 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి – 9866059615
ఆన్‌లైన్‍లో
https://www.amazon.in/Edari-Chinuku-Jhansi-Koppisetty/dp/B0C961TK5M
అమ్మమ్మ ప్రేమకు పరాకాష్ఠ.. ఈ ‘ఆర్వీయం’ మినీ కవితా సంపుటి..!!
సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన రచయితలు/రచయిత్రులు, కవులు/కవయిత్రులు తమకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియలలో రచనలు చేయడం మామూలు విషయమే! కొద్దిమంది మాత్రం జీవిత చరిత్రల పట్ల, ఆత్మ కథల పట్ల, స్మృతి కావ్యాలపట్ల ఆసక్తి చూపిస్తారు ,అదేవిధంగా అలాంటి రచనలు చేసే ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఒకరకమయిన తృప్తిని ఆస్వాదిస్తారు, అలాగే భావితరాలకు ఒక కుటుంబ చరిత్రను నిక్షిప్తం చేసే సదావకాశాన్ని కల్పించుకుంటారు. అలాగే ప్రేయసి గురించి ప్రియుడు, ప్రియుడి గురించి ప్రేయసి రాసుకున్న ప్రేమకావ్యాలూ వున్నాయి. ఈ మధ్య కాలంలో అమ్మమ్మలూ, నానమ్మలూ, తాతయ్యలూ తమ తమ మనుమలు, మనుమరాండ్రపై వున్న ప్రేమను కవిత్వం ద్వారానో, కథల ద్వారానో, వ్యాసాల ద్వారానో తెలుపుకుంటూ రచనలు చేసి, సాహిత్యం పైన, తమ మనుమల పైనా ప్రేమను ప్రదర్శించుకుంటూ సంతృప్తి పొందుతున్నారు. ఇది నిజంగా మంచి పరిణామమే! ఎదిగిన తర్వాత పిల్లలు తమ గురించి తమ పెద్దలు రాసిన సాహిత్యం చదువుకుని ఆనందించడమే కాదు, గర్వపడతారు కూడా. అంతమాత్రమే కాదు వారిలో కూడా సాహిత్యాభిలాష అంకురించే అవకాశం ఉందన్నమాట. ఒక రకంగా భావితరాలలో సాహిత్య తృష్ణ పెంచుకోడానికి ఇదొక మంచి మార్గమూ, పునాదిరాయి కూడాను.
మనుమల గురించి కొందరు తాతలు (ఈ రచయిత కూడా) వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. అయితే ఈ మధ్య ఒక అమ్మమ్మ తన చిన్న మనుమరాలు (పెద్ద కూతురు కుమార్తె) నేపథ్యంగా ఒక వినూత్నమైన రచనను తీసుకువచ్చి అమితమైన అమ్మమ్మ ప్రేమను ప్రకటించుకున్నారు. తెలుగు/ఆంగ్ల భాషల్లో అందంగా ముస్తాబై వచ్చిన పుస్తకం ఇది.
ఈ అందమైన హార్డ్ బౌండ్ పుస్తకానికి టాగ్‌లైన్ మాదిరిగా ‘నిట్టి, గ్రిట్టి, ఆర్వీ, ప్రెటీ’ అనే మాటలు కూడా తగిలించారు. ఇంతకీ ఈ పుస్తకం రచించిన అమ్మమ్మ (కవయిత్రి ) హైదరాబాద్ వాసీ, ఆస్ట్రేలియా నివాసి. ప్రస్తుతం పుస్తకప్రియులలో తరచుగా నలుగుతూన్న పేరు ప్రముఖ నవల/కథ/వ్యాస రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి.
మదిలో మెదిలిన తక్షణం కార్యరూపంలో పెట్టి పని పూర్తి అయ్యేవరకూ నిద్రించని కఠిన క్రమశిక్షణ గల సాహితీ మిత్రమణి శ్రీమతి కొప్పిశెట్టి. ఈ పుస్తకంలో తెలుగు/ఆంగ్ల భాషల్లో (అనువాదం ఈ కవయిత్రిదే) చిన్న చిన్న మినీ కవితలు వున్నాయి. ప్రేమ -కవిత్వమూ రంగరించి పుస్తకంలో అద్దినట్టుగా చదివినప్పుడు అనిపిస్తుంది. ప్రముఖ సాహితీవేత్త, కవి, వక్త శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య మంచి ‘ముందుమాట’ రాశారు.
ఆర్వీతో పాటు, ఆర్వీ రక్తసంబంధీకుల అందరి ఫోటోలు ముచ్చటగా అమర్చడం వల్ల పుస్తకానికి కొత్త సొబగులు అద్దినట్లై, పుస్తకానికి మరింత విలువ పెరిగినట్లయింది. ఈ బాలిక పుట్టుక కవయిత్రికి ప్రత్యేకం. అందుకే ఈ పాప (కవయిత్రి పెద్ద కుమార్తె, మూడవ కూతురు) పుట్టిన వెంటనే అమ్మమ్మ అయిన ఝాన్సీ ఈ పొట్టి కవిత రూపంలో స్పందించారు, చదవండి:
“ఈ అమ్మమ్మ హృదయాకాశ ముంగిట
మరో జాబిలమ్మ పుట్టిందీపూట..!
పూలంటి పిల్లలంటేనే పరవశం
మత్తిల్లే ఈ మకరందం మరింత వివశం..!!”
దీని గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదనుకుంటాను.
వృద్ధాప్యం దగ్గరయ్యేకొద్దీ మనుష్యులకి ఏదో తెలియని కొరత వేధిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక్కడ రాజూ-పేద తేడా ఉండదు. దీనికి ఝాన్సీ గారు అతీతం కాదు. అందుకే కాబోలు మనవరాలి పుట్టుకను తలుచుకుంటూ –
“ఈ ఆకులు రాలే శిశిరంలోకి
హరితాన్ని మోసుకొచ్చిందీ వసంతం!
నా వడలిన వదనంలో
వెలుగులు నింపింది చంద్రమాంతం..!!”
అని తెగ మురిసిపోయారు.
“నిన్ను వీడి వెళ్ళటం నాకో ఏసిడ్ పరీక్ష!
వదలివెళ్లే పాశాల దుఃఖం మోస్తూ..
భవబంధాల తాపత్రయం గ్రహిస్తూ..
సాగిస్తున్నా ఈ అసంతృప్త పయనం..!!”
అంటూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు కవయిత్రి.
ఇలా ఇంకా ఎన్నో హృదయాన్ని కరిగించే, ద్రవింపజేసే చిరు కవితలు ఎన్నో వున్నాయి. వాటన్నింటిని ఇక్కడ ఉటంకించే అవకాశం లేదు. కానీ చివరి కవితలో కవయిత్రి అసలైన వ్యథను ఎలా వ్యక్తపరిచారో గమనించండి-
“జగన్నాటక మాయలో –
ఏ పావేటు కదులుతుందో తెలియకుంది!
ఈ కాలం కనికరించి వరకూ,
నా కలం ఇలా పలవరించి పరవశిస్తుంది!!”
ఇలా తాత్వికంగా ముగించారు. కారణం, ఎప్పుడు తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి మనుమరాలిని చూస్తుందో ఆవిడకి తెలియని పరిస్థితి. అందుకే కాలమే కనికరించాలని ఆవిడ వేడుకుంటున్న సందర్భం, ఝాన్సీగారి చేత ఈ ‘ఆర్వీయం’ పుస్తకాన్ని రాయించిందన్న విషయం స్పష్టం.
ఇందులో పుస్తక ప్రాప్తి స్థానం గాని, పుస్తకం వెల గాని కవయిత్రి ఎక్కడా పేర్కొనలేదు. బహుశా ఇది కొనడానికి దొరకని పుస్తకం అనుకుంటాను.
కానీ, ఇలాంటి పుస్తకాలు రాయాలనుకునే రచయిత్రులు/రచయితలూ; కవులు, కవయిత్రులు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి మొబైల్ (98660 59615) కు ఫోన్ చేసి పుస్తక వివరాలు కనుక్కోవచ్చు.
***