ఎడబాటు

0
2

[dropcap]ఇ[/dropcap]క్కడ కాసేపు బయట కూర్చోవటానికి లేదు. మంచు పూలవానలాగా కురుస్తున్నది. ఈ డల్లాస్‍లో ఇప్పుడు ఇంత చల్లగా వుంటుందనుకోలేదు. తనకసలే చల్లదనం పడదు. మనుమరాలు గదిలో నిద్రపోతున్నది. ఇలాంటి ఖాళీ సమయాల్లోనే తను ఇండియా నుంచి భర్త పెట్టిన వాయిస్ మెసేజ్‍లన్నీ చూసుకుంటుంది. అక్కడ ఆయన ఎలా వున్నారో? ఏం తింటున్నారో? ఎప్పుడూ ఒకర్ని విడిచి ఒకరం వుండలేకపోయేవాళ్ళం అనుకుంటూ పద్మావతి తన ఫోన్ ఆన్ చేసుకున్నది. ముందుగా వాట్సప్ చూసింది. పెద్ద మెసేజే వున్నది.  తీరిక చూసుకుని – గూగుల్ వాయిస్ టైపింగ్ ద్వారా టైప్ చేసినట్లున్నారు. తమ ఇద్దరికీ ఇప్పుడు ఫోనే ఊరట ఇస్తున్నది. వచ్చే నిట్టూర్పు నణుచుకుంటూ అక్షరాల వంక దృష్టి పెట్టింది.

“భార్యామణీ! నా అలివేణీ! అక్కడ నీకు మనుమరాలి పనులతోనూ, ఇంటి పనులతోనూ సమయం తేలిగ్గా గడిచిపోతున్నట్లున్నది. అమ్మాయీ, అల్లుడు ఇద్దరూ బ్యాంక్‍ల కెళ్ళి వుంటారుగా? ఇంజనీరింగ్ చదివే పిల్లలకు పాఠాలు చెప్తూ పగలు ఎలాగో కాలక్షేపం చేస్తున్నాను. ఖాళీ దొరకగానే నువ్వే గుర్తొస్తావు. బి.ఇడి. కాలేజ్‍లో ఇంగ్లీషు లెక్చరర్‍గా పనిచేస్తూనే ఇంట్లో నీ సహాయ సహకారాలతో నాగార్జున యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. పూర్తి చేశాను? అడుగడుగునా నాకన్నీ అందించి నాకెన్ని సేవలు చేశావు? ప్రియా! చారుశీలా! ఎన్నని కృతజ్ఞతలు చెప్పను? ఏమని చెప్పను? రోజు రోజుకు నీ పై పెరిగే ప్రేమను ఎలా వ్యక్తపరచను? బి.ఇడి. కాలేజీ నుంచి రిటైరయ్యాను. పి.హెచ్.డి చేసిన ఉత్సాహంతో వెంటనే ‘ప్రియదర్శిని’ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీషు ప్రొఫెసర్‍గా, చేరటానికి ఇంటర్వ్యూ కెళ్ళాను. “ఇంట్లో వుండి విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి కాన్పు కోసం అమెరికా వెళ్ళాల్సి వుంటుంది. ఇద్దరం తోడుగా వెళ్దాం” అంటూ నువ్వేంతో నచ్చచెప్పావు. నేను వినే స్థితిలో లేకపోయాను.

ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాను. నాకున్న సర్వీస్ తోను, అనుభవంతోను ప్రొఫెసర్ పదవి ఇచ్చారు. “అమెరికా మరోసారి వస్తాను. నా డాక్టరేట్ డిగ్రీని సార్థకం చేసుకుంటాను. ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకు ఇంగ్లీషు బాగా చెప్పాలని నాకు కోరికగా ఉంది” అంటూ ఆనందంతో పొంగిపోయాను. ఏ భావమూ నీ ముఖంలో కన్పించనివ్వని గంభీరురాలివి నువ్వు. “నువ్వెలాగూ వస్తూ వస్తూ మనుమరాలిని తీసుకొస్తావుగా. ఈలోగా నువ్వెళ్ళిన తర్వత వీడియో కాల్‍లో చూపిస్తావుగా. మనకు పుట్టబోయేది మనుమరాలని ముందే తెలిసిందిగా” అంటూ, ఏమేమో చెప్పాను. ప్రియదర్శిని కాలేజ్ నాకు కొత్త. ఇంజనీరింగ్ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మంచి ఇంగ్లీషు ప్రొఫెసర్‍ని అనిపించుకోవాలి అనుకుంటూ ఎక్కడెక్కడి ఇంగ్లీషు వ్యాకరణం పుస్తకాలు తిరగేస్తూ నా లోకంలో నేనుండేవాడిని. అప్పుడు కూడా నా పనుల బాధ్యత అంతా నీదే. నేను గవర్నమెంటు సర్వీసులో రిటైరయినా నీకు మాత్రం ఇంటి పనుల్లో రిటైర్‍మెంట్ లేదు. ఎప్పట్లాగే ప్రొద్దున్నే లేచి పలహారాలు, భోజనం కారియర్ సర్దిచ్చిన సహనశీలివి. ఏనాడూ నీ ముఖంలో విసుగు చూడలేదు. నవ్వు ముఖం, ఆ నవ్వులో నా మీద ప్రేమే కనబడేది. “నాతో పాటు నీగ్గూడా ప్రమోషనోయ్ పద్మా. నువ్విప్పుడు లెక్చరర్ గారి భార్యవు కావు. ప్రొఫెసర్ గారి భార్యవు” అంటూ కితాబిచ్చేవాడిని. “నేను నేనే. కేవలం మీ భార్యనే. నాకే బిరుదులూ అక్కరలేదు” అంటూ గలగలా నవ్వేసేదానివి. ఆ నవ్వులో నా మీద బోలెడంత ఇష్టం కనబడేది.

నువ్వు అమెరికా వెళ్ళే రోజు వచ్చింది. నిన్నొక్కదాన్నే హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కించాను. దుబాయ్‍లో విమానం మారే చోట కాస్త సహాయం చేయమ్ని తెలిసిన తోటి ప్రయాణీకులకి చెప్పాను. అలా నిన్నొక్కదాన్నే పంపించినందుకు చాలా బాధపడ్డాను. క్షమించమని ఇప్పుడు మరీ మరీ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు దగ్గర లేకపోతే నా హృదయం ఎంత శూన్యమవుతున్నదో బాగా అర్థమవుతున్నది. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేనింక ఉండలేను. ఇది నీ పట్ల నాకున్న మోహం కాదు. నీమీదున్న ప్రేమ, ఇష్టం నన్నలా అనిపిస్తున్నది. నాకూ వీసా వున్నదిగా. అల్లుడితోను, అమ్మాయితోనూ నేను అమెరికా రావటానికి టికెట్ కొని పంపమని చెప్తాను. టికెట్ కొని పంపగానే వెంటనే వచ్చేస్తాను. మిమ్మల్నందరినీ, ముఖ్యంగా నిన్ను చూడాలనీ, నీ దగ్గరే వుండాలని మరీ మరీ అనిపిస్తున్నది. చిన్నితల్లి ఏమంటున్నది? నీకు నా అనేక ముద్దులు. చిన్ని తల్లికి ఆశీస్సులు. ఉంటాను.

ఆ మెసేజ్ చదివిన పద్మావతి మనసు భారమయింది. తన భర్త బాగా బెంగపడ్డాడని అర్థమయింది. చేసే ఉద్యోగం పట్ల ఉన్న సంతృప్తిని కూడా తన ఎడబాటు మింగేసినట్లుగా వున్నది. ‘ఏ వీడియో కాలో చేసి ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఇండియాలో అర్ధరాత్రి అయి ఉంటుంది. బాగా నిద్రలో వుండి వుంటారు. ఆయన బాధను దూరం చేయటానికి నేను కూడా మెసేజ్ పెడతాను’ అనుకుంటూ భర్త వాట్సప్ నెంబరుకు మెసేజ్ టైప్ చేయసాగింది.

“నా బంగారు తండ్రీ! పిచ్చి నాన్నా! అంత బెంగ అయితే ఎలా అమ్మా! ఇప్పుడు మీకు ప్రొఫెసర్‍గా ఒక్క ప్రమోషనే కాదు, తాతగారి హోదా కూడా వచ్చిందిగా. అంటే మీరిప్పుడు బాగా పెద్దవాళ్ళ కింద లెక్క. పెళ్ళాం మీద ఇంత బెంగా, ఇంత పిచ్చి ప్రేమా కన్నా! కొంచెం నిబ్బరంగా వుండండి. మీకేనా? నాకూ ప్రతిక్షణం మీరే గుర్తుకొస్తున్నారు. నేను మీకేదో సేవలు తెగ చేసి పెట్టేశానని పదే పదే అనుకుంటున్నారు. మీ పనులో, సేవలో అవన్నీ కూడా మీమీద ఎంతో ఇష్టంగాను, ప్రేమగానూ, చాలా సంతోషంగా చేశాను. నాకేనాడు విసుగనిపించాలా. మీరే మా అందరి కోసం ఎక్కువ కష్టపడుతున్నారని బాధపడేదానిని. నాకిది కావాలి అని నేనడక్కుండానే నా మనసు గ్రహించినట్లుగా అన్నీ అమర్చేవారు. అదేంటో గమ్మత్తుగా మనిద్దరి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలాగే వుండేవి. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే మీలాంటి భర్త లభించాడని పదే పదే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దణ్ణం పెట్టుకుంటూ వుంటాను. ఇక్కడ మన చిన్ని తల్లి బోసినవ్వులు నవ్వుతుంటే వాటిల్లో నాకు మీ ముసి ముసి నవ్వులే కనిపిస్తున్నాయి. దానిదంతా మీ పోలికే అంటాను నేను. నా మాటలు విని మనమ్మాయి నవ్వేస్తున్నది. ఎప్పుడూ నాన్నని తలచుకుంటూ వుండేటప్పటికి దాని ముఖంలో అన్నీ నాన్న పోలికలే నీకు కనబడుతున్నాయంటుంది. మీ పట్ల నాకున్న ప్రేమ తెలియజెప్పడానికి నాకింతకంటే చాతకాదు. మీరు నాకెన్ని విషయాలు నేర్పుతూ వుంటారు? ఇప్పుడీ ఫోన్ సంగతే చూడండి. నాకు తెలుగులో టైపింగ్ రాక తంటాలు పడేదానిని. ఏపిల్ ఫోన్‍లో ‘స్వరచక్ర’ యాప్ వుండదు. కానీ నా కోసం ఆండ్రాయిడ్ ఫోన్ కొని దాంట్లో ‘స్వరచక్ర’ యాప్‍ను డౌన్‍లోడ్ చేసుకుని మీరు తెలుగు టైపింగ్ నేర్చుకుని నాకు నేర్పారు.  దాంతో నేను చక్కని తెలుగు భాషను టైప్ చేయగలుగుతున్నాను. అలాగే టైప్‍లో స్పీడ్ కోసమని ‘గూగుల్ వాయిస్ టైపింగ్’ విధానం కూడా నేర్పారు. ఇలాంటివి ఎన్నో ప్రియతమా! మీరు లేకపోతే నేనదే దానిని లేను. మీ సహకారం, మీ ప్రేమనే నాకు ఆలంబన. నేను మీకెన్ని కృతజ్ఞతలు చెప్పాలి! సరే ఇక అసలు విషయానికి వద్దాం. మనిద్దరి మధ్య ఎనలేని ప్రేమ ఇదివరకున్నది. ఇక ముందు కూడా వుంటుంది. ఇంకా చిక్కబడుతుంది కూడా. రాత్రి పూట మీరు చదివి చదివి అలసిపోయి పడుకునేవారు. మీ చేతిలోని పుస్తకం తీసి పక్కనపెట్టి మీకు దుప్పటి కప్పేదానిని.  నిద్రపోయే మీ ముఖం పసిపాప ముఖమంత స్వచ్ఛంగా నిర్మలంగా అనిపించేది. మీకు దగ్గరగా జరిగి మిమ్మల్ని సుతారంగా జో కొడుతూ వుండేదానిని. ఆ తర్వాత ఎప్పుడో నిద్రలోకి జారుకునేదానిని. మధ్యలో నాకు ఎప్పుడు మెలకువ వచ్చినా మీ వంక చూస్తూ మీ నుదుటి మీద వెంటుకల్ని తాకీ తాకనట్టుగా సరిచేసేదానిని. మీ నుదుటిన ముద్దు పెట్టుకోవాలనిపించి కూడా మీకెక్కడ మెలకువ వస్తుందోనని ఆగిపోయేదానిని. రాత్రి పూట ఇప్పుడిక్కడ కూడా అలవాటు చొప్పున నిద్ర మత్తులో చెయ్యి చాపి పక్కన మీరుంటారేమోనని ఉలిక్కిపడి లేస్తాను. మీకు చదువంటే తగని ఆపేక్ష. నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలన్న తపన వున్నది. దాంతో ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది రోజులు ఇద్దరం ఓపిక పడదాం. ఎలాగూ రెండు నెలలు గడిచాయి. పగలంతా కాలేజీ కాంటిన్‍లో తింటూ రాత్రి పూట అక్కడ్నుంచే చపాతీలు ప్యాక్ చేయిచుకుని తెచ్చుకుని రాత్రి పూట తిని కాలక్షేపం చేస్తున్నారు. మీరు కాలేజీకి వెళ్ళే లోపు పనిమనిషి వచ్చి పనులు చేసి పెడుతుంది. బట్టల ఇస్త్రీ సంగతి కూడా తనే చూసుకుంటుంది. ఎలాగో ఒకలా ఇంకో నాలుగు నెలలపాటు సర్దుకుందాం. ఈలోగా ఇలాగే మెసేజ్‍లు పెట్టుకుంటూ, వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దాం. సరేనా బంగారు తండ్రీ! నా వరాల కొండ నా మాట వింటాడు. నాకా నమ్మకం వున్నది. అదుగో మన చిన్ని తల్లి నిద్ర లేచి కయ్యిమంటున్నది. ఇక ఉండనా మరి?”

విశ్వనాధం భార్య పంపిన మెసేజ్ చదివి ‘నా వల్ల కావటం లేదు పద్మా’ అనుకున్నాడు. వెంటనే చేతి వేళ్ళు ఫోన్ మీద కదలాడసాగాయి. “నా వలపుల వరాల మూట, నా వజ్రాల గనీ! వెంటనే నీతో మాట్లాడాలని కోరిగ్గా వున్నది. కానీ మన సమయాలు కుదరటం లేదు. ఇప్పుడయితే అక్కడ ఇంట్లో పిల్లలు వుంటారు. ఇక్కడ కూడా నేను భావోద్వేగంతో బిగ్గరగా మాట్లాడుతుంటే పక్క ఫ్లాట్ వారికి వినపడుతుందన్న భయంతో మరలా మెసేజ్ పెడుతున్నాను. నేను మాత్రం ఇంక ఇక్కడ ఉండను. నా ఆవేదన, నా విరహ బాధ అర్థం చేసుకో. కాలేజీ వాళ్ళను సెలవు అడుగుతాను. వాళ్ళు సెలవు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. మానేస్తాను. అమ్మాయి వాళ్ళు టికెట్ కొని పంపకపోయినా నేను కొనుక్కుంటాను. నాకిక్కడ ఏ పని చేయాలనిపించటం లేదు. ఇంట్లో ఏ శబ్దం వినిపించినా, ఎక్కడ ఏ గొంతు విన్పించినా నువ్వే వచ్చేసి వుంటావని భ్రమ పడుతున్నాను. కాళిదాసు కాలంలో యక్షుడు మేఘసందేశం పంపాడంటారు. నేను నీకు ఫోన్‍లో సందేశాలు పంపుతున్నాను. నిన్నెలాగూ అమ్మాయి వాళ్ళు ఇప్పుడు ఇండియా రానివ్వరు. అందుకని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. ఇంకా ఉంటా.” అని టైప్ చేసి మెసేజ్ పంపాడు.

ఆ సందేశం చూసి పద్మావతికి సంతోషపడాలో, విచారపడాలో అర్థం కాలేదు. కాని వెంటనే ఆయనకు సమాధానం ఇవ్వాలి అనుకుంటూ ఇంట్లో చిన్న చిన్న పనులుంటే పూర్తి చేసింది. మనుమరాలిని నిద్రపుచ్చింది. ‘వీడియో కాల్ చేసి సముదాయిద్దామంటే ఆయన కాలేజీలో వుండే సమయం’ అని ఆలోచించి మరలా మెసేజ్ టైప్ చేయసాగింది

“మా బంగారు కొండ, మా చిట్టి తండ్రి, నా మాట వింటాడమ్మా. గతంలో మీరు పగలు ఉద్యోగం, రాత్రి పూట థీసిస్ వర్క్ చేసుకుంటుంటే విలవిలలాడిపోయేదాన్ని. ఆ వర్క్ ఏడో నేను చేయగలిగితే బాగుండునని కొట్టుకుపోయేదానిని. ఇంగ్లీషు భాష మీద మీకెంతో పట్టు వున్నది. అది పిల్లలకు పంచండి. ఇప్పుడు మానేస్తే ఇంజనీరింగ్ పిల్లలకు చెప్పలేక మానేశాడు అన్న పేరే మిగుల్తుంది. అమెరికా నుండి వచ్చాకా మరల మీకు ఉద్యోగం ఇవ్వరు. పి.హెచ్.డి., ఆ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వాలన్నది మీ గొప్ప కోర్కె. అది నెరవేరే సమయానికి చేజార్చుకోవద్దు. అక్కడ మీ ఆలోచనలలో నేనూ, ఇక్కడ నా ఆలోచనలలో మీరూ ప్రతిక్షణం మన మనసుల్లో మెదులుతూనే వుంటాం. ఊసులాడుకుంటూనే వుంటాం. ఇంక ఎడబాటు ఎక్కడ? ఓపిక పట్టాలి పతిదేవా. రెక్కలు కట్టుకుని మీ ముందు వాలాలని నాకూ వుంటున్నది. కానీ తమాయించుకుంటున్నాను. ఇక్కడ పాపను పెంచే బాధ్యత తీసుకున్నాను. నన్ను నమ్ముకుని మన అమ్మాయి ఇప్పుడే మరలా తను పనిచేసే బ్యాంకు కెళుతున్నది. ఈ నాలుగు నెలలూ పూర్తి చేసి పాపను తీసుకుని ఇండియా వచ్చేస్తాను. తల్లి దగ్గర పాలు తాగే పసిదానిని వదిలేసి ఎలా ఇండియా రాగలను? దానిని ఇప్పుడే ఇక్కడకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కాదుగా. అర్థం చేసుకో చిన్న తండ్రీ. వుంటాను.”

***

ఆ రోజు డల్లాస్ లోని పద్మావతి అల్లుడికి మామగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. “అల్లుడు గారూ! నేను మా కాలేజీలో సెలవు కోసం అప్లై చేశాను. నాలుగు నెలలు సెలవు శాంక్షన్ చేస్తే సరేనండి. లేకపోతే రాజీనామా ఇచ్చేసైనా నేను కూడా అమెరికా వచ్చేస్తాను. వీలైనంత త్వరగా టికెట్ తీసుకోండి. మీకైతే తేలికని మీకు చెప్తున్నాను. మీకు కుదరకపోతే ఇక్కడ నేనే ట్రై చేసుకుంటాను. నేనిక్కడ ఒంటరిగా వుండలేకపోతున్నాను.”

“మావయ్యగారూ! నేను చెప్పేది కూడా వినండి. మీరు తొందరపడుతున్నారని అనిపిస్తోంది. కొద్ది నెలలు ఓపిక పట్టలేరా? మంచి పోస్ట్ కావాలని చాలా శ్రమపడి సాధించుకున్నారు గదా?”

“కాదు అల్లుడు గారూ! నేనింక ఒక్క రోజు కూడా ఆగలేననిపిస్తున్నది. అందరినీ మిస్ అవుతున్నాను. అత్తయ్యతో పాటు నేనూ రాకుండా పెద్ద పొరపాటు చేశాననిపిస్తున్నది.”

“మీరింత పట్టుపడుతుంటే టికెట్ సంగతి నేనే చూస్తాను. మీరేం వర్రీ అవకండి. వుంటాను” అంటూ అల్లుడు ఫోన్ పెట్టేశాడు.

విశ్వనాధానికి ఎక్కడ లేని హుషారు వచ్చింది. పది రోజులు గడిచాయి. అల్లుడు టికెట్ పంపే పనిలో వున్నాడన్న కబురే చెప్తున్నారు. సెలవు ఇవ్వం, మానేసి వెళ్ళిపొండి అని కాలేజీ వాళ్ళు చెప్పారు. అమెరికా బయల్దేరే ముందు రాజీనామా చేస్తానన్నాడు.

ఆ రోజు మధ్యాహ్నం పద్మావతి నుండి కాలేజికి ఫోన్ వచ్చింది. ఇంకో గంటలో ఇంటికొస్తాం. మీరొచ్చి ఇంటి తాళం తియ్యండి” అని.

అదేంటి? పద్మ ఇలా ఫోన్ చేసింది? ఇంటికొస్తామంటున్నది. అక్కడ పాప సంగతి ఏం చేశారు! ఏమీ అర్థం కాక విశ్వనాధం కాలేజీ నుంచి ఇంటికొచ్చేశాడు. తను వచ్చిన గంటకల్లా కూతురు, అల్లుడూ పాపనెత్తుకుని తన భార్య అందరూ కారు దిగి లోపలికొచ్చారు. అతను విస్తుపోయాడు.

“మామయ్య గారూ! మీ విరహం చూడలేకపోయాం. మీ అమ్మాయీ, నేనూ పని చేసే బ్యాంకుల్లోని సాఫ్ట్‌వేర్ జాబ్ వర్క్ కొన్ని నెలలు ఇంటి నుంచే చేసేందుకు పర్మిషన్ తెచ్చుకున్నాం” అన్న అల్లుడి నవ్వు మాటలకు పద్మావతి ముఖం ఎర్రబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here