ఏదైనా వీలైతేనే…

0
2

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]ఆ[/dropcap] సాయత్రం చీకట్లు ముసురుతున్న వేళ..

ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన నాకు క్రింద సెల్లార్లో లగేజీతో.. కదలడానికి సిద్దంగా ఉన్న ఆటో కనబడడంతో.. ‘ఎవరో ఊరు వెళుతున్నారన్న మాట’ అనుకు౦టుండగానే… పైనుంచి క్రిందకు దిగిన లిఫ్ట్ లోంచి ఆండాళ్ళు గారు బయటికొస్తూ “కాశీ యాత్రకు వెళుతున్నాం” అంటూ ఉత్సాహంగా చెప్పేసి వెళ్ళిపోయింది.

అవధానులు గారు అప్పటికే ఆటో దగ్గర, ఆవిడ కోసం ఎదురు చూస్తున్నారు.

అపార్టుమెంటులో అందరూ.. అందరికీ స్నేహితులే. పగలు నేను ఇంట్లో ఉండను కాబట్టి, ఏ విషయమైనా చివరి నిముషంలోనే తెలుస్తుంది.

“ఓ.కే .. బై. క్షేమంగా వెళ్లి లాభంగా రండాంటీ” చెప్పింది అక్కడే ఉన్న వర్ధని.

వాళ్ళు అలా బయలుదేరడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకూ యాత్రలంటే చాలా ఇష్టం. అయితే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాన్ని చూసుకుని, పరిగెత్తుకుంటూ వెళ్లి.. పరిగెత్తుకుంటూ వచ్చేయడం అవుతుంది. పోనీ, మరో రెండు రోజులు శెలవు ఎక్కువగా.. పెట్టుకుని తీరికగా చూసొద్దాం అంటే.. రైలు టైమింగ్స్, వెళ్ళిన పనులకూ పొంతన కుదరక.. కొంత హోటల్ ఖర్చులకూ వెరసి, వెళ్ళామా.. వచ్చామా అన్నట్లుంటుంది మా టూరు.

ఏమైనా మాట్లాడదామన్నా వీలు అవలేదు. అందుకే ‘వెళ్లి రండి’ అన్నట్లు చెయ్యి ఊపాను.

ఆటో నిండుగా బేగ్గులు. అంత లగేజీ వేసుకుని ఇద్దరూ వెళుతున్నారంటే.. ఎన్ని రోజులు ఉంటారో? అనుకునేంత లోనే ఆశ్చర్యంగా.. మనసు పని చెయ్యడం మొదలు పెట్టింది, మరి ఇంట్లో… అత్తగారో?.. అని.

ఆమె డెబ్బై ఏళ్ల ముసలమ్మ. ఆమెకు నాలుగేళ్ళుగా.. అన్నీ మంచం మీదే జరుగుతున్నాయట. మనిషిని పెట్టి చేయిస్తున్నారు. పనిమనిషి మరియమ్మే రోజంతా.. ఉండి చేస్తుంది. రాత్రుళ్ళు అక్కడే పడుకుంటుంది. ఎంత కష్టపడితే ఆమెకు.. నెల తిరిగే సరికి ‘ఆరువేల’ రూపాయలోస్తాయి.

వారం రోజుల క్రిందటే, అవధానిగారి కూతుళ్ళు ఇద్దరూ.. వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. మరి ముసలమ్మ పరిస్థితి ఏమిటీ?

ఆ ముసలమ్మ గారికి ఇద్దరూ కొడుకులే. అవధానులుగారే పెద్ద. రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అతనే.. అన్నగారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడని అనుకోవడం.

లిఫ్టులో పైకి వస్తూ౦టే ఇదే ఆలోచన.

ఇంట్లోకి అడుగుపెడుతూ చెప్పాను “అవధానులుగారు కాశీ యాత్రకు వెళుతున్నారు” అని.

“ఎప్పుడు” అన్నారాయన.

“ఇప్పుడే. మాట్లాడడానికి వీలుపడలేదు”

“వాళ్ళు ఇంతకుముందే ప్రయాణం పెట్టుకున్నారు, సమైక్యాంద్ర గొడవల్లో. అప్పుడు రైళ్ళు తిరగలేదని మానేసారు” చెప్పారు.

పాత విషయాలు గుర్తు చేసుకుంటూ “అవును. నిజమే. మళ్ళీ ప్రయాణం పెట్టుకోడానికి ఇన్నాళ్ళు పట్టిందన్న మాట. అంతా బాగానే వుంది. కానీ, ఇంట్లో ముసలమ్మ.. అదే అవధానులగారి తల్లి.. ఉండిపోయింది. పోనీ, బంధువుల ఇంట్లో పెట్టి ఉంటారు అని అనుకుందాం.. అన్నా వాళ్లకి ఎవరూ లేరే ఇక్కడ” అంటూ మనసులోని సంశయాన్ని బయటపెట్టాను.

“వాళ్ళ గొడవ నీకెందుకు. నీ పనేదో నువ్వు చూసుకోక” ఇంట్రస్టింగుగా చూసే.. క్రికెట్ కామెంట్రికి అడ్డం వస్తున్నాననుకున్నారేమో.. టీ.వి నుంచి దృష్టి మరల్చకుండానే.

ఆయనకు నేను.. ఏది చెప్పినా విసుగ్గానే ఉంటుంది.

రిటైరు అయ్యి మూడేళ్ళుగా ఇంట్లో కూర్చున్నారు. టి.వీ. తప్ప మరో వ్యాపకం లేదు. ఖాళీగా ఉండేవాడి ‘బుర్ర డెవిల్స్ కార్ఖానా’ లాంటిదని నాన్నగారు చెబుతూ ఉంటారు. ఆయన బుర్రా అలాంటిదే. ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు.

“అంతే లెండి. చూసుకోక ఏం చేస్తాను. అసలు ఎప్పుడైనా.. మనం కాశీ యాత్రకు వెళతామా! ఉద్యోగంలో ఉండగా తీరిక దొరకదు. రిటైరు అయ్యాక ఓపిక చాలదు” అన్నా ఆయన మాటలు తిప్పికొడుతూ.

అప్పుడైనా ఆయన మనసు కరిగి ‘అలాగే లే’ అంటారన్న గుడ్డి ఆశ.

***

రెండు రోజుల తరువాత…

ఆఫీసుకి వెళ్ళడం కోసం, అపార్టుమెంటు మెట్లు దిగి వస్తుంటే, అవధానుల గారి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి..

సిగ్నల్స్ కోసం అన్నట్లు వీధి వాకిట్లోకి వచ్చి నిలబడి, మరియమ్మ ఫోన్లో మాట్లాడుతుంది. “ఇక్కడ అంతా బాగానే వుంది బాబుగారూ… అమ్మగారు బాగానే ఉన్నారు. స్నానం చేయించి.. ఇప్పుడే కాఫీ ఇచ్చాను. ఇక వంట చెయ్యాలి. ఒకసారి ఫోన్ ఇవ్వనా.. బాబుగారూ.. అమ్మగారితో మాట్లాడతారా” అంటూ గట్టిగా మాట్లాడుతుంది.. ఫ్లోర్ అంతా వినిపించేలా.

అంటే, ముసలమ్మకి కాపలాగానూ … అన్నిటికీ ఈమెనే పెట్టారన్న మాట ఇంట్లో.

ఆండాళ్ళమ్మ గారికి ప్రతిదీ అంటూ.. సొంటే.

అపార్టుమెంటులో.. సెల్లార్లో ఫంక్షన్లు ఏమైనా జరిగితే చాలు.. అన్నిటికీ ఆమె ముందుండి పనులు అందిపుచ్చుకుని, మాలాంటి వాళ్ళని కాస్త దూరం పెడుతుంది.. అన్నీ తినేవాళ్లమని.

మరి మరియమ్మ ఎవరు? వాళ్ళకు ఏ విధంగా దగ్గర. కావాలనుకుంటే ఎవ్వరినైనా కలుపుకోగలరన్న మాట. ఎటు చూసినా వాళ్ళ కత్తికి రెండువైపులా పదునే. నాలుగునెలల క్రిందట జరిగిన విషయం లీలగా మెదిలింది నా మదిలో.

***

అది కార్తీకమాసం.. వనభోజనాలు.. ఉసిరిచెట్టు క్రింద సహపంక్తి భోజనాలు. అదో సంప్రదాయ౦..

అందులో భాగంగానే మా అపార్టుమెంటులో చివరి ఆదివారం మరెక్కడికో వెళ్ళకుండా ఇంటిలోనే భోజన కార్యక్రమ౦ ఏర్పాటు చేసారు.

కారణం.. అపార్టుమెంటులో నాటిన ఉసిరిచెట్టు.. పది సంవత్సరాల తరువాత ఈ ఏడాదే కాపుకు రావడ౦.

అపార్టుమెంటులో అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా బ్రాహ్మణులు. అసలు ఇంటి స్థలం ఇచ్చింది కూడా బ్రాహ్మణులే కావడంతో.. సర్వజన ఆమోదంగా విందులు అన్నీ శాఖాహార భోజనాలే ఉంటాయి ఎప్పుడూ.

ఆదివారం కూరగాయల భోజన౦ చెయ్యాలంటే చాలా మంది మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. మరో రోజైతే ఉద్యోగస్థులకు వీలుకాదు. కాబట్టి తప్పదు.. నలుగురితో నారాయణ.. కులంతో గోవింద.

విందులు.. వినోదాలకి ఎవ్వరూ వ్యతిరేకులు కాదు, కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొనేవారు.. ముఖ్యంగా ఆడవాళ్ళు.. ఆ రోజుకి ఇంట్లో వంట పని తప్పుతుందని.

‘కుంతీ మాధవ స్వామి కళ్యాణం’ నిమిత్తం ఈ ఆదివారం.. మన అపార్టుమెంటు సెల్లారులోనే వనభోజన కార్యక్రమం.. అందరూ రావలసిందని’ పిలుపులు వెళ్ళాయి.

చందా ఏమీ అడగలేదు. ఏదో విధంగా మేనేజ్ చేస్తే.. ఈ నెలలోనే డిసెంబర్ ముప్పై ఒకటి ఉంది.. కొత్త సంవత్సర ఆహ్వానానికి.. ఎలాగూ ‘కేక్’ కటింగు.. ఫంక్షన్ ఉంటు౦ది కాబట్టి.. అంతా కలిపి ఒకేసారి తీసుకోవచ్చని ప్లాన్.

ఆదివారం వంట పని లేదు లీజర్ గానే ఉండవచ్చు అనుకున్నా, ఇంట్లో పని తెమిలేసరికే టైము పన్నెండు అయ్యింది.

“క్రింద వంటలు చేస్తున్నారు.. అపుడే కందాబచ్చలి, గుత్తివంకాయ కూరా.. చేసేసారు. బూరెలు కూడా వేస్తున్నారు. ఓ సారి పోయి చూసి రా వచ్చు కదా!” అన్నారాయన అప్పుడే క్రిందనుంఛి వస్తూ, నేనేదో ఇంట్లో తీరికగా కూర్చున్నట్లు.

నేనూ అలాగే అనుకున్నా.. పనులన్నీ తెముల్చుకునే సరికి.. ఓపిక లేకుండా పోయింది.

రోజూ ఆఫీసు అంటూ బయటికి పోవడంతో.. శెలవు రోజు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అలా అని.. సరిగ్గా భోజనాల టైముకే క్రిందకి దిగితే ఏమనుకుంటారో! అన్న సందేహమూ.. పీడించి బయలుదేరాను.

వంటకి ఎలాగూ వంట బ్రాహ్మలు ఉంటారు. ఎప్పటి నుంచో వాళ్ళే వచ్చి చేస్తారు రావులపాలెం నుంచి వచ్చి. అవే వంటకాలు.. అవే రుచులు. అయినా ఎప్పటికప్పుడు బాగానే ఉంటాయి.

క్రిందకి వెళ్లేసరికి అప్పటికే చాలా మందే వచ్చి ఉన్నారు సుబ్బలక్ష్మిగారూ, మీనాక్షిగారు, వనజ, అనిత. కృష్ణగారు, సత్యనారాయణగారు ఇంకా.. ఇంకా చాలా మంది.

సెల్లార్ ముందు షామియానా వేసి, కుర్చీలు.. బల్లలు వేసి సిద్దం చేసారు. అందరూ కొత్త బట్టలు కట్టుకుని, పండుగ వాతావరణాన్ని తలపించేలా హడావుడి చేస్తున్నారు.. వండిన వంటకాలన్నీ ఓ ప్రక్కగా పేర్చబడి ఉన్నాయి.

నన్ను చూస్తూనే ఆండాళ్ళు గారు “మీ వారిని కూడా పిలిచేయ్యండి. వంటలు పూర్తి అయ్యాయి. అందరూ వస్తే వడ్డించేస్తాం” అన్నది.

ఆమె వైపు ఆశ్చర్యగా చూస్తూ “అప్పుడేనా! ఇంకా పన్నెండున్నర అవలేదు. అప్పుడే భోజనాలా. అయినా ఇందాకే టిఫెను పంపించారు కదా! ఇప్పుడే ఏం తినేస్తాం” అన్నా.

అక్కడే ఉండి ఏదైనా పని చేద్దాం అన్నా, ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూనే ఉన్నాయి. పైగా ఈవిడ లాంటి వాళ్ళకి చాదస్తం కూడాను. అందుకే అక్కడ ఉండి ‘ఏం చేస్తాము’లే అని పైకి వచ్చేసాను.

***

గంట తరువాత వెళితే భోజనాలు వడ్డించేస్తున్నారు. గేటుకి దగ్గరలో ఉన్న ఉసిరిచెట్టుకి పూజ చేసినట్లున్నారు.

చెట్టు మొదట్లో పసుపు, కుంకుమలు చల్లి, నైవేద్యం పెట్టబడి ఉంది. బహుశా శాస్త్రిగారి దంపతులు కళ్యాణం చేసి ఉంటారు. అన్ని పండుగాల్లోనూ వాళ్ళే ముందుంటారు. మొదటి పంక్తిలోనే భోజనాలకు కూర్చున్నారు. చాలా విస్తర్లు వడ్డించేసి ఉంటే.. నన్నూ కూర్చోమంటే, వెంటనే కూర్చున్నాను. వడ్డించేసినవి.. ఎక్కడ చల్లరిపోతాయో నని. నాకసలే వేడిగా తినే అలవాటు.

భోజనం చేస్తున్నంతసేపూ.. గోవింద నామస్మరణలతోనూ.. జోకులూ.. చమత్కారాలతో జరిగిపోయింది. బంతి మీదనుంచి లేస్తుంటే, శాస్త్రిగారు అన్నారు అందర్నీ ఉద్దేశించి “బోజనాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోతే కాదండోయ్! తరువాత వాళ్లకి వడ్డించాలి” అని.

నిజమే. అప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాను. ‘కాసేపు వుండి వడ్డించాలి’ అనుకున్నా.

మళ్ళీ మరో విడత విస్తర్లు వేస్తుంటే, అక్కడే ఉన్న ఆండాళ్ళుగారితో ‘మీరూ కూర్చో౦డి.. మేం వడ్డిస్తా౦’ అంటూ వంటకాలున్న ఓ బేసిన్ అందుకునే ప్రయత్నం చేశాను.

“మీరెందుకు… వడ్డించడానికి… మేం ఉన్నాంలే.. వెళ్లి కూర్చోండి” అంటూ ఖాళీగా ఉన్న కుర్చీల వైపు చెయ్యి చూపించిందావిడ.

‘మీరేందుకు నాన్ బ్రహ్మిన్స్.. మేమున్నాములే చూసుకోవడానికి’ అన్నగుడార్థం ధ్వనింపు.. కటువుగా, వాడిగా గుచ్చుకుంది నాకు. ఏం మాట్లాడలేకపోయాను.

అయినా నాకు కాస్త చెయ్యి నొప్పి. నేను తెలిసిన అందరికీ.. ఆ సంగతి తెలుసు. అందుకే, ఆవిడ అలా అని ఉంటుందిలే.. అని సరిపెట్టేసుకుని, ఆవిడ చెప్పినట్లే అక్కడే కూర్చుని.. ప్రక్కనున్న వాళ్లతో కబుర్లలో పడ్డాను.

నాలుగునెలల క్రిందట అద్దెకు వచ్చిన.. మా ఇంటి ముందు ఉన్న ఆచారిగారి భార్య.. అన్నీ తానై చక్కబెడుతుంటే.. పదేళ్లుగా ఉన్న.. స్వంత ఇంటిదాన్ని అస్తిత్వాన్ని కోల్పోయాననిపించింది.

అలా కొంతసేపు గడచిందో! లేదో!.. ఉన్నట్టుండి.. గట్టిగా, కేకలు వినిపించాయి. మొదట్లో.. ఏ తాతగారో పిల్లల మీద కేకలేస్తున్నారని అనుకున్నాం.

కానీ, ఆనందంలో.. అపశ్రుతి. అందరి దృష్టి అటువైపు మళ్ళింది.

నాకు ఎదురైన అనుభవమే.

అది ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. అది అంతటకూ ప్రాకింది. ‘నాన్ బ్రహ్మిన్స్’ ఎవరో వడ్డించడానికి వెళితే.. అదే మాట అన్నారట. అంతే.

పంక్తిలో చివర్న కూర్చున్న వెంకటరావుగారు పట్టుకున్నారు. “ఈ రోజు నాన్ బ్రహ్మిన్స్ వడ్డించ కూడదన్నారు. రేపటిరోజున మీరు వేరుగా.. మేము వేరుగా కూర్చోవాలని అంటారు. లేదంటే మీరు భోజనాలు చేసిన తరువాతే.. మేము చెయ్యాలని అంటారు.. మనసులో ఇలాంటి ఆలోచనలు.. ఉంచుకుని ఇలా విందు భోజనాలకి పిలిచి మమ్మల్ని అవమానించడమెందుకు? వదిలేస్తే మా మానాన మేం పోయేవాళ్ళం గదా” అంటూ కోపం తెచ్చుకున్నారు.

అతను బయటపడ్డారు. నేను కక్కలేక దిగమింగాను. ఎవ్వరూ ప్రతిఘటించకపోతే అది చేతకానితనమే అవుతుంది.

ఆ కోపంతో .. అతను ‘అ భోజనం’ గానే విస్తరి ముందు లేచిపోయారు.

ఇన్ని సంవత్సరాలూ లేని వైషమ్యాలు ఇప్పుడు దేనికీ? ఎన్నో వినాయక చవితులు, ఎన్నెన్నో ఫంక్షన్స్ కలిసి చేసుకున్నాం. ఇపుడు ఈ ముసలం ఎందుకు పుట్టిందో! ఎవరి వల్ల పుట్టిందో తెలియక పోయినా మూలకారణం ఆండాళ్ళు గారని.. నాలాంటివాళ్ళ అనుమానం. ఆమె మాటే చెల్లాలి అపార్టుమెంటులో.

ఇంట్లో ఉసిరిచెట్టు కాపు కాయడమేమిటి.. మా లాంటి వాళ్ళ మనసులు గాయపడడం ఏమిటి?

ఈ రోజు..

అత్తగారిని తమ కులం కాని మనిషిపై వదిలేసినప్పుడు అవేమీ గుర్తుకు రాలేదా?

అన్నీ ఆలోచిస్తే.. ఆవిడ కాశీ యాత్ర చెయ్యలేదేమో!

కొన్ని కావాలనుకుంటే.. కొన్ని వదులుకోవాలట.

ఆవిడ కాశీలో తొమ్మిది రాత్రుల నిద్ర చెయ్యాలనుకుంది. ఆ సంకల్పం నెరవేరడానికి.. వాళ్ళ ఆచార వ్యవహారాలైన .. ‘అంటూ.. మడి’ని పదేహేను రోజుల పాటు ప్రక్కన పెట్టింది.

ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంటుంది. మంచైనా.. చెడైనా. కట్టుబాట్లూ, ఆచార వ్యవహారాలు అన్నీ వీలైతేనే సుమా! కాకపోతే ఏమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here