ఏది కవిత్వం?

1
2

[27/4/24 న నవసాహితీ ఇంటర్ నేషనల్ (చెన్నై), పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో శ్రీ రోచిష్మాన్ చదివిన వ్యాసం.]

[dropcap]ఏ[/dropcap]ది కవిత్వం? ఈ ప్రశ్న, ఈ ప్రశ్నకు సరైన జవాబు లేదా జవాబులు మరే ఇతర భాషకన్నా తెలుగుకు ఇప్పుడు అత్యవసరం. ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగుకు ఈ ప్రశ్నల అవసరం ఇప్పుడు ఉన్నంతగా లేదు. ‘ఏదీ కవిత్వం?’ అంటూ వెతుక్కునే స్థితి పూర్తిగా రాక ముందే ఏది కవిత్వం? అన్న ప్రశ్నకు అభిప్రాయాలతో కాకుండా అవగాహనతో జవాబును లేదా జవాబుల్ని అవగతం చేసుకోవాలి.

కవిత మనిషితో పాటే పుట్టి ఉంటుంది. మనిషితో పాటే కవిత కదులుతూ వస్తోంది. మనిషి ఉన్నన్నాళ్లూ కవిత ఉంటుంది; ఉండాలి. ఆ కవిత లేకుండాపోయే స్థితిని తెలుగు మనిషి తెచ్చుకోకూడదు. కవితకు ఏన్నో నిర్వచనాలు, వివరణలు… ఇదుగో ఇదే అంటూ కవిత్వాన్ని నిర్వచించగలమా? కవిత్వం భాష పరమైన అభివ్యక్తి. వాక్యం ద్వారానే కవిత వ్యక్తీకరించబడుతుంది. అంతమాత్రాన వాక్యం కవిత్వం అయిపోతుందా? అవదు. “వాక్యం రసాత్మకం కావ్యం” అని లాక్షణికుడు విశ్వనాథ అన్నాడు. రసం అంటే ఏమిటి? అదీ అనిర్వచనీయమే. జగన్నాథ పండితుడు “రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం” అని అన్నాడు. ‘అర్థమూ, రసమూ కలిసి కదిలిన, మెదిలిన, నిలిచిన రచనలు కవితలయ్యయి’ అని అనుకోవచ్చు.

చెబుతున్న విషయం కవిత్వం అవదు. చెప్పబడుతున్న విధానం కవిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక రచనలోని శైలి, శిల్పం కవిత్వాన్ని సమర్పిస్తాయి. రచనా సంవిధానం కవిత్వాన్ని ప్రతిష్ఠిస్తుంది. “మనిషి మరణిస్తాడు” అని చెబితే అది కవిత్వం ఔతుందా? అవదు. మనిషి మరణిస్తాడు అన్న విషయాన్ని తమిళ్ష్ కవి కణ్ణదాసన్ ఇలా చెబుతాడు:

“ఆత్మ విడిచి పట్టేస్తుంది
శరీరం కృశించి పోతుంది
నిప్పు కాల్చేస్తుంది
ఉనికి శూన్యంలో ఉంటుంది”

మరో కవి మరోలా చెప్పచ్చు. చెప్పబడ్డ విధం లేదా రచనా సంవిధానం కవిత్వాన్ని నిర్ధారిస్తుంది.

“కవిత్వం ఒక శక్తివంతమైన భావానికి సహజమైన పొంగు. అది తన మూలాల్ని ప్రశాంతతలో స్మరించుకోబడిన రసావిష్కరణల నుంచి తీసుకుంటుంది” అని విలిఅమ్ వోడ్స్‌వత్ అన్నాడు. “కవి పని కొత్త రసాలను కనుక్కోవడం కాదు; ఉన్న వాటిని ఉపయోగించడమూ, ఆపై వాస్తవంలో లేనేలేని రసాలతో భావాల్ని వ్యక్తీకరించడానికి వాటిని కవిత్వంగా పనిచేయించడమే.” అని టి.ఎస్. ఇలిఅట్ అన్నాడు.

“శబ్దార్థాల సముచిత సహభావం ఉన్న విద్యే సాహిత్య విద్య” అని లాక్షణికుడు రాజశేఖరుడు అన్నాడు. “శబ్దార్థాలతో కూడింది కావ్యం” అని భామహుడు అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటివాళ్లు దీనికి నిలువెత్తు ఉదాహరణలు. వాళ్లు ఎలా శబ్దాలతో అర్థాలను సాధించారో చరిత్ర చూపించి చెప్పింది. “నేను నా బాధను వెలుగును చేస్తాను” అనీ, “నా విధి ప్రతిదానికీ మోసం చెయ్యలేదు” అనీ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న దాన్ని గమనించాలి. ఇక్కడ సరైన పదాలూ, భావాలూ అమరి మనకు కవిత్వాన్ని ఇచ్చాయి.

అరిస్టాట్ల్ కవిత్వం గురించి చెబుతూ “కవిత్వంలోని విషయం విశ్వ జనీనమై ఉండాలి కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతం కాకూడదు” అని అన్నాడు. మన తిక్కన తన భారత రచనను చేస్తున్నప్పుడు “ఆంధ్రావళి మోదమొంద రచియింతును” అని అన్నాడు. కవిత్వం అంటే ఒక వ్యక్తి తన పుర్రెలోని వెర్రినీ, తన వికారాన్నీ, తన మానసిక రోగాన్నీ వెళ్లగక్కుకోవడం కాదు. గోల చెయ్యడమూ, ఆర్తనాదాలు చెయ్యడమూ గానం అవనట్టే వికృతపు భావాలను వక్రమైన భాషతో వాంతి చెయ్యడం కవిత్వం అవదు. గానానికి శ్రుతి, తాళం ఉన్నట్టే కవిత్వానికి చింతనా సంస్కారమూ, సరైన భాషా ఉంటాయి. సంస్కారహీనమైంది కవిత్వం అవదు; కళ అవదు.

ఒక కావ్యం లేదా కవిత సకల కాలాలకూ చెందింది. షేక్స్‌పిఅ(ర్) గురించి చెబుతూ “షేక్స్‌పిఅ(ర్) ఒక కాలానికి చెందినవాడు కాడు; సర్వకాలాలకూ చెందినవాడు” అని జాన్‌సన్ అన్నాడు. జాన్‌సన్ మాటలు నిజం. షేక్స్‌పిఅ(ర్) రచనలు 400 ఏళ్ల తరువాత కూడా అత్యధిక ప్రజాదరణతో చలామణిలో ఉన్నాయి. వాల్మీకి, కాళిదాసులకు ప్రాచీనత్వం రాలేదు. వాళ్ల రచనలకు ప్రాంతీయత అంటుకోలేదు. వాళ్ల రచనలు కాలాల్నీ, దేశాల్నీ దాటి అంతర్జాతీయమయ్యాయి

లావొచు, జలాలుద్దీన్ రూమీ, షేక్స్‌పిఅ(ర్), ఖలీల్ జిబ్రాన్ ఈ నలుగురి కవిత్వం ఇవాళ అంతర్జాతీయంగా ఎక్కువగా చదవబడుతోంది. అంతర్జాలం వల్ల  ప్రపంచం మన అరచేతిలో కనిపిస్తోంది. కనిపించే దాన్ని మనం కళ్లు తెరుచుకుని చూడాలి, చదవాలి. అంతర్జాతీయంగా ఆదరించబడుతున్న కవిత్వం మనకూ తెలియవస్తుంది. తెలుగులో “కవిత్వం” అంటూ చలామణిలో ఉన్నది ఏదో, ఏపాటిదో మనకే తెలిసిపోతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కవిత్వంపై మనకు రావాల్సిన అవగాహన రావాలి.

1916లో ప్రముఖ ఇంగ్లిష్ కవి డబ్ల్యూ. బి. ఎయ్‌ట్స్ – ద ఆక్స్‌ఫడ్‌ బుక్ అవ్ మోడన్ వోస్ అన్న పేరుతో 1892-1935ల మధ్య వచ్చిన కొన్ని మంచి ఇంగ్లిష్ కవితల్ని ఒక సంకలనంగా ప్రకటించాడు. ఆ సంకలనంలో పెద్దగా ప్రచారంలో లేని భారతదేశపు కవి శ్రీ పురోహిత్ స్వామి రాసిన ఒక ఉర్దూ కవిత ఆంగ్లానువాదంగా చోటు చేసుకుంది. ఆ కవిత:

“నిజానికి ఒక అద్భుతం
నువ్వు సర్వ శక్తులకు ప్రభువువి
నేను కొంచం శక్తిని అడిగాను
నువ్వు నాకొక భిక్షపాత్రను ఇచ్చావు”

రచనా సంవిధానం ఈ నాలుగు పంక్తుల అభివ్యక్తిని అంతర్జాతీయ కవితగా నిలిపింది. 1,500యేళ్లకు ముందే తమిళ్ష్ కవి తిరువళ్లువర్ తన తిరుక్కురళ్‌లో ఒక చోట ఇలా అన్నాడు: “అడుక్కుంటూనే ప్రాణం బతకాలంటే ప్రపంచాన్ని రాసిన వాడే పెద్ద ఎత్తున చెడిపోవాలి”. ఆ తిరుక్కురళ్ తెలుగుతో పాటు 100 భాషల్లోకి అనువాదమైంది. మరో తమిళ్ష్ మహాకవి సుబ్రమణియ బారతి ఒక కవితలో

“ఆకాశమా, లేత ఎండా,
దట్టమైన వృక్షరాశీ,
మీరందరూ ఎడారి నీళ్లేమో?
వట్టి దృష్టి దోషాలేమో?” అని అన్నాడు.

అన్నమయ్య, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, ఉమర్ అలీ షాహ్ వంటి తెలుగు కవులు అంతర్జాతీయ స్థాయి కవులు. తెలుగులో ఇంక మంచి కవులు లేరని కాదు. మరెవ్వరూ మంచి కవిత్వం రాయలేదనీ కాదు. ఏ శిల్పంతో, ఏ చింతనతో,  ఏ విధమైన శబ్ద కూర్పుతో, ఏ తీరులో ఉన్న కవిత్వం ఇవాళ అంతర్జాతీయంగా ఎక్కువగా ఆదరించబడుతోందో ఆ శిల్పంతో, ఆ చింతనతో, ఆ విధమైన శబ్ద కూర్పుతో, ఆ తీరులో ఈ ఐదుగురూ కవులూ కవిత్వం రాశారు.

“మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుడుండేటి సరి భూమి యొకటే
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు ఎండొకటే”

అంటూ అన్నమయ్య ప్రదర్శించిన చింతన, శిల్పం ఉన్నతమైనవి. ఈ శిల్పం రూమీ, ఖలీల్ జిబ్రాన్‌లలో కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రాయడంవల్లే వేమన తెలుగు ఎల్లలు దాటి ప్రపంచంలోకి వెళ్లగలిగాడు. ప్రపంచంలో వాడుకలో ఉన్న పలు భాషల గురించి తెలియజేస్తూ ఇంగ్లిష్‌లో ద లేంగ్విజ్‌స్ అవ్ ద వోల్డ్ అన్న పుస్తకం వచ్చింది. 1977లో రూట్‌లెడ్జ్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అందులో తెలుగు గురించి తెలియజేస్తూ వేమన రాసిన సీస, కంద పద్యాలు రెండిటిని ఇచ్చారు. ఆ పద్యాలు:

చెవులు గోరును మంచి జిలిబిలి పాటల,
తియ్యని మాటల తెరగు వినగ
చర్మంబు గోరును సరవి తోడుత శీత
మృదుల సంస్పర్శ సంపదల నెపుడు
కన్నులు గోరును కమనీయ వర్ణంబు
లైనట్టి రూపంబులు నువు తోడ
నాలుక గోరును నయము తోడత తీపి,
యొగరు, కారమ్ము, చేదుప్పు, పులుసు

ముక్కు గోరును సద్గంధములను, జెఁలగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వ ముక్కు
నన్నియును గూడినటువంటి యిల్లు రోసి
తన్ను గనుగొని సుఖియింప దగును వేమ.

వేమనను తెలుగు కవితకు ప్రతీకగా గుర్తించారు వాళ్లు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 3 పద్యాల 12 పాదాల ‘నీవు-నేను’ ఆన్న కవిత ఒక అంతర్జాతీయ స్థాయి కవిత. అందులో “పొదలు పెనుచీకటిని కాంతిని వెదకికొందు” అని అనడం,  “బహుజన రక్త చిహ్నములందు నాది ఇదని గుర్తేమి కన్పడును సామీ” అని అనడం అంతర్జాతీయ స్థాయి. ఉన్నతమైన కవి దృష్టి , శిల్ప శీలత్వం ఉన్న కవి విశ్వనాథ. శ్రీశ్రీ రాసిన కవితా! ఓ కవితా!, జ్వాలాతోరణం, కేక, నీడలు, మానవుడా! వంటి కవితలు అంతర్జాతీయ స్థాయివి.  “అర్థమయింది, శబ్దంలో కాదు నిశ్శబ్దంలో రాగముందని” ఆనీ, “ఏ చీకటిలో నీ జీవకాంతుల బంధువులు స్పందిస్తున్నాయో?” అనీ, “ఎండలాంటి నా ఊహ శబ్దం మీద పడింది” అనీ అంటూ శేషేంద్రశర్మ అంతర్జాతీయతతో కవిత్వం చెప్పాడు. “ప్రొద్దు పొడిచే వేళ/ ప్రొద్దు కుంకే వేళ/ వద్దన్న రాగాలు వాలిపోతాయా?” అనీ, “ఊడల్లో ఉయ్యాల/ఊగుచుండే ఊసు/వాడల్లో చెప్పితే/ అర్థమవుతుందా?” అనీ, “ప్రాణములు నీదు పాదాల పైని విడిచి/ మట్టినై నీవు త్రొక్కెడి మార్గమందు/ నుండ నూహింతు జీవిత ముండు వరకు/ నేడ్చుచుందును నిన్ను వీక్షించు కొరకు” అనీ అంటూ ఉమర్ అలీ షాహ్ అంతర్జాతీయ కవిత్వం చెప్పాడు.

“మహోన్నతమైన మంచి, నీరు లాంటిది” అనీ, “తలపులు మెదడును బలహీన పరుస్తాయి” అనీ, “విజయం ఓటమి అంత అపాయకరమైంది” అనీ లావొచు అన్న తీరులోనూ, “నువ్వే పాట, వినాలనుకుంటున్న పాట” అనీ, “నేను కరుణా నిలయంలో ఉన్నాను, నా హృదయం ప్రార్థనాలయం” అనీ జలాలుద్దీన్ రూమీ అన్న తీరులోనూ, “అందం కరుణతో జీవిస్తూంటుంది” అనీ, షేక్స్‌పిఅ(ర్) అన్న తీరులోనూ, “నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు అనకూడదు, దేవుడు నా హృదయంలో ఉన్నాడని దానికి బదులుగా అను నేను దేవుడి హృదయంలో ఉన్నానని” అనీ, “నీకు తెలుసా? ప్రాణంలో ఒక అర్థముంది దాన్ని మరణం దాచలేదని” అనీ ఖలీల్ జిబ్రాన్ అన్న తీరులోనూ ఉన్న కవిత్వం ఇవాళ అంతర్జాతీయంగా విలసిల్లుతోంది. జ(ర్)మన్ కవి, రచయిత, తాత్త్వికుడు, విమర్శకుడు గ్యోఠ (Goethe) ఫార్శీ కవి హాఫిజ్‌ను యూరప్ కవులకన్నా గొప్ప కవి అని చెప్పాడు. హాఫిజ్‌ కవిత్వం ఎప్పటికీ గొప్ప కవిత్వంగా మెరుస్తూంటుంది. కవి రూద్‌కీ ఆదిగా వచ్చిన ప్రముఖమైన ఫార్శీ కవిత్వం కవిత్వం అన్నదానికి తార్కాణం.

కులం, మతం, ప్రాంతీయత, వర్గం, ముఠాలకు, వాదాలకు దూరంగా ఉన్నప్పుడే కవిత్వం కవిత్వమై ఉంటుంది. ఆశ్లీలానికీ, అసభ్యతకూ అతీతంగా ఉండడం కవిత్వానికి ఎంతో అవసరం. ఏ శిల్పం, ఏ రచనా సంవిధానం అంతర్జాతీయంగా కాలాలను గెలిచిన కవిత్వమయిందో తెలివిడితో తెలుసుకుని మెదడులోకి ఎక్కించుకుంటే ఏది కవిత్వం అన్న ప్రశ్నకు ఎవరికి వారు సరైన జవాబుల్ని అర్థం చేసుకుంటారు; అందువల్ల ‘ఏదీ కవిత్వం’ అని వెతుక్కునే స్థితి భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. తొలి ఇంగ్లిష్ కవి జెఫ్రీ చోసర్ “బంగారం తుప్పుపట్టిపోతే ఇనుము సంగతేమిటి?” అని అన్నాడు. బంగారం తుప్పుపట్టడంలా కవితే భ్రష్టుపట్టిపోతే ఎలా? కవిత భ్రష్టుపట్టకూడదు.

కల్మషానికి కవిత్వానికి, నసకు రసానికి, కక్కడానికి కనడానికి, చీల్చడానికి చెయ్యడానికి తేడా  ఉంటుంది. ఆ తేడా తెలిసిన కవి ఏది కవిత్వమో దాన్ని ఆవిష్కరిస్తాడు. తనలో అరగందేదో కవిత్వం అంటూ కవి చేస్తున్న‌ వాంతిలో బయటకు వస్తూండడంవల్ల ప్రజలకు రోత కలుగుతుంది; కలుగుతోంది. భ్రష్టత్వం కాదు శ్రేష్ఠత కావాలి అని, వక్రత్వం కాదు ఔన్నత్యం కావాలి అని కవి తెలుసుకుంటే ఏది కవిత్వమో అది ఉత్పన్నమౌతుంది. కవిత్వం నుంచి ప్రజ పారిపోతున్న స్థితి,  ప్రజ నుంచి కవిత్వం జారిపోతున్న స్థితి తెలుగులో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఏది కవిత్వం? అన్న ప్రశ్నకు “అదిగో తెలుగులో ఉందే అదీ కవిత్వం” అని ప్రపంచం నినదించే రోజు రావాలి. ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఆ రోజు వస్తుందని ఆశిద్దాం.

***

నిద్రలో మెలకువనూ, అస్తమనంలో ఉదయాన్నీ,
ఆవేదనలో ఆహ్లాదాన్నీ అందుకోవడం ఏమౌతుంది? కవిత్వం ఔతుంది‌.
మంచులో వేడినీ, చెట్టులో రక్తాన్నీ, మట్టిలో చెమటనూ తెలుసుకోవడం ఏమౌతుంది?
కవిత్వం ఔతుంది.

కాలం అనే ఆది లేని కనిపించని నది రూపులేని ఏ కడలిలో కలుస్తుందో? తెలియదు‌; అలా తుది ఉండని మొదలు కవిత్వం.
ఎవ్వరూ అడగని ప్రశ్నలకు ఎప్పుడూ వచ్చే జవాబుల లీల కవిత్వం.

భాషల పదాల‌, పదాల అర్థాల అల్లిక, ఎందరో చేస్తున్న ఎన్నో భావాల పూనిక కవిత్వం.
అన అన్నది లేని, అక్కఱలేని ప్రసారం‌, ఆపై
ఆమోదం అన్నది లేకున్నా అనబడుతూ సాగుతూండే ప్రభావం కవిత్వం.

వ్యక్తిత్వాతీత వ్యక్తీకరణ, శిల శిల్పం అయిన‌ స్థితి,
శిల్పం పరిమళించే పరిస్థితి, శైలీ హేలా వైశిష్ట్యం,
ధారగా సౌరు వచ్చే విశేషం, సంవిధానాత్మక సంవేదన కవిత్వం.

కనబడుతూ వినబడేది, వినబడుతూ కనబడేది కవిత్వం.

కవిత్వం తత్త్వం, కవిత్వం సత్వం; కవిత్వం సత్యం;
సత్యం కవిత్వం.

మనిషీ నువ్వు నీలో కవిత్వాన్ని నింపుకో;
మనిషీ, నువ్వు కవిత్వమైపో; మనిషీ , నువ్వు మనిషివి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here