[box type=’note’ fontsize=’16’] “విస్మృత కథకుడు – ఎదిరె చెన్నకేశవులు” అనే ఈ వ్యాసంలో చెన్నకేశవులు గారి ‘పొట్టకోసం’ కథా సంపుటిని పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]
[dropcap]1[/dropcap]918, ఆగష్టులో మహబూబ్‌నగర్‌లో జన్మించిన ఎదిరె చెన్నకేశవులు ఉన్నత విద్యాభ్యాసం వరకు అక్కడే చదువుకున్నారు. స్వయంకృషితో ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలతో గాఢ పరిచయాన్ని సంపాదించుకున్నారు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడుతున్న దినపత్రికలకు విలేఖరిగా పనిచేశారు.
గోపాల్‌పేట సంస్థానమున హరిజన పాఠశాలలో ఉపాధ్యాయ పదవిని నిర్వహించి, వారి అభ్యుదయానికై కృషి చేశారు. ఆంధ్ర సారశ్వత పరిషత్తు స్థానిక శాఖ కార్యదర్శిగా, ఆంధ్ర మహాసభ జిల్లా శాఖకు సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర గ్రంథాలయ సంఘ వ్యవస్థాపక కార్యదర్శిగా, హైదరాబాద్ కేంద్ర చేనేత సహకార సంఘానికి ముఖ్య నాయకులలో ఒకరుగా, సర్వోదయ కార్యకర్తగా అన్ని ప్రజా ఉద్యమాలలోనూ వివిధ దశలలో, వివిధ హోదాలలో పాల్గొని నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని ఎనలేని సేవలందించారు.
సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్వహిస్తూ వుండిన “గోలకొండ” ద్వైవార పత్రికలో కొన్ని రోజులు సహాయ సంపాదకులుగా పనిచేశారు. డెయిలీ న్యూస్, మిలాప్ పత్రికలకు ప్రతినిధిగా కూడా కొంత కాలం పనిచేశారు. నేత పత్రికా సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. “సమాచార సహకారం” మాస పత్రికాధిపతులు నిర్వహించిన సహకారోద్యమ వ్యాసాల పోటీలలో పాల్గొని వరుసగా మూడు సంవత్సరాలు బహుమతులందుకున్నారు. తర్వాత అదే పత్రికలో చేరి సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ ప్రతిపాదించిన చేనేత పదకోశానికి, ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు పర్యటించి శబ్ద సేకరణ చేశారు.
వీరి రచనల నుండి “అర్పణ” (గేయ సంపుటి), “అదృశ్య హస్తం” (అపరాధ పరిశోధన నవల), “పొట్టకోసం” (కథా సంపుటి) అనే గ్రంథాలు వెలువడినాయి. ఇవే కాకుండా రానున్న ప్రచురణలుగా “అందరి గొడవ” (గేయ సంపుటి), “సహకార సహజీవనం” (వ్యాస సంపుటి), “చేనేత ప్రముఖులు” (జీవిత చరిత్రలు), “పఠిత” (నవల) పేర్కొన్నారు. కాని అవి వచ్చాయా లేదా అన్న సంగతి ఖచ్చితంగా నిర్ధారించలేకున్నాము. ప్రచురింపబడిన వాటిలో “అర్పణ” అనే గేయ సంపుటి శ్రీ సత్యసాయిబాబా ప్రశంసకు సంబంధించినది. “డిటెక్టివ్ మోహన్” పేరుతో రాసిన అపరాధ పరిశోధన నవల “అదృశ్య హస్తం” పేరిట 1969లో వెలువడింది. అప్పట్లో వస్తున్న డిటెక్టివ్ నవలలతో పోల్చుకుని చూస్తే, ఇది ఔత్సాహిక స్థాయిలోనే ఉన్నదని చెప్పాలి. ఇక 1968లో వెలువరించిన “పొట్టకోసం” కథా సంపుటిలో పది కథలున్నాయి. ఇందులో దారిద్ర్యంతో పాటు కూలీలు – చిరుద్యోగుల జీవన పోరాటాన్ని చిత్రీకరించిన కథలున్నాయి. ధనవంతుల విలాసాలు – అహంకారాన్ని వివరించే కథలున్నాయి. విఫల ప్రేమను, లోకరీతిని తెలియజేసే కథలు కూడా వున్నాయి.
ప్రపంచంలో “పొట్టకోసం” ఎవరెవరు ఏ ఏ పాట్లు పడతారో ఎవరికెరుక? ఎందరో అమ్మాయిలు పొట్టకోసం అనీ, డబ్బు సంపాదనకై తమ మానాలను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఈ టైటిల్ కథ తెలియజేస్తుంది. రోడ్లు వేసే కూలీ గ్యాంగులో చేరుతారు వెంకన్న దంపతులు. ఒకరోజు వెంకన్న చలిజ్వరంతో మంచం పట్టగా, కూలీ కోసం మేస్త్రీ దగ్గరకి వెళ్ళిన లక్ష్మిని, ఆ మేస్త్రీ బలాత్కరిస్తాడు. అవమానం భరించలేక లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటుంది. వెంకన్న తన మీద ప్రతీకారం తీర్చుకోనున్నాడని తెలిసిన మేస్త్రీ, ఆ రాత్రి తన మనుషులతో వచ్చి వెంకన్న గుడిసెకు నిప్పు పెడతాడు. దాంతో పిచ్చి పట్టిన వెంకన్న దేశాలు పట్టిపోతాడు. కూలినాలి చేసి బతుకుదామనుకుంటే, వాళ్ళని బతకనీయకుండా చేసే యజమానుల దౌర్జన్యాలను ఈ “కూలీ వెంకన్న” కథ వివరిస్తుంది.
పండగ పూట కూడా కడుపు నింపుకోలేని చిరుద్యోగుల జీవితాలను “ఉగాది“లో చూడవచ్చు. ప్రతి ఉద్యోగికి మొదటి తేదీ వస్తుందనగానే ఒక దిక్కు నుండి ఆశ, రెండో దిక్కు నుంచి నిరాశ ఆవరిస్తుంది. ఆశ ఎందుకంటే నెల రోజులు చెమటోడ్చి కష్టించిన దానికి ప్రతిఫలంగా డబ్బు లభిస్తుంది. వచ్చిన ఆ డబ్బు ఎక్కడికక్కడి అవసరాలకు, అప్పులకి పోను మరుసటి రోజు నుంచి వచ్చే ఆర్థిక చిక్కులకు తట్టుకోలేక, అప్పుల వేటకు బయలుదేరక తప్పని పరిస్థితులు, ఎందుకీ మొదటి తేదీ వచ్చిందిరా దేవుడా అని నిరాశతో వాపోయే ఉద్యోగ జీవితాలు “మొదటితేదీ“లో కనిపిస్తాయి.
కార్మిక సంఘ కార్యదర్శత్వం వదులుకోనందుకు యాజమాన్యవర్గం రామును డిస్మిస్ చేస్తుంది. రాముకు అండగా కార్మికులు సమ్మె చేయబోగా, పోలీసులు రామును అరెస్ట్ చేసి జైలులో వేస్తారు. సమ్మెకు జడిసిన అధికారులు రామును విడిచిపెట్టడంతో “కార్మికులదే గెలుపు” అవుతుంది. అప్పుడు తమ హక్కుల కోసం నిజమైన పోరాటం ప్రారంభమవుతుంది.
“ప్రతిఫలం” కథలో, ధనమదంతో అహంకరించిన మామగారు ఒక బిచ్చగాడి మరణానికి కారకుడవుతాడు. వాడి ఉసురు వల్లనే తన కొడుకు పాము కరిచి చనిపోయాడని భావించిన మామగారు, తన ఆస్తిని ప్రజోపయోగ చర్యలకు వినియోగించడానికి నిశ్చయించుకుంటాడు. పాపభీతియే అతనిలోని మార్పుకు కారణమని మనం గుర్తించవచ్చు. గొప్ప వారికి స్నేహం ఒక కాలక్షేపం. బీదవాళ్ళకు మైత్రి అంతే అనుబంధం, ఆప్యాయతలు. గొప్పింటి లీలకు, బీదింటి లలితకు ఏర్పడిన స్నేహం అపార్థాలు, అవమానాలు దాటుకుని తిరిగి వాళ్ళని ఒకటిగా చేస్తుందని “సహవాసం” కథలో తెలియజేస్తారు.
చాలీచాలని జీతంతో గడిపే డేవిడ్‌ను, అతని భార్య మేరీ తన విలాసాల ఖర్చు కోసం ఎప్పుడూ ఏడిపిస్తూ వుంటుంది. ఒక ధనవంతుల పార్టీకి వెళ్ళాల్సివచ్చినప్పుడు, ఆమె మెడలో వేసుకోడానికి నెక్లెస్ కావాలని పోరుపెడితే, తన యజమానురాలి దగ్గర అరువు తీసుకుని వస్తాడు డేవిడ్. వారు పార్టీ నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె మెడలో నెక్లెస్ కనిపించదు. అది తిరిగి ఇవ్వకపోతే ఉద్యోగం పోతుంది. పైగా పోలీసులకి పట్టిస్తుందని భయపడిన డేవిడ్ తన ఇల్లు అమ్మి, ప్రావిడెంట్ ఫండ్ తీసుకుని, స్నేహితుల వద్ద అప్పు చేసి అదే రకమైన నెక్లెసును కొని ఆమెకి అందచేస్తాడు. అప్పులు తీర్చడానికి వారు అమిత పొదుపు చేస్తూ బతుకుతుంటారు. అప్పుడు మేరీని చూసి పోలిక పట్టలేక యజమానురాలు ప్రశ్నిస్తుంది. జరిగిన కథ విన్న యజమానురాలు, ఆ నెక్లెసు నకిలీ రాళ్ళది, అయిదు వందల రూపాయల నగ కోసం, అయిదు వేలు ఖర్చుపెట్టి దివాళా తీస్తారా? అని ఆమెని ఓదారుస్తుంది. ధనవంతులను అనుకరించాలని చూసే మేరీలాంటి వాళ్ళకు ఇదొక చక్కని “గుణపాఠం“. మొత్తానికి మేరీకి అలా నిరాడంబర జీవితం అలవడుతుంది.
“నీ కోసం” కథలో తండ్రిని కోల్పోయి మేనమామ పంచన చేరిన కిశోర్, మేనమామ కూతురు పద్మ బాల్యం నుండే అన్యోన్యంగా పెరిగి ప్రేమికులవుతారు. పద్మకు బలవంతంగా వేరే పెళ్ళి చేయడంతో ఆమె మనోవ్యాధితో మంచం పడుతుంది. ఆమె అవసాన దశలో, ఆజన్మబ్రహ్మచారిగా మిగిలిపోయిన కిశోర్‌ను పెళ్ళి చేసుకోమని కోరి చనిపోతుంది. ఆమె కోరిక మేరకు పెళ్ళి చేసుకున్న కిశోర్ తన కూతురుకు పద్మ పేరే పెట్టుకుని, ఆమె జ్ఞాపకాలలోనే మునిగితేలుతుంటాడు. ఇంకో కథలో నటిగా, గాయనిగా ప్రసిద్ధి చెందిన రూప వేషధారణలో, ప్రవర్తనలో ఆధునికంగా ప్రవర్తిస్తూ వుంటుంది. ఆమె కలివిడితనాన్ని అపార్థం చేసుకున్న మగాళ్ళు ఆమెను లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలమవుతుంటారు. అలా, అవమానింపబడిన ఒక మేకప్‌మాన్, ఆమె ఒక వేశ్య అని దుష్ప్రచారం చేయడంతో అది అంతటా పాకిపోతుంది. తనకు మంచి మిత్రుడు, తాను ఎంతగానో అభిమానించే శంకర్‌ను పెళ్ళిచేసుకుందామని ప్రస్తావన తెస్తే, అతడు ఆమె శీలాన్ని శంకించడంతో, ఆమెకు దిమ్మ తిరిగిపోతుంది. చివరకు తమ మీద వచ్చిన పుకార్లను నిజం చేయడానికే నిశ్చయించుకుంటుందా? లేక తన వెంటబడిన యువకుడినే పెళ్ళి చేసుకుంటుందా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పని రచయిత ఆ “పర్యవసానాన్ని” మన ఊహకే వదిలేస్తాడు.
సాదాసీదా కథాకథనాలతో కూడుకుని వున్న ఈ కథలలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమీ లేదు. 1960 దశకంలో వచ్చిన ఈ కథలను ఇప్పటి కథలతో పోల్చుకుని చూస్తే అవుట్‌డేటెడ్ అనే చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ సంపుటిలో వైవిధ్యభరితంగా వున్న “గుణపాఠం” అనే ఒకే ఒక్క కథ, ఎప్పటికీ నిలిచిపోతుంది.ఇదే ఇతివృత్తంతో తర్వాతి కాలంలో కొన్ని కథలు రావడం విశేషం. ఎదిరె చెన్నకేశవులు రచనలు ఎక్కడా ప్రచారానికి నోచుకోకపోవడం వల్ల అప్పటికీ, ఇప్పటికీ వారు విస్మృత రచయితగానే మిగిలిపోయారు.