[dropcap]అం[/dropcap]దరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం సాధించి 75 ఏళ్ళయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశమంతా సంవత్సరం పాటు సంబరాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తదనుగుణంగా ఈ సంవత్సరం పాటూ పలు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దేశంలో ఒక విచిత్రమయిన పరిస్థితి నెలకొంది. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటినుంచీ ఆయన ప్రతి చర్యను వెక్కిరించి, అవహేళన చేసి, దాన్లో తప్పులు వెతికి ఆయనకు పాలనార్హత లేదని, పరిపాలన రాదని నిరూపించాలన్న ప్రతిపక్షాల ప్రవర్తన ఏ స్థాయికి చేరిందంటే చివరికి జెండా ఎగరేయమన్నా అదొక వివాదాస్పదమయిన చర్యగా మారింది. ఇలాంటి పరిస్థితి బహుశా ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ కనబడదు. ఇది కేవలం భారతదేశానికే ప్రత్యేకం.
దేశాన్ని తక్కువ చేయటం, సైన్యాన్ని విమర్శించటం వంటివన్నీ గొప్ప చర్యలుగా, అలా చేసేవాళ్ళే మేధావులుగా, తెలివైనవాళ్ళుగా భావించుకుంటూ ఇతరులంతా పనికిరానివారన్నట్టు, వారికేమీ తెలియదన్నట్టు తమని తాము ఒక పీఠంపై ఊహించుకుంటున్నట్టున్న వీరి ప్రవర్తన, ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకపోగా, అసలు వారికి అభిప్రాయాలు ప్రకటించే హక్కే లేదన్నట్టు ప్రవర్తిస్తూ వారి అభిప్రాయాలను వినే సహనాన్ని కూడా చూపకపోవటం కనిపిస్తుంది. రాజకీయాల్లోని ఇలాంటి ప్రవర్తన సాహిత్య ప్రపంచంలో కూడా కనిపిస్తోంది.
తెలుగులో ‘దేశభక్తి కథల’ సంకలనం ఒకటే వుంది. కానీ, స్వాతంత్ర్యపు అమృతోత్సవాలలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినా ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ఈ ‘దేశభక్తి కథల’ సంకలనం ప్రస్తావన కానీ, దేశభక్తి అంటే ఏమిటన్న చర్చకానీ లేదు. దీనికితోడు, ఈ సందర్భంగా జరిగిన అన్ని కార్యక్రమాలలో దేశం గురించి, దేశ స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడినవారంతా అవకాశం దొరకగానే దేశాన్ని, దేశభక్తిని, దేశంలోని వ్యవస్థలను విమర్శించేవారే, భారతదేశాన్ని బలహీనపరచి, వ్యవస్థను కూలద్రోయాలని పరితపించేవారే అవటం తెలుగు సాహిత్య ప్రపంచం ఏ స్థాయిలో సాహిత్య మాఫియా ముఠాల గుప్పిట్లో, ఇజాల భావజాలాల వలల్లో చిక్కుకున్నదో స్పష్టం చేస్తుంది.
ఇటీవలే, సంచిక టీమ్‌లో ఒకరయిన కస్తూరి మురళీకృష్ణ ఒక టీవీ చర్చలో పాల్గొన్నప్పుడు జరిగిన అనుభవం సాహిత్య ప్రపంచంలోని సంకుచితత్వాన్ని, వివక్షతనూ మరింత స్పష్టం చేస్తుంది. ఆ చర్చలో దేశ ఔన్నత్యాన్ని వివరిస్తూ, జాతీయ భావన స్వరూపాన్ని తెలియచెప్తూంటే, మాట పూర్తికాకముందే మరొకరిని ప్రశ్న అడిగి యాంకర్ చర్చలో తాను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకమయిన వాదనను వినలేని అసహనం ప్రదర్శించారు. టీవీ వేదిక మర్యాదను పాటిస్తూ మౌనంగా వుండాల్సివచ్చింది కానీ, ఎదుటి వ్యక్తికి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు వుందన్న మౌలిక విచక్షణను ప్రదర్శించని అసహనం రాజకీయాలలోనే కాదు, సాహిత్య ప్రపంచంలో కూడా ఏ స్థాయిలో నెలకొని వుందో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ ఆలోచనల వేదికగా, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచే మాధ్యమంగా ‘సంచిక’ తెలుగు సాహిత్య ప్రపంచంలో పోషిస్తున్న విశిష్టమయిన పాత్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాల్సివుంటుంది. అలాంటి విశిష్టమయిన పాత్రను అర్థవంతంగా సమర్థవంతంగా పోషించటంలో భాగంగా, ఆగస్ట్ 15, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘దేశభక్తి కథల’ ప్రత్యేక సంచికను ‘సంచిక’ వెలువరిస్తోంది. అడిగిన వెంటనే ‘దేశభక్తి కథల’ పుస్తకంపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా అందించిన రచయితలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తోంది ‘సంచిక’.
అలాగే, అమృతోత్సవం సందర్భంగా కోడీహళ్ళి మురళీమోహన్ 100 కవుల పద్యాలతో వెలువరించిన ముక్తపదగ్రస్త పద్య సంకలనం సమీక్ష కూడా ఈ ప్రత్యేక సంచికలో ప్రచురిమవుతోంది.
తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక చక్కని ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించే సహృదయం లేదు. వ్యవస్థ లేదు. ఒక చక్కని రచనను గుర్తించి పాఠకులకు చేరవేసే పద్ధతి లేదు. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ‘సంచిక’ ప్రయత్నిస్తోంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయితలు సృజిస్తున్న విశిష్టమయిన రచనలను పాఠకులకు చేరువ చేయాలని ‘సంచిక’ ప్రయత్నిస్తోంది. ఇందుకు ఉత్తమ సాహిత్యాభిలాషుల సహాయ సహకారాలు సలహాలను ‘సంచిక’ ఆహ్వానిస్తోంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళయిన సందర్భంగా అందరమూ చేతులు కలిపి తెలుగు సాహిత్యాన్ని మాఫియా ముఠాల ఉక్కు పిడికిళ్ళ నుంచి, ఇజాల సంకుచితాల నుంచి విముక్తం కావించేందుకు నడుము బిగించాలని ‘సంచిక’ అభ్యర్ధిస్తోంది. ఉత్తమ సాహిత్యాన్ని సృజించటం, పాఠకులకు చేరువ చేయటాన్ని ఒక ఉద్యమంలా చేపట్టితేకానీ, తెలుగు సాహిత్యానికి స్వాతంత్రం లభించదు. ఈ సందర్భంగా హిందీ కవి నీరజ్ చేసిన సూచన, ‘ఏది ఎలా రాయాలనుకుంటే అలా రాయండి. కానీ, సాహిత్యంలోకి వాదాల వివాదాలు, ఇజాల బూజులను తేకండి’ అన్నదాన్ని గుర్తుచేసుకోవాల్సి వుంటుంది.
15 ఆగస్టు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
పుస్తకాలు:
- భరతమాతకు పద్యమణిహారం – పాణ్యం దత్తశర్మ
- దేశభక్తి గుబాళింపజేసే కథలు – వేదాంతం శ్రీపతిశర్మ
- ‘దేశభక్తి కథలు’ పుస్తకం ముందుమాట – సంచిక టీమ్
- నిరుపమాన దేశభక్తి కథల సమాహారం – ఎన్.కె. బాబు
- ఏది దేశభక్తి? – పుస్తక సమీక్ష – కోవెల సంతోష్‌కుమార్
- భావి తరాలకు స్ఫూర్తిదాయకం – పుస్తక సమీక్ష – ఎన్.వి. హనుమంతరావు
కవితలు:
- జాతీయ వేడుక – సాదనాల వేంకటస్వామి నాయుడు
- రెపరెపలాడే జెండా – వెల్మజాల నర్సింహ
- స్వతంత్ర్యం వచ్చింది – శంకరప్రసాద్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.