సంపాదకీయం ఏప్రిల్ 2022

0
2

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, సాహిత్యాభిమానులకు తెలుగు నూతన సంవత్సరారంభమయిన యుగాది శుభాకాంక్షలు. సంచిక 2018లో యుగాది రోజున ప్రారంభమయింది. అంటే, సంచిక వెబ్ పత్రిక ఆరంభమయి నాలుగేళ్ళు పూర్తయినాయన్నమాట. ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే, తెలుగు సాహిత్యంపై, నాలుగేళ్ళలో సంచిక తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసిందన్నది స్పష్టమవుతుంది. కొత్త రచయితలు, యువ రచయితలు తమ తమ విశిష్టమయిన రచనలతో ముందుకు వస్తున్నారు. తెలుగులో సీరియల్ నవలలు చదవటం తగ్గింది అన్న మాటపోయి, సంచికలో సీరియల్స్ చాలాబాగున్నయని అనటమే కాదు, సీరియళ్ళను ఆదరించటమూ పెరిగింది. కశ్మీర రాజతరంగిణి వంటి చరిత్ర రచనలు, జ్ఞాపకాల తరంగిణి, జ్ఞాపకాల పందిరి వంటి ఫీచర్లు, కొరియానం, మదురమైన బాధ వంటి సినిమా ఫీచర్లు, లతా మంగేష్కర్ మరణం తరువాత, ఇంతవరకూ ఏ తెలుగు మీడియాకానీ, పత్రికకానీ లత గురించి చెప్పని విషయాలు, లోతయిన పరిశీలన, పరిశోధనలతో లత జీవిత చరిత్ర రచన… ఇలా, ప్రతి ఒక్క పాఠకుడికి ఏదో ఒక రచన వుండేట్టు, అందరికీ అన్నీ అన్న ఆలోచనతో పాఠకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది సంచిక.

మనస్సాక్షిలేని పెద్ద పత్రికలకు భిన్నంగా, సంచిక ఉత్తమ జర్నలిజం ప్రామాణికాలను, ఉన్నత నైతిక విలువలనూ పాటిస్తూ భావి తరాలముందు ఉత్తమ ప్రామాణికాలను, ఉన్నత ఆదర్శాలనూ నిలపాలని అహరహం తపిస్తుంది. అందుకే, సంచికలో ప్రతి రచనకూ ఆధారాలుంటాయి. ధృవీకృతమయిన సత్యాల ఆధారంగానే సంచికలో రచనలు ప్రచురితమవుతాయి. తాము ఊహించిందే నిజమని అవాకులు చవాకులు రాసేసే జర్నలిజానికి సంచిక దూరం. అలాంటి జర్నలిజాన్ని సంచిక సమర్థించదు. ఎంతటి పెద్ద పత్రికలోనయినా, ఎంత సీనియర్ జర్నలిస్టయినా అలా ఊహలను నిజాలుగా ప్రకటించి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే, తన స్థాయిలో పాఠకులకు నిజానిజాలు వివరించాలని సంచిక ప్రయత్నిస్తుంది.

ఉత్తమ ప్రామాణికాలను నిలపాలన్న ఉద్దేశం సంచిక రచనల పోటీలు నిర్వహించటంలోనూ కనిపిస్తుంది. ఉగాది కవితల పోటీ ఫలితాలను ఉగాదికి వెల్లడించటమే కాదు, ఆరోజు ఫలితాలు వెలువడే సమయానికి రచయితలకు బహుమతి సొమ్ము కూడా అందేట్టు చూస్తోంది సంచిక. రచనల ఎంపికలో వీలయినంత పారదర్శకతను పాటిస్తోంది. అయితే, బహుమతికి ఎంపికయిన రచనలే ఉత్తమమయినవన్న దురాలోచన సంచికకు లేదు. ఎంపిక కాని రచనలు సంచిక నిర్ణయించుకున్న ప్రామాణికాలలో ఒదగలేదు. అంతేతప్ప ఎంపిక కాకపోవటానికీ, రచనల నాణ్యతకూ ఎలాంటి సంబంధంలేదు.

సంచిక 2022 కథలపోటీ కూడా నిర్వహించింది. అయితే, కథలపోటీ న్యాయనిర్ణేతలు, కథలను పరిశీలించేందుకు మరికాస్త సమయం అడిగారు. దాదాపుగా 20 బహుమతులను నిర్ణయించాల్సి రావటంతో, వారి కోరికను మన్నించి కథల పోటీ ఫలితాలను రామనవమి రోజు ప్రకటించాలని సంచిక నిర్ణయించింది.

రామనవమి తరువాత వచ్చే ఆదివారం వెలువడే సంచికలో సరికొత్త ప్రకటన కథల పోటీ గురించి వుంటుంది.

సంచిక కవితలు కథల పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు. సంచికను ఇలాగే ఆదరిస్తారని, మీరు ఆదరించటమేకాదు, ఇతరులకు కూడా సంచికను పరిచయంచేస్తూ సంచిక విస్తృతిని పెంచటంలో తోడ్పడతారనీ సంచిక ఆశిస్తోంది. రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ సంచిక ముందుకు సాగుతుంది. ఇందులో, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను సంచిక అభ్యర్థిస్తోంది.

~

సంచికలో 1 ఏప్రిల్ 2022 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

  • డా. అమృతలత అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • సాహిత్యచరిత్రను దారికితెచ్చిన దర్శనం – డా. ముదిగొండ వీరభద్రయ్య

కాలమ్స్:

  • రంగుల హేల 49: క్షమించండి… కానీ మర్చిపోకండి. – అల్లూరి గౌరిలక్ష్మి
  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో… – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- ఏప్రిల్ 2022- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -25 – ఆర్. లక్ష్మి

కథలు:

  • రెండు డిగ్రీలు – డా. మధు చిత్తర్వు
  • జీవన పరిమళం – బోరి మురళీధర్
  • ఏది ఎంత వరకు – గంగాధర్ వడ్లమాన్నాటి
  • నాన్న గతం – తెలికిచెర్ల విజయలక్ష్మి

కవితలు:

  • అతడు – ఆమె – శ్రీధర్ చౌడారపు
  • కొత్త రంగు – డా. విజయ్ కోగంటి

బాలసంచిక:

  • ఆకలి పిశాచం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

ప్రయాణం:

  • కర్ణాటక సాంస్కృతిక రాజధాని – మైసూరు – డా. కందేపి రాణీప్రసాద్

పుస్తకాలు:

  • ఆసక్తిదాయక వ్యాసాల ‘పడమటి రాగం’ – పుస్తక పరిచయం – సంచిక టీమ్

భక్తి:

  • మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం – మావూరు విజయలక్ష్మి

అవీ ఇవీ:

  • పురాణ పురుషుడు ‘ఇంద్రద్యుమ్నుడు’ – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 9 – భాగవతార్థ కల్ప తరువు – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం – అనూరాధ నాదెళ్ళ
  • రమ్యభారతి లఘు కవితల పోటీ 2022 ఫలితాలు ప్రకటన – చలపాక ప్రకాష్

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here