[dropcap]ఆ[/dropcap]గస్ట్ నెల ఆకాశం మేఘావృత్తమై వుండి చిరు జల్లులతో ఆరంభమవుతోంది. మామూలుగా అయితే అత్యంత ఆహ్లాదకరమయిన వాతావరణం. కానీ, వెంటవెంటనే సాహితీ ప్రపంచం ప్రముఖ సాహితీవేత్తలను కోల్పోవటంతో మనసు దిగులుగా బాధతో వుండటంతో వాతావరణం ఆహ్లాదంగా వున్నా మేఘాలు నిండిన ఆకాశం బాధతో నిండిన హృదయంలా, వర్షం, పొంగి పొర్లుతున్న విషాదంలా తోస్తున్నాయి. అబ్బూరి చాయాదేవి, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, కేబీ లక్ష్మి వంటి సాహితీ దిగ్గజాలు వెంటవెంటనే నిష్క్రమించటం అత్యంత బాధాకరమైన విషయం. ముఖ్యంగా వీరు ఇంకా చురుకుగా వుంటూ చివరి క్షణం వరకూ సాహిత్య సృజన చేస్తూన్నవారు కావటం వల్ల వారి నిష్క్రమణం మరింతగా బాధిస్తోంది. ఒక కళాకారుడి మరణం అతడి సృజనాత్మక స్రవంతి ఇంకిపోవటమే అంటాడో కవి. ఆతరువాత అతని శరీరం భౌతికంగా అదృశ్యమవటం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, ఇంకా చురుకుగా సృజిస్తున్న కళాకారులు హఠాత్తుగా కనుమరుగవటం జీర్ణించుకోలేని చేదు నిజం… బాధించే పరిణామం. కేబీ లక్ష్మి గారు సాహిత్య సభల్లో చురుకుగా పాల్గొంటూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో స్నేహసుమాలను పంచుకుంటూ, అనుబంధాలను పెంచుకుంటూ నడుస్తున్నవారు. “ఏమి? మీ సంచికకు మా రచనలు సరిపోవా? నేను కాలమ్ రాస్తాను.. ఎలా వెయ్యవో చూస్తాను???” అని అల్టిమేటం ఇచ్చి రైలు ఎక్కిన మనిషి మరణవార్త దిగ్భ్రాంతి కలిగించింది. కేబీ లక్ష్మి గారి ఆత్మకు శాంతి కలగాలని సంచిక మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తోంది.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారితో సంచిక అనుబంధం అక్షరాలలో పెట్టగలిగేది కాదు. సంచిక ఆరంభం నుంచీ ఎలాంటి రచనకోసం వెతుకుతోందో, అలాంటి రచనను చేసి, మొత్తం స్క్రిప్టును సంచికకు అందించారు. ఇంతకీ, వారు స్క్రిప్ట్ ఇచ్చేవరకూ సంచిక ఎలాంటి రచన కోసం తపిస్తోందో వారికీ తెలియదు. తన కోసం రాసుకున్నది ఆయన సంచిక కోసం, సాహిత్యాభిమానులకోసం అందించారు. సాహిత్య ప్రపంచంలో పాండిత్యం అంటే, వందిమాగధ భజన బృందాల కేకలు భీకర బాకాలు మాత్రమే అని స్థిరపడుతున్న సమయంలో ఇలాంటి అసలయిన పండితులు నిష్క్రమించటం అత్యంత బాధాకరమయిన విషయం. ముద్రారాక్షసం పూర్తయ్యేలోగా మరిన్ని సంస్కృత కావ్యాల ప్రతిపదార్ధతాత్పర్యాలు వ్యాఖ్యాన సహితంగా తయారుచేసిస్తానని చెప్పిన ఆయన ఇలా హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు ప్రయాణమవటం తెలుగు సాహిత్యప్రపంచానికి తీరనిలోటు అని చెప్పటం ముంజేతి కంకణానికి అద్దం చూపినట్టే అవుతుంది. ఆయన మరణం సంచిక లక్ష్యసాధనను కఠినతరం చేసే అంశం అనటం చేదు నిజం. ఎందుకంటే, ప్రస్తుతం, మన ప్రాచీన వాఙ్మయాన్ని ప్రతిపదార్ధతాత్పర్యవ్యాఖ్యాన సహితంగా సరళంగా అందించాల్సిన ఆవశ్యకత వుంది. ఇది కేవల సాహిత్య సంబంధి మాత్రమో సామాజిక బాధ్యతనో మాత్రమేకాదు. ఇది ఒక ధార్మిక బాధ్యతకూడా.. ఈ బాధ్యత స్వరూపాన్ని అవగతం చేసుకుని అంత సమర్ధంగా, నిజాయితీ చిత్తశుద్ధిలతో నిర్వహించేవారు మరొకరు దొరకటం దుర్లభం… ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి హఠాన్మరణానికి సంతాపం వ్యక్తపరుస్తూ, అలాంటి సృజనశీలి, పాండిత్యంతోపాటూ సహృదయం కలిగిన రచయిత సంచికకు లభించాలని సరస్వతీదేవిని ముకుళిత హస్తాలతో అవనత శిరస్సుతో సంచిక ప్రార్థిస్తోంది. ఆత్మీయుల మరణం దుఖదాయకం. కానీ, కాలం ఎవరికోసం ఆగదు. బ్రతికివున్నవారు వందేళ్ళు జీవిస్తామనుకుని, కన్నీళ్ళు దిగమింగుకుని ముందుకు సాగటం తప్పని సరి. చెరిగిన కలను వదలి కొత్త కలలతో ముందుకు సాగిపోక తప్పదు. అందుకే, కన్నీళ్ళతో ఆత్మీయులకు వీడ్కోళ్ళు పలుకుతూ, భవిష్యత్తుపై ఆశతో, భవిష్యత్తరాల పట్ల వున్న బాధ్యతను గుర్తుచేసుకుంటూ కలలతో సంచిక ముందుకు అడుగులువేస్తోంది.
పాఠకులను ఆకర్షించాలని, తెలుగు రచయితలకు ఉత్సాహప్రోత్సాహాలివ్వాలని సంచిక నిరంతరం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మరిన్ని విభిన్నము, విశిష్టము అయిన రచనలతో సంచిక మీ ముందుకు వస్తోంది.
ఈ నెల సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి
ప్రత్యేక వ్యాసం: నాందీ-ప్రస్తావన – ఇ.ఎన్.వి.రవి
సీరియల్స్:
పాదచారి- మొదటి భాగం – భువనచంద్ర
కాలమ్స్:
రంగులహేల-17- విమర్శ కషాయం – అల్లూరి గౌరిలక్ష్మి
నవ్వేజనా సుఖినోభవంతు!-3 – కళా’రోదన’ – భావరాజు పద్మిని
నాటిక:
బురిడీ – తోట సాంబశివరావ్
పుస్తకాలు:
‘ఆకెళ్ళ నాటకాలు’ రెండవ సంపుటానికి ముందుమాట – కె.పి. అశోక్‌కుమార్
కథలు:
దారి తప్పిన వయసు – శింగరాజు శ్రీనివాసరావు
గోవిందరావు – వాలు జడ – కొత్తపల్లి ఉదయబాబు
దేవానాం మనుష్య రూపేణా – కాశివిశ్వనాధం పట్రాయుడు
నాన్న బాటలో – గంగాధర్ వడ్లమన్నాటి
బతికి సచ్చిన మనిసి – నల్ల భూమయ్య
కవితలు:
సల్లంగుండవే నా నీడ! – శ్రీధర్ చౌడారపు
హాలికుడి గర్భశోకం – వెలగా శేఖర్
ఎవరికోసమో నీవు – శ్రీదేవి శ్రీపాద
యాస – భాష – Savvy
లోకస్థితి – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
సలహాలు, సూచనలు రచనలతో తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడాలని పాఠకులకు, రచయితలకూ విన్నపం.
సంపాదక బృందం