Site icon Sanchika

డిసెంబరు 2020 సంపాదకీయం

[dropcap]2[/dropcap]020 సంవసరం చివరి నెలకు వచ్చాము. అందరూ ఈ 2020 ఎప్పుడయిపోతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరిలో ఏ రోజు ఎలాంటి వార్త వినాల్సివస్తుందో, ఈ రోజు ఎవరి వంతో, ఇలాగే కొనసాగితే తమ వంతు ఎప్పుడో అన్న భావనలు చెలరేగుతున్నాయి. బయట ఎవరినీ కలవలేకపోవటం, ఎటు వెళ్ళాలన్నా అదో రకమయిన వెరపు మనసుని లాగుతూండటంతో అనేకరకాల మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి తనతో తాను ప్రశాంతంగా వుండలేని వాడికి ఎక్కడా శాంతి లభించదు. కానీ, తనని తాను మరచిపోయేందుకు మనిషి పలురకాల రంగుల వలలను సృష్టించుకుని తనని తాను ఆ వలల్లో బంధించుకున్నాడు. కరోనా ఆ రంగుల వలల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపిస్తోంది. మనిషి జీవితం క్షణంలో ఆవిరయిపోయే బుడగ అనీ, దానిమీద మనిషికి ఎలాంటి నియంత్రణలేదని, తాను ఏదో సాధిస్తున్నాడు, దేన్నో నియంత్రిస్తున్నాడు అని అనుకోవటం కూడా ఈ రంగులాలలో భాగమేనని గ్రహించేట్టూ చేస్తోంది కరోనా కాలం. కానీ, దాన్ని గ్రహించినా ఒప్పుకోడు మనిషి. ఒప్పుకుంటే ఈ ప్రపంచం మరోరకంగా వుంటుంది. కానీ, కరోనా మనిషి తనతోతాను సంతోషంగా సంతృప్తిగా వుండగలగటంలోని ప్రాధాన్యాన్ని స్పష్టంచేస్తోంది. ఈ సమయంలో సృజనాత్మక రచయితలు తమ రచనలతో ప్రజలకు విషయాలపై అవగాహన కలిగించి భవిష్యత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలి.

కానీ రచయితలు వర్తమానంలో కాళ్ళుంచి గతాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులోకి తొంగి చూసి మార్గదర్శనం చేసేంత దృష్టిని ప్రదర్శించటంలేదు. కాలం స్థంభించిపోయి గతంలో చిక్కుకుపోయి బయటకురాలేని వారిలా , ఘనీభవించిపోయి ఎదగటం మరచిన వారిలా ప్రవర్తించటం నిరాశ కలిగిస్తున్న విషయం. అందుకే ఒకరకంగా తెలుగు సాహిత్యం సమకాలీన సమాజంతో సంబంధం తెంచుకుని, ఎదగని మనస్తత్వంతో అంతంతలోనే తిరుగాడుతూ తన ప్రాధాన్యాన్ని కోల్పోతోందేమోననిపిస్తుంది. రచయితలు తరతరాల, యుగయుగాల నిద్రను వదల్చుకుని మారుతున్న కాలాన్ని, మారుతున్న ఆలోచనలను, మనస్తత్వాలను, సామాజిక స్వరూప స్వభావాలను అవగాహన చేసుకుని తమ సృజననలో ప్రతిఫలించకపోతే తెలుగు సాహిత్యం తన రిలెవెన్స్‌ను కోల్పోక తప్పదు. ఇప్పటికే తెలుగు సాహిత్యం సాహిత్య మాఫియా ముఠాలు, వందిమాగధ భజన బృందాలు, కూటములు, ఇజాల గుంపులు, అస్తిత్వాల ఆరాటాల నడుమ నలిగి సామాన్య పాఠకుడికి దూరమయింది. ఇప్పటికయినా రచయితలు సాహిత్య పెద్దలు మేల్కొని పరిస్థితి చక్కపరచకపోతే భవిష్యత్తు ఊహించాలంటేనే భయం వేస్తుంది.

సాహిత్యం పట్ల ఆలోచన కల పత్రికగా సంచిక తనవంతుగా రచయితలనుంచి వినూత్నమయిన, విభిన్నమయిన, విశిష్టమయిన రచనలను ఆహ్వానిస్తోంది. ఎలాంటి కొత్త ఆలోచనకయినా స్వాగతం పలుకుతోంది. భిన్నంగా రాయమని , అలాంటి రచనలకు సంచిక పెద్ద పెద్దపీటవేస్తుందనీ స్పష్టంచేస్తోంది.

పాఠకులను అలరించే ప్రయత్నంలో భాగంగా ఈనెల సంచిక అందిస్తున్న రచనల వివరాలు:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

నాటిక:

బాలసంచిక:

పుస్తకాలు:

అవీ ఇవీ:

రచయితల సహకారాన్ని, పాఠకుల సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది సంచిక.

సంపాదక బృందం

Exit mobile version