Site icon Sanchika

సంపాదకీయం డిసెంబరు 2021- సిరివెన్నెలకు నివాళి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం ఇప్పుడిప్పుడే కరోనా ట్రామా నుంచి తేరుకుంటున్న తెలుగు సమాజాన్ని అనూహ్యమయిన వేదనా లోయల్లోకి నెట్టేసింది. మెదడు మొద్దుబారిపోవటం, మనసు మూగగా రోదించటం, హృదయం స్థాణువయిపోవటం, చైతన్యం స్తబ్ధు అయిపోవటం అంటే ఏమిటో అనుభవానికి వచ్చిది. గలగలా ప్రవహించే సరస్సు కూడా సిరివెన్నెల మరణ వార్త విని గడ్డకట్టుకుపోయింది. వీచే గాలి ద్రవంలా జారిపోయింది. కాలం కదలిక భారమయి, ఊపిరి తీయటం కష్టమయి, ప్రతిక్షణం ఒక తీరని బాధతో కదలుతున్నట్టనిపిస్తోంది.

ఒక కళాకారుడి మరణం, ముఖ్యంగా ఇంకా చురుకుగా సృజిస్తున్న కళాకారుడి మరణం తీరని  వేదనను కలిగిస్తుంది. హిందీ పాటల రచయిత, ఆనంద్ బక్షి మరణం ఆసన్నమయినప్పుడు, సహ గేయ రచయిత సమీర్‌తో అన్న మాటలు సిరివెన్నెలకూ వర్తిస్తాయి. ఆయన ఆస్పత్రిలో మంచంపై నుంచి సమీర్‌తో అన్నారు “నాకు వీలయితే నా మనసులో వున్న పాటలన్నీ నీకు ఇచ్చేసేవాడిని. కానీ, అది వీలు కాదు. నేను మాత్రమే రాయగలిగే వేల వేల పాటలను, నేను మాత్రమే చెప్పగలిగే వేల వేల భావనలను నాతోనే తీసుకువెళ్తున్నాను. ఇంకెవరికీ సాధ్యం కాని గేయాలవి” అన్నాడు. ఇది సిరివెన్నెలకూ వర్తిస్తుంది. ఎన్నెన్ని అవ్యక్త భావనలో, ఎన్నెన్ని ఇంకా రూపుదిద్దుకోని పాటలనో, ఎన్నెన్ని సిరివెన్నెల మాత్రమే చేయగలిగే చిత్రవిచిత్రమయిన పద ప్రయోగాలనో తనతో తీసుకువెళ్ళిపోయిన సిరివెన్నెలను ఆయన సృజించిన పాటల ద్వారా గుర్తు చేసుకుంటూ బాధను అధిగమించే ప్రయత్నం చేయటం తప్ప మనం ఏమీ చేయలేము.

సాహిర్ అనే గేయ రచయిత ఇలా రాశాడు.

“కల్ ఔర్ ఆయేంగే నగ్మోంకీ ఖిల్తీ కలియాన్ చున్ నే వాలే

ముఝ్సే బేహత్తర్ కహెనేవాలే, తుంసే బెహెత్తర్ సున్ నే వాలే

కల్ కోయీ ముఝ్కో యాద్ కరే, క్యూన్ కోయీ ముఝ్కో యాద్ కరే

మత్ రుక్ జమానా మేరేలియే, క్యూన్ వక్త్ అప్నా బర్బాద్ కరే” 

రేపు నీకన్నా బాగా వినేవారొస్తారు, నా కన్నా బాగా రాసేవారొస్తారు. రేపు ఎవరయినా నన్నెందుకు గుర్తుంచుకుంటారు. అసలెందుకు గుర్తుంచుకోవాలి. నాకోసం ఎవరూ ఆగాల్సిన పనిలేదు. సమయం వ్యర్థం చేయాల్సిన పనిలేదు.. అన్నాడు.

కానీ, ప్రపంచం సాహిర్‌ని మరచిపోలేదు. సిరివెన్నెలనూ మరచిపోదు. మనకన్నా బాగా పాటలను వినేవారొస్తారు. కానీ సాహిర్ కన్నా బాగా రాసేవారు రాలేదు. సిరివెన్నెలను మించి రాసేవారూ రారు. సాహిర్ పాటలు వినటం కోసం సమయ భావనను వదిలేసి వింటూ, అత్యంత ఆనందాన్ని అనుభవిస్తున్నాము. సిరివెన్నెల పాటలను వింటూ అలౌకికానందాన్ని అనుభవిస్తాము. సమయం బాగా గడిచిందని ఆనందిస్తాము. సిరివెన్నెల మళ్ళీ తెలుగువాడిగానే పుట్టి తెలుగు పాటలకు మళ్ళీ పరిమళాలద్దాలని దేవుడిని ప్రార్థిస్తున్నది సంచిక.

అంతలోనే మనసులో ఒక సంశయం..

తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేదీ??????

~

సంచికలో 1 డిసెంబరు 2021 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

ప్రత్యేక వ్యాసం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

– సంపాదక బృందం.

Exit mobile version