సంపాదకీయం ఫిబ్రవరి 2023

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’కు పాఠకుల నుంచి లభిస్తున్న విపరీతమయిన ఆదరణ ఆనందంతో పాటూ కాస్త భయాన్ని కూడా కలిగిస్తోంది. భయం ఎందుకంటే, ‘సంచిక’పై పాఠకులకు పెరుగుతున్న విశ్వాసంతో పాటూ, ‘సంచిక’ పట్ల అంచనాలు కూడా అంతే పెరుగుతాయి. పాఠకుల అంచనాలను అందుకుని సంతృప్తిని కలిగించాల్సిన బాధ్యత పెరుగుతుంది. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ఇంకా విశిష్టమయిన రచనల ద్వారా ఉత్తమ సాహిత్యాన్ని అందిస్తూ మరింత సంఖ్యలో పాఠకులను ఆకర్షించాలని ‘సంచిక’ ప్రయత్నిస్తూంటుంది. సరికొత్త శీర్షికలను అందించాలని తపన పడుతూంటుంది.

పాఠకులకు  ఉత్తమ సాహిత్యాన్ని అందించాలనే ప్రయత్నంలో భాగంగా, మార్చ్ నెల నుంచీ సాహిత్యానికే ప్రత్యేకంగా నెలకొక ప్రత్యేక సంచికను వెలువరించే ప్రయత్నం చేస్తోంది. కొత్త పుస్తకాల పరిచయం, రచయితలతో సంభాషణంతో పాటూ సాహిత్య విశ్లేషణాత్మక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య పరిచయ వ్యాసాలనూ ఈ ప్రత్యేక సంచికలో భాగం చేయాలనుకుంటోంది ‘సంచిక’. తెలుగు దినపత్రికలలో సాహిత్యానికి ప్రత్యేక పేజీలు లేని లోటుని పూడ్చాలన్నది ‘సంచిక’ ప్రయత్నం. ఇప్పుడు, కొన్ని పత్రికలలో వారానికి ఒక రోజు సాహిత్య పేజీలన్నవి ఉంటున్నా, వాటిని సాహిత్య పేజీలని అనలేము. ఆయా పేజీలు తెలుగు సాహిత్యానికి కాక, తెలుగు సాహిత్యంలో కొందరికి మాత్రమే బాకాలూదే ప్రచార కరపత్రాల్లంటివి. ఆయా పేజీలు, వాటి ఇన్‌ఛార్జీలకు సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందటానికి, ఒక స్థానాన్ని సంపాదించటానికి తప్ప మరెందుకూ పనికిరావటం లేదు. అసలు సృజనాత్మక రచయితలకు ఆయా కరపత్రాల పేజీల్లో స్థానం లభించదు. అందుకే అసలయిన సాహిత్యాన్ని పాఠకులకు చేరువ చేసేందుకు ‘సంచిక’ ఈ ప్రత్యేక సాహిత్య సంచికను రూపొందిస్తోంది.

‘సంచిక’ ప్రధానంగా సాహిత్య పత్రిక అయినా చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సామాజిక జీవనంపై వాటి ప్రభావాలను విస్మరించటం సమంజసం కాదు. ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసం, మెజారిటీ ప్రజల మనోభావాలతో చెలగాటమడుతూ, దానికి వచ్చే ప్రతిక్రియకు  రాజకీయ రంగు పులుముతూ, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని జరిగే ప్రయత్నాలను చూస్తూ ఊరుకుంటే, భవిష్యత్తు తరాల ముందు దోషిలా నిలవాల్సివస్తుందన్న ఆలోచన కలుగుతోంది. మేధావుల పేరిట రాజకీయ రచనలు చేస్తూ, ఒకే రకమయిన భావజాలానికి కొమ్ముకాస్తున్న రచయితల ప్రవర్తన ఎంతగా సాహిత్యం తన స్వచ్ఛతను కోల్పోయి మలినమయిపోయిందో తెలుపుతోంది.  ఈ సమయంలో సాహిత్యాభిమానులంతా కలసికట్టుగా, సాహిత్యంలోంచి రాజకీయాలను తొలగించి ప్రక్షాళన కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన ఆవశ్యకతను ‘సంచిక’ గుర్తించింది. ఈ దిశలో కార్యాచరణ గురించి పథకాలు వేస్తోంది. వివరాలు త్వరలో ప్రకటిస్తుంది.

కేంద్ర సాహిత్య అకాడెమీలో అవార్డుకు ఎన్నికయిన రచనల స్థాయిని విశ్లేషిస్తూ ‘సంచిక’ ప్రచురిస్తున్న వ్యాస పరంపర కొనసాగుతుంది.  పాత సాహిత్య అకాడెమీ సభ్యుల పదవీకాలం పూర్తయిపోయింది. కొత్త సభ్యుల ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. అయితే, సాహిత్య అకాడెమీ సభ్యుల ఎంపిక ప్రక్రియలోకానీ, సభ్యుల విషయంలోకానీ, ఎలాంటి మార్పు రాలేదని, అకాడెమీ వెబ్‌సైట్‌లో ప్రకటించిన నలుగురు నూతన సభ్యుల జాబితా స్పష్టం చేస్తోంది. ఇంతవరకూ ప్రకటించిన సభ్యుల పేర్లు చూస్తే మాత్రం Everything is same, except the name అనిపిస్తుంది. అయినా సరే మానవుడు ఆశాజీవి. కాబట్టి, కనీసం తమ చర్యలను నిశితంగా  పరిశీలిస్తూ, విమర్శించే వారున్నారన్న  ఎరుక అయినా వీరి పనితీరులో మార్పు తెస్తుందని ఆశిద్దాం. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సమీప భవిష్యత్తులో సాహిత్య అకాడెమీ పనితీరులో కానీ, అవార్డులందుకునేవారి భావజాలంలో కానీ, ఎలాంటి మార్పు వుండే వీలు లేదనిపిస్తున్నది. సాహిత్య సృజనకన్నా, భావజాలానికే ప్రాధాన్యం కొనసాగుతుందనిపిస్తున్నది. దీనికి తోడుగా సాహిత్య మాఫియా ముఠాలు సైతం యువ రచయితలను, గుర్తింపు, పొగడ్తలు, అవార్డుల ప్రలోభాలతో ఆకర్షించి పబ్బం గడుపుకుంటున్నాయి  తప్ప రచయితగా ఎదిగే అవకాశం యువరచయితలకివ్వటంలేదు. పెద్ద సంఖ్యలో యువ రచయితలనిలా తప్పుదారి పట్టించటం, యువ రచయితలు కూడా రచయితలుగా ఎదుగుదామన్న ఆలోచన లేకుండా, గుర్తింపుగుంపుల్లో చేరి సంతృప్తి పడటం చూస్తూంటే, ఈ గుంపుల్లో ఇమడలేని అసలయిన రచయితలంతా తమకంటూ ఒక సంస్థనేర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుందనీ, సాహిత్య అకాడెమీకి ప్రత్యామ్నాయంగా అసలయిన సృజనాత్మక రచయితలను గుర్తించి, గౌరవించి, వారికి బహుమతులివ్వటం ద్వారా పాఠకుల దృష్టికి వీరి విశిష్టమయిన రచనలను చేరువచేరాల్సిన అవసరముందనీ సంచిక గుర్తించింది. ప్రత్యామ్నాయ సంస్థ ఏర్పాటు, అవార్డుల ఏర్పాటు విషయంలో రచయితలను కూడదీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

అచిర కాలంలోనే తనదయిన ప్రత్యేక గుర్తింపు సాధించి, సాహిత్య ప్రపంచంపై తనదయిన ముద్ర వేస్తున్న ‘సంచిక’ భవిష్యత్తులో విభిన్నమయిన, విశిష్టమయిన శీర్షికల ద్వారా తెలుగు పాఠకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. సరికొత్త శీర్షికల ప్రకటన త్వరలో వెలువడుతుంది. అలాగే, ఉగాది కథలు, కవితల పోటీ వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తుంది ‘సంచిక’. ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్ధన.

~

సంచికలో 1 ఫిబ్రవరి 2023 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

  • శ్రీమతి శీలా సుభద్రాదేవి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో..10 – వి. శాంతి ప్రబోధ/ మోటమఱ్ఱి సారధి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- ఫిబ్రవరి 2023- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -35 – ఆర్. లక్ష్మి

కవితలు:

  • హే, భగవాన్..! – శ్రీధర్ చౌడారపు
  • దారులు కలవని చోట! – డా. విజయ్ కోగంటి
  • వలసపిట్ట..!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
  • నాన్నగా నేను మరుగుజ్జంతటివాడిని – డాక్టర్ బి. హేమావతి

కథలు:

  • నగరంలో మరమానవి-5 – చిత్తర్వు మధు
  • శృతి లేని రాగం – శ్యామ్ కుమార్ చాగల్
  • నా జవాబు నో – గంగాధర్ వడ్లమాన్నాటి
  • ఎవరికి వారే – సిహెచ్. సి. ఎస్. శర్మ

పుస్తకాలు:

  • కల్మషం అంటని మనుషుల కథలు – ‘రాజనాల బండ’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

బాల సంచిక:

  • అవయవ దాన మహత్యం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • వేదాధ్యయనపరుడు ‘కౌశికుడు’ – అంబడిపూడి శ్యామసుందర రావు

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here