[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, సాహిత్యాభిమానులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
క్రితం సంవత్సరం ఉగాదితో ఆరంభమయిన సంచిక ఈ సంవత్సరం ఉగాదికి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆరంభమయినప్పటినుంచీ సంచిక వీలయినంతమంది పాఠకులను అలరించాలని నిజాయితీగా ప్రయత్నిస్తోంది. పాఠకులను ఆకర్షించేందుకు నాణ్యమయిన రచనలను, ప్రామాణికమయిన రచనలను, విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని ప్రయత్నిస్తోంది తప్ప, ఏదో ఒకటి చేసి సంచలనాలను సృష్టించి, వివాదాలను రగిల్చి పదిమంది నోళ్ళలో నాని అదే గొప్ప, అదే పాపులారిటీ అని వాపును బలుపని భ్రమపడి భ్రమకల్పించే వైపు దృష్టి పెట్టటమే లేదు.
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరేవారు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలతారని సంచికకు తెలుసు. పరుగెత్తి పాలు తాగే కన్నా, నిలబడి నీళ్లు తాగటమే మేలనీ తెలుసు. తగరానికి బంగారం పూత పూసి తాత్కాలికంగా పబ్బం గడుపుకున్నా నిజం నిలకడ మీద తెలుస్తుందనీ, నిజం తెలిసిన రోజు పరువు పోవటమే కాదు పాఠకుల విశ్వాసమూ కోల్పోవాల్సి వుంటుందనీ తెలుసు. అందుకే సంచిక ఒక పిట్ట ఒక్కో గడ్డిపోచనూ తెచ్చి గూడును అల్లినట్టు భద్రంగా, ప్రాకృతికంగా నిజాయితీగా పాఠకులకోసం సాహిత్యపు గూడు అల్లుతోంది. పదిలంగా సాహిత్యపు పొదరిల్లు అల్లుతోంది.
సంవత్సరంగా పాఠకులను అలరిస్తున్న సందర్భాన్ని చిరస్మరణీయం చేసేందుకు ఉగాదినాడు సాహిత్యప్రియులతో ఒక సమావేశాన్ని నిర్వహించి, ఆ సమావేశంలో ఒక ఉత్తమ సాహిత్యసృజనకర్తను సంచిక సాహిత్య పురస్కారంతో సత్కరించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఆ సమావేశంలో ఆ రచయిత రచనల విశ్లేషణ వుంటుంది. ఈ పురస్కారాన్ని నిర్ణయించటం వెనుక ఎంతో ఆలోచన వుంది. తెలుగు సాహిత్య ప్రపంచం పలు ముఠాలుగా ఏర్పడి వుంది. ఇందులో ఏ ముఠావారు ఆ ముఠావారినే ప్రస్తావించటం, వారి సాహిత్యాన్నే పనిగట్టుకుని ప్రచారం చేయటం జరుగుతూ వస్తోంది. ఈ ప్రచారంలో సాహిత్యము, నాణ్యత అన్న అంశాలకు ప్రాధాన్యం లేదు. అందుకే, తెలుగు సాహిత్యంలో ఒక రచనకు గొప్పతనం రచన నాణ్యతకన్నా రచయిత వ్యక్తిగత పరిచయాలపైనే ఆధారపడి వుండటం స్పష్టంగా తెలుస్తుంది. విమర్శకులనబడేవాళ్ళు నిజానికి భట్రాజ భజన బృందాలు. అసలయిన నిజాయితీ నిష్పాక్షిక విమర్శకులు ఒకరో ఇద్దరో వున్నారు.
కానీ పూత పూసిన రచయితల హోరు, రచయితను చూసి రచనను పొగిడే విమర్శకుల జోరుల నడుమ కేవలం సాహిత్య సృజన తప్ప ముఠాలు, మఠాలు, మాయల మరాఠాలు తెలియని రచయితలు, వారి రచనలు మరుగున పడుతున్నాయి. అలాంటి రచయితల రచనలు ప్రచారానికి తెచ్చి, పాఠకుల దృష్టి ఆయా రచయితల రచనలవైపు మళ్ళించేట్టు చేయటం ద్వారా, ఉత్తమ రచనలు, సంస్కారవంతమయిన ఆలోచనలు పాఠకులకు చేరువచేయాలన్నది సంచిక లక్ష్యం. మౌలికంగా మనిషి అశుద్ధంవైపు ఆకర్షితుడయినంత సులభంగా శుద్ధం వైపు మళ్ళడు. ఇది తెలిసికూడా తనవంతు బాధ్యతగా సంచిక ఉత్తమ రచనలను ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలని ప్రయత్నిస్తోంది. ద్వేషము, కామము, క్రోధము, మదమోహ లోభ మాత్సర్యాలను రెచ్చగొట్టే రచనలను పరిహరించి ఉత్తమమయిన ఆలోచనలు, ఉన్నతమయిన సంస్కారము నేర్పే రచనలను అందించాలని తపనపడుతోంది. ఈ ప్రయత్నంలో తమ రచనలతో సహకారం అందించాలని రచయితలను, తమ సలహాలు, సూచనలద్వారా మార్గనిర్దేశనం చేయాలని పాఠకులను అభ్యర్ధిస్తోంది. సంచికలో రచనకు ప్రాధాన్యం. రచన విశిష్టంగావుంటే రచయిత స్వాభావికంగా వెలుగులోకి వస్తాడు. రచన, రచయిత వెలుగులోకి రావటం సాహిత్యాభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే, రచయిత రచన ద్వారా వెలుగులోకి రావటం వల్లనే సాహిత్యాభివృద్ధి జరుగుతుంది.
1 జనవరి 2019 సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:
ప్రత్యేక వ్యాసం:
తెనాలి రామకృష్ణుని కవిత్వ వైచిత్రి – రవి ఇ.ఎన్.వి.
ధారావాహికలు:
నీలమత పురాణం-9 – కస్తూరి మురళీకృష్ణ
తమసోమా జ్యోతిర్గమయ-6- గంటి భానుమతి
అంతరం-5- స్వాతీ శ్రీపాద
కాలమ్స్:
రంగుల హేల -10: పండితుల అపండితత్వాలు – అల్లూరి గౌరీ లక్ష్మి
భక్తి:
దివినుంచి భువికి దిగిన దేవతలు 6 – డా. ఎం. ప్రభావతి దేవి
కథలు:
పరమేశ్వరుడూ – పచ్చి మిరపకాయ బజ్జీ – జొన్నలగడ్డ సౌదామిని
నీలవేణి – ముమ్మిడి శ్యామలా రాణి
అందని తీరం – పి.ఎల్.ఎన్. మంగారత్నం
భిక్షుక బృహస్పతులు – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
కవితలు:
కొంచెం వాన కురవాలంటే – డా. విజయ్ కోగంటి
గుడ్ బై నేస్తమా… గుడ్ బై – శ్రీధర్ చౌడారపు
నీళ్ళు నవ్వులు – సింగిడి రామారావు
ఏమి తెలుసు – డా. శ్రీకాంత్ భీంపల్లి
ప్రేమలేఖ – Savvy
వ్యాసాలు:
కల్పవృక్షంలో సీతాదేవి – కోవెల సుప్రసన్నాచార్య
ఒకపారి నెక్లస్ కథను పునశ్చరణ చేసుకుందామా! – పాండ్రంకి సుబ్రమణి
మీకు తెలుసా? – యన్.వి.వి.యస్.యస్. ప్రకాశరావు
బాలసంచిక:
పర్యావరణం కథలు-1: ప్లాస్టిక్ భూతం – డి. చాముండేశ్వరి
చంద్రవంశం – డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
పుస్తకాలు:
‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ – పుస్తక పరిచయం – కొల్లూరి సోమ శంకర్
‘కొత్త నీరొచ్చింది’ – పుస్తక సమీక్ష – కె.పి. అశోక్‌కుమార్
అవీ ఇవీ:
అతిరథ మహారథులు – పొన్నాడ సత్యప్రకాశరావు
కార్టూన్:
కెవిసుబ్రహ్మణ్యం కార్టూన్-8
నూతన సంవత్సరంలో సంచికను మరింతగా ఆదరించి తమ రచనలతో రచయితలు, తమ సూచనలతో పాఠకులు పరిపుష్టం చేస్తూ తెలుగు సాహిత్యాన్ని ఉన్నతమైన దిశలో నడిపించే భాగ్యాన్ని సంచికకు కలిగిస్తారని ఆశిస్తున్నాము. ఇందుకు చేయగలిగినది సంచిక చేస్తుందని హామీ ఇస్తున్నాము.
– సంపాదక బృందం